14, మే 2018, సోమవారం

జమున విజయరహస్యం

బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 జగన్నాథ ఆలయం సమీపంలోని రోడ్డు గుండా వెళితే అడవిని తలపించే అపార్ట్‌మెంట్. పేరుకు అది అపార్ట్‌మెంట్ అయినా విశాలమైన ఆవరణ, కృత్రిమంగా ఏర్పాటు చేసిన వాటర్ ఫాల్స్. అటవీ ప్రాంతానికి వచ్చామేమో అనిపిస్తుంది.
ఆ అపార్ట్‌మెంట్‌లో విశ్రాంతి జీవితం గడుపుతున్న జమునను కలవడానికి వెళ్లినప్పుడు ఏ జర్నలిస్టుకైనా ముందు కళ్ల ముందు కనిపించే వాస్తవం ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఆ కాలం నాటి నటీనటులు చాలా మంది మహానటులుగా గుర్తింపు పొందినా అంతిమ దశలో మాత్రం దయనీయమైన జీవితం గడిపారు. కానీ జమున జీవితం దీనికి భిన్నంగా ఉంది. వయసు మీద పడినా తగ్గని ఆత్మవిశ్వాసం. దేవుడి దయవల్ల ఇంకా నలుగురికి సహాయం చేసే స్థితిలోనే ఉన్నాను అని చెప్పారు.
***
ఆర్థికంగా బలహీనంగా ఉండడం మనిషిని నిర్వీర్యం చేస్తుంది. డబ్బుకు పేదవాళ్లం కానీ గుణానికి కాదు అనే గంభీరమైన డైలాగులు సినిమాల వరకు బాగానే ఉంటాయి. కానీ మనిషిని బలహీనుడిగా మార్చేస్తాయి.
ఆర్థికంగా ఫరవాలేదు అనుకున్నప్పుడు మనిషి ఆత్మవిశ్వాసంతో ఉండగలడు.
తెలుగు సినిమా రంగంలో ఎన్టీఆర్, ఎఎన్‌ఆర్‌ను రెండు కళ్లు అంటూ సినిమా వాళ్లు ఇప్పటికీ చెబుతుంటారు. ఆ రెండు కుటుంబాల పట్టు సినిమా రంగంపై ఇంకా ఉండడం వల్ల వీరు పోయి ఇంత కాలం అయినా అదే మాట మాట్లాడతారు. ఇక మనకు సినిమాల్లో అవకాశాలు అవసరం లేదు అనుకున్న వయసులో సహజకవి మల్లె మాల లాంటి వారు ఎన్టీఆర్ గురించి నిర్మొహమాటంగా తన మనసులోని అభిప్రాయాన్ని రాసిన పుస్తకాన్ని వెంటనే మార్కెట్ నుంచి వెనక్కి తెప్పించుకోవలసి వచ్చింది. మల్లెమాలకు సినిమాల్లో ఇక భవిష్యత్తు లేదని ధైర్యంగా రాశాడు. కానీ మల్లెమాల కుమారుడికి ఇంకా భవిష్యత్తు ఉంది కాబట్టి ఆ పుస్తకాన్ని మార్కెట్ నుంచి వెనక్కి తెప్పించారు. 76ఏళ్ల వయసులో ఈ మధ్య చంద్రమోహన్ కూడా ధైర్యంగా ఎన్టీఆర్ గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఒక సినిమాలో ఎన్టీఆర్‌కు తమ్ముడిగా చంద్రమోహన్‌ను ఎంపిక చేశారు. షూటింగ్‌కు సిద్ధమై రిహార్సల్స్ చేసుకుంటుంటే బాలకృష్ణను ఆ పాత్రకు ఎంపిక చేశారు. ఇక జీవితంలో ఎన్టీఆర్‌తో నటించవద్దని నిర్ణయించుకున్నాను. ఎన్టీఆర్ నీకో మంచి పాత్ర ఇస్తాలే బ్రదర్ అన్నాడట! ఆయన ఆఫర్ చేశాక రిజెక్ట్ చేయాలని అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఎలాంటి ఆఫర్ చేయలేదని, నిర్మాత ద్వారా విషయం తెలిసిన ఎంజి రామచంద్రన్ తనతో పాటు నటించేందుకు తమిళ సినిమాలో అవకాశం ఇచ్చారని చంద్రమోహన్ చెప్పారు. ఆర్థికంగా బలంగా ఉన్న చంద్రమోహన్ ఇప్పుడు భయపడాల్సిన స్థితిలో లేరు. అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన వయసు కాదు. దాంతో ధైర్యంగానే మాట్లాడేశారు.
ఎన్టీఆర్ మరణించి రెండు దశాబ్దాల గడిచిన తరువాత కూడా ఆయనపై ఎవరికైనా వ్యతిరేక అభిప్రాయం ఉంటే వ్యక్తం చేయలేని పరిస్థితి. అలాంటిది ఎన్టీఆర్ సినిమాల్లో ఒక వెలుగు వెలుగుతున్న కాలంలో ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడడం అంటే ఊహించగలమా? అదీ సినిమాల్లో ఆయనతో హీరోయిన్‌గా నటించే నటి ఒకరిని కాదు ఏకంగా రెండు కళ్ల వ్యతిరేకతను తట్టుకుని సినిమా రంగంలో బతికి బట్టకట్టడం అంటే ఊహించగలమా?
అసాధ్యం అనుకున్న దీన్ని జమున సాధ్యం చేసి చూపించింది.
మీలో ఇంతటి ధైర్యానికి కారణం ఏమిటని ఆసక్తిగా ఆమెను అడిగినప్పుడు 1930-40 ప్రాంతంలోనే మా నాన్న ఎగుమతి వ్యాపారంలో ఉన్నారు. పసుపు, పొగాకు విదేశాలకు ఎగుమతి చేసేవారు. మా నాన్న కలిగించిన ఆత్మవిశ్వాసమే నా ధైర్యానికి కారణం అంటూ చెప్పుకొచ్చారు.
ఎంతో మంది మహానటులు సినిమాల్లో ఎంతో ఉన్నత స్థానానికి వెళ్లి చివరి దశలో చితికి పోయి పూట గడవడమే కష్టం అయిన దశకు చేరుకున్నారు. ధనం- మూలం పేరుతో అలాంటి నటుల గురించి వరుసగా రాస్తూ జమున అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేశాను. చాలా మంది నటీనటులు ఆర్థికంగా చితికి పోయారు. నటులకు ఇదేమైనా శాపమా? ఈ శాపం నుంచి మీలాంటి నటులు ఎలా తప్పించుకున్నారని ప్రశ్నిస్తే, ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.
‘‘ఒకరికి పైసా అప్పు ఇచ్చేది లేదు, ఒకరి వద్ద అప్పు తీసుకునేది లేదు. నేను మొదటి నుంచి దీనికి కట్టుబడి ఉన్నాను. ఇష్టపూర్వకంగా సహాయం చేశాను కానీ అప్పు ఇవ్వలేదు.. సావిత్రి, నాగయ్య, కాంతారావు వారు వీరు అని కాదు సినిమా రంగానికి చాలా మంది ఆర్థికంగా దెబ్బతిన్నది సినిమాలు తీయడం వల్ల. వ్యసనాల వల్ల ఆస్తి కరిగిపోదు. కొంత ఆర్థికంగా నష్టపోవచ్చు కానీ వ్యసనాల వల్ల ఆస్తులు కరిగిపోయిన వారు ఎవరూ లేరు. నిర్మాతగా సినిమాలు తీయడం వల్ల దెబ్బతిన్న వారే ఎక్కువ. మనం నటులం నటనకే పరిమితం కావాలి అని మొదటి నుంచి అనుకున్నాను. దానికే కట్టుబడి ఉన్నాను. నిర్మాతగా మారి ఉంటే నా పరిస్థితి కూడా దెబ్బతినేది. భానుమతి మాత్రం నిర్మాతగా మారినా దెబ్బతినలేదు. దానికి కారణం వారికి స్టూడియో ఉండడం వల్ల. సావిత్రి నిర్మాతగా సినిమా తీయడం వల్లనే ఆర్థికంగా దెబ్బతిన్నారు. జెమినీ గణేషన్‌కు మార్కెట్ ఉన్న సమయంలో సినిమా మొదలైంది. హఠాత్తుగా మార్కెట్ పడిపోయింది. సినిమా ఆలస్యం అయింది. జెమినీ గణేషన్ మార్కెట్ మళ్లీ పుంజుకుంది. ఆ సమయంలో సినిమాను అమ్మేసుకుంటే సావిత్రి దెబ్బతినేది కాదు. కానీ తానే స్వయంగా విడుదల చేయడం, సినిమా విడుదల సమయానికి జెమినీ గణేషన్ మార్కెట్ మళ్లీ పడిపోవడంతో చేతులు కాల్చుకుంది. మిస్సమ్మ సినిమాలో నటించినందుకు ఆ రోజుల్లో నిర్మాతలు పదిహేనువేల పారితోషికం లేదా కారు ఇస్తామని చెప్పారు. ఆ సినిమాలో ముఖ్యనటులు అందరికీ ఇదే ఆఫర్. అప్పుడు నేను కారు తీసుకున్నాను. అంతకు ముందు కారు తీసుకోవాలని కొందరు చెప్పినా మా నాన్న మాత్రం అవకాశాలు ఎలా ఉంటాయో తెలియదు. తొందర పడి కారు తీసుకుంటే తరువాత అవకాశాలు లేకపోతే ఇబ్బంది పడతావు అని నాన్న చెప్పారు. ప్రారంభం నుంచే డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉన్నాను. భూములు కొన్నాను. భవనాలు కొన్నాను. మేడ్చల్‌లో 50 ఎకరాల భూమిని ఆ మధ్య మా అబ్బాయి అమెరికాలో ఇళ్లు నిర్మించుకోవడానికి అమ్మేశాను’’ అంటూ చెప్పారు. తెలుగు సినిమాకు రెండు కళ్లు ఎన్టీఆర్ ఎఎన్‌ఆర్ ఆ రోజుల్లో జమునను బహిష్కరించినప్పుడు ఆమె అస్సలు భయపడలేదు. ఆ సమయంలోనే హిందీ సినిమాల్లో హీరోయిన్‌గా మంచి అవకాశాలు వచ్చాయి. తెలుగులో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. సారీ చెప్పేందుకు జమున ససేమిరా అన్నారు. చివరు టీ కప్పులో తుఫానులా ఎవరూ సారీ చెప్పకుండానే వివాదం సమసిపోయింది. ఆర్థిక అంశాల్లో మొదటి నుంచి ఒక ప్రణాళికా బద్ధంగా ఉండడం, సంపాదించిన డబ్బును సరైన విధంగా ఇనె్వస్ట్ చేయడం వల్ల జమున ఎప్పటికీ జముననే అనుకునేట్టు ఆత్మవిశ్వాసంతో బతక గలుగుతున్నారు. ఒక్క సినిమా రంగం అనే కాదు ఏ రంగంలోనైనా చాలా మంది అధికారం చలాయించిన వారు చివరి దశలో ఆర్థికంగా బలంగా లేకపోవడం వల్ల దయనీయంగా బతుకుతారు. మొదటి నుంచి సరైన విధానంలో ఆర్థిక ప్రణాళిక రూపొందించుకున్న వారికి చివరి దశ కూడా సంతోషంగా గడిచిపోతుంది. అది మన చేతిలోనే ఉంది. మన ఆలోచనలే మన తలరాతలను రాస్తాయి. మన తలరాతలను మరెవరో రాయరు. 1936 ఆగస్టు 30న హంపిలో జన్మించిన జమున 82ఏళ్ల వయసులోనూ ఆత్మవిశ్వాసంతో బతుకుతున్నారంటే ప్రారంభ కాలంలో ఆమె జీవన విధానమే కారణం.
--బి.మురళి
(ఆంధ్ర భూమి 6-5-2018)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం