2, జనవరి 2018, మంగళవారం

బాలాజీ టాకీసు -బంగ్లా దేశ్ కు సహాయం




ఘంటసాల మరణం .పాకిస్థాన్ తో యుద్ధం-బాంగ్లాదేశ్ ఆవిర్భావం ప్రభుత్వ పాఠశాల లో రుచికరమైన చిక్కటి పాలు .. చింత చెట్టు నుంచి రాలిపడే చింతకాయలు  .
 బడిపంతులు -అంజలి శ్రీదేవి , జయమాలిని జగన్ మోహినీ 
ఇవన్నీ ఒకదానికి ఒకటి సంబంధం  లేదు . కానీ గాంధీనగర్ లోని బాలాజీ టాకీస్ అనగానే ఇవన్నీ ఒకదాని తరువాత ఒకటి గుర్తుకు వస్తాయి . 
***

 మహా సౌధం కూలిపోయిన తరువాత అక్కడ ఆనవాళ్లు కనిపించి నట్టుగా అనిపించింది ఆ గోడను చూసిన తరువాత ...గాంధీ నగర్ లోని ఒకప్పటి బాలాజీ సినిమా హాల్ ఇప్పుడు కేవలం జ్ఞాపకాలు మాత్రమే .. అందులో చూసిన సినిమాలు తక్కువే కావచ్చు .. కానీ ఆ టాకీసు గోడలపై చూసిన సినిమా పోస్టర్ లకు లెక్క లేదు .. ప్రతి రోజూ ఉదయం స్కూల్ కు వెళ్లి హాజరు వేయించుకొన్నట్టుగానే ..స్కూల్  లంచ్ టైం లో ఆ టాకీసుకు వెళ్లి గోడమీద పోస్టర్ లను కాసేపు చూసి అక్కడి నల్లా నీళ్లు తాగి రావలసిందే . ఓ రోజు అలా పోస్టర్ లు చూస్తుండగానే ఒకరు ఘంటసాల మరణించారు అనే వార్త మోసుకొచ్చారు .. అక్కడి పోస్టర్లు చూస్తూ ఆ వార్త విని నాలుగున్నర దశాబ్దాలు అవుతున్నా ఆ దృశ్యం ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది . 
ఫలక్ నుమా ప్యాలెస్ లో పొడవైన ఆ డైనింగ్ టేబుల్ ఎలా ప్రత్యేక మైందో బాలాజీ టాకీస్ కు కిలోమీటర్ల దూరం నుంచి కనిపించే పొడవైన కట్టడం ఒకటి ప్రత్యేక మయింది . రాజు గారికి కిరీటం లా బాలాజీ టాకీస్ కు  పైన జారుడు బండ లాంటి నిర్మాణం ఉండేది. గాంధీ నగర్ ముషీరాబాద్ ఎటు నుంచి చుసిన కనిపించేది .. 
ఒక రోజు టికెట్ పై అయిదు పైసలు అదనపు చార్జీ వసూలు చేశారు . టికెట్ ధర పైన ఐదు పైసలు అదనంగా ముద్రించారు .. బంగ్లాదేశ్ కు సహాయం కోసం . పాకిస్తాన్ నుంచి బంగ్లా దేశ్ వేరుపడింది . బంగ్లా విముక్తిలో మనదేశానిదే కీలక పాత్ర .. అప్పుడు విధించిన అదనపు చార్జీలు నేటికీ కొనసాగుతున్నాయని పత్రికల్లో వచ్చింది . . ఈ రోజుల్లో మారుమూల ప్రాంతాల్లో కూడా కొత్త సినిమాలు నేరుగా విడుదల అవుతున్నాయి .. ఆ రోజుల్లో బాలాజీ టాకీస్ లో కొత్త సినిమాలు వచ్చేవి కాదు కానీ కొన్ని నెలలు గడిచిన తరువాత వచ్చేవి . జయమాలిని నటించిన జగన్ మోహిని సినిమా ఇందులో బాగా ఆడింది .. 
ఆర్ధిక సంస్కరణల తరువాత సినిమా టాకీసుల్లో కూడా చాలా మార్పు వచ్చింది . మధ్య తరగతిలో పెరిగింది . అంతకు ముందు సినిమా టాకీసులో థర్డ్ క్లాస్ టికెట్ కు జనం ఎక్కువగా ఉండేవారు . థర్డ్ క్లాస్ బుకింగ్ మూసేసిన తరువాతనే పై తరగతి టికెట్లు అమ్ముడు పోయేవి . ఆర్ధిక సంస్కరణల తరువాతి పై తరగతి బుకింగ్స్ క్లోజ్ అయినా తరువాత కింది తరగతి టికెట్ లు ఉన్నా వెళ్లేందుకు ఇష్టపడని తరగతి సంఖ్య భారీగానే  ఉంది .. 
గాంధీ నగర్ ,ముషీరాబాద్ ,భోలక్ పూగాంధీ నగర్ ,ముషీరాబాద్ ,భోలక్ పూర్ ప్రాంతాల వారికీ తలమానికంగా నిలిచిన బాలాజీ టాకీసు ఇప్పుడు ఓ జ్ఞాపకం మాత్రమే . ఆ టాకీసును కూల్చేప్పుడు చుట్టుపక్కల వారంతా చేరి తమ ఇంటిని కూల్చి వేస్తున్నట్టుగా ఆవేదన చెందారు . తాము చిన్నప్పుడు అడుగులు వేసిన ప్రాంతం. తోలి సినిమా చుసిన టాకీసు ను తమ కళ్ళ ముందే కూల్చి వేయడాన్ని తట్టుకోలేక పోయారు . తమ ఆత్మీయుడు మరణిస్తే ఎలాంటి ఆవేదన చెందుతారు ఆలా మూగగా రోధించారు.. 
***
బాలాజీ టాకీసు ఉన్న చోట ఇప్పుడు బాలాజీ ఇంద్ర ప్రస్థ పేరుతో భారీ అపార్ట్ మెంట్ అవతరించింది . వారికి అదో అపార్ట్ మెంట్ మాత్రమే కానీ ఆ ప్రాంత వాసులకు తమ జీవితం లో ఎప్పుడూ చెదిరిపోని జ్ణాపకాల వేదిక . 
 బాలాజీ టాకీసు పక్కనే మరో టాకీసు నిర్మాణం ప్రారంభమయింది .. ఇప్పటిలా భూముల ధరలు అంత ఎక్కువ కాదు కాబట్టి విశాలమైన స్థలం లో బాలాజీ టాకీసు ఉండేది . దాని పక్కన మరో టాకీసు నిర్మాణం ప్రారంభమయింది .. మధ్యలోనే టాకీసు నిర్మాణం ఆపేశారు . ఓ దశాబ్ద కా లం సగం నిర్మాణం తో అలానే ఉండేది .. ఇప్పుడు బాలాజీ టాకీసు లేదు దాని పక్కన మరో టాకీసు లేదు .. ఆ స్థలం లో భారీ అపార్ట్ మెంట్ కనిపిస్తోంది . ఫస్ట్ క్లాస్ , సెకండ్ క్లాస్ , థర్డ్ క్లాస్ అని టికెట్ బుకింగ్స్ కనిపించే చోట ఇప్పుడు అపార్ట్ మెంట్ లో మొదటి లైన్ రెండవ లైన్ మూడు , నాలుగవ లైన్ అని కనిపిస్తోంది . 
టాకీసు మొత్తం కూల్చి వేసినా ఎందుకో కానీ ప్రహరీ గోడను మాత్రం అలానే ఉంచారు . మార్నింగ్ షో పాత సినిమా పోస్టర్ లు అతికించే గోడ అలానే ఉంది కానీ వాటిమీద పోస్టర్ లు మాత్రం లేవు . గేటు గోడ పాతదే.. బాలాజీ క్యాంటిన్ అని మసక మసకగా అక్షరాలు కనిపిస్తున్నాయి . 
కవాడిగూడ లోని ప్రభుత్వ స్కూల్ ను గాంధీ నగర్ కు మార్చారు . అద్దెకు ఉన్నప్పుడు ఇంటిని ఖాళీ చేసినట్టే అద్దె స్కూల్ ను ఖాళీ చేయాలి . దాదాపు నాలుగున్నర దశాబ్దాల క్రితం  స్కూల్ పిల్లలంతా కవాడిగూడ నుంచి గాంధీనగర్ కు నడక అంతా చెట్లూ  చేమ తో అడవిని తలపించేది . జూబ్లీ హిల్స్, హై టెక్ సిటీ కన్నా ముందు అత్యంత ఖరీదైన ప్రాంతం గాంధీ నగర్ .. నాలుగున్న దశాబ్దాల క్రితం ఓ అడవిని తలపించే విధంగా ఉండేది . స్కూల్ లో ఆ రోజుల్లో మధ్యాహ్నం చిక్కని పాలు ఇచ్చేవారు . 
స్కూల్ పిల్లలంతా నడుచుకొంటూ వెళ్లేప్పుడు చెట్ల పొదల నుంచి తొండలు వస్తాయేమో అని భయం .. ఉర్దూలో మాట్లాడితే తొండలు భయపడి రావు అని మాలో ఒకరి సలహా . దాంతో పిల్లలంతా ఉర్దూలో తెగ ముచ్చట్లు . తొండలకు భాషా బేధం ఉంటుందా ?
భోలక్ పూర్ నుంచి గాంధీ నగర్ బాలాజీ టాకీసుకు దగ్గరి దారి . గాంధీ నగర్ నుంచి బాలాజీ టాకీసు దారిలో విసిరివేసినట్టుగా ఒకే ఒక ఇల్లు . ఆ ప్రాంతం లో అదే తోలి ఇల్లు . ఆ ఇల్లు ఇప్పటికీ అలానే ఉంది . చుట్టూ బహుళ అంతస్థుల భవనాలు . 
ఎన్టీఆర్ అంజలి నటించిన బడిపంతులు ఇందులో చూశాను . శ్రీదేవి ఎన్టీఆర్ కు మానవరాలిగా నటించింది . బుచా డమ్మా బుచాడు బుల్లి పెట్టెలో ఉన్నాడు అంటూ టెలిఫోన్ గురించి శ్రీ దేవి పాట పాడేది ఈ సినిమాలోనే ఆ కాలం లో కొద్దీ మంది సంపన్నుల ఇళ్లలో తప్ప టెలిఫోన్ అంతగా అందుబాటులో ఉండేది కాదు .. ఆ రోజుల్లో ఈ పాట చాలా పాపులర్ . 
గ్రామాల్లో పుట్టి పెరిగిన వారికీ చింత చెట్టు జ్ఞాపకాలు తప్పకుండా ఉంటాయి . నగరం లోని వారికీ ఆ జ్ఞాపకాలను మిగిల్చింది మాత్రం బాలాజీ టాకీసు పక్కన ఉండే చింత చెట్టు . ఇప్పుడు ఆ చెట్టూ లేదు ఆ ఖాళీ స్థలం లేదు . ఓ అపార్ట్ మెంట్ చెట్టును ఖాళీ స్థలాన్ని మింగేసింది . బాలాజీ టాకీసులో బాగా ఆడిన సినిమా జయమాలిని నటించిన జగన్ మోహిని . అడ మగ పిల్లా పీచు తేడా లేకుండా జనం తండోప తండాలుగా వచ్చారు . 
టాకీసు కూల్చినప్పుడు రోజంతా ఏడ్చాను . అన్నం తినబుద్ధి కాలేదు . చుట్టుపక్కల ఉన్న అందరూ టాకీసు వద్దకు వచ్చి అలానే బాధ పడ్డారు అని బాలాజీ టాకీసు దగ్గరలోనే ఉండే మిత్రుడొకరు ఆనాటి  జ్ఞాపకాలను  నెమరు వేసుకున్నారు . 
బుద్దా మురళి (జ్ఞాపకాలు నమస్తే తెలంగాణ 31-12-2017)


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం