10, జులై 2016, ఆదివారం

చలో హైకోర్ట్...కోర్ట్ నే కొట్టేద్దాం

‘‘ఏంటీ దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్?’’
‘‘ఇంటికీ, గొడ్ల చావడికీ పై కప్పు గురించి మాత్రం కాదులే .. నువ్వూ చేతులు కలుపుతానంటే చెబుతాను. మనం ఇద్దరం కలిశామంటే మన ప్లాన్ ఫలిస్తే వందల కోట్ల రూపాయల స్థలం మనదవుతుంది’’


‘‘వంద గజాల ప్లాటే కొనలేకపోయాం. వందల కోట్ల స్థలం ఉచితంగా ఇచ్చినా తీసుకునేంత సీన్ మనకుందా? సక్సెస్ అయితే వందల కోట్లు, కాకపోతే జైలుకేనా?’’
‘‘కాదు రెండు రాష్ట్రాలను, దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యకు పరిష్కారం లభిస్తుంది’’
‘‘చిత్రంగా ఉందే. మహా మహా భూ కబ్జాదారుల సంగతులెన్నో చూశాను. భూ కబ్జాలో సక్సెస్ అయితే భూమి దక్కుతుంది లేకపోతే కేసు అవుతుంది అంతే.. ఫెయిల్ అయినా లాభమే అంటున్నావ్’’
‘‘పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. జీరో పర్సంటేజ్ రిస్క్.. ఓడినా, గెలిచినా మనకే లాభం’’
‘‘ రాజకీయాల్లో ఆదాయం బాగున్నా పెట్టుబడి ఎక్కువే .. రిస్క్ ఎక్కువే .. ప్రభుత్వ ఉద్యోగం లో అయితే ఆదాయం ఉండొచ్చు కానీ ఈ వయసులో మనకు ఉద్యోగం రాదు .. అంత లాభ సాటి వ్యవహారం ఏంటో చెప్పేయ్ ఇంక ఊరించకు ఏంటో చెప్పేయ్ నీతో చేతులు కలిపేందుకు సిద్ధం’’


‘‘మూసీ ఒడ్డున మదీన వద్ద ఉన్న హైకోర్టు భవనం చూశావా? అది మనం కొట్టేసే చాన్స్ దక్కింది’’
‘‘???’’
‘‘ఆశ్చర్యపోకు జీవిత కాలంలో ఎప్పుడో ఒక్కసారి మాత్రమే ఇలాంటి అరుదైన అవకాశం దక్కుతుంది. మనం కొంచం బుర్ర ఉపయోగిస్తే హైకోర్టును కొట్టేయెచ్చు’’
‘‘హైకోర్టును కొట్టేయడం ఏమిటిరా! నీకేమైనా పిచ్చా! జేబులు కొట్టేద్దాం అన్నంత ఈజీగా చెబుతున్నావ్! కొట్టేసిన వాళ్ల కేసులను అక్కడ విచారిస్తారు. నువ్వేమో ఏకంగా హైకోర్టునే కొట్టేద్దామంటున్నావ్!’’


‘‘నీకు తెలుసు కదా? చట్టమంటే నాకు చాలా భయం.. చట్టబద్ధంగానే హైకోర్టును కొట్టేద్దాం. హైకోర్టును కొట్టేయడం అంటే అక్కడున్న చెక్క బల్లలు, కళ్లకు గంతలు కట్టుకునే న్యాయమూర్తి విగ్రహాన్ని కాదు. హైకోర్టు స్థలాన్ని కొట్టేద్దాం. కోట్ల రూపాయల విలువ చేస్తుంది. ఏమీ తెలియకుండానే మాట్లాడుతున్నాను అనుకోకు. హైకోర్టు భవనం ఎప్పుడు నిర్మించారు? ఎవరు నిర్మించారు. ఎంత వైశాల్యంలో ఉంది? ఇప్పుడక్కడ గజం ధర ఎంత? మొత్తం స్థలం అమ్ముకుంటే ఎంత వస్తుంది? అన్ని వివరాలున్నాయి నా వద్ద’’
‘‘నా కస్సలు అర్ధం కావడం లేదు’’
‘‘పత్రికలు చూస్తున్నావు కదా? ’’
‘‘ఎందుకు చూడను పత్రిక పేరు మొదలు కొని ప్రింటర్ అండ్ పబ్లిషర్ వరకూ అన్నీ చదువుతాను’’


‘‘హైకోర్టు విభజన కోసం రెండేళ్ల నుంచి ఏదో ఒక స్థాయిలో ఆందోళనలు సాగుతున్నాయి కదా? ఈ వార్తలు వరుసగా చదువుతుంటే నాకీ బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. హైకోర్టు విభజన వెంటనే జరపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ రెండేళ్ల నుంచి కేంద్రాన్ని అడుగుతూనే ఉన్నారు. అంటే హైకోర్టు తెలంగాణది కాదు అని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పారు. కేంద్రంలో న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు సదానందగారే హైకోర్టు సమస్యతో మాకు సంబంధం లేదు. మాకేలాంటి అధికారం లేదని తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఇదే మాట చెప్పారు. అంటే హైకోర్టు తెలంగాణది కాదు, ఆంధ్రప్రదేశ్‌ది అసలే కాదు. కేంద్రానిది కానే కాదు. ఇంకెవరిది? ’’
‘‘నువ్వు చెప్పు?’’
‘‘ ప్రతి ఒక్కరు హైకోర్టు మాది కాదంటే మాది కాదని చెబుతున్నారు. ఇక్కడే మనం తెలివిగా వ్యవహరించాలి. హైకోర్టు మాదే అని మనం ప్రకటిద్దాం. అంతా మాది కాదంటున్నప్పుడు మాదే అని మనం ముందుకు వస్తే సమస్య పరిష్కారం అవుతుందని సంబరపడతారు కానీ కాదనేవారెవరు?’’


‘‘ఒకవేళ దేవుడిది కావచ్చు కదా? గవర్నర్ ఇదే మాట చెప్పారు. హైకోర్టు సమస్యను దేవుడు పరిష్కరిస్తాడని’’
‘‘ అదే జరిగితే మనంత అదృష్ట వంతులే ఉండరు . దేవుడు ఉన్నాడా ? లేడా ? అని ఆస్తికులు , నాస్తికులు వేల సంవత్సరాల నుంచి తేల్చుకోలేక పోతున్నారు .. హై కోర్ట్ కోసం దేవుడు రంగం లోకి దిగితే ... ఈ ప్రపంచానికి సమాధానం దొరకని ప్రశ్నను మనం మార్గం చూపినట్టు అవుతుంది .  మాది అని మనం క్లయిమ్ చేశాక, దేవుడు వచ్చి కాదు ఇది మాది అంటే అప్పుడు చూసుకుందాం. అప్పటి వరకైతే మనం ఓనర్లం అవుతాం కదా? ఎవరైనా కేసు వేసినా మాది అని కోర్టుకు వెళ్లే మనమే ఉంటాం కానీ వీళ్లది కాదు మాది అనే వాళ్లు ఒక్కరూ ఉండరు’’


‘‘తేడా వస్తే లోపలేస్తారేమో’’
‘‘పిచ్చోడా తేడా ఎందుకొస్తుంది? ఎక్కడొస్తుంది?’’
‘‘ఆ భవనం నిర్మించిన వాళ్లు మాదే అని ముందుకొస్తే’’
‘‘ముందే చెప్పాను. వివరాలు అన్నీ సేకరించే వచ్చాను అని హైకోర్టు భవనం ఎప్పుడైనా చూశావా? ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిజాం రాజ్యాంలో అత్యున్నత న్యాయస్థానం కోసం 1915లో అద్భుతంగా ఈ భవనాన్ని నిర్మించారు. జైపూర్ ఆర్కిటెక్‌తో పాటు హైదరాబాద్ ఆర్కిటెక్‌లో భవన నిర్మాణంలో పాలు పంచుకున్నారు. నాలుగేళ్లలో నిర్మాణాన్ని పూర్తి చేశారు. 300 కిలోల వెండితో ఆకాలంలోనే హైకోర్టు భవన నమూనాను తయారు చేశారు. హైకోర్టు నమూనా పురానా హవేలీలోని ప్యాలెస్‌లో ఉంది. ఇప్పుడు నిజాం రాజ్యం లేదు. నిజాం వారసులూ లేరు. ఇప్పుడున్న రాష్ట్రాలు, కేంద్రం మాది కాదంటే మాది కాదని ప్రకటించేశాయి. చార్మినార్ వద్ద ఆ కాలం నాటి పాత డాక్యు మెంట్లు ఎన్నంటే అన్ని దొరుకుతాయి. నిజాం పోతూ పోతూ హైకోర్టు భవనాన్ని మా తాతలకు రాసిచ్చిండు ఇదిగో డ్యాకుమెంట్లు అని చూపిద్దాం’’
‘‘ఏమీ కాదా?’’
‘‘ఏమీ కాదు.. మన వాదన బలంగా వినిపిస్తే హైకోర్టు భవనం మనదవుతుంది. వందల కోట్ల రూపాయల స్థలానికి మనం ఓనర్లం అవుతాం’’


‘‘ఫెయిల్ అయితే?’’
‘‘ఫెయిల్ కావడం అంటే? హైకోర్టు ఓనర్లం మేమే అని మనం ప్రకటిస్తే, కాదు అని ఎవరో ఒకరు ముందుకు రావాలి? ఎవరొస్తారు? తెలంగాణ ప్రభుత్వమా? ఆంధ్ర ప్రభుత్వమా? కేంద్రమా? ఎవరూ ముందుకు రాకపోతే సంతోషం. వస్తే మరింత సంతోషం. మనది కాదు అని వచ్చిన వాళ్లు నిరూపించాలి. అలా నిరూపించేవాళ్లు ఈ హైకోర్టు ఎవరికి చెందుతుందో తేల్చాల్సి ఉంటుంది. అంటే రెండేళ్ల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలు, వేలమంది న్యాయవాదులు ఉద్యమం ద్వారా పరిష్కారం లభించని సమస్యకు మనం పరిష్కారం చూపితే సంతోషమే కదా? ఏమంటావు?’’
‘‘ఆ భవనం మాదే .. నిజాం ఇచ్చి వెళ్లాడని ప్రకటిద్దాం. ఛలో హైకోర్ట్’’  


-బుద్ధా మురళి (జనాంతికం 10-7-2016)

1 కామెంట్‌:

మీ అభిప్రాయానికి స్వాగతం