11, మే 2018, శుక్రవారం

ఇది.. గుండెపోటు తనం!

ఏరా..? అంత దిగులుగా ఉన్నావు? ప్రధానమంత్రి పదవికి ఓకే అని రాహుల్, సిఎం పదవికి సిద్ధం అని రేవంత్ ప్రకటించారు.. ఇంకెందుకు దిగులు. ఈ దేశం మరీ గొడ్డు పోలేదు. పాలించేందుకు ఎవరో ఒకరు వస్తారులే దిగులు పడకు’’
‘‘నా దిగులుకేం కానీ, నాకన్నా ఎక్కువ దిగులుగా కనిపిస్తున్నావ్? ఏమైంది?’’
‘‘ దిగులు నా కోసం కాదు.. కర్నాటక ఎన్నికల కోసం ’’
‘‘పోటీ చేస్తున్న ఏదో ఒక పార్టీ గెలుస్తుంది. ఏవరో ఒక నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు. దానికంత దిగులెందుకు? కాలం కలిసొస్తే పోటీ చేయని నాయకుడు కూడా ముఖ్యమంత్రి కావచ్చు. కింగ్ మేకరే కింగ్ కావచ్చు. ఐనా కర్నాటక ప్రజలకు లేని దిగులు నీకెందుకు? పదవి పోతుందేమోనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, పరువుపోతుందేమోనని ప్రచారం చేసిన ప్రధాని మోదీ దిగులుపడితే అర్థం ఉంది? ఊళ్లోపెళ్లికి ఎవరిదో హడావుడి అన్నట్టు వారికి లేని దిగులు నీకెందుకోయ్’’
‘‘నేను కూడా సరిగ్గా ఈ విషయంలోనే దిగులు పడుతున్నాను. నువ్వన్నట్టు ఎవరి పెళ్లికో ఎవరి హడావుడినో అన్నట్టు. కర్నాటక ఎన్నికలకు తెలుగు వారి హడావుడి చూస్తుంటే, ఫలితాలు వచ్చాక ఏమవుతుందా? అని దిగులవుతుంది. అమెరికాలో ఎవరు గెలవాలో, కర్నాటకలో ఎవరు ఎవరిని ఓడించాలో, కులాల వారిగా తెలుగువారు ఫత్వాలు జారీ చేస్తుంటే, ఫలితాలు వచ్ఛాక ఓడినవారు ప్రతీకార ఫత్వాలు జారీ చేస్తే ఎలా ఉంటుందా? అని దిగులు. మన వాళ్లు అక్కడి తెలుగు వాళ్ల కోసం తెలుగులో జారీ చేసిన ఫత్వాను- తెలుగు రాదు కాబట్టి ట్రంప్ చదవలేదు గనుక బతికి పోయాం. కన్నడ భాషకు తెలుగు భాష దగ్గరగా ఉంటుంది. మన ఫత్వా వాళ్ల దృష్టిలోనూ పడింది. ఫలితాలు తేడాగా వస్తే. మన వాళ్ల పరిస్థితి?’’
‘‘మరీ అతిగా ఊహిస్తున్నావోయ్! ఐటీ కంపెనీల్లో ఉద్యోగం కోసం వెళ్లే మన వాళ్లు ఓటర్లుగా నమోదు చేయించుకోవడం, క్యూలో నిలబడి ఓటు వేయడం, ఫత్వాను పాటించడం జరిగే పనేనా? పోనీ ఎప్పటి నుంచో ఉన్న తెలుగువాళ్ల ఓట్లు భారీగా ఉన్నాయనుకున్నా, కులం, ఉప కులం, తెగ అన్నీ చూసుకునే ఓటు వేస్తారు.  హిల్లరీ సలహా సంఘం లో మనవాళ్ళు , ట్రంప్  సలహా సంఘం లోనూ మన వాళ్ళు దూరి పోయారు . ఇద్దరిలో ఎవరు గెలిచినా ఫలించిన తెలుగు వ్యూహం అంటాం . హిల్లరీ గెలవాలి అని పత్వా ఇచ్చింది మనమే . ట్రంప్ గెలవాలని కాశీలో పూజలు చేయించింది మనమే . ఇద్దరిలో ఎవరు గెలిచినా మనదే గెలుపు . మన వాళ్ళు ఎక్కడున్నా పది మంది తెలుగు వాళ్లకు సగటున పన్నెండు సంఘాలు ఉంటాయి .  ఒకే కుటుంబం నుంచి భార్య ఒక పార్టీ నుంచి మంత్రి , భర్త మరో పార్టీ నుంచి పదవి . కుటుంబమే వేరు వేరు పార్టీలుగా చీలిన ఈ రోజుల్లో మన పత్వా పని చేస్తుందా ?  అన్ని పార్టీలకూ ఆ ఓట్లు చీలిపోతాయి నువ్వేమీ కంగారుపడకు. ’’
‘‘సరే కానీ- నా దిగులు సంగతి చెప్పాను. మరి ఇంతకూ నీ దిగులెందుకో చెప్పనే లేదు’’
‘‘నీది మరీ లోకల్ సమస్య.. నాది విశ్వమానవ సమస్య’’
‘‘ఏంటది?’’
‘‘మూడు రోజులు తక్కువ 500 కోట్ల సంవత్సరాల్లో సూర్యుడు అంతమవుతాడట!’’
‘‘ఇదేం లెక్క జ్యోతిష్కుడు చెప్పాడా? ’’
‘‘కాదు.. సైంటిస్ట్‌లే మూడు రోజుల క్రితం- ఐదువందల కోట్ల సంవత్సరాల్లో సూర్యుడు అంతరిస్తాడని చెప్పారు. నేను ఆ మూడు రోజులు మినహాయించి చెప్పాను.’’
‘‘ఏమండోయ్! సూర్యుడు అంతరిస్తే ఇక మనం సంసారం చేసినట్టే. ఏసీ పెట్టుకున్నప్పటి నుంచి కరెంటు బిల్లు భరించలేకపోతున్నానని ఇప్పటికే ఏడుస్తున్నారు. ఇక సూర్యుడు అంతరిస్తే కచ్చితంగా పగలు లైట్లు తప్పవు. విద్యుత్ బిల్లు రెట్టింపు అవుతుంది. ఇప్పుడే చెబుతున్నాను. కావాలంటే మీ సిగరేట్ల ఖర్చు, సినిమాలు, టీ ఖర్చు తగ్గించుకోండి. అంతే కానీ విద్యుత్ బిల్లు పెరుగుతోందని ఇంటి ఖర్చు తగ్గిస్తే మాత్రం ఊరుకునేది లేదు.’’
‘‘నాన్నోయ్.. సూర్యుడు అంతరిస్తే ఇక మేం స్కూల్‌కు వెళ్లాల్సిన అవసరం లేదా?’’
‘‘ఏదో ముతక సామెత చెప్పినట్టు- సూర్యుడు చచ్చిపోతాడురా దేవుడా అని నేను అందోళన చెందుతుంటే మధ్యలో మీరేంటి?’’
‘‘తుఫాన్‌ను ఆపేసినట్టు సూర్యుడి మరణాన్ని ఆపలేరా! ఇలాంటి రోజు వస్తుందనే అరచేతిని అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఆపలేరని ఎప్పుడో అన్నారు.’’
‘‘తెలిసీ తెలియకుండా మాట్లాడకు. సూర్యోదయాన్ని ఆపలేరు అని చెప్పడంలో కవి హృదయాన్ని అర్థం చేసుకోవాలి. ఏదో విప్లవ పార్టీలకు డిమాండ్ బాగా ఉన్న రోజుల్లో ఇలాంటి డైలాగులు పాపులర్ . ఇది అర్జున్‌రెడ్డి కాలం, ఆర్. నారాయణమూర్తి కాలం కాదు.’’
‘‘ఏమండీ.. మీకు చెప్పొద్దని దాచి పెట్టాను. మా తమ్ముడు మాదాపూర్‌లో త్రిబుల్ బెడ్‌రూం ఫ్లాట్ కొంటున్నాడు. అడ్వాన్స్ కూడా ఇచ్చేశాడు. నిన్ననే తమ్ముడు, మరదలు వచ్చి చెప్పారు. అడ్వాన్స్ వెనక్కి తీసుకోమంటారా? సూర్యుడే అంతరించినప్పుడు రియల్ ఎస్టేట్ ధరలు పడిపోకుండా ఉంటాయా? ’’
‘‘హైదరాబాద్ గాంధీనగర్‌లో మూడు వందల రూపాయలకు మూడు వందల గజాల ప్లాటు అమ్మిన కాలం నుంచి ధరలు తగ్గుతాయనే మాటలు వింటున్నాను. తెలంగాణ వస్తే స్థలాల ధరలు పడిపోతాయని కొందరు, రాకుంటే పడిపోతాయని మరి కొందరు తెగ ప్రచారం చేశారు. నోట్ల రద్దుతో డమాల్ అని కొందరు, జిఎస్‌టితో రియల్ ఎస్టేట్ శకం ముగిసినట్టే అని మేధావులు అంచనా వేశారు. మొన్నటికి మొన్న రిజిస్ట్రేషన్‌కు ఆధార్ అనుసంధానం వల్ల భూముల ధరలు పాతాళంలో పడిపోవడం ఖాయమన్నారు. తీరా మొన్న హెచ్‌ఎండిఏ వాళ్లు ప్లాట్లను వేలం వేస్తే లక్షా 56 వేల రూపాయలకు గజం ధర పలికింది. ఒకేసారి ఇంత ధర పలకడం వల్ల రియల్ ఎస్టేట్ పడిపోతుందని మళ్లీ ప్రచారం. పెరుగుట విరుగుట కొరకే అనేది రియల్ ఎస్టేట్‌కు వర్తించదు. పెరుగుట పెరుగుట కొరకే ’’
‘‘అన్నయ్య గారూ.. మీరు మరోలా అనుకోవద్దు, మా వారూ, మీరూ మరీ దీర్ఘంగా ఆలోచిస్తున్నారు.. అంత మంచిది కాదేమో? మగవాళ్లకే గుండెపోటు ప్రమాదం ఎక్కువట.. ఎందుకో తెలుసా?’’
‘‘ఆడవారి నుంచి గృహహింసను తట్టుకోలేక కావచ్చు.. హా..హా..’’
‘‘కాదన్నయ్య గారూ.. ప్రపంచంలోని ప్రతి సమస్యపై మగాళ్లు అతిగా ఆలోచిస్తారు కాబట్టి గుండెపోటు ఎక్కువ. కర్నాటక ఎన్నికల ఫలితాలపై అక్కడి నాయకుల్లో కన్నా ఆ వార్తలు రాసే మీడియా వారిలో, ఆయా పార్టీల అభిమానుల్లో ఆందోళన ఎక్కువగా ఉంది. ఎన్నికల్లో ఒక్క నాయకుడికి కూడా గుండెపోటు రాదు కానీ మీడియావారికి, అభిమానులకు గుండెపోట్లు వస్తున్నాయి. క్రికెట్ ఆడేవారి కన్నా అది చూసీ మీలాంటి వారిలో ఆందోళన ఎక్కువగా కనిపిస్తోంది? ఎందుకంటారు?’’
‘‘అది కూడా నువ్వే చెప్పమ్మా..!’’
‘‘టెన్షన్ నాయకులకుండాలి కానీ మీకెందుకు? రేపేం జరుగుతుందో తెలియదు. ఐదువందల కోట్ల సంవత్సరాల తరువాత అంతరించే సూర్యుడి గురించి ఆందోళన అవసరమా? అతిగా ఆలోచించడం మేధావితనం కాదు గుండెపోటు తనం అవుతుంది.’’
*

బుద్దా మురళి(జనాంతికం - 11-5-2018)

1 కామెంట్‌:

  1. అన్నట్టు గురువు గారూ, చిన్న సందేహం.

    ఎన్టీఆర్ గారిని పార్టీ పెట్టుకోమని, బిల్ గేట్సును కంప్యూటర్ నేర్చుకోమని, వాజపేయి గారికి కలాం గారిని రాష్ట్రపతి చేయమని, ఇట్లా ఎన్నెన్నో మంచి సలహాలు ఇచ్చే అత్యంత సీనియర్ నాయకుడు మన దేశంలోనే ఉన్నాడు కదా. అంతరించివద్దని సూర్యుడికి నచ్చచెప్పమని ఆయనను అడిగితే సరి!

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం