20, ఏప్రిల్ 2018, శుక్రవారం

అసలేం జరుగుతోంది..?

అసలేం జరుగుతోంది..?
ఇంతకీ ఏం జరుగుతోంది..?’’
‘‘శ్రీరెడ్డి పేరు శ్రీ శక్తిగా మారింది.బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి సినిమాల్లో త్యాగ మయ హీరో తప్పులన్నీ తనపై వేసుకొని రాజు వయ్యా మహ రాజు వయ్యాఅని పించుకొన్నట్టు వర్మ శ్రీ తప్పులను తనపై వేసుకొన్నాడు . వర్మకు ఇది కొత్త పాత్రే 
 . దేశంలో ఇరవై నిమిషాలకో అత్యాచారం జరుగుతోందని తేలింది. ప్రధాని దీక్షను తీవ్రంగా విమర్శించిన ముఖ్యమంత్రి ఈనెల 20న ‘హోదా’ కోసం దీక్ష చేస్తానని ప్రకటించారు. దీక్షకు కోట్ల రూపాయల ఖర్చుతో అదిరిపోయే ఏర్పాట్లు .ఫెడరల్ ఫ్రంట్‌లో కలిసేది లేదని సిపిఎం నేత తమ్మినేని ప్రకటించారు’’

‘‘తమ్మినేని పార్టీ ఇంకా ఉందా? ఉంటే ఎక్కడ..?’’
‘‘దేశమంటే రెండు తెలుగు రాష్ట్రాలేనా? ’’
‘‘సర్లే.. కమ్యూనిస్టులు కలవకపోయినా- ఒక్క సీటు గెలవక పోయినా , వాళ్లే ప్రధానమంత్రి అయితే సంతోషమే! మంగళగిరి సీటు కోసమే ఈ మహోద్యమం అని గిట్టని వాళ్లు విమర్శిస్తున్నారు. నేను ఎన్నో విశేషాలు చెబితే, తమ్మినేని గురించే అడిగావంటే ఆయనంటే నీకెంత అభిమానమో తెలుస్తునే ఉంది.’’
‘‘ఐతే- ఇప్పుడు శ్రీ శక్తి గురించి మాట్లాడనా మరి.. వద్దులే.. చట్టాన్ని ఆశ్రయించాలని పవన్ కల్యాణ్ చెప్పినందుకే నానా బూతులు తిడుతోంది.. ఆమె సంగతి మనకెందుకులే... ఆ చానల్స్ గంటల తరబడి.. రోజుల తరబడి చూపిస్తున్నా, చర్చిస్తున్నా ఇప్పటికీ నాకు విషయం అర్థం కాలేదు. టీవీ చర్చల్లో మొదటి రోజు ఆమె తెలుగు సినిమాల్లో తెలుగు వారికి అవకాశం ఇవ్వాలని కోరింది. ఒక సినిమా ఆయన ఫోన్ చేసి అవకాశం ఇస్తానన్నాడు. వ్యవహారం ఎటు నుంచి ఎటు పోయిందో.. ఆమెను మహోద్యమ నాయకురాలిగా ప్రకటించేశారు. ఇలా ఎలా అయిందని ఎవరినైనా అడుగుదామంటే నేనెంత అజ్ఞానంలో ఉన్నానో అందరికీ తెలిసిపోతుందని అడగలేదు. ఈ పాపులారిటీతో ఆమె రెండు రాష్ట్రాల్లో జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తే ఎన్నికల్లో నిలబడేట్టుగానే ఉంది. పది మంది అనుచరులు లేని వాళ్లు కూడా పార్టీ పెట్టేస్తుండగా, ఆమె పెడితే కొత్తగా పోయేదేముంది?’’
‘‘రాఖీ సావంత్ ఆ మధ్య పార్టీ పెట్టింది. ఏమైందో తెలియదు. పద్మనాభం హీరోగా వచ్చిన జాతకరత్న మిడతం భొ ట్లు సినిమా చూశావా? మిడతం భొట్లు తన నోటికి వచ్చింది ఏదో అనేస్తాడు. అవే జరుగుతాయి. అంతా అతడ్ని కా లజ్ఞానిగా కీర్తిస్తారు. కాలం కలిసొస్తే శ్రీరెడ్డి కాస్తా స్ర్తిశక్తిగా మా రుతుంది. ’’
‘‘అర్థం కాలేదు..’’
‘‘కొన్ని విషయాలు అర్థం అయి కాకుండా ఉంటేనే బాగుంటుంది. జ్యోతిలక్ష్మి డ్యాన్స్‌లా?’’
‘‘ఒకదానికొకటి అస్సలు సంబంధం లేదు కదా? ’’
‘‘ఉందనుకుంటే ఉంది.. లేదనుకుంటే లేదు.’’
‘‘ఏమడిగినా సినిమాలనే ఉదహరిస్తావెందుకు?’’
‘‘సినిమాలు, జీవితం వేరు కాదు.. పాలలో నీళ్లలా ఒకదానిలో ఒకటి కలిసిపోయాయని నమ్ముతాను కాబట్టి’’
‘ఈ వివాదాలు ఎందుకు కానీ.. ఎల్లుండి ఢిల్లీలో మా అబ్బాయి గృహ ప్రవేశం.. నువ్వు వస్తావా?’’
‘‘మీ వాడు తొందరపడి ఢిల్లీలో ఇల్లు కట్టాడు.’’
‘ఢిల్లీ కొచ్చిన ముప్పేముంది? వద్దంటున్నావు’’
‘ 
‘ఢిల్లీ భస్మం అయినప్పుడు అందులో ఉన్న మీ వాడి ఇల్లు కూడా బూడిద అవుతుంది.’’
‘‘1999లో, 2012లో యుగాంతం జరిగిపోతుందని వి న్నాం. 2018లో యుగాంతం అని కొత్తగా ప్రచారం ఏదైనా ప్రారంభం అయిందా? ’’
‘‘నీవేం మిస్సవుతున్నావో నీకే అర్థం కావడం లేదు. హైదరాబాద్ పత్రికల్లో చదివితే నీకేముందని? తెలంగాణకు వరప్రసాదం కాళేశ్వరం, రైతులకు వ్యవసాయ పెట్టుబడి.. వంటి చప్పటి వార్తలే తప్ప. మసాలా ఉన్న గొప్ప వార్తలు మి స్సవుతున్నావు.’’
‘ఢిల్లీలో శివప్రసాద్ వేషాలతో పాటు అన్నీ చూసి తరించాను. మరింకేం మిస్సయ్యాను.?
‘‘మూడోకన్ను తెరిస్తే ఢిల్లీలో ప్రభుత్వం భస్మం అవుతుందని నందమూరి బాలకృష్ణ అనంతపూర్‌లో చెప్పిన వార్త హైదరాబాద్‌లో వచ్చిందా? ’’
‘‘రాలేదు..’’
‘‘తెలుగువారు ఒక్కసారి తొడకొట్టి ఢిల్లీకి వినిపించాలని పిలుపు ఇచ్చారు. నువ్వు విన్నావా? ’’
‘‘నిజమా? నాకు తెలియదు.. బహుశా ఆయన పిలుపు అమరావతి ఎడిషన్ దాటి పోలేదేమో .. పోయి ఉంటే నిజంగా ఒక్కసారి తెలుగు వారంతా తొడ కొడితే ఢిల్లీ ప్రభుత్వం గజగజ వణికిపోకుండా ఉంటుందా? ’’
‘‘వ్యంగ్యమా..?’’
‘‘కంటిచూపుతో ఆయన రైలును వెనక్కినడిచేట్టు చేశాడు. ఈ రోజే టీవీలో చూశా.. అదేదో సినిమాలో పాతికమంది ఆడవిలన్లతో త్రిష బాలకృష్ణపై దాడికి వస్తుంది. ఏం జరుగుతుందా? అని ఉత్కంఠ.. పాతికమంది ఆడపులుల్లా మీదకు వస్తుంటే ధైర్యంగా ఉన్న బాలకృష్ణ..’’
‘‘ఆ.. ఆ అప్పుడేమవుతుంది?’’
‘‘నేను కూడా ఇలానే ఏమవుతుందా? అని ఉత్కంఠగా చూశాను. అమ్మాయిలు అడుగులో అడుగేసుకుంటూ పైపైకి వస్తుంటే జేబులో చెయ్యి పెట్టిన బాలకృష్ణ..’’
‘‘గన్ తీశాడా..?’’
‘‘అంతకన్నా శక్తివంతమైన ఆయుధం’’
‘‘ఎకె 47?’’
‘‘అది జేబులో పట్టదు. 
జేబులో నుంచి బాడీ స్ప్రే తీసి తనపై కొట్టుకున్నాడు. అంతే.. చీల్చి చెండాడానికి వచ్చిన ఆ పాతిక మంది అమ్మాయిలు ఆ వాసనకు.. అదే ఫర్మ్యూమ్ సువాసనకు ఆయనపై పడిపోతే పాపం.. త్రిష వాళ్లను పక్కకు లాగలేక నానా తంటాలు పడింది.’’
‘‘మేగ్నట్‌కు ఇనుము అతుక్కు పోయినట్టు, పాతిక రూపాయల బాడీ స్ప్రేకు పాతికమంది అతుక్కు పోతారని బాలయ్య బాబు ద్వారా- ఆ సినిమా సభ్యసమాజానికి గొప్ప సందేశం ఇచ్చింది.’’
‘‘ఎన్టీఆర్, బాలయ్య బాబులను మించి సాహసాలు చేసిన హరికృష్ణ టాలెంట్‌ను తొక్కేస్తున్నారు. ’’
‘‘వీరిని మించిన టాలెంట్..? నేను నమ్మను..’’
‘‘ఇద్దరు ఎన్టీఆర్‌లు, బాలకృష్ణల వరకు ఏం చేశారు- మహా అయితే పులిని, సింహాన్ని చంపేశారు, సుమోలను గాలిలోకి లేపారు. అంతే కదా? కానీ హరికృష్ణ సింహాన్ని చిత్తుగా ఓడించి కాడికట్టి పొలం దున్నించాడు.’’
‘‘ఆ..’’
‘‘విజయరామరాజు సినిమాలోనట.. టీవీలో ఆ దృశ్యం వస్తే చూశా. ఇంతటి టాలెంట్ వల్ల తనకు ఎప్పటికైనా ప్రమాదం అని తెలిసే కావచ్చు హరిని పక్కన పెట్టారు. ’’
‘‘మన చర్చ దారి తప్పుతుందేమో?’’
‘‘ఎలా?’’
‘‘సినిమా వేరు, వాస్తవం వేరు. రాజకీయ పరిణామాలు అనే సీరియస్ విషయాలను నువ్వు సినిమాలతో కలిపి మాట్లాడుతున్నావ్’’
‘‘్ఢల్లీ భస్మం చేయడం గురించి బాలయ్య బాబు చెప్పి న డైలాగు సినిమాలో కాదు అనంతపురం సభలో.. ఆ డైలాగు విని జనం కేరింతలు కొట్టారు. ప్రత్యేక హోదా ఇచ్చేస్తాం అని మోదీ ప్రకటించినా అంతటి చప్పట్లు వినపడవేమో! సినిమా, వాస్తవం కలిసిపోయి చాలాకాలం అయింది. రెండు గంటల్లో సినిమా ముగుస్తుంది. రాజకీయ సినిమా ఏళ్ల తరబడి సాగుతుంది. ఎన్నికల ఏడాదిలో రాజకీయ సినిమా మలుపులతో ఉర్రూతలూగిస్తుంది.’’
‘‘ఎంత గొప్ప సినిమా ఐనా రెండు గంటల తరువాత థియేటర్ నుంచి బయటకు రావాలి. రాకపోతే జీవితం ఉండదు. ’’ *

బుద్దా  మురళి (జనాంతికం 20.4.2018)

1 కామెంట్‌:

మీ అభిప్రాయానికి స్వాగతం