16, జనవరి 2018, మంగళవారం

రాహత్ మహల్ కోరా కాగజ్




అత్యద్భుత చిత్రము యొక్క అద్భుత విజయం పక్షి రాజావారి బీదల పాట్లు తారలు నాగయ్య -లలిత- పద్మ 
రాహత్ మహల్ లో సమయము , ఆటలు యధా ప్రకారం - జనవరి 16-1951లో అంటే 67 ఏళ్ళ క్రితం గోలకొండ పత్రికలో సినిమా ప్రకటన . 
 మహల్ అదెక్కడా? అనే ప్రశ్న ఈ తరం వారికిఉదయించవచ్చు . 
ఆ సినిమా టాకీసు పేరు అర్థం ఆ రోజుల్లో తెలియలేదు. కానీ ఆ పేరులోనే ఆహ్లాదం ఉన్నది. ముషీరాబాద్‌లోని ఈ సినిమా హాలును ఇప్పటికీ అక్కడివారు రాత్ మహల్ అనే పిలుస్తారు. రాత్ మహల్ అంటే రాత్రి ప్యాలెస్ అని అర్థం. కానీ దాని అసలు పేరు రాహత్‌మహల్. రాహత్ అని రహత్అని కొన్ని ప్రకటనల్లో ఉంది. రాహత్   అంటే అరబ్బీ భాషలో విశ్రాంతి, రిలీఫ్ అని అర్థం. మహల్ అంటే ప్యాలెస్. ఎన్నో సమస్యలతో సతమతమయ్యే సగ టు జీవి కాసేపు సేదతీరేది సినిమాహాలులోనే. దానికి తగ్గట్టుగానే కళాత్మకహృద యంతో ఈ సినిమా హాలుకు రహత్ మహల్ అని పేరు పెట్టారు.
రాహత్ని ాఅని అరబ్బీ పేరు పెట్టినా ప్రారంభం లో ఎక్కువగా తెలుగు సినిమాలే ప్రదర్శించే వారు .కాంతారావు , కృష్ణ కుమారి , రాజనాల నటించిన కనకదుర్గ పూజా మహిమ ఇందులో ప్రదర్శించారు  గుండమ్మ కథ వంటి సినిమాలు ప్రదర్శించారు. 
  యజమాని ఎవరు? హాలులో ఎవరి వాటా ఎంత? ఆదాయం వస్తుందా? లేదా? అనే ఆలోచన లు అప్పుడు అస్సలు లేవు. కానీ సినిమాహాలు రూపం మారిన తర్వాత ఇది వనపర్తి రాజాలదని తెలిసింది.ఇప్పుడు రహత్ మహల్ లేదు. కానీ రాజా పేరుతో అదే చోట మూడు టాకీసులు నిర్మించారు. పేరుకు తగ్గట్టు విశా లమైన స్థలంలో ఈ టాకీసు ఉండేది. చుట్టుపక్కల ఎక్కువ గా ముస్లింలు నివసించే ప్రాంతం కావడంతో ఎక్కువగా హిందీ సినిమాలే విడుదలయ్యేవి.
టాకీసు ఉన్నది ముషీరాబాద్‌లో అయినా ముషీరాబాద్, బోలక్‌పూర్, బాకారం, జమీస్తాన్‌పూర్, రాంనగర్ వారికి అందుబాటులో ఉండేది. ఈ ప్రాంతాల హిందీ సినిమా ప్రేమికులకు రహత్ మహల్ ఒక మధుర జ్ఞాపకం. తొలిసా రి సినిమా షూటింగ్ చూసింది కోరా కాగజ్ హిందీలో బాగా హిట్టయిన ఈ సినిమా రహత్ మహల్లోనే చూశాను. జన్మకో శివరాత్రి అన్నట్టు ఎప్పుడో ఒకసారి తెలుగు సినిమాను ప్రదర్శించేవారు.ఈ రోజుల్లో సినిమాహాలు బుకింగ్ వద్ద మొదటి తరగతి, రెండవ తరగతి, మూడవ తరగతి అని ఎక్కడైనా కనిపిం చిందా? కావాలంటే నగరంలోని అన్ని టాకీసులు తిరిగి చూడండి ఒక్కచోట కూడా కనిపించదు. కానీ ఆ రోజుల్లో రహత్ మహల్లో ఆడేవి హిందీ సినిమాలే అయినా బుకింగ్ దగ్గర మాత్రం తెలుగులోనే మొదటి తరగతి, రెండవ తరగ తి, మూడవ తరగతి అని రాసి ఉండేది. మూడవ తరగతి చదువుకుంటున్నవారికే టికెట్లు ఇస్తారేమో అని అనుకొని ఐదవ తరగతి చదువుతున్నా టికెట్లు ఇచ్చేవాడికి మూడవ తరగతి అని అబద్ధం చెప్పాలని నిర్ణయించుకుని క్యూలో నిలబడిన సందర్భాలు చాలామందికి ఉన్నాయి.
కోరా కాగజ్ సినిమాలోని ఒక సీనును ట్యాంక్‌బండ్‌పై చిత్రీకరించారు. నటుల పేర్లు తెలియదు. కానీ ట్యాంక్‌బండ్ పై స్త్రీ పాత్రధారి వెళ్తుంటుంది. కారుపై వెళుతూ హీరో ఆమె కు కారు తగిలిస్తాడు. ఈ చిన్న సీనును తీసేందుకు కొన్ని గం టలపాటు షూటింగ్ జరిగింది. సినిమా షూటింగ్ అంటే ఇం త కష్టమా? అనిపించింది మొదటిసారి.రహత్‌మహల్లో లెక్కలేనన్ని హిందీ సినిమాలు చూసినా కోరా కాగజ్ సినిమా అనుభవం ప్రత్యేకం. అప్పటివరకు హిందీ సినిమాలు అంటే డిష్యూం డిష్యూం ఫైట్స్‌కు పెట్టింది పేరు. డిష్యూం మాట దేవుడెరుగు ఈ సినిమాలో కనీసం ఒక చెంపదెబ్బ సీన్ కూడా లేకపోవడంతో ఇదేం సినిమా అనిపించింది 1974లో. ఆ ఏడాది హిందీలో పాపులర్ సినిమాగా కోరా కాగజ్‌కు అవా ర్డు దక్కింది.అమర్ అక్బర్ ఆంథోని. ఆ కాలం లో ఒక ఊపు ఊపిన హిందీ సినిమా. ఆ సినిమాను చూసింది రహత్ మహ ల్‌లోనే ఉదయం పూట పాత తెలుగు సినిమాలు ప్రదర్శించేవారు. మూడు ఆటలు ఎక్కువగా హిందీ సినిమాలే ప్రదర్శించేవారు. దగ్గరలోనే ముషీరాబాద్ హైస్కూల్ కావడంతో ఇంటర్వె ల్‌లో టాకీసుకు వచ్చి హాజరు వేయిం చుకొని వెళ్లడం అక్కడి విద్యార్థులకు అలవాటు.ఇక్కడ చూసిన సినిమాల కన్నా విన్న సినిమాలు ఎక్కువ. బయటకు సినిమా మొత్తం వినిపించేది. కాసేపు అక్కడ గడిపి వెళ్లడం ఓ వ్యాపకం.

విశాలమైన ఆవరణ చివరలో సినిమా హాలు. ఎంట్రెన్స్ లోనే క్యాంటిన్, క్యాంటిన్ ముందు విశాలమైన ఖాళీ స్థలం. అప్పటి కార్మిక నాయకుడు, ఇప్పటి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి బుల్లెట్ మీద టంచనుగా రహత్ మహల్‌కు రోజూ వచ్చేవారు. సినిమా చూసేందుకు కాదు. క్యాంటిన్ ఎదురుగా ఖాళీ స్థలంలో తనకోసం వేచి ఉన్న వారి సమస్యలను పరిష్కరించి వెళ్లేవారు.ఈ ప్రాంతం చుట్టుపక్కల ఎక్కువగా శ్రమజీవులే. దినమంతా పనిచేసేవారే. మిగిలిన ఆటలకన్నా సెకండ్ షోలోనే ఎక్కువమంది కనిపించేవారు. కొంతకాలానికి సినిమా హాలును మూసేశారు. రహత్ మహల్‌ను మూసినచోట ఇప్పడు రాజా పేరుతో మూడు సినిమా హాళ్లను నిర్మించారు. ముందు షాపింగ్ కాంప్లెక్స్, లెక్కలేనన్ని షాపులు. వెనుక మూడు సినిమా హాళ్లు. సూక్ష్మంలో మోక్షం సాధించాలి అని ఆధ్యాత్మికవేత్తలు భావించినట్టుగానే తక్కువ స్థలంలో ఎక్కు వ వ్యాపారం సాగించాలనేది నేటి మాట. అందుకే విశాలం గా ఉన్నరహత్ మహల్ అంతరించి ఇరుకుగా మూడు టాకీసులు, డజన్లకొద్దీ షాపులు వెలిశాయి. పాతతరం వారికి రహత్ మహల్ జ్ఞాపకాలు ముఖ్యం. కొత్తతరం యజమానులుకు లాభం ముఖ్యం.ఎప్పటిలానే ఈ టాకీసుల్లో హిందీ సినిమాలనే విడుదల చేస్తున్నారు. నాటి జ్ఞాపకాలను గుర్తు చేసే విధంగా క్యాంటిన్ లో కొంతభాగం అలానే ఉంది.

ముగ్గురు అన్నదమ్ములు విలన్ కారణంగా విడిపోతారు. అమర్ అక్బర్ ఆంథోనీగా మూడు మతాలకు చెందిన వారి గా పెరిగి పెద్దవుతారు. ముగ్గురు తాము అన్నాదమ్ములమని, విలన్ కారణంగా తమ కుటుంబం విడిపోయిందని గ్రహిం చి ప్రతీకారం తీర్చుకుంటారు. ఈ కథతో లెక్కలేనన్ని సినిమాలు వచ్చాయి. కానీ అమర్ అక్బర్ ఆంథోనీ సూపర్‌హి ట్ అయింది. రహత్ మహల్‌లో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.విడిపోయిన ముగ్గురు అన్నదమ్ములు చివరకు ఒకటవుతారు. రహత్ మహల్ మాత్రం ఒకటి నుంచి మూడయింది. కానీ ఆ కళ మాత్రం కనిపించడం లేదు. ఆ తరం వారికి రహత్ మహల్ ఒక జ్ఞాపకం మాత్రమే. ఇప్పుడు బయటినుంచి చూస్తే ముందుగా కనిపించేవి షాపులు. వాటివెనుక సినిమా టాకీసులు.
బుద్దా మురళి (జ్ఞాపకాలు నమస్తే తెలంగాణ 14-1-2018)
టాకీస్ 4 

1 కామెంట్‌:

మీ అభిప్రాయానికి స్వాగతం