27, నవంబర్ 2017, సోమవారం

గుర్రపు బగ్గీల నుంచి.. మెట్రో వరకు

మెట్రో ప్రారంభం హైదరాబాద్ చరిత్రలో ఓ కీలక మలుపు. ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా సైకిళ్ళ జోరు కనిపించేది. ఇప్పుడు ఎక్కడ చూసినా మెట్రో జోరు. మెట్రోతో నగర స్వరూపమే మారిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో తెలంగాణపై అవకాశం ఉన్నంతవరకు వ్యతిరేక ప్రచారం సాగించారు. వ్యతిరేక ప్రచారానికి ఏ ఒక్క అంశాన్ని వదులకుండా చిత్తశుద్ధితో ప్రయత్నించారు. మెట్రోనూ వదలలేదు. విభజన జరిగితే మెట్రో లాభసాటి కాదు నిలిపివేస్తామని ఉద్యమకాలంలో కేంద్రానికి లేఖ రాయించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ఈ లేఖను బహిరంగపరిచి హైదరాబాద్ మెట్రో పట్టాలెక్కదని ప్రచారం మొదలు పెట్టారు. మా కోడికూయకపోతే తెల్లవారదనుకున్న ముసలవ్వలా.. మేం లేకపోతే మెట్రో నడువదని చెప్పాలని ప్రయత్నించిన వారికి ప్రభుత్వం గట్టిగానే సమాధానం చెప్పింది. తుం నహీతో ఔర్ సహీ అనేసరికి వ్యవహారం దారికి వచ్చింది వివాదం సాగినప్పుడు మెట్రో కథ ముగిసినట్టేనని కొందరు కలలుగన్నారు. హైదరాబాద్, తెలంగాణ చరిత్రలో ఒక కీలక మలుపు లాంటి మెట్రో రైల్ ప్రారంభం ఈ నెల 28న. హైదరాబాద్ ఒక అద్భుత ప్రేమనగరం. ఎవరైనా ఈ నగరాన్ని ప్రేమించాల్సిందే. తనను ద్వేషించి నా ఈ నగరం తనను ఆశ్రయించిన వారిని ఆదరిస్తుంది. పొట్ట చేతపట్టుకొని వచ్చిన వారిని కడుపులో దాచిపెట్టుకొంటుంది. అలా యాభై ఏండ్ల క్రితం పొట్టచేత పట్టుకొని వచ్చిన లక్షలాది కుటుంబాల్లో ఒకటి మా కుటుం బం. 53 ఏండ్ల వయసు, 50 ఏండ్ల ప్రయాణ అనుభవం. ఈ మహానగరం రోడ్లపై గంటల తరబడి కిలోమీటర్లు నడిచాను. సైకిల్ నుంచి మెట్రో వరకు ఈ అద్భుత అనుభ వం. సైకిల్స్ కన్నా ముందు నిజాం కాలంలో సంపన్నుల కోసం గుర్రపు బగ్గీలు ఉండేవట.
నిజాం కాలంలో హైదరాబాద్ గుర్రపు బగ్గీల నగరం. అటు నుంచి సైకిల్‌పై మెల్లగా ప్రయాణించింది. 80 వరకు సైకిల్ ప్రయాణం సాగితే ఆర్థిక సంస్కరణల తర్వాత కార్ల తో కిక్కిరిసిన నగరంగా మారిపోయింది. ఇప్పుడు మెట్రో నగరం.. తనను తాను పాలించుకొంటూ ఆత్మవిశ్వాసం తో మెట్రో రైలులో దూసుకెళుతున్నది. సైకిల్ తొక్కడం నేర్చుకున్నప్పుడు ప్రపంచాన్ని జయించినట్టనిపించింది. 

సైకిల్ తొక్కస్తే దేన్నయినా నడుపవచ్చు అనే నమ్మకం ఏర్పడుతుంది. జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం తెలుస్తుంది. ఈ తరం వారికి తెలియకపోవచ్చు అవసరం లేకపోవ చ్చు. కానీ మూడు, నాలుగు దశాబ్దాల కిందట గంటకింత అని సైకిల్ అద్దెకిచ్చే వారు. బహుశా గంటకు 25 పైసలు ఉండవచ్చు. సైకిల్ కండిషన్ బాగుంటే అద్దె ఎక్కువగా ఉంటుంది. ఇలా సైకిల్ అద్దెకు అమెరికాలో పర్యాటక కేం ద్రాల్లో ఇస్తున్నారు. మెట్రోలో కూడా ఇవ్వనున్నారు. హైదరాబాద్‌లో 40 -50 ఏండ్ల కిందట ఎక్కడచూసినా రోడ్డు కు ఇరువైపులా చెట్లు రోడ్డు మధ్యలో సైకిల్స్, రిక్షాలు కనిపించేవి. క్రమంగా సైకిల్స్ కనిపించకుండాపోయాయి. అదే సమయంలో రిక్షాలు. బహుశా ఎమర్జెన్సీ సమయం లో కావచ్చు రిక్షాలకు మోటారు అమర్చారు. రిక్షా తొక్క డం వల్ల అనారోగ్యం పాలవుతున్నారని వారికోసం ప్రభు త్వం పెట్రోల్‌తో నడిచేవిధంగా మోటార్లు అమర్చారు. అవి ఎక్కువరోజులు కనిపించలేదు. మోటార్లను అమ్ముకోవడమో, చెడిపోవడమో జరిగింది. ఎప్పటిలానే రిక్షాలను తొక్కారు. కొంతకాలానికి అవి అదృ శ్యమై వాటి స్థానాన్ని ఆటోలు ఆక్రమించాయి. గత వైభవానికి చిహ్నాలు అన్నట్టు గా ఇప్పుడు సికింద్రాబాద్ మోండా మార్కెట్ వద్ద ఓ అర డజను రిక్షాలు బతికి ఉన్నాయి. మోండా నుంచి బోయిగూడ వరకు బస్సు సౌకర్యం లేదు. అదే ఆ రిక్షాలను బతికిస్తున్నది. ఆటో మినిమం చార్జీ పెంచినప్పుడ ల్లా ఇకపై ఆటో ఎక్కవద్దు అనే డైలాగు వినిపిస్తుంది. బహుశా హిట్లర్ తర్వాత అత్యధిక సాహిత్యం హైదరాబాద్ ఆటోడ్రైవర్ల మీదే వచ్చిఉంటుంది. పెన్ను పట్టుకొన్న ప్రతి ఒక్కరు కవిత, మినీ కవిత, కథ, నవల, వ్యాసం ఏదైనా కావచ్చు ఆటో ప్రయాణ అనుభవం, ఆటో డ్రైవర్ల నిర్ల క్ష్యం, మీటరుపైన వసూలుచేసే వారి తీరు గురించి బోఫో ర్స్‌ను, జగన్ లక్ష కోట్లను మించి రాసేశారు. దాదాపు 20-30 ఏండ్ల పాటు ఆటోలు తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించాయి. అదే సమయంలో క్యాబ్‌లు ఆటోల స్థానాన్ని ఆక్రమించాయి. మరోవైపు కొత్త ఆటోలను నిషేధించారు. షేరింగ్ ఆటో ప్రయాణం జీవితపాఠాలు చెబుతుంది. సికింద్రాబాద్ నుంచి వారాసిగూడ వరకు షేరింగ్ ఆటో లో వెళ్తే జీవితం అంటే ఏమిటో తెలుస్తుంది. 

ఆటోలు వచ్చి రిక్షావాళ్ల కడుపుకొట్టాయి. క్యాబ్‌లు వచ్చి ఆటో వాళ్ల కడుపుకొట్టాయి. మెట్రో వచ్చి మా క్యాబ్‌ల కడుపుకొట్ట డం ఖాయం దాన్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టు ఉండాలి నాంపల్లి రైల్వేస్టేషన్ నుంచి ఇంటికి క్యాబ్‌లో వస్తున్నప్పుడు క్యాబ్ డ్రైవర్ వేదాంత ధోరణిలో చెప్పినమాట. ఏదీ శాశ్వతం కాదు. మార్పును స్వాగతించాలి, జీర్ణం చేసుకోవాలి. సికిం ద్రాబాద్ నుంచి డబుల్ డెక్కర్ బస్సులో ట్యాంక్‌బండ్‌పై ప్రయాణించడం ఓ మధురమైన అనుభూతి. సీట్లన్నీ ఖాళీ గా ఉన్నా ఫుట్‌బోర్డుపై ప్రయాణించడం ఓ ైస్టెల్. బస్సు స్టాప్‌లో బస్సు ఆగినా దిగకుండా కొంచం ముందుగానే లేదా బస్సుస్టాప్ దాటినా తర్వాత వేగంగా వెళ్లే బస్సు నుం చి దిగడం కొందరికి హీరోయిజం లాంటిది. మెట్రోలో ఈ సౌకర్యం లేకపోవడం ఇలాంటివారికీ పెద్ద లోటే. ఫలా నా కాలనీకి బస్సు సౌకర్యం ఉన్నదంటే అక్కడ రియల్ ఎస్టేట్‌పై ఆ ప్రభావం ఉంటుంది. ఇప్పుడు మెట్రో రూట్ లో అదేవిధంగా రియల్ ఎస్టేట్‌పై ప్రభావం చూపుతున్న ది. క్రీ.శ., క్రీ.పూ. అని చరిత్రను విభజించి చెప్పినట్టు ఇప్పుడు మెట్రో స్టేషన్ నుంచి అంటూ చెప్పాలి. రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరాబాద్ రిక్షావాలా జిందాబాద్ అంటూ ట్యాంక్‌బండ్‌పై చలం  రిక్షా తొక్కుతూ పాడిన పాట గుర్తుందా?అదేదో సినిమా లో ఎన్టీఆర్ కూడా రిక్షా తొక్కింది ఇక్కడే ..  ఎన్ని సినిమాల్లో హీరోలు హీరోయిన్లు సైకిల్ తొక్కుతూ ప్రేమించుకున్నారో. ఇక అలాంటి దృశ్యాలు కనిపించవు. ఇక మెట్రోలో హీరో హీరోయిన్ల ప్రేమ, విలన్లను హీరో మెట్రోలో చితగ్గొట్టడం చూస్తాం. త్వరలోనే మెట్రో కథలు అంటూ మెట్రో ప్రయాణం అనుభవ కథల సంకలనం చూడబోతున్నాం. నిమిషానికో స్టేష న్ వస్తుందట. షార్ట్‌టైం ప్రేమలు కూడా మెట్రోలో మొగ్గ తొడిగే అవకాశం లేకపోలేదు. 5 రోజుల మ్యాచ్ తర్వాత 20-20 చూడటంలేదా ఆదరించలేదా? ఇప్పుడు గంటల ప్రయాణ ప్రేమల నుంచి నిమిషాల ప్రేమ కథలు వస్తా యి. మధ్యలో యంయంటీయస్ వచ్చినా ఎక్కువగా ప్రజలకు అందుబాటులోలేదు. యంయంటీయస్-2 పూర్త య్యాక ఒకవైపు మెట్రో, మరోవైపు యంయంటీయస్ దూసుకెళుతుంటే హైదరాబాద్‌ను పట్టుకోవడం ఎవరి తరం కాదు. రాష్ట్ర విభజనకు, మెట్రోరైలుకు ముడిపెట్టిన నాయకులకు ఈ నెల 28 నుంచి దూసుకెళ్లే మెట్రో పరు గులే సమాధానం.
బుద్దా మురళి (నమస్తే తెలంగాణ 26-11-2017)

24, నవంబర్ 2017, శుక్రవారం

తలలు మార్చుకోండి!

‘‘నిజం ఛెప్పండి.. ఎక్కడికి వెళుతున్నారు’’
‘‘ఆఫీసు పనిమీద క్యాంపుకెళుతున్నాను డియర్. ఎప్పుడూ లేనిది ఈరోజు అలా అడుగుతున్నావేమిటి?’’
‘‘నన్ను మభ్యపెట్టాలని చూడకండి. నిజంగా ఆఫీసు పనిమీద వెళుతుంటే
బీరువాలో ఉన్న ఆ కొత్తముఖం పెట్టుకొని వెళ్లాల్సిన అవసరం ఏంటి? ఆఫీసుకు వెళ్లేప్పుడు పెట్టుకుని వెళ్లే ఆ ఏడుపు ముఖంతోనే వెళ్లండి. లేదంటే మొన్న మా అయ్యవాళ్లు వచ్చినప్పుడు పెట్టుకొన్న నీరసపు ముఖం పెట్టుకొని వెళ్లండి. మరీ అంత అమాయకురాలిని అనుకోకండి. క్యాంపు పేరుతో పూలరంగడి ముఖంతో వెళుతున్నారంటే మీరు ఎక్కడికి వెళుతున్నారు? ఎవరిని కలుస్తారు? ఏం చేస్తారో అన్నీ ఊహించలను’’
‘‘నువ్వు ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఐశ్వర్యరాయ్ మోడల్ ముఖం మీద ఒట్టు డియర్ నువ్వు అనుమానిస్తున్నట్లు నా మాజీ డార్లింగ్ దగ్గరకు వెళ్లడం లేదు. ఆమె ఉండేది అక్కడే. కానీ నేను మాత్రం అక్కడకు వెళ్లడం లేదు’’
‘‘ఐతే మీ పాతముఖంతోనే వెళ్లండి. అలా అయితే మిమ్ములను నమ్ముతాను. మీ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులు నాకు ఇచ్చి వెళ్లండి. ఖర్చు కోసం నేనిచ్చిన డబ్బుకు లెక్కలు చెప్పాలి. బయటకు వెళ్లాక నచ్చిన ముఖం కొనుక్కొని వెళదాం అనుకుంటున్నారేమో! మీ పప్పులు ఉడకవు మీరెక్కడికి వెళ్లినా మా తమ్ముడు ఏదో ఒక ముఖంలో మిమ్ములను నీడలా వెంటాడుతుంటాడు’’
‘‘రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్పదన్నట్టు రెండు చేతులా సంపాదిస్తూ ఒకేసారి ఆరు ముఖాలు కొనుక్కొనే స్తోమత ఉన్నా ముదనష్టపు పాత ముఖంతోనే బతికేయాలి. కాలేజీలో చదువుకొనేటప్పటి నుంచి ఆమె అంటే ఎంతిష్టటమో! ప్రేమలేఖ రాస్తే ముఖం అద్దంలో చూసుకున్నావా? అని చీదరించుకుంది. బల్లకింది నుంచి, బల్లపై నుంచి సంపాదించే ఉద్యోగం వచ్చాక అదృష్టం ఫెవికాల్‌లా పట్టుకొంది. ఇప్పుడు నేను తలచుకొంటే నేను సంపాదిస్తున్న డబ్బుతో రోజుకో ముఖం కొనుక్కోగలను. కానీ ఏం లాభం. ఓసారి అనుకోకుండా విమానాశ్రయంలో నా కొత్తముఖంతో పాత డార్లింగ్ కంటపడ్డాను. వావ్ కొత్తముఖంలో ఎంత బాగున్నావ్ డియర్ అని తానే పలకరించేసరికి నమ్మలేకపోయాను. కొంపదీసి మా ఆవిడే పాత డార్లింగ్ ముఖంలో వచ్చిందా? అని అనుమానం వచ్చింది. చేతిమీదున్న పుట్టుమచ్చ చూసి గుర్తుపట్టాను. అప్పటి నుంచి క్యాంపులు పెరిగాయి. ఇప్పుడేమో మా ఆవిడకు అనుమానం పెరిగింది’’
‘‘ఏంటి నేనిక్కడ మాట్లాడుతుంటే మీలో మీరే ఏదో ఆలోచించుకుంటున్నారు?’’
‘‘ఏమీ లేదు డియర్. పోచంపల్లి చీరలు, నీకోసం కొన్న రెండు డజన్ల ముఖాలు పాతపడ్డాయి కదా! కొత్త ముఖాలు, కొత్త చీరలు కొందామని ఆలోచిస్తున్నా. పోచంపల్లి వెళదామా? కలసి వెళదామా? అని ఆలోచిస్తున్నాను’’
‘‘అంతొద్దు నీ అండర్‌వేర్ నేను కొనుక్కొస్తాను. ఇక నాకు కావలసిన మోడల్ ముఖాలు మీరు కొనుక్కొస్తారా? ఏడ్చినట్టే ఉంది. మీ ఆలోచన, నోరు మూసుకుని పాత ముఖంతో వెళ్లిరండి’’
***
‘‘హలో అక్కయ్యా ఇంట్లోనే ఉన్నారా? అర్జంట్‌గా మా అమ్మాయికి పెళ్లి చూపులు. సమయానికి మా ఆయన ఇంట్లో కూడా లేరు. మీరొక్కరే గుర్తుకు వచ్చారు. మొన్న శ్రీ లక్ష్మి పెళ్లిలో మీరు తొడుక్కున్న ముఖాన్ని ఓ గంట అరువిస్తారా? పెళ్లి చూపులు అయిపోగానే ఫ్రిజ్‌లో పెట్టి మీ ముఖం మీకిచ్చేస్తాను’’
‘‘అమ్మాయికి పెళ్లి చూపులంటే, ఆ మాత్రం సహాయం చేయలేనా? అలాగే తప్పకుండా. కానీ జాగ్రత్త. అది చాలా ఖరీదైన ముఖం. నాకెంతో ఇష్టమైంది. అలాంటి ముఖం మళ్లీ మార్కెట్‌లో దొరుకుతుందనే నమ్మకం కూడా లేదు’’
‘‘ఔను అక్కయ్యా.. ఈ మధ్య మార్కెట్‌లోకి చైనా ముఖాలు వచ్చిపడ్డాయి. ధరలు తక్కువ అని ఎగబడుతున్నారు. కానీ ఏ మాత్రం నాణ్యత లేవు. ఆరునెలలు కూడా ఉండడం లేదు. ఎంతైనా అమెరికా వాడు అమెరికావాడే అక్కయ్యా. తలలు మారుస్తూ అమెరికాలో ఆపరేషన్ సక్సెస్ కాగానే, దీన్ని ఎలా వ్యాపారంగా మార్చుకోవాలా? అని చైనావాడు ఆలోచించాడు. అమెరికాలో వ్యాపారాత్మకంగా తలల మార్పిడికి అనుమతి ఇవ్వకపోవడం వారి చారిత్రక తప్పిదం. అమెరికాలో అవకాశం లేక ఆ కాలంలో చైనా వచ్చి తలలు మార్చారు. ఆ ఫార్ములా వాడికి తెలిసిపోయి, బేగంబజార్‌లో ప్లాస్టిక్ వస్తువులు అమ్మినంత ఈజీగా, జుమేరాత్ బజార్‌లో సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మినంత చౌకగా చైనావాడు తలలు అమ్మేస్తున్నాడు. చెబితే నమ్మవేమో అక్కయ్యా మంచి ఫీచర్లు ఉన్న చైనాఫోన్, చైనావాడి తలలు ఒకే రేటుకు అమ్ముతున్నారు.’’
‘‘పోనీలే అక్కయ్యా మనలాంటి వాళ్లం అలాంటి చైనా ముఖాల జోలికి వెళ్లవద్దు. మిడిల్ క్లాస్ వాళ్లు, పేదవాళ్లు ఏదో మనలానే ముఖాలు మార్చాలని ముచ్చటపడి చైనా ముఖాలతో సంతృప్తి పడుతున్నారు’’
‘‘నాప్‌టాల్‌లో ఆన్‌లైన్‌లో ముఖాలు కొనుక్కొనే ఆ ముదనష్టపు వాడికి అమ్మాయిని ఇచ్చే ప్రసక్తే లేదు. చూస్తూ చూస్తూ ఆ దరిద్రపు సంబంధానికి అమ్మాయిని ఇవ్వాలని మీకెలా అనిపించిందండి’’
‘‘ఇంట్లో డబ్బుందని, ఫ్రిజ్‌లో డజను ముఖాలు ఉన్నాయని అంత అహంకారం పనికిరాదు. రాధా! నేను నిన్ను పెళ్లి చేసుకొనేప్పుడు నీకేమయింది రాధా! కొత్త ముఖాలు కాదు కనీసం త్రిబులెక్స్ సబ్బులు కొనేందుకు కూడా మీ ఇంట్లోవాళ్ల వద్ద డబ్బులు ఉండేవి కాదు. ఆ విషయం మరచిపోవద్దు. ఇంట్లో డబ్బులు, ఒంట్లో జబ్బులు ఉన్నాయని మిడిసిపాటు పనికిరాదు. నిజమే నా మేనల్లుడికి డజను ముఖాలు కొనే స్థోమత లేకపోవచ్చు. కానీ అమ్మాయికి గుప్పెడు మల్లెపూలు తెచ్చే మంచి మనసుంది.’’
‘‘అమ్మా నాన్నా నా పెళ్లికోసం మీ ఇద్దరూ కొట్టుకోవద్దు. నేనో అబ్బాయిని ప్రేమించాను. అబ్బాయి ఆఫ్రికా, ఆ నల్లని ముఖం చూడగానే మనసు పారేసుకున్నాను. చైనా చౌకధర ముఖాలు, అమెరికా తెల్లముఖాలు చూసీచూసీ విసుగేసింది. ఆఫ్రికా ముఖం ఉన్న అబ్బాయిని చేసుకొంటే అందరిలో నేను ప్రత్యేకంగా కనిపిస్తా. మీకు నచ్చినా నచ్చకపోయినా ఇది ఫైనల్’’
***
వచ్చే ఎన్నికల్లో మిమ్ములను గెలిపిస్తే తెల్ల రేషన్ కార్డుపై ప్రతి ఇంటికి రెండేసి ముఖాలు ఇస్తాం. అంతకన్నా ఎక్కువ ముఖాలు కావాలంటే వడ్డీలేని రుణం ఇస్తాం. తరువాత ఒకేసారి రుణమాఫీ చేస్తాం. ఈ ఎన్నికల మ్యానిఫెస్టోతో మనదే విజయం.
***
‘‘ఏమండోయ్ ఈ విషయం విన్నారా! మీ బాస్ సుబ్బారావు ఇంటిపై ఏసీబీ దాడి జరిగిందట! టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. హైదరాబాద్‌లో, అమరావతిలో 18 ఫ్లాట్‌లు, 14 ఫ్లాట్లు, 50 ఎకరాల భూమి, పది కిలోల బంగారం దొరికింది. ఇవన్నీ కామన్. ఇల్లంతా వెతికితే మొత్తం 36 తలలు దొరికాయట! ముఖాలు ఎంత అందంగా ఉన్నాయంటే చివరకు ఆ ఏసీబీ అధికారులు కూడా ఆ ముఖాలపై మనసుపడ్డారట! ఎవరికీ అనుమానం రాదనుకొని బెడ్‌రూమ్‌లోని ఫ్రిజ్‌లో ఆ ముఖాలు దాచిపెట్టార్ట! దొరికిపోయారు’’
‘‘ఆపు శకుంతలా ఆపు. ఏసీబీ వాళ్లు మనింటిపై కూడా దాడి చేయవచ్చు. ఫ్రిజ్‌లోని ఆ తలలను తీసి దాచిపెట్టు... వెళ్లు..వెళ్లు..వెళ్లు...
***
‘‘ఏమైంది వెళ్లు..వెళ్లు అని కలవరిస్తున్నారు. బారెడు పొద్దెక్కింది లేవండి’’
‘‘ఫ్రిజ్‌లో తలలు ఉన్నాయా?’’
‘‘మీ తలలో ఏం లేకపోయినా మీ వద్దే ఉంటుంది. కానీ ఫ్రిజ్‌లో ఉండడం ఏంటి?
‘‘ఏమైంది పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు’’
‘‘అంటే ఇదంతా కలనా? అమెరికా డాక్టర్లు తలలు మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా చేశారట! ఆ వార్త చదివి తలలను మార్చడం సులభం అయితే భవిష్యత్తు ఎలా ఉంటుందని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను’’

బుద్దా మురళి (జనాంతికం 24-11-2017)

17, నవంబర్ 2017, శుక్రవారం

మన కాలంలో అతీతశక్తులు


‘‘మా రోజులే వేరు. మా కాలంలో ఇంట్లోకి నాన్న వస్తున్నాడంటే గజగజ వణకిపోయేవాళ్లం. చిన్న తప్పు చేసినా తొడపాశం పెడతాడని భయపడేవాళ్లం. కలికాలం. ఈ రోజుల్లో తల్లిదండ్రులను పిల్లలు పేరుపెట్టి పిలుస్తున్నారు. మొన్న ఓ ఫంక్షన్‌లో వాయ్ పంకజ్ అని అమ్మాయి పిలుస్తుంటే ఎవరా అని విచారించా, వాళ్ల అమ్మాయి అట. ఏదో బాయ్‌ఫ్రెండ్‌ను పిలిచినట్లు ఆ పిలుపులేమిటి? మా కాలంలో స్కూల్‌లో టీచర్‌గా తొడపాశం పెట్టి ఎక్కాలు నేర్పించేవాళ్లు. పిదపకాలం పిదప బుద్ధులు. అదేదో చట్టం ఉందిట! విద్యార్థులను కొట్టకూడదట! కలికాలం’’
‘‘ఔను మీ వయసువాడే సుబ్బారావు అని పాపం చెవిటివాడు. చిన్నప్పుడు ఎక్కాలు సరిగా రాకపోతే పంతులు గూబగుయ్యిమనేట్టు చెంపదెబ్బ కొట్టాడట! ఆ రోజు నుంచి సుబ్బారావు స్కూల్‌కు వెళ్లలేదు. వాడి చెవి పనిచేయడం లేదు. వృద్ధాప్యంలో ఒకరి పంచన బతుకుతున్నందుకు వారేం తిట్టుకుంటున్నారో వినపడదు హాయిగా ఉంది అని సంతోషంగా చెబుతుంటాడు. అడగడం మరిచాను మీ అమ్మానాన్నలను ఓల్డ్ ఏజ్ హోంలో వేశావట?’’
‘‘నేను వేయడం ఏంటి? తల్లిదండ్రుల కోరిక తీర్చడం నా ధర్మం. విశాలమైన వృద్ధాశ్రమంలో ఉంటామని పోరి వెళ్లారు. తమ వయసువారితో కబుర్లు చెబుతూ ఉండాలని ఎవరికి మాత్రం అనిపించదు. మా అమ్మానాన్నల కోరిక తీర్చినందుకు నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను’’
‘‘ఔను చెప్పలేవు. తెలిసిపోతుంది. చెప్పడం కష్టం. నువ్వేమో మీ అమ్మానాన్నల కోరిక తీర్చాను అంటావు. అందరేమో! మీ ఆవిడ కోరిక తీర్చడానికి ఈ వయసులో అమ్మానాన్నలను ఎవరూలేని అనాధల్లా వృద్ధాశ్రమంలో వదిలావు అంటున్నారు’’
‘‘శ్రీరాముణ్ణి అనుమానించిన లోకం ఇది. లోక కల్యాణం కోసం శ్రీరాముడు సీతమ్మను అడవిలో వదిలాడు. అలానే అమ్మానాన్నల కోసమే వృద్ధాశ్రమంలో వదిలాను’’
‘‘నీ పాపం శ్రీరామునికి అంటగట్టడం ఎందుకులే? నువ్వన్నట్లు ఆ రోజులు అద్భుతం, ఆ రోజుల్లో పుట్టిన మీలాంటివారు తల్లిదండ్రులను పుణ్యంకోసం బొందితో కైలాసానికి పంపే సాహసాలు కూడా చేస్తున్నారు. ఈ కాలం వారికి అంత ఓపిక ఎక్కడిది.’’
‘‘ఏంటి మీ ఫ్లాట్ ఎదురింటి వాళ్లు లింగులిటుకు మంటు ఇద్దరే ఉంటారు. పిల్లలు వీరిని పట్టించుకోరా?’’
‘‘అవును పట్టించుకోరు. వాళ్లు మనలాంటి పుణ్యకాలం మనుషులు కాదు. ఈ కాలం పాపాత్ములు. పిల్లలు అమెరికాలో ఉంటారు. ఒకే ఇంట్లో ఉన్నా పలకరించుకోలేని, మాట్లాడుకోలేని పుణ్యకాలం మనుషులం మనం. ఖండాంతరాల్లో ఉన్నా తమ తల్లిదండ్రుల బాగోగులను అక్కడినుంచే చూస్తూ, తమకోసం కష్టపడ్డ తల్లిదండ్రులకు మంచి జీవితాన్ని ఇవ్వాలని అక్కడి నుంచే ఏర్పాటు చేసే కలికాలం మనుషులు వాళ్లు’’
‘‘ఏంటో చెప్పావ్! అస్సలు అర్థం కాలేదు. కానీ ఏదో అర్థం మాత్రం ఉందనిపిస్తోంది!’’
‘‘ఆ సంగతి వదిలెయ్. అతీతశక్తులు ఉన్నాయంటావా?’’
‘‘నీకెందుకలా అనిపిస్తోంది’’
‘‘మొన్న నదిలో పడవ మునిగి 21మంది మరణించారుకదా? అతీతశక్తుల పనే అని చెప్పగలను’’
‘‘మంచి ఐడియా ఫలానా వారు కారణం అని తేల్చితే వారిని శిక్షించాలి. ఏ సామాజిక వర్గం వారు, ఎవరికి కోపం వస్తుందో, ఎవరి తెరవెనుక ఏ మంత్రి ఉన్నారో ఇవన్నీ తేల్చాలి. అతీతశక్తులపని, అంటే ఏ సమస్యా ఉండదు’’
‘‘నేను చెప్పాలనుకున్నది అది కాదు. ఆధారం లేనిదే ఏదీ మాట్లాడను. అతీతశక్తి ఉంది. ముమ్మాటికీ నిజం. ఉదాహరణ చెబితే నువ్వు ఒప్పుకుంటావ్’’
‘‘నిజమే. ఒక్కోసారి నాకూ అలానే అనిపిస్తుంది. మొన్న ఓ యువమంత్రి ప్రతిపక్షం లేని అసెంబ్లీలో అద్భుతంగా మాట్లాడారట! ప్రతిపక్షం గజగజ వణికిపోయిందట! అది చూశాక నిజంగా అతీతశక్తులు ఉండే ఉంటాయి అనిపించింది. మొన్న రాంగోపాల్ వర్మతో ఎన్టీఆర్ ఆత్మ మాట్లాడిన వీడియో వాట్సప్‌లో, ఫేస్‌బుక్‌లో వర్మనే షేర్ చేశాడు. సూపర్ హిట్ సినిమా తీసిన వర్మనే అతీతశక్తులకు ఆధారం చూపించినప్పుడు నమ్మకుండా ఎలా ఉంటాం. ఏవో అతీతశక్తులే ఆ యువమంత్రితో అద్భుతంగా మాట్లాడించి ఉంటాయి!!
‘‘అది కూడా అతీతశక్తుల పనే కావచ్చు. కానీ నేను చెప్పాలనుకున్న అతీతశక్తి పని అదికాదు. లాంచీని నదిలో ముంచింది అతీతశక్తులే’’
‘‘ఇందులో నువ్వు కనిపెట్టిందేముంది. ప్రతి వ్యాపారం వెనుక అతీత శక్తి ఉంటుంది’’
‘‘అబ్బా అదికాదు. మానవ ఊహాశక్తికి అందని ఏదో ఒక అతీత శక్తి ఉంది అంటారుకదా! అలాంటి అతీతశక్తి గురించి నేను చెబుతున్నది. బెర్ముడా రహస్యం ఇంకా బయటపడలేదుకదా? ఏ పడవ అటు వెళ్లినా తనలోకి లాక్కొంటుంది. అలాంటి అతీతశక్తి గురించి చెబుతున్నాను’’
‘‘అంటే కృష్ణనదికి బెర్ముడా ట్రయాంగిల్‌కు సొరంగ మార్గం ఉందంటావు. ఓ గుంత చూసి గోల్కొండ కోట నుంచి వరంగల్‌కు సొరంగ మార్గం ఉందని ఆ మధ్య ఓ వార్త వచ్చింది. తీరా తవ్వి చూస్తే అది డ్రైనేజి మార్గమని తేలింది.’’
‘‘డ్రైనేజి మార్గం కాదు. కచ్చితంగా ఇది అతీతశక్తి పనే అతీతశక్తులు ఉన్నాయని మనం రుజువు చేస్తే ప్రపంచంలో కొత్త ఆవిష్కరణలకు నాంది పలికినవారం అవుతాం’’
‘‘సరే, ఆ అతీతశక్తులు ఏమిటి? ఆధారలేమిటో చెప్పు’’
‘‘పడవ మునిగిన తరువాత వచ్చిన వీడియోలు చూశావా? పడవను నదిలోకి వదిలే ప్రసక్తే లేదని అధికారి ఒకరు అడ్డుకున్నాడు. వెళ్లనిచ్చే ప్రసక్తేలేదని అతను అడ్డుకున్నా, పడవ నదిలోకి వెళ్లింది. నాకేపాపం తెలియదు, నాకు ఐదు పడవలు ఉన్నాయి. నదిలోకి వెళ్లడానికి అనుమతి లేదు కాబట్ట్డి నేను పంపించలేదు. దేవునిమీద ఒట్టు. నేను ఒట్టి అమాయకుడిని అని పడవల యజమానికి కొండలరావు హృదయవిదారకంగా చెబుతున్నాడు. కావాలంటే చూడు. పత్రికల్లో వచ్చింది.’’
‘‘పడవ వెళ్లకుండా అధికారి అడ్డుకున్నాడు, యజమాని పడవను పంపలేదు. అంటే ఏదో ఒక అతీతశక్తి పడవను నీటిలోకి లాక్కొంది. అలానే ప్రయాణీకులను పడవలోకి లాక్కొని, నదిలోకి తీసుకువెళ్లింది. వీరిలో ఆయువుతీరిన 21మంది మాత్రమే మరణించారు. అంటే ఏదో అతీతశక్తి పనే అని స్పష్టం కావడం లేదా?’’
‘‘బెర్ముడా ట్రయాంగిల్ వద్దకు వెళ్లిన పడవలు మాత్రమే మాయం అయ్యాయి కానీ ఇక్కడ మాత్రం ఎక్కడో బెడ్‌రూంలో ఘంటసాల భక్తి గేయాలు వింటూ విశ్రాంతి తీసుకుంటున్న పడవలు ఎవరూ చూడకుండా తమంతట తాము నదిలోకి వెళ్లాయి అంటే అతీతశక్తుల పని కాకుండా మరేమిటి?’’
‘‘నువ్వు చెబుతుంటే నిజమే అనిపిస్తోంది. కాశీమజిలీ కథలో ఓ కథ. రాజుగారు మంచపై నిద్రపోయాక మంచం కోళ్లు తమలో తామే మాట్లాడుకుంటాయి. రాజుగారికి గండం ఉందని, మంచం కోళ్లు మాట్లాడుకోవడం అనే ఆలోచన వింతగా అనిపించింది. ఈ కాలంలోనే అతీతశక్తులు పడవను, ప్రయాణికులను నదిలోకి లాక్కోవడం ప్రత్యక్షంగా చూశాం. కాశీమజిలీ కథల కాలంలో మంచం కోళ్లు మాట్లాడుకోవడంలో ఆశ్చర్యం ఏముంది’’
‘‘మీ కాలం, మా కాలం అని కాదు కానీ అతీతశక్తులు ఏ కాలంలోనైనా ఉన్నాయనిపిస్తోంది’’
‘‘ప్రపంచంలోని ప్రతి సమస్యకు కారణం అతీతశక్తులు, ప్రతి కేసులో దోషి అతీతశక్తి అనుకుంటే కేసులు ఉండవు. విచారణ ఉండదు. ఇంతకుమించి పరిష్కారం ఉండదు. ఏమంటావు’’
బుద్ధా మురళి (17-11-2017 జనాంతికం )

10, నవంబర్ 2017, శుక్రవారం

24 గంటలు విద్యుత్ తో అణుయుద్ధ ప్రమాదం ..వాణీ విశ్వ నాథ్ రాజకీయ ప్రవేశం తో ప్రపంచ శాంతి


‘‘జీవితంలో అన్నీ మనం అనుకున్నట్టే జరగవు. జరిగినవాటిని జీర్ణం చేసుకోవాలి తప్పదు. ఇంత దిగులుగా ఎప్పుడూ కనిపించలేదు ఏమైంది?’’
‘‘కొన్ని చూస్తుంటే బాధేస్తుంది. చెబితే వినరు ఏం చేస్తాం’’.
‘‘ఇంతకూ దిగులెందుకో చెప్పనేలేదు’’.
‘‘ఈ విశ్వం ఏమవుతుందా? అని ఆలోచిస్తుంటే భయం వేస్తుంటుంది’’.
‘‘ఎంతైనా నువ్వు అదృష్టవంతుడివి’’.
‘‘ భయం వేస్తుందంటే  అదృష్టవంతుడివి అంటావేం. నీకన్నీ వెటకారాలే’’.
‘‘ నిజంగానే. చూడోయ్ ఆనందంగా ఉండాలని చాలామంది ఎంతో తంటాలు పడతారు. ఎంతటి సంతోషకరమైన పరిస్థితుల్లోనైనా ప్రపంచంలో ఎక్కడినుంచైనా ఒక సమస్యను తెచ్చుకొని, దానికోసం దీర్ఘంగా ఆలోచించి, నువ్వు కోరుకున్న విధంగా బాధపడతావు. కోరుకున్నది సాధించడం కొందరు అదృష్టవంతులకే సాధ్యం.  అమెరికాను చికాకుపెడుతున్న కిమ్ గురించి ఆలోచిస్తున్నావా? ఐనా అది మన పరిధిలో లేని సమస్య. అసలు అమెరికా పరిధిలోనే లేదు. ఇక మనమేం చేస్తాం. ఆ సమస్య వదిలేసి, నీ బాధ కోసం ఇంకో సమస్యను నమ్ముకోవడం మంచిది. ఏమాటకు ఆమాటే చెప్పుకోవాలి. పుండును గిచ్చుకొంటే ఏదో తెలియని ఆనందం కలిగినట్టు, సమస్యను తలుచుకొని, సృష్టించుకొని బాధపడుతుంటే, నలుగురు ఓదార్చడం భలే ఉంటుంది. అందుకే అన్నాను ఎంతైనా అదృష్టవంతుడివి అని’’.
‘‘
 అసలు అమెరికానే నా సమస్య కావచ్చుకదా? అయినా నేను నీలా సంకుచితంగా ఆలోచించేవాణ్ణి కాదు. విశ్వమానవుణ్ణి. ప్రపంచంలో ఎక్కడ సమస్య ఉన్నా భూతద్దం వేసి చూసి బాధపడతాను తెలుసా? ఇది  నాకు  చిన్నప్పుడే అలవాటైంది. ప్రపంచంలో ఏ దేశంలో ఏం జరిగినా ఖండించండి అంటూ మా స్కూల్ గోడలపై రాసేవాణ్ణి. ఓసారి ఎక్కడా ఏ సమస్య కనిపించకపోతే రెండు రోజులు నిద్రపట్టలేదు. చిట్టి బుర్రకు పెద్ద ఆలోచన వచ్చింది. ఉదయం లేవగానే గ్లోబ్ చూసి అప్పటివరకు ఎవరూ వినని దేశం పేరు తీసుకోని టొట్రూ దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన నశించాలి. పాలకులను దించేయాలి అంటూ వాడి వేడి నినాదాలను స్కూల్ గోడలపై రాశాను. మరుసటి రోజు నాకే ఆశ్చర్యం వేసింది. ఆ నినాదాలు కాలేజీ గోడలపై కనిపించాయి. ఎక్కడ చూసినా అవే నినాదాలు. నేను ఆరోజే అనుకున్నాను, సమస్యలు లేవని నిరాశ చెందవద్దు, సమస్యలను సృష్టించుకుందాం అనుకున్నాను. అదే మార్గంలో వెళుతున్నాను. నా మార్గం అనితర సాధ్యం’’.
‘‘వండుకునేవాడికి ఒకటే కూర, అడుక్కునేవాడికి 60 కూరలు’’ అన్నట్టు సమస్యలు వెతుక్కోవాలనే ఆలోచనే రావాలి కానీ ప్రపంచంలో సమస్యలకు కొదవా?’’.
‘‘నీ మాటలు నాకెప్పుడూ సరిగా అర్థం కావు. ఆ సామెత ఉద్దేశం నన్ను పొగిడినట్టా? లేక?’’ 
అణుయుద్ధం ‘‘చూశావా ఎంత ఎదిగిపోయావో? నా మాటలను అర్థం చేసుకోవడం కూడా నీకు ఓ సమస్యనే అన్నమాట! ఇంతకూ ఆ దిగులుకు కారణం ఏమిటో చెప్పనే లేదు’’.
‘‘ఆ వార్త చూసినప్పటినుంచి మనసు దిగులుగా ఉంది’’.
‘‘ఏ వార్త, టెక్సాస్‌లో దుండగుడు చర్చిలో పిల్లలని కూడా చూడకుండా అమానుషంగా చంపడం గురించిన వార్తనా?’’
‘‘అది కాదు. అమెరికాలో అకారణంగా ఇలాంటి ఉన్మాదం మామూలే’’.
‘‘మరి నీ దిగులు కారణం?’’
‘‘ఈ వార్త చూడు. వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచిత విద్యుత్ అంటే ఎంత బాధాకరం’’.
‘‘ఔను నిజమే. చీకట్లో మగ్గిపోతారు అని చిలక్కు చెప్పినట్టు చెబితే అలా చెప్పిన వారి మనోభావాలు దెబ్బతీనే విధంగా 24 గంటలు విద్యుత్ ఇవ్వడం అన్యాయం. విద్యుత్‌ను రేపటికోసం దాచిపెట్టుకోవాలి కానీ ఇలా పంతానికి పోయి ఖర్చు చేయడం అన్యాయం. వందేళ్ళకు ఉపయోగపడే విద్యుత్ ఏడాదికే ఖర్చు చేసేట్టుగా ఉన్నారు’’.
‘‘వెటకారమా?’’
‘‘అయ్యో నీకు మద్దతుగా ఏదో తెలిసీ తెలియకుండా, తెలిసీ తెలియని విషయం మాట్లాడాను, అంతే తప్ప వెటకారమేమీ లేదు’’.
‘‘వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌వల్ల భూమిలోని నీళ్లన్నీ ఖర్చవుతాయి. ఈ రాష్ట్రంలో నీళ్లు అయిపోయిన తరువాత ఇరుగు పొరుగు రాష్ట్రాల నీళ్లు తరువాత ఆ ఉత్తరాది రాష్ట్రాల నీళ్లు లాగేసుకొంటాం. అంతవరకూ పరవాలేదు. తరువాత పాకిస్తాన్, చైనా, జపాను, శ్రీలంక వంటి ఇరుగు పొరుగు దేశాల భూగర్భ జలాలను లాగేస్తాం. దీనివల్ల దేశాలమధ్య యుద్ధాలు జరిగే ప్రమాదం ఉంది. అసలే చైనా ఇండియాతో యుద్ధానికి ఏ సాకు దొరుకుతుందా? అని ఎదురుచూస్తోంది. 24 గంటల విద్యుత్ ఇచ్చి ప్రపంచాన్ని అణుయుద్ధం ప్రమాదంలోకి నెట్టివేయడం అవసరమా? ప్రపంచ శాంతికి కలిగే ప్రమాదాన్ని హెచ్చరిస్తున్నా అంతే. నీళ్లు ఎక్కువగా లాగేస్తే సూర్యుడు మరింత వేడెక్కి, ఓజోన్ పొర కరిగే ప్రమాదముంది’’.
‘‘అయ్యో వినడానికే భయంగా ఉంది. ప్రపంచ శాంతికోసం మనవంతు ప్రయత్నం చేద్దాం. కానీ ఈ సంగతి వదిలేద్దాం. ఇంకా మాట్లాడితే భయంతో గుండెపోటు వస్తుందేమో అని భయంగా ఉంది.’’
‘‘వినడానికే ఇలా ఉంటే 24 గంటలు ఇస్తే ఎలా వుంటుంది ఆలోచించు. సరేకానీ ఈ వార్త విన్నావా?’’’
‘‘కొత్త పార్టీ ఏర్పాటుపై ఆలోచిస్తున్నామని పటేల్‌గారు అన్నారట’’.
‘‘అన్ని పార్టీలు కలిసి ఓ కూటమి ఏర్పాటు చేశాయి కదా? పార్టీలన్నీ వెళ్లిపోయాక, పెళ్లివారిల్లు పెళ్లి తరువాత బోసిపోయినట్టు అయింది. ఖాళీ ఇల్లు మళ్లా కళకళలాడాలి అంటే పార్టీ పెట్టాలనే ఆలోచన చేస్తున్నట్టున్నారు’’.
‘‘ఇందులో కొత్తేముంది. గత రెండేళ్ల నుంచి కొత్త పార్టీ కోసం రోజూ ప్రకటనలు వస్తూనే వున్నాయి కదా?’’
‘‘ఏం జరగవచ్చు?’’
‘‘ఇంకో 14 నెలలపాటు సమాలోచనలు జరుగుతూనే వుంటాయి’’.
‘‘తరువాత?’’
‘‘అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుంది’’
‘‘తరువాత?’’
‘‘ఎన్నికలు ముగిశాక, ఆ వెంటనే మళ్లీ సమాలోచనలు జరుగుతాయి. 60 నెలలపాటు జరుగుతూనే వుంటాయి.’’
‘‘అంటే తెనాలి రామలింగని మేక తోక మేక తోకలా- ఇది అంతులేని కథ అన్నమాట’’.
‘‘కమల్‌హాసన్ రాజకీయ పార్టీ పెట్టబోతున్నారట కదా! ఎప్పుడు పెట్టొచ్చు?’’
‘‘‘ఇప్పటికే మూడేళ్లు ఆలస్యం అయింది’.
‘‘అంటే అప్పుడే పార్టీ పెడితే, ఇప్పుడు సిఎం అయి ఉండేవారనా?’’
‘‘నేను అలా అన్నానా?’’
‘‘మరేంటి?’’
‘‘పెళ్లీడుకోసం అమ్మాయి, అబ్బాయి వయసు ఎంతుండాలో ఓ లెక్క ఉంది. వయసు రాగానే పప్పన్నం ఎప్పుడు పెడతారని అడుగుతాం’’.
‘‘నేను కమల్ పార్టీ గురించి అడుగుతుంటే నువ్వు పెళ్లి గురించి మాట్లాడుతున్నావ్. ఆయన ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇంకో పెళ్లి చేసుకుంటాడంటావా?’’
‘‘పెళ్లికి వయసు ఉన్నట్టే నటులు పార్టీ ఏర్పాటు చేసేందుకు యుక్తవయసు ఉంటుంది’’.
‘‘యుక్తవయసా?’’
‘‘ఔను, హీరోలకు వయసు ముదిరితే, రాజకీయ యుక్తవయసు వచ్చినట్టు. ఎన్టీఆర్, చిరంజీవి ఎవరైతేనేం టాప్ హీరోలు 60 ఏళ్ల వయసులోకి రాగానే ఇంతకాలం నన్ను ఆదరించిన ప్రజల కోసం పార్టీ పెట్టి సేవ చేయాలి అనే ఆలోచన వస్తుంది. కమల్‌హాసన్, రజనీకాంత్ ఎవరైనా కావచ్చు, అది అనివార్యం’’.
‘‘హీరోలకేనా? మరి హీరోయిన్‌లకు?’’
‘‘మనది పితృస్వామ్య వ్యవస్థ, హీరో ఓరియెంటెడ్ సినిమా జీవితాలు మనవి. ఎంత గొప్ప హీరోయిన్ అయినా, హీరోయిన్‌గా అవకాశాలు తగ్గాక కొన్నాళ్లు ఎదురుచూసి, ఇక అవకాశాలు రావని గ్రహించి ఏదో పార్టీలో చేరి ప్రజలకు సేవ చేయాలి కానీ సొంతంగా పార్టీ కుదరదు. హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన జయప్రద, జయసుధ, రోజా, వాణి విశ్వనాధ్, కుష్బూ ఎవరైనా కావచ్చు. ఎన్టీఆర్ సమకాలీనులు జమున, శారద, వాణిశ్రీలతో సహా సంప్రదాయాన్ని కాదని హీరోయిన్ ఓరియంటెడ్ కథలతో సినిమాల్లో సంచలనం సృష్టించినప్పుడు రాజకీయాల్లో కొత్త ట్రెండ్ ఎందుకు సృష్టించవద్దని విజయశాంతి హీరోయిన్‌గా ఔట్‌డేటెడ్ అయ్యాక హీరోలా పార్టీ పెట్టి వర్కవుట్ కాక మూసేసి పార్టీల్లో విలీనం తరువాత ఇప్పుడు తత్వం బోధపడింది’’.
‘‘అంటే వీరికి ప్రజాసేవ చేయాలని ఉండదా?’’
‘‘నేను అలా అన్నానా? చూడోయ్, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు. జనం గుర్తుపట్టినప్పుడే క్యాష్ చేసుకోవాలి. లేకపోతే ఎన్టీఆర్ పక్కన సీతగా నటించిన గీతాంజలి, అందరూ మరిచిపోయాక నాలుగు దశాబ్దాల క్రితం ఎన్టీఆర్ శ్రీరాముడు అయితే నేను సీతను అని చెప్పినా పట్టించుకొనే వారుండరు. కమలమ్మ కమతం హీరోయిన్‌ను నేనే అని చెప్పుకున్నా పట్టించుకొనేవారు లేరు. గీతాంజలి, కవితలు ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చారో, ఎప్పుడు వెళ్లిపోయారో తెలియకుండా వుంటుంది. సన్నిలియోన్ వస్తే కేరళ కిక్కిరిసిపోయింది. అలా అని పార్టీ పెడితే ఎవరూ ఉండరు’’.
‘‘కమల్ విజయం సాధిస్తాడా?’’
‘‘ముందు పార్టీ పెడతారో లేదో అది చూద్దాం. ఆయనకన్నా ముందు తమిళ చిరంజీవి పార్టీ చూశాం. రజనీకాంత్ ప్రకటన చూశాం. కమల్‌హాసన్ సంగతి చూద్దాం.’’ 
‘‘ మరేమంటావు ?’’
‘‘ఏమీ అనను వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ ఇస్తే ప్రపంచానికి అణుయుద్ధ ప్రమాదం ..వాణీ విశ్వ నాథ్ రాజకీయ ప్రవేశం తో ప్రపంచ శాంతి సాధ్యం అనిపిస్తోంది ప్రచారం చూస్తుంటే ’’
బుద్దా మురళి (10. 11. 2017 జనాంతికం )

3, నవంబర్ 2017, శుక్రవారం

షట్ముఖకోణ పవిత్ర ప్రేమ-విలువలు

‘‘డాక్టర్ మావాడి జబ్బుకు చికిత్స లేదంటారా?’’
‘‘వైద్య శాస్త్రంలోనే ఇదో అంతు చిక్కని లక్షణం’’
‘‘డాక్టర్ బ్లాక్ అండ్ వైట్‌లో అక్కినేని తొలి సినిమా నుంచి నిన్న మొన్న అల్లరి నరేష్ కామెడీ పారడీల వరకు ఎన్నో సినిమాల్లో డాక్టర్లు అచ్చం మీలానే అంతు చిక్కని జబ్బు అని చెప్పిన తరువాత కూడా సినిమా ముగింపులో జబ్బు నయమైంది డాక్టర్. అలానే మా పిల్లాడి జబ్బు కూడా నయం అవుతుందా? డాక్టర్’’
‘‘మాటకు ముందోసారి వెనకోసారి డాక్టర్ అంటూ అలా గుర్తు చేయక నాకు కొంచెం మతిమరుపు మరచిపోకుండా వుండేందుకే తెల్లకోటు, మెడలో స్టెతస్కోపుతో వస్తాను .’’
‘‘మా అబ్బాయి వింత జబ్బు గురించి వస్తే మీ జబ్బు గురించి చెబుతున్నారు డాక్టర్, ఇంతకూ ఇదేం జబ్బు డాక్టర్’’
‘‘ఏది మీదా? నాదా? మీ అబ్బాయిదా?’’
‘‘మీకే జబ్బయితే నాకేంటి డాక్టర్. నా సమస్య మా అబ్బాయి జబ్బు’’
‘‘అది జబ్బని ఎవరు తేల్చారు? అది జబ్బంటే, పేరేంటి అంటావ్? కాస్త ఆలోచించుకోనివ్వు. వైద్య శాస్త్రానికే పరీక్ష పెట్టావు.’’
‘‘అంటే మీరు చికిత్స చేయలేరా?? డాక్టర్’’
‘‘నేనే కాదు. కె.ఎ.పాల్ తలుచుకున్నా చికిత్స చేయలేడు. ముందు జబ్బో కాదో తెలుసుకోవాలి. జబ్బయితే పేరు తెలుసుకుని చికిత్స మొదలుపెట్టొచ్చు.’’
‘‘ఎంత ఖర్చయినా ఫరవాలేదు డాక్టర్ విదేశాలకైనా ఓకె.’’
‘‘అంత డబ్బుందా?’’
‘‘ఆరోగ్యశ్రీ కార్డుంది’’
‘‘మా ఆస్పత్రిలో వున్న మిషన్లు అన్నింటికి పని చెబుతూ పరీక్షలు చేయించినా మీవాడి జబ్బేమిటో తెలియడంలేదు. అసలేం జరిగిందో? మీవాడిలో ఈ  తేడా వుందని నీకు ఎప్పుడు అనిపించిందో మొదటి నుంచి చెప్పుకుంటూ రా .’’
‘‘సరే డాక్టర్ సినిమాలో అవేవో రింగులు రింగులు కనిపిస్తాయి కదా? కనిపిస్తున్నాయా డాక్టర్?’’
‘‘ఎందుకు?’’
‘ప్లాష్ బ్యాక్ చెప్పా లంటే ముందు రింగులు కనిపించాలి డాక్టర్. అవి కనిపించకపోతే మిమ్ములను ఫ్లాష్ బ్యాక్‌లోకి ఎలా తీసుకెళతాను.’’
‘‘ముందు ఏం జరిగిందో చెప్పు. సీన్ సరిపోదు అనుకుంటే రైటరే మనకు ఫ్లాష్ బ్యాక్‌లోకి తీసుకెళతాడు.’’
‘‘సాయంత్రం ఆఫీసు నుంచి రాగానే ఎప్పటిలానే టీ తాగి న్యూస్ చానల్ ఆన్ చేసాను. అబ్బాయి వచ్చి టివి ముందుకూర్చున్నాడు. అదేదో జపానో, చైనానో కార్పొరేట్ విద్యా వ్యాపారుల గొడవ. డైరెక్టర్ అట ఆవిడెవరో విద్యా వ్యాపారంలో విలువలు ముఖ్యం అని చెబుతోంది.’’
‘‘ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. ఆ వ్యాపారులేనా?’’
‘‘ఔను డాక్టర్ వాళ్లే. విలువల కోసం వాళ్లెంతకైనా తెగిస్తారట! ర్యాంక్ వస్తుందని తెలిస్తే హైస్కూల్లో వుండగానే కనే్నసి విద్యార్థులను ఎలా లాగేసుకొచ్చేది కళ్లకు కట్టినట్లు చెప్పారు. ఈ వ్యాపారంలో వున్న అందరూ చేసేది ఇదే అంటూ వ్యాపార మెళకువలు అన్నీ చెప్పేసారు. కిడ్నాప్‌లు, ర్యాంకులు కొనడాలు ఒక పద్ధతి ప్రకారం విలువలకు కట్టుబడి విద్యా వ్యాపారం విలువలు పెంచుతున్నట్లు చక్కగా చెప్పింది. ప్రత్యర్థి గ్యాంగ్ అదే ప్రత్యర్థి వ్యాపారి కూడా విలువల విషయంలో తాము ఇతరులతో చెప్పించుకునే స్థితిలో లేమని, విలువల కోసం ప్రాణాలు తీయడానికైనా సిద్ధం అని ప్రకటించారు.’’
‘‘అది సరే, పిల్లలు ఇలా ఎందుకు చనిపోతున్నారు? చదువు చెప్పమంటే ప్రాణాలు తీస్తారా? దానికేమన్నారు?’’
‘‘ఆ విషయం విలువల మానవతా మూర్తులను ఎవరూ అడగలేదండి’’
‘‘అన్యాయం కదూ! అంత సీరియస్ విషయం కనిపిస్తుంటే విద్యావ్యాపారులు ఎదురుగా వున్నా ఎందుకు అడగరు?’’
‘‘ఇది కూడా విలువల్లో భాగమే డాక్టర్. అంతా ప్యాకేజీనే. విద్యా వ్యాపారులు విలువల గురించి తాము మాట్లాడాలనుకున్నది మాట్లాడి వీడియో తీసి పంపిస్తే టీవీలో ప్రసారం చేయాలి. ఇది విలువల ప్యాకేజీలో భాగం. విలువలకు కట్టుబడకుండా ప్రశ్నించాలని ప్రయత్నిస్తే- 1,1,2,2,3,3 అనే ప్రకటనలో వారి చానల్‌లో రావు డాక్టర్. ఇవి కూడా మహోన్నత విలువల ప్రమాణాల్లో భాగమే’’
‘‘
మొన్న ఐపిఎస్ అధికారి కాపీ కొడుతూ పట్టుబడింది -జీవితంలో విలువలకు*  ప్రాధాన్యత చెప్పే ‘‘ఎథిక్’’ పేపర్‌లోనే. జీవితంలో విలువల కోసం ఎంతకైనా తెగిస్తారు కొందరు ...సర్లే వాళ్ల వ్యాపారం గోల మనకెందుకు. నువ్వు చెప్పు.’’
‘‘టీవీలో ఇరువర్గాల విద్యా వ్యాపారులు విలువల గురించి హావభావాలతో వివరిస్తున్నప్పుడు ఎందుకో అనుకోకుండా మా అబ్బాయి ముఖంలో చూసాను. రంగులు మారినట్టు, పిచ్చిగా చూసినట్టు అనిపించింది. అప్పుడు పట్టించుకోలేదు. కానీ నేనే వినలేక చానల్ మార్చాక మామూలుగానే కనిపించాడు. మరోసారి న్యూస్ చానల్‌లో ఒకామె ఓ ప్రజాప్రతినిధిని వలచిన కథ చెబుతోంది.’’
‘‘పెళ్లి చేసుకుంటాను అని ప్రేమించి మోసం చేసాడా?’’
‘‘డాక్టర్‌గారు ఆమె -ప్రేమ అనగానే మీలోనూ ఎక్కడలేని ఉత్సాహం మొదలైంది. ఇదేమి  స్కూల్ ప్రేమ కాదు. ఇంజనీరింగ్ కాలేజీ ప్రేమ కథ కాదు. కృష్ణా రామా అనుకుంటూ వానప్రస్థాశ్రమంలో గడపాల్సిన వయసులో ఓ చిన్నోడు, చిన్నది కనిపించని మూడవ సింహం’’
‘‘ప్రేమ కథనా?’’
‘‘కాదు కామ కథ’’
‘‘ముగ్గురి త్రికోణ ప్రేమ కథనా?’’
‘‘కాదు మూడు జంటలు, ఆరుగురి వ్యూహ కథ- షట్ముఖ కోణ- పవిత్ర ప్రేమకథ’’.
‘‘ఈ ప్రేమ కథలో ఎవరి వ్యూహంతో వాళ్లున్నారు. తొలిమాట, తొలి చూపు నుంచి ప్రతిది రికార్డు చేసి పెట్టుకున్నారు.’’
‘‘ప్రేమించుకున్నారు అంటున్నావు. నువ్వు చెప్పింది చూస్తే ఆధారాలు సేకరించి పెట్టుకున్నట్టుగా వుంది కానీ ప్రేమ కథలా లేదు.’’
‘‘అన్ని ప్రేమ కథలు బాలచందర్ ప్రేమ కథల్లానే వుండవు. ప్రేమ కథల లేటెస్ట్ ట్రెండ్ ఇదే. డాక్టర్ గారూ మీ మంచి కోరే చెబుతున్నాను. డాక్టర్‌గా నాలుగు చేతులా బాగానే సంపాదిస్తున్నారు. అంతమాత్రాన మీరేమి మహేష్‌బాబు కాదు. పవన్‌కళ్యాణ్ కాదు ఎవరైనా మనసు పడ్డారు అనుకుంటే.. ఇదిగో ఇలానే టీవీలో పడతారు జాగ్రత్త’’
‘‘నా సంగతెందుకు ముందు  కేసు గురించి చెప్పు’’
‘‘టీవీలో ఈ పవిత్ర ప్రేమికులు మాట్లాడుతున్నది మావాడు విన్నాడు. మా మధ్య సన్నిహితత్వం వుంది. ఇది సామాజిక బాధ్యత. మనుషులకు విలువలు ముఖ్యం. మనం పవిత్రమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో వున్నాం. నాతోనే వుంటాను. మూడవ సింహం వద్దకు వెళ్లను అని ఒట్టేసి చెప్పమంటే చెప్పడంలేదు. విలువల కోసం పరితపించే మాలాంటి వారు ఇది ఎలా సహిస్తారు. ఇందుకేనా రాష్ట్ర విభజన జరిగింది? ఇందుకేనా ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఇదేనా గాంధీ పుట్టిన దేశానికి అర్థం. ఇలా అయితే భారతీయ విలువలపై విదేశీయులు ఏమనుకుంటారు.’’
‘‘ఆపవయ్యా! బాబు నీ విలువల ఉపన్యాసం వింటుంటే విలువలమీదే చిరాకేస్తుంది.’’
‘‘ఇదిగో ఇలానే డాక్టర్ ఆ వీడియోలో మాటలు, వాళ్లు టీవీల ముందు ఉపన్యాసం, ఈ వార్తలు ఒక వైపు ఈ దాడి సరిపోదు అన్నట్టు ఆ వృద్ధ ప్రేమికుడు  
 విలువలకు కట్టుబడిన మా కంపెనీపై ఎవరో కుట్ర పన్ని ఇలా చేసారు. ఎంత డబ్బయినా ఖర్చుచేసి ఎవరినైనా తప్పించి కాంట్రాక్టులు సంపాదించేప్పుడు మేం విలువలకు ప్రాధాన్యత ఇస్తాం అంటూ  మాట్లాడడం విన్నాక, మా అబ్బాయిని పరీక్షగా చూస్తే పిచ్చి చూపులు చూస్తూ అయోమయంగా టీవీ చూస్తూ కనిపించాడు. భయం వేసింది. ఇంగ్లీష్ హారర్ సినిమాలను చూస్తూ పెరిగినవాడు అలా భయపడగా ఎప్పుడూ చూడలేదు. వాడి దృష్టిలో తెలుగులో వచ్చే దయ్యం సినిమాలో కామిక్ కథల్లాంటివి. ఇంగ్లీష్ దయ్యం సినిమాలనే బఠానీలు తిన్నంత ఈజీగా చూస్తాడు. అలాంటి వాడి ముఖంలో భయం చూసి ఆశ్చర్యం వేసి చానల్ మార్చాను. మరో న్యూస్ చానల్‌లో రాజకీయాల్లో విలువలు ముఖ్యం అని ఒకాయన ఉపన్యాసం వరుసగా చానల్స్ మారుస్తుంటే అన్ని చానల్స్‌లో ఇలానే విలువలతో కూడిన జీవితంపై మాట్లాడుతున్నారు. కొద్దిసేపు వదిలేస్తే స్పృహ తప్పి పోతాడేమో అనిపించింది. మావాడిని మీరే రక్షించాలి డాక్టర్.’’
‘‘సరే మా తమ్ముడి డయాగ్నస్టిక్ సెంటర్‌లో ఈ పరీక్షలు చేసుకొని వెళ్లు. అలానే వెళ్లేప్పుడు మా బామర్ది షాప్‌లో ప్రెస్టిజ్ ప్రెషర్ కుక్కర్ కొనుక్కుని వెళ్లు. వాటి రసీదులు చూపించు. ఏం చేయాలో చెబుతా’’.
‘‘పరీక్షలు ఓ.కె. ప్రెస్టిజ్ ప్రెషర్ కుక్కర్ ఎందుకు డాక్టర్?’’
‘‘రోగులు మరీ తెలివిమీరి పోతున్నారు.డాక్టర్ ను నే నా ? నువ్వా ? ఏది ఎందుకో నా కన్నా నీకు ఎక్కువ తెలుసా ?  అన్నీ చెప్పాలా? తమ్ముడికి వ్యాపారం చూపించినప్పుడు బామర్ది షాప్‌కు వ్యాపారం చూపకపోతే ఇంట్లో భార్య ఊరుకుంటుందా? శ్రీమతిని ప్రేమించేవారు బామ్మర్ది షాప్‌లో ప్రెస్టిజ్ కుక్కర్ ఎలా కాదంటారు. అదే కార్పొరేట్ ఆస్పత్రిలో తల నొప్పికి లక్ష బిల్లు చేస్తారు. నేను డయాగ్నస్టిక్ సెంటర్‌కు, కుక్కర్‌కు కలిపి పదిహేనువేల బిల్లు చేస్తే లక్ష ప్రశ్నలు. ప్రజల్లో విలువలకు విలువే లేకుండా పోతుంది.’’
* * *
‘‘ఇదిగో డాక్టర్ కుక్కర్ బిల్లు, పరీక్ష చేయించాను. రిపోర్టు చూస్తారా?’’
‘‘అవసరం లేదు. వాడి బొంద వాడికేం తెలుసు. డబ్బులున్నాయని తమ్ముడు  మిషన్లు కొన్నాడు. రోగులున్నారని నేను పంపిస్తున్నాను. అందులో ఏమీ లేదు. కంగ్రాట్స్ మీ అబ్బాయి పేరు వైద్య చరిత్రలో నిలిచిపోతుంది.’’
‘‘ఎలా?’’
‘‘మానసిక, శారీరక, భౌతిక, సాంఘిక, సామాన్య, మ్యాథ్స్,బికాం లో  ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని సబ్జెక్టుల రోగాలు కలిసి పుట్టిన కొత్త రోగం మీవాడికి వచ్చింది. రోగం పెద్దదేకానీ చికిత్స సులభమే.’’
‘‘చెప్పండి డాక్టర్... అలా సస్పెన్స్‌లో ముంచకండి. కుక్కర్‌తోపాటు మీ తమ్ముడి షాప్‌లో రోటి పచ్చడి కోసం రెండువేలు పెట్టి రోలు కొనమన్నా కొంటాను..’’
‘‘ఇదోరకం ఫోబియా! విలువలు పాటించకుండా విలువల గురించి ఎవరైనా ఎక్కువగా మాట్లాడుతుంటే పొరపాటున విన్నా మీవాడు పిచ్చిపిచ్చిగా చేస్తాడు. ఇలాంటి విలువల గాలి సోకకుండా మీవాణ్ణి కంటికి రెప్పలా కాపాడుకోవాలి.’’
‘‘దీనికి చికిత్స లేదా? డాక్టర్’’
‘‘లేదు. నివారణ ఒక్కటే మార్గం. సోమాలియాలో ఆకలికి ఏదో ఒకరోజు పరిష్కారం లభిస్తుంది. ఆఫ్గానిస్తాన్‌లో తీవ్రవాదులు ఏదో ఒకరోజు బుద్ధం శరణం గచ్ఛామి అనొచ్చు. ఏమైనా జరగవచ్చు. గుర్రం ఎగరావచ్చు కానీ విలువల ధ్వంసానికి పాల్పడేవారు విలువల గురించి ఎక్కువగా మాట్లాడడం ఆపరు. ఆపలేం. మీ అబ్బాయి వాటికి దూరంగా వుండడమే నివారణ మార్గం. జాగ్రత్త ఇది అంటువ్యాధి. ‘షట్ముఖ కోణ పవిత్ర ప్రేమకథ’ రాసినవారు, విన్నవారు, చదివినవారు విలువల వ్యాధి బారిన పడకుందురుగాక.’’

బుద్దామురళి (జనాంతికం 3-11-2017)