13, అక్టోబర్ 2017, శుక్రవారం

శ్రీమతి సామాజిక స్మగ్లర్

‘‘ఆ హీరోయిన్‌ను మింగేసేట్టుగా చూడాల్సిన అవసరం లేదు’’
‘‘నేను చూస్తున్నది హీరోయిన్‌ను కాదు. హీరోను. నీ కళ్లు ఆ హీరోయిన్ కట్టుకున్న చీరపై ఉన్నాయేమో నేను కూడా అదే చూస్తున్నట్టు నీకు అనిపిస్తోంది.’’
‘‘బుకాయించకండి కళ్లు చిదంబరం ఎటు చూస్తున్నాడో కూడా చెప్పేంత చురుకైన చూపు నాది. హీరోవైపు చూస్తున్నారో, హీరోయిన్‌ను కొరికేసేట్టుగా చూస్తున్నారో ఆ మాత్రం గ్రహించలేను అనుకుంటున్నారా? అయినా అక్కడ హీరో ఎక్కడున్నాడు?’’
‘‘తాటి చెట్టంత ఎత్తున్న ఈ హీరో కూడా నీకు కనిపించడంలేదా?’’
‘‘మీరు చూస్తున్నది అమితాబచనా? హీరో అన్నారు’’
‘‘ఈ దేశంలో అమితాబ్‌ను మించిన హీరో ఎవరున్నారోయ్’’
‘‘మన తెలుగు హీరోలు 60 ఏళ్ల చిరుప్రాయంలో హీరోలుగా నటిస్తే కుళ్లు జోకులు వేసే మీలాంటి వారికి 75 ఏళ్ల అమితాబ్ మాత్రం యాంగ్రీ యంగ్‌మెన్‌గా, నవ యవ్వన హీరోగా కనిపిస్తారు.
మీకు తెలుగు వాళ్లంటే చిన్నచూపు. హాలీవుడ్‌లో పండు ముసలి హీరో జేమ్స్‌బాండ్ అంటూ పడుచు హీరోయిన్‌లతో సరసాలాడుతుంటే సినిమా అర్థంకాకపోయినా, భాష రాకపోయినా ఆహా, ఓహో అంటూ ఆకాశానికెత్తుతారు. అదే మన తెలుగు హీరోల నిజ జీవితంలో పట్టుమని పది వాక్యాలు తప్పులు లేకుండా మాట్లాడలేకపోయినా అభిమానుల కోసం ఎంతో కష్టపడి బ్రహ్మాండంగా డైలాగులు చెబితే, అంత పెద్ద వయసులోనూ వాళ్లు పడే కష్టానికి అభినందించాల్సింది పోయి, హీరో హీరోయిన్ల డాన్స్‌ను తాతయ్య, మనవరాలి సయ్యాట అని ఎగతాళి చేస్తారు. తెలుగువాడికి తెలుగువాడే శత్రువు, సాటి తెలుగువాడి ప్రతిభను గుర్తించేందుకు మనసు రాదు.’’
‘‘అబ్బా ఇక ఆపవోయ్. నీ గోల నీదే కానీ, నామాట వినవు. నేను హీరోను చూస్తున్నాను అన్నా కానీ అమితాబ్ అని చెప్పానా? దృష్టిలో హీరో అంటే సినిమా వాళ్లేనా ఇంకెవరూ ఉండరా? అయినా నా దృష్టిలో ఇప్పటికీ అమితాబ్‌ను మించిన యువ హీరోలేడు.’’
‘‘మరి అంత తన్మయంగా చూసింది సినిమా వారిని కాకుండా ఇంకెవరిని?’’
‘‘ఏం ఇంట్లో నేను హీరోను, నువ్వుహీరోయిన్‌వుకాదా? మన కుటుంబానికి మనమే హీరో హీరోయిన్‌లం కాదా?’’
‘‘చాల్లేండి బడాయి. ఇంతకూ ఏ హీరోనో చెప్పకుండా డొంక తిరుగుడుగా మాట్లాడి తప్పించుకుంటున్నారు.’’
‘‘తప్పించుకోవడానికి నేనేం తప్పు చేసాను. నాకేం భయం. నేను చూసింది రిచర్డ్ ధాలేర్ అనే ఈ హీరోను. ఈ సంవత్సరం ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత.’’
‘‘సినిమాలో హీరోగా నటించాడా? ఏ సినిమా, పేరెప్పుడు వినలేదే?’’
‘‘సినిమాలో నటించాడు కానీ హీరోగా కాదులే. నోబెల్ బహుమతి గ్రహీత అంటే ప్రపంచ హీరో అన్నట్టే ఆర్థిక శాస్త్రంలో ఆయన ప్రపంచ హీరో అన్నమాట.’’
‘‘అవి నాకు అర్థం కాని విషయాలు. వదిలేయండి. అత్తా ఒకింటి కోడలే, అల్లుడూ ఒకింటి కొడుకే సీరియల్ వచ్చే టైం అయింది. వెళతాను. గతవారం అత్తకోడళ్ల మధ్య వార్, చెంప చెళ్లు మనిపించడానికి అత్తాకోడలు ఒకేసారి చేయి పైకి ఎత్తారు. సీరియల్ ఆగిపోయింది. అత్త చెంపను కోడలు చేయి ముందు వాయించిందా? కోడలు చెంపను అత్త వాయించిందా? అని ప్రేక్షకులకు ఎస్‌ఎమ్‌ఎస్ కాంటెస్ట్ నిర్వహించారు. నేను కోడలే విజయం సాధిస్తుందని ఎస్‌ఎంఎస్ పంపాను. మీ అభిప్రాయం చెప్పండి. ఎవరు విజయం సాధిస్తారు?’’
‘‘ఇలాంటి వివాదాల్లోకి నన్ను లాగి, ఇద్దరు కలిసి నా చెంప వాయించాలని చూడకండి.’’
‘‘ ఆ సీరియల్‌లో అచ్చం అత్తకొడుకు మీలానే మాట్లాడతాడు. మా ఆయన బంగారం. అవసరం అయితే చచ్చినట్టు నాకే మద్దతు ఇస్తారని నాకు తెలుసు.’’
‘‘జైలు గోడల మధ్య ఉన్న ఖైదీ జైలర్‌కు కాకుండా ఇంకెవరికి మద్దతు ఇస్తాడు. కానీ నేను ఆ హీరో ఫోటోను అంత తన్మయంగా ఎందుకు చూశానో చెబితే మళ్లీ అంటావు మా ఆయన బంగారం అని.’’
‘‘తప్పెవరిదైనా క్షమాపణ కోరే భర్త అన్నా అనకపోయినా బంగారమే కానీ విషయం ఏంటో చెప్పండి.’’
‘‘మానసిక శాస్త్రం, ఆర్థిక శాస్త్రాన్ని మిక్స్ చేసి రిచర్డ్ రూపొందించిన సిద్ధాంతానికి ఈసారి నోబెల్ బహుమతి ప్రకటించారు. డబ్బు ఖర్చు చేసే సమయంలో మనిషి ఆలోచనలు ఎలా ఉంటాయో, ఆయన తన పరిశోధనలో తేల్చి చెప్పారు. డబ్బు ఖర్చు చేసేప్పుడు మన మీద మనకు నియంత్రణ ఉండదట! హేతుబద్ధంగా ఆలోచించమట! ఆ వార్త చదవగానే నోబెల్ బహుమతి గ్రహీతలో నన్ను నేను చూసుకున్నాను. నిన్ను కూడా చూశాననుకో, అందుకే మన ఇంటికి మనమే హీరో హీరోయిన్‌లం అన్నాను.’’
‘‘నన్ను పొగిడారంటే అర్థం ఉంది. మిమ్ములను మీరు హీరో అని ఎలా పొగుడుకుంటారు. నోబెల్ బహుమతి గ్రహీత పరిశోధనకు మీకూ పోలికేంటి? ఎందులో పోలిక?’’
‘‘అక్కడికే వస్తున్నా! ఖర్చు పెట్టేముందు అన్ని లెక్కలూ వేసుకోరు అనేదేకదా? ఆ ఆర్థిక శాస్తవ్రేత్త కనిపెట్టిన విషయం. ఈ విషయంలో నేను ఆయనకన్నా ముందున్నా... అదే అదే మనం ఆయనకన్నా ముందున్నాం.’’
‘‘మేధావిలా ఏదో స్టేట్‌మెంట్ ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు. దాన్ని ఎలా సమర్థించుకుంటారో చెప్పండి?’’
‘‘నాకు నెలజీతం రాగానే మొత్తానికి మొత్తం నీకే ఇచ్చేస్తా కదా?’’
‘‘అవును.’’
‘‘మా ఆయన బంగారం. బుద్ధిమంతుడిలా జీతం తెచ్చి ఇచ్చేస్తాడు అని నువ్వు మురిసిపోతావు. కానీ దీని వెనుక పెద్ద వ్యూహం ఉంది. ఆర్థిక శాస్త్రం ఉంది. నోబెల్ ప్రైజ్ సాధించడానికి కావలసినంత తెలివి ఉంది.’’
‘‘ఏంటో ఆ తెలివి?’’
‘‘జీతం నీ దగ్గరే ఉంటే చందన బ్రదర్స్‌లో కేజీల్లో చీరలు అమ్ముతున్నారు, నాగార్జున బంగారు ఆభరణాలు కొనమని పదే పదే అడుగుతున్నాడు, చెన్నై షాపింగ్ మాల్‌కు వెళ్లొద్దాం, ప్రేమించుకునేప్పుడు బంగారువడ్డాణం చేయిస్తా అన్నారంటూ నా దుంప తెంచేదానవు. ఇంట్లో రోజూ కిష్కింద కాండ నాటక ప్రదర్శన మూడు షోలు నిరాటంకంగా సాగేది. అవునా? కాదా? మరిప్పుడు జీతం మొత్తం నీ చేతికే ఇవ్వడంవల్ల అలాంటి కోరికలు చచ్చినా మన ఇంటి దరిదాపుల్లోకి కూడా రావు. జీతం ఎంతో? ఖర్చు ఎంతో నీ కళ్లముందు ఐమ్యాక్స్‌లో స్క్రీన్‌లా తేటతెల్లంగా కనిపిస్తుంటే, నీకు బంగారు కోరికలు ఎలా పుడతాయి. భార్య అంటే భయం అని పిచ్చోళ్లు అనుకుంటారు. కానీ ఇప్పుడు చెప్పు నా వ్యూహంలో నోబెల్ ప్రైజ్‌కు కావలసిన తెలివితేటలు దాగున్నాయా? లేదా?’’
‘‘ఔనండి. బుద్ధిగా నా చేతిలో పెడితే మురిసిపోయా. మీరు అమాయకులు అనుకున్నా. ఇన్ని తెలివితేటలు ఉన్నాయా? ఐనా నేను కూడా అమాయకురాలిని ఏమీ కాదు. జీతం అంతా ఖర్చయింది అని చెప్పి నెలనెలా ఎంతో కొంత దాచిపెడుతున్నా. పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు అవసరం వస్తుందని, ఖర్చు తగ్గించి పొదుపు చేస్తున్నా. పోపుల డబ్బానుంచి బీరువాలోని చీరల కింది వరకు అన్నీ నాకు వరల్డ్‌బ్యాంకులే కష్టకాలంలో ఆదుకుంటాయి’’
‘‘డబ్బులు పోపు డబ్బాలో దాచిపెడుతున్నాను అని నాతో అన్నావు సరిపోయింది. గట్టిగా అనకు మేధావులు విన్నారంటే ఆడవాళ్లంతా సామాజిక స్మగ్లర్లు అని ముద్ర వేయగలరు.’’
‘‘మందులకో మాకులకో అవసరం వస్తుందని పోపుల డబ్బాలో డబ్బు దాచిపెట్టుకుంటే సామాజిక స్మగ్లర్లు అయితే బీడీలు, మందు బాటిల్స్‌కు డబ్బు తగలేసి, రోగాలు వచ్చాక నలుగురి ముందు చేయి చాచడం మేధావితనం అవుతుందా?’’
‘‘వివాదాలు మనకెందుకు వదిలేయ్. మనమిద్దరం చేస్తున్నది మంచి అని మనకు తెలుసు’’
‘‘అయినా అదేం చిత్రమండి. అంతోటి దానికి నోబెల్ బహుమతి ఇచ్చేస్తారా? ఆ దేశాల సంగతి తెలియదు కానీ మన దేశంలోసగటు కుటుంబరావుల ప్రతి రూపాయి ఖర్చు చేసేముందు మన ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, ఈ ఖర్చు చేయవచ్చా? లేదా? అని నిరంతరం మెదడులోనే క్యాలిక్యులేటర్‌గా మార్చి లెక్కలు వేస్తూనే ఉంటాడు కదా? మరాయన డబ్బు ఖర్చు చేసేముందు ఆలోచించరు అని పరిశోధించి చెప్పేసరికి నోబెల్ ప్రైజ్ ఇచ్చేసారు.’’
‘‘రిచర్డ్ థాలేర్ ఓసారి మనదేశానికి వచ్చి కుటుంబరావులతో ఈ విషయం మాట్లాడితే బాగుండు.’’
‘‘ఐనా మన గురించి ఒకరు చెప్పడం ఎందుకు? మన గురించి మనకు తెలియదా? డబ్బు ఖర్చు విషయంలో మన సగటు మధ్య తరగతి, పేద కుటుంబాలు నోబెల్ బహుమతి పరిశోధనా అంశం కన్నా ముందున్నాం.’’
‘‘అంతేనోయ్ బాగా చెప్పావు. డార్లింగ్ ఈరోజు పెట్రోలుకు ఓ వంద ఎక్కువిస్తావా?’’
‘‘నా దగ్గర మీ తెలివితేటలు చూపకండి. పెట్రోల్ లీటర్‌కు రెండు రూపాయలు తగ్గింది. ఆ వంద సిగరెట్ ప్యాకెట్‌కని తెలుసు. నోరు మూసుకుని వెళ్లండి’’
బుద్దా మురళి 13. 10. 2017 జనాంతికం 

1 కామెంట్‌:

మీ అభిప్రాయానికి స్వాగతం