25, నవంబర్ 2016, శుక్రవారం

లోబడ్జెట్ పెళ్లి..!



‘‘కెవ్వు.. ఎవడ్రా నువ్వు.. నా చెయ్యి పట్టుకున్నావ్.. ‘షీ టీమ్’ను పిలిచానంటే నీ తాట తీస్తారు.. పిచ్చి సన్నాసీ’’
‘‘చెంప ఛెల్లుమనిపించావేంటి డార్లింగ్? పెళ్లయ్యాక ఎలాగూ తప్పదు. నేను విఘ్నేష్‌ను.. ఇదిగో నా ఐడెండిటీ కార్డు. బ్యాంకులో టోకెన్ సంపాదించే సరికి ఇలా మారిపోయాను. మన పెళ్లికి విఘ్నాలన్నీ తొలగిపోయినట్టే. ఒకే కానె్వంట్, ఒకే కాలేజీ, ఒకే కంపెనీలో ఉద్యోగం, ఇప్పుడు ఒకే ఇంటి వారమవుతున్నాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా మనం ఒకటవుతున్నందుకు చాలా థ్రిల్లింగ్‌గా ఉంది డార్లింగ్’’
‘‘సారీ డియర్.. చెరిగిపోయిన జుట్టు, చిరిగి పోయిన షర్టు చూసి ఎవడో ఏబ్రాసి వెధవ చేయి పట్టుకున్నాడనుకున్నాను.’’
‘‘పర్లేదు... ఇక ఆ బ్యాంక్ మేనేజర్‌ని ఒప్పించామంటే మన పెళ్లికి గండాలన్నీ తీరినట్టే’’
‘‘డియర్.. అతివిశ్వాసం మంచిది కాదు. బాగా ప్రిపేర్ కా, ఇక్కడ పరీక్ష తప్పావంటే.. మన పని గోవిందా’’
‘‘ఎంసెట్‌లో టాప్ 100లో నిలిచాను.. నాకు ఈ ఇంటర్వ్యూ ఓ లెక్కనా డియర్’’
‘‘టోకెన్ నంబర్ 205’’
‘‘ ఆధార్ కార్డులో ముఖానికి, బ్యాంకు అకౌంట్‌లో ఉన్న ఫొటోకు, ఇపుడు మాకు ఎదురుగా కనిపిస్తున్న నీకు.. అస్సలు సంబంధం కనిపించడం లేదు. నువ్వేనా..? నిజం చెప్పు’’
‘‘దేశంలో 120 కోట్ల మందిలో ఏ ఒక్కరికీ ఆధార్‌కు, అసలు ముఖానికి సంబంధం ఉండదు సార్! తొక్కిసలాటలో ముఖం ఇలా అయింది’’
‘‘సర్లే.. చూస్తుంటే పనీ పాటా లేకుండా తిరిగే పోకిరిలా ఉన్నావ్! నీకు పిల్లనిచ్చే వాళ్లు కూడా ఉన్నారా? ’’
‘‘ఇన్ఫోసిస్‌లో పని చేస్తున్నాను సార్! రాణీ ఒకసారి ఇటురా! ఇదిగో సార్ అమ్మాయి. రాణి కూడా ఇన్ఫోసిస్‌లోనే పని చేస్తోంది..’’
‘‘ఏమ్మా.. ఇంత చక్కగా ఉన్నావ్! మీ వాళ్లకు ఇంతకు మించి మంచి సంబంధం కనిపించలేదా? ’’
‘‘మాది లౌ కమ్ అరేంజ్‌డ్ మ్యారేజీ సార్’’
‘‘సర్లే.. నువ్వు ఎలా చస్తే నాకేంటి కానీ.. నీ పెళ్లికి రెండున్నల లక్షల బ్యాంకు రిలీజ్ చేయాలంటే నేనడిగే ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాలి’’
‘‘అడగండి సార్.. పూర్తిగా ప్రిపేర్ అయ్యాను.’’
‘‘ఎలా.. అబద్ధం చెప్పాలనా? నిజం చెప్పాలంటే ప్రిపేర్ అవసరం లేదు. అబద్ధాలకే ప్రీపేర్ కావాలి’’
‘‘కాదు సార్.. పెళ్లికి సంబంధించి మంత్రాలతో సహా ప్రతి ఒక్కటీ ప్రిపేర్ అయ్యాను. నారాయణ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ చదివాను. ఏదైనా బట్టీ పట్టడం బాగా అలవాటైంది.’’
‘‘ ఏడ్చినట్టే ఉంది. నీ తెలివి. సర్లే కానీ ఈ రెండున్నర లక్షలతో ఏమేం చేస్తావో లెక్క చెప్పు’’
‘‘మంగళసూత్రానికి 15వేలు.. పూలదండలు, విస్తరాకులకు రెండువేలు.. పప్పుచారు, పెరుగు, బుడమకాయ తొక్కు..ఇది సార్ లెక్క’’
‘‘ఏడ్చి తుడుచుకున్నట్టు ఉంది నీ లెక్క. ఇదేం పెళ్లి బోడి పెళ్లి.. వంకాయ, ఆలుగడ్డ కూర లేని పెళ్లి కూడా ఒక పెళ్లేనా? నేనే అమ్మాయి తండ్రినైతే పెళ్లిలో వడ్డించే కూరగాయల జాబితా చూశాక చచ్చినా ఈపెళ్లికి ఒప్పుకోను’’
‘‘ సారీ సార్.. రెండున్నర లక్షల్లోనే ముగించాలి . ఇది లోబడ్జెట్ పెళ్లి సార్. ఇద్దరికీ మంచి సంపాదన. మామూలుగా అయితే బాహుబలి రేంజ్‌లో ఉండేది. నోట్ల రద్దు-50 రోజుల బంద్‌లో పెళ్లి కాబట్టి లోబడ్జెట్‌కు అడ్జస్ట్ కావలసి వస్తోంది’’
‘‘సరే.. నువ్వు కాసేపు పక్క గదిలో ఉండు. అమ్మాయితో నేను విడిగా మాట్లాడాలి’’
‘‘ఏమ్మా.. వీడు తప్ప నీకు ఇంకో శాల్తీ దొరక లేదా? ’’
‘‘మేం చిన్నప్పటి నుంచి ప్రేమించుకున్నాం సార్...తూనీగా తూనీగా పాట టైప్ ప్రేమకథ సార్ మాది. చిన్నప్పటి నుండి ‘బంగారం’ అంటూ వాడు ఎంతో ముద్దుగా పిలిచేవాడు. ఆ మాటకే పడిపోయాను.’’
‘‘వాడే కాదమ్మా.. ప్రతి అడ్డమైన వాడు ‘బంగారం’ అనే పిలుస్తాడు. అదేదో దిక్కుమాలిన సినిమాతో అందరికీ ఆ పదం అలవాటైంది’’
‘‘ఎవరేమన్నా విఘ్నేష్‌నే చేసుకుంటాను’’
‘‘మంచి కోరి పెద్దవాడిని చెబుతుంటే.. కాదు గొయ్యిలో పడతాను అంటే ఏం చెప్పగలను? కుందనపు బొమ్మలా చక్కగా ఉన్నావు. నాకు ఆడ పిల్ల ఉంటే అచ్చం ఇలానే ఉండేది. మీ తండ్రే నీ మంచి కోరి కాస్త కఠినంగా చెబితే వినవా? ’’
‘‘సార్.. మీకు ఆడపిల్లలు లేరా? ’’
‘‘లేరు.. ఒకడే మగ పిల్లవాడు. వాడి జీవితం అడవి కాచిన వెనె్నల అవుతుందేమో అని నా భయమమ్మా.. పెళ్లి చేసుకోరా! అంటే చదువు
పూర్తి కావాలన్నాడు. పాతికేళ్లు గడిచిపోయాయి. తర్వాత ఉద్యోగం అన్నాడు. సరే అన్నాను. రెండేళ్లకే మొదటి ఉద్యోగం ఊడింది. ఐటి కంపెనీలో ఉద్యోగం ఏ రోజు ఊడుతుందో? ఏ రోజు ఉంటుందో తెలియదు. కాస్త కుదురుకుని ఒక పొజీషన్‌కు వచ్చే సరికి వాడి వయసు 35కు వచ్చి కూర్చుంది. ‘నాన్నా.. పెళ్లి..’- అని ఇంటికి వెళ్లగానే వాడు అడుగుతుంటే ఈ తండ్రి హృదయం ఎంత విలవిల లాడుతుందో ఆలోచించు తల్లీ.. ఈ రోజుల్లో కనె్న పిల్లగాడు తల్లిదండ్రుల గుండెలమీద కుంపటిలా మారుతున్నాడు. ఇది నా ఒక్కడి బాధ కాదు తల్లీ.. నాలాంటి లక్షలాది మంది తండ్రుల ఆవేదన..’’
‘‘అంకుల్ ... . మీరు పెద్దవారు అలా ఏడవకండి.. గంతకు తగ్గ బొంత ఎక్కడో దొరక్కపోదు’’
‘‘ఆ బొంతవు నువ్వే ఎందుకు కాకూడదు తల్లీ.. సొంత ఇల్లుంది. ఊర్లో పొలం. మా వాడికి మంచి ఉద్యోగం.’’
‘‘సారీ .. నేను విఘ్నేష్‌కు మనసిచ్చాను. ఈ మనసులో ఇంకొకరికి స్థానం లేదు’’
‘‘ అంకుల్ అన్నావంటే ఆ మాట చాలు .. బ్యాంకులో దాచుకున్న ఫిక్స్‌డ్ డిపాజిట్‌కే దిక్కు లేదు. కనిపించని మనసుదేముందమ్మా..? వెనక్కి తీసుకో.. సరే ఎవరికీ చెప్పవద్దు.. నీకో గోల్డెన్ ఛాన్స్. వందనోట్ల కట్టలు మూడు ఇస్తాను. అంటే వంద రూపాయల నోట్లు మూడు వందలు ఇస్తాను. ఒక్క వందనోటు కోసమే జనం తపిస్తున్నారు. అలాంటిది మూడు వందల నోట్లు నీ వద్ద ఉంటే సమాజం నీకు ఇచ్చే గౌరవం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు’’
‘‘ అంకుల్ . మీరు నన్ను టెమ్ట్ చేస్తున్నారు. ఆలోచించుకొని చెబుతాను’’
‘‘విఘ్నేష్.. ఈ పెళ్లి సంబంధం మా బ్యాంక్‌కు నచ్చలేదు. నీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తున్నాను.’’
‘‘సార్ ఇది అన్యాయం ’’
‘‘ఎక్కువగా మాట్లాడితే రాజా ద్రోహం కేసు పెడతాను .. నేను ఒక సారి రిజెక్ట్ అంటే అంతే ప్రధాన మంత్రి , ఆర్థిక మంత్రి , ఆర్ బి ఐ గవర్నర్ ఈ ముగ్గురి కమిటీకి అప్పీల్ చేసుకో పో’’ 
***
విఘ్నేష్ పెళ్లికి విఘ్నం తొలగుతుందా?  ప్రధాని బృందం అతని అప్పీలును పట్టించు కొంటుందా ? ఆ అమ్మాయి  రాణి మనసు మారుతుందా? నవాబుల కాలంలో శుభకార్యాల ఖర్చులకు ప్రభుత్వ అనుమతి అవసరం ఉండేది. ఈ నిబంధనలను ఆర్‌బిఐ రద్దు చేసుకుంటుందా? ఎవరికీ ఏమీ తెలియదు. కాలమే చెబుతుంది. * 

- బుద్దా మురళి(జనాంతికం - 25. 11. 2016)


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం