26, జులై 2015, ఆదివారం

నిదుర లేవరా తమ్ముడా!

‘‘యత్ర యత్రే... తత్ర తత్రే...యత్రో యత్రః’’
‘‘అంటే ఏంటి గురువా?’’
‘‘అర్థం కావాలా? పరమార్థం కావాలా? అర్థమే లేదనుకుంటే నన్ను వదిలేయ్.. శిష్యా?’’
‘‘ అర్థం తెలిస్తేనే కదా గురువా? పరమార్థం తెలిసేది? ’’
‘‘అర్థం తెలియాలంటే నిఘంటువు చూడు. పరమార్థం తెలియాలంటే నా మాటలు నమ్ము ’’
‘‘ చెప్పండి గురువా? వింటాను’’


‘‘ అందరినీ నిద్ర లేపాలనుకునే వాడు నిద్రకు దూరమవుతాడు. నిద్రకు దూరమైనవాడు చిత్త చాపల్యంతో మాట్లాడతాడు. చిత్త చాపల్యం తో భయం , దాని వెంట క్రోధం , ఆ వెనకే తిక్క ఆవహిస్తుంది ..  అందరినీ తానే నిద్ర లేపుతున్నాననుకుంటాడు. ప్రపంచాన్ని తానే కనిపెట్టానని, విశ్వం తన కనుసన్నల్లో నడుస్తుందని, ప్రపంచ పటంలో ఏమేమి ఉండాలో, ఏది ఎక్కడ ఉండాలో తానే నిర్ణయిస్తానని, ప్రపంచం తనను కీర్తిస్తుందని, ప్రపంచానికి తనను పొగడడం తప్ప మరో పని లేదనే భ్రమల్లో ఉంటాడు. ’’
‘‘ అవును గురువు గారు నాకూ అప్పుడప్పుడు ఇలానే అనిపిస్తుంది. మా ఇంట్లో ఉన్న అలారం మోగితేనే ప్రపంచం నిద్ర లేస్తుందని. ఆ అలారం పని చేయడం మానేస్తే ప్రపంచ ఏం ఏమైపోతుందనే ఆందోళన కూడా కలుగుతుంది’’


‘‘ నీది తాత్కాలిక భ్రమ.. నేను చెప్పేది ఏది నిజమో ఏది భ్రమో గ్రహించలేనంత తీవ్ర భ్రమల్లో మునిగిపోయిన బ్రహ్మీ గురించి ’’
‘‘ యత్ర.. తత్ర అనే ఒక్క మాటలో ఇంత అర్థం ఉందా? గురువా? ’’
‘‘ వినేవాడి ఓపిక, చెప్పేవాడి ‘కాలం’ సైజును బట్టి ఉంటుంది. ఊపిరి పీల్చుకోవడం తరువాత మనిషి బతకడానికి కావలసింది నిద్ర. ఇలాంటి నిద్ర ఎక్కువైనా ప్రమాదమే, తక్కువైనా ప్రమాదమే’’
‘‘మరి నేను నిద్ర పోను .. మిమ్ములను నిద్ర పోనివ్వను అని అంటుంటారు కదా? ’’
‘‘ నిజమే శిష్యా అధికారం నుంచి దిగిపోయిన వారికి, అధికారం కోసం పరి తపించే వారికి తీవ్రమైన ఆలోచనలతో నిద్ర రాదు. వాడికి నిద్ర రానప్పుడు ప్రపంచమంతా హాయిగా నిద్ర పోవడాన్ని సహించలేడు. అందుకే నేను నిద్ర పోనప్పుడు మీరేలా నిద్ర పోతారో చూస్తాను అని చిత్తభ్రమతో ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. ’’


‘‘కొంత మంది మీ గుండెల్లో నిద్ర పోతాను అంటుంటారు’’
‘‘బాగా శ్రమించిన తరువాత కటిక నేలపై పడుకున్నా నిద్ర వస్తుంది. గతుకుల రోడ్లపై ఆర్టీసిలో ప్రయాణించినా గోతుల్లో పడినప్పుడల్లా జోలపాట పాడుతున్నంత హాయిగా నిద్ర వస్తుంది కానీ మనిషన్న వాడెవడూ ఇంకో మనిషి గుండెల్లో నిద్ర పోలేడు. ఆ ఎమ్మెల్యే ఇంటికి, పిసిసి మాజీ అధ్యక్షుని ఇంటికి వెళ్లి చూడు. కెసిఆర్ గుండెల్లో నిద్ర పోతాను అని చెప్పినాయన్ని పదవి నుంచి తీసేశాక ఇంట్లో హాయి గా పడుకునే ఉంటున్నారు. ఇదే మాటన్న కొందరు నేతలు జైలులో, ఇంట్లో నిద్ర పోతున్నారు. ’’
‘‘ గురువా? మీరు అసలు విషయం మరిచి పోయారు... భాగ్యనగరం ప్రజలకు నిద్ర నుంచి మేల్కొలపడం నేర్పిందే మా మామ అని అల్లుడు చెబుతున్నాడు’’


‘‘ఆది చెప్పడానికే కదా ఇంత సేపు నీతో నిద్ర గురించి మాట్లాడింది. చిన్నప్పుడు ఇల్లలికిన ఈగ కథ చదివావా? ఓ ఈగ ఇల్లును అలుకుతూ పనిలో పడిపోయి చివరకు తన పేరే మరిచిపోతుంది’’
‘‘ నేను ఎన్టీఆర్ నిద్ర లేపడం గురించి అల్లుడి గారి స్టేట్‌మెంట్ అడిగితే మీరు ఈగ గురించి చెబుతారేమిటి గురువా ? ప్రెస్ కాన్పరెన్స్‌లో విలేకరులు అడిగే ప్రశ్నలకు అల్లుడు గారు చెప్పే దానికి సంబంధం ఉండదు మీరూ అలానే చెబుతున్నారు. ’’
‘‘వౌనం కూడా శక్తివంతమైన సమాధానమే. అర్ధం లేకుండా మాట్లాడడం వెనుక కూడా ఓ పరమార్థం ఉంటుంది అర్ధం చేసుకోవాలి. వెనకటికో రాజు చరిత్రలో తన పేరు చిరస్థాయిగా గుర్తుండి పోవాలని కొత్త రూల్ పాస్ చేశారు. జనం ఇకపై రాత్రి మేల్కొనాలి.. ఉదయం నిద్ర పోవాలని ’’
‘‘ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంది? ఎవరా రాజు ఏమా కథ. ఆయన రూల్‌ను ప్రజలు అమలు చేశారా? ’’
‘‘ జనం కొత్త విధానానికి అలవాటు పడలేక రోగాల పాలయ్యారు. ఇదే అదను అనుకుని శత్రురాజు దండెత్తి నిద్రలో జోగుతున్న దేశాన్ని ఆక్రమించేసుకున్నాడు.’’


‘‘ అయ్యో ఆయన ప్రయత్నాన్ని ప్రజలు సరిగా అర్ధం చేసుకోలేదన్నమాట’’
‘‘ ప్రకృతిని జివోలు శాసించలేవు’’
‘‘ ఇంతకూ ఎన్టీఆర్ నిద్ర గురించి చెప్పనే లేదు’’
‘‘మత్తు వదలా నిద్దుర మత్తు వదలరా అంటూ జ్ఞానబోధ చేసే శ్రీకృష్ణుడి పాత్రలో ఆయన జీవించేశారు. రాముడి వేషం వేస్తే శ్రీరాముడు అచ్చం ఇలానే ఉంటాడనిపించేది. రావణుడి వేషం వేసినా, చివరకు రిక్షారాముడి వేషమైన, డ్రైవర్ రాముడి వేషం అయినా అచ్చం ఇలానే ఉంటాడు అనిపించేట్టు నటించే వారు. సినిమా హీరోగా 60 ఏళ్లు పూర్తి చేసుకున్న తరువాత రాజకీయ వేషం వేశారు. సినిమాలో ఎవరి పాత్ర ఏమిటో దర్శకుడు నిర్ణయిస్తాడు. రాజకీయాల్లో ఎవరికి వారే నటుడు, దర్శకుడు, అన్నీ రాజకీయాల్లో ఎవరు ఏ పాత్రలో నటిస్తున్నారో, పక్కనున్న వాడు సహాయ నటుడు అని హీరో అనుకుంటే వాడు చివరకు వెన్నుపోటు పొడిచి పారేస్తాడు. ఎన్టీఆర్ అందరూ మేల్కొన్న సమయంలో నిద్ర పోయే వారు. అందరూ నిద్ర పోయిన సమయంలో లేచే వారు. దాంతో తన చుట్టూ ఉన్న ప్రపంచంలో వాస్తవంగా ఏం జరుగుతుందో ఆయనకు అర్ధం కాలేదు. బ్రహ్మాండమైన బ్రహ్మీ ముహూర్తం అంటూ ఆయన నిద్ర నుంచి లేచి చూసే సరికి అంతా అయిపోయింది. ఆయన్ని కుర్చీ నుంచి దించేశారు. విషయం అర్ధం అయ్యాక నిద్ర లేని రాత్రులు గడిపి, శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ’’


‘‘ ఇంతకూ భాగ్యనగర వాసులను ఆయన నిద్ర లేపలేదంటారా? ’’
‘‘ చివరకు తన సంతానానే్న నిద్ర లేప లేకపోయాడని నేను చెబుతుంటే, నీకేమైనా అనుమానం ఉంటే వైస్రాయ్ చరిత్రను మరో సారి రివైండ్ చేసుకొని చూడు. ’’
‘‘ మీరెంత చెప్పినా నాకెందుకో హైదరాబాద్ వారిని ఎన్టీఆరే నిద్ర లేపారనిపిస్తోంది’’
‘‘సూర్యున్ని ప్రతి రోజూ తెల్లవారు జామున నేనే నిద్ర లేపుతాను. ఈ రహస్యం ఎవరికీ చెప్పకు. సూర్యుడు ఫీలవుతాడు.’’

19, జులై 2015, ఆదివారం

దేశభక్తులు- దేశ ద్రోహులు-బాహు బలులు

‘‘అపూర్వసహోదరుల్లా ఎప్పుడు చూసినా ఇద్దరూ కలిసే ఉండేవారు అదేంటి ఈ రోజు చిత్రంగా ఒకే చోట ఇద్దరు ఒకరికొకరు దూరంగా కూర్చున్నారు’’


‘‘నువ్వు నాతో మాట్లాడాలనుకుంటే మాట్లాడు. లేదంటే వాడి దగ్గరకు పో.. అంతే కానీ ఆ దేశ ద్రోహి గురించి నన్ను అడగొద్దు. వాడి పేరు వినాలంటేనే నాకు చిరాగ్గా ఉంది. ఇలాంటి దేశ ద్రోహులు ఈ భూమి మీద ఎందుకుంటారో? నేను దేన్నయినా భరించగలను కానీ దేశ భక్తి లేనోడ్ని భరించలేను’’
 

‘‘ఏం జరిగింది నాకు నిజంగా తెలియదు. వాడేమైనా కాశ్మీర్‌లో పాకిస్తాన్ జెండాలు ఎగర వేశాడా? ’’
‘‘అది కామన్ కాశ్మీర్‌లో ఎప్పుడూ పాకిస్తాన్ జెండాలు ఎగురుతూనే ఉంటాయి. అందులో నాకేమీ పెద్ద తప్పు కూడా కనిపించలేదు’’


‘‘కొంపదీసి ఐఎస్‌ఐ ఏజెంటా ? ’’
‘‘దేశంలో ఐఎస్‌ఐ ఏజెంట్లకు కొదవుందా? జనాభా లెక్కల సేకరణలా కొన్ని ప్రాంతాల్లో ఐఎస్‌ఐ ఏజెంట్ల లెక్కలు సేకరించాల్సిన పరిస్థితి ఉంది.’’
‘‘అంటే ఇస్లామిక్ దేశం కోసం కొట్లాడుతున్నారు కదా వీడు కూడా అందులో చేరిపోయాడా? ఏమిటి? అలా అయితే ఇలాంటి వారిని అస్సలు క్షమించవద్దు’’
‘‘ఎవరి సిద్ధాంతాలు వారివి ఇస్లామిక్ దేశం కోసం పోరాడితే అది వారిష్టం. మనకేం? ’’
‘‘లాడెన్ బృందం అమెరికా టవర్స్‌ను కూల్చినట్టు వీడేమైనా కూల్చాలని ప్లాన్ వేస్తున్నాడా? పార్లమెంటుపై దాడి చేయాలనుకుంటున్నాడా? అయితే ఇప్పుడు చెప్పు నిజమైన దేశభక్తుల్లా మనం వీడి సంగతి పోలీసులకు చెప్పాల్సిందే’’
‘‘అది కాదులే... ఎవరి సిద్ధాంతాలు వారివి వారి సిద్ధాంతాల ప్రచారం కోసం టవర్స్‌ను కూలుస్తుంటారు. పార్లమెంటుపై దాడి చేస్తుంటారు. దానికి మనమెలా తప్పు పడతాం. చెప్పాను కదా ఆ దేశ ద్రోహి గురించి నాలాంటి దేశ భక్తులు మాట్లాడడం తప్పు’’


‘‘మరి? ’’
‘‘ఆ ద్రోహి గురించి తప్ప ఇంకేమైనా మాట్లాడు వింటాను, అడుగు చెబుతాను’’
‘‘వాడి గురించి వదిలేద్దాం. నీ గురించి చెప్పు. నీలో ఇంత దేశభక్తి ఉందని ఎప్పుడూ అనుకోలేదు. పనికి రాని విషయాల గురించే తప్ప దేశం గురించి నువ్వు ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదు. ఏంటీ సైన్యంలో చేరుతున్నావా? ఏంటి? ’’
‘‘ ఓయ్ ఏం మాట్లాడుతున్నావ్? నేను సైన్యంలో చేరడమేంటి ? నీకెలా కనిపిస్తున్నాను. అమలాపురం ‘దేశం’ ఎంపి మొన్న సైన్యం గురించి ఏమన్నాడో తెలియదా? ఉచితంగా మద్యం, మాంసం దొరుకుతుందనే సైన్యంలోకి వెళతారని చెప్పాడా? లేదా? మా బాబాయ్‌కే మందు షాపుంది. సైన్యంలో చేరాల్సిన అవసరం నాకేముంది? ’’
‘‘మొన్నటి దాకా నీ ప్రాణమిత్రుడిగా ఉన్నాడేమో ఇప్పుడు దేశ ద్రోహి అంటావు. సైన్యం అంటే ఇంత చిన్న చూపున్నోడివి నువ్వు దేశ భక్తుడివేంటిరాబాబూ’’
‘‘అంటే సైన్యం గొప్పతనాన్ని అంగీకరిస్తేనే దేశభక్తి ఉన్నట్టా? దేశభక్తికి ఇంకేమీ కొలమానాలు లేవా? ’’


‘‘నాకు తెలిసింది అంతే కాబట్టి అలా అన్నాను. నీ దృష్టిలో దేశభక్తి అంటే ఏమిటో చెప్పు వింటాను. ’’
‘‘ నేను 15 ఆగస్టు రోజున బార్‌కు వెళ్లి దేశభక్తితోనే మందు కొడతాను. నా షర్ట్ జేబుకు త్రివర్ణ పతాకం స్టిక్కర్ ఉంటుంది. చివరకు అక్కడ బేరర్లు కూడా త్రివర్ణ పతాకం స్టిక్కర్లు ధరించే మందు సర్వ్ చేస్తారు. కావాలంటే ఇంటికి రా ఫోటో చూపిస్తాను. ఇది కాదా దేశభక్తి ’’
‘‘సరే ఇంతకూ వాడు చేసిన దేశ ద్రోహం ఏమిటి? నీలాంటి దేశభక్తుడి కోపానికి కారణం ఏమిటి? అది చెప్పు ?’’


‘‘సినిమాలపై నీ అభిప్రాయం’’
‘‘ నేను సినిమాలు చూడడం తక్కువే కానీ ఇప్పటికే అదే పెద్ద వినోద సాధనం అని నమ్ముతాను. దేశ ద్రోహి గురించి చెప్పమంటే హఠాత్తుగా సినిమాల్లోకి వచ్చావు’’
‘‘ ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. తరువాత నీ ప్రశ్నకు సమాధానం చెబుతాను. గర్వంగా చెప్పుకునే సినిమా పేరు చెప్పు’’
‘‘ ఒకటెందుకు.. చాలా సినిమాలు ఉన్నాయి. నర్తనశాలలో ఎస్వీఆర్ నటనకు తాష్కెంట్‌లో సైతం జనం జేజేలు పలికారు. నిండైన విగ్రహంతో ఎస్వీఆర్ నటన నభూతో న భవిష్యత్తు. దేవదాసులో అక్కినేని జీవించేశారు. లవకుశలో ఎన్టీఆర్, అంజలి పూజలందుకున్నారు. దానవీర శూరకర్ణలో ఎన్టీఆర్ డైలాగులతో అదరగొట్టారు. ఎన్టీఆర్, కాంతారావు, రాజనాల అబ్బో ఒకటా రెండు ఒక్కో జానపద సినిమా ఒక్కో కళాఖండం కదా? ఇప్పుడు చూసినా ఊహాలోకంలోకి వెళ్లిపోతాం.’’
‘‘ అవి కాదు’’


‘‘అలా అంటావా? శంకరాభరణంను మించిన సినిమా ఏముంటుంది? ఆ సినిమా విడుదలయ్యాక తల్లిదండ్రులు తమ పిల్లలకు సంగీతమో, నాట్యమో నేర్పించడానికి ముందుకొచ్చారు. ఇప్పుడు నాట్యప్రదర్శనలు ఇస్తున్నారంటే, పాటలు పాడుతున్నారంటే ఆ సినిమా సమాజంపై చూపిన ప్రభావమే కారణం. ’’
‘‘మరీ శంకర శాస్ర్తీలా ఉపన్యాసాలివ్వకు... అలాంటి సినిమాల పేర్లు వినడం కూడా నాకు పెద్దగా ఇష్టం ఉండదు. ’’
‘‘ దేశం గర్వించదగ్గ సినిమా పేరు చెప్పు ’’
‘‘ షోలేను మించిన సినిమా రాలేదు. దశాబ్దాల తరబడి ముంబైలో నడిచిన సినిమా ’’
‘‘మీరింకా అప్‌డెట్ కావాలి లేదంటే నిన్ను కూడా దేశ ద్రోహుల జాబితాలో కలిపేస్తాను ’’
‘‘సర్లే సినిమాల సంగతి వదిలేయ్ ఇంతకూ వాడు చేసిన దేశ ద్రోహం ఏమిటో, నీ దేశభక్తి ఏమిటో చెబితే వినాలని ఉంది’’


‘‘ ప్రైడ్ ఆఫ్ ఇండియా సినిమాను వాడింత వరకు చూడలేదట! చూసే ఉద్దేశం కూడా లేదట. ప్రపంచంలో భారత దేశ కీర్తిపతాకాన్ని ఎగురవేసిన బాహుబలి సినిమాను చూసే టైమ్ లేదంటున్నాడు. మొదటి రోజు మొదటి ఆట చూసిన నాలాంటి దేశ భక్తుడు అలాంటి దేశ ద్రోహికి దూరంగా ఉండాలనుకోవడం తప్పా? ’’‘‘వాడే కాదు బాహుబలి చూడని నువ్వు, చూసి విమర్శించే వాళ్లు, పైరసీ సీడిల్లో చూసే వాళ్లు కూడా దేశ ద్రోహులే. మీలాంటి వారిని శిక్షించేలా తక్షణం చట్టాలను తేవాలి. పార్లమెంటుకు ఇంతకు మించిన పని ఏముంటుంది?. ఈ చట్టం తేకపోతే పార్లమెంట్ కూడా దేశ ద్రోహే. ఈ వర్షా కాల సమావేశాల్లో పార్లమెంట్ తన దేశ భక్తి నిరూపించు కొంటుందా ?దేశ ద్రోహిగా ముద్ర వేసుకుంటుందా ?చూడాలి .  ఇది పార్లమెంట్ కు పరీక్షా సమయం ’’
ఆ ???? 

12, జులై 2015, ఆదివారం

అమాయక ‘భారతం’

‘‘భారత దేశ జనాభా 128 కోట్ల ఒకటికి చేరింది?’’
128 కోట్లు అని ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది. నిన్ననే నాకో మనవడు పుట్టాడు. ఆవిషయాన్ని ఇలా చెప్పాను’’
‘‘ఓహో అదా ఎప్పుడూ రాజకీయాల గురించి మాట్లాడేవాడివి, జనాభా లెక్కలు చెబుతుంటే ’’
‘‘ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం కూడా అందుకే టాపిక్ మార్చాను. అది సరే ఈ 128 కోట్లలో అమాయకులు ఎంత మంది ఉంటారు, మాయకులు ఎంత మంది? ’’
‘‘ఆడా మగ లెక్కలు, మైనారిటీ, మెజారిటీ లెక్కలే కానీ ఎవరు ఎలాంటి వారనే లెక్కలుండవు. అటూ ఇటూ కానీ మూడో జాతి వారి లెక్కలు సైతం సేకరించాల్సిందే అని ఆ మధ్య వాళ్లు గొడవ చేసినట్టున్నారు’’
‘‘సాంకేతికంగా ఇంత పురోగతి సాధించినప్పుడు ఎవరు ఎలాంటి వారో లెక్కలు తేలిస్తే వచ్చే నష్టమేముంది? ఎలాంటి వాళ్లు ఎంత మందో తేలితే దేశ రాజకీయాలు కీలక మలుపు తిరుగుతాయి. ఎలాంటి వారి సంఖ్య ఎక్కువగా ఉందో తేలితే రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికలో అలాంటి వారికి వరాలు కురిపిస్తాయ ’’


‘‘ ప్రతి ఒక్కడూ పైకి ఒకలా కనిపిస్తాడు. లోన మరోలా ఉంటాడు. పైగా నాకు మంచివాడుగా కనిపించిన వాడు నీకు చెడ్డవాడుగా కనిపించవచ్చు.. అంతెందుకు? దావుద్ ఎలాంటి వాడని నువ్వనుకుంటున్నావో చెప్పు’’
‘‘అనుకోవడానికేముంది వాడో ముదనష్టపు సచ్చినోడు, దేశ ద్రోహి...’’
‘‘మొన్నొకాయనతో మాట్లాడితే దావుద్ అంత అమాయకుడు మరోడు ఉండడు అన్నాడు. ’’
‘‘అమాయకుడా !ఎలా? ’’
‘‘రెడ్ హ్యాండెడ్‌గా పూర్తి ఆధారాలతో పట్టుపడిన ఎమ్మెల్యేలు కూడా ఎంత చక్కగా విలేఖరుల సమావేశాలు ఏర్పాటు చేసి మా ఎదుగుదలను చూసి సహించలేని వాళ్లు మాపై కుట్ర పన్నారు. మేం చాలా మంచి వాళ్లం కావాలంటే ఆరవ తరగతిలో స్కూల్‌లో ఇచ్చిన కాండక్ట్ సర్ట్ఫికెట్ చూడండి అని చెబుతున్నారు. పైగా ఇలాంటి వాళ్లు బెయిల్‌పై బయటకు వస్తే అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. దావూద్‌కు ఈ తెలివి లేక దేశం కాని దేశంలో రహస్య జీవితం గడుపుతున్నాడు. ఇండియా వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేసి దేశంలోనాకున్న పాపులారిటీ చూసి రాజకీయ పార్టీ పెట్టి దేశాన్ని ఏలేస్తాడనే భయంతో కుట్రతో నన్ను కేసులో ఇరికించారు అని చెపితే సరిపోయేది. జైలుకు వెళ్లి వెంటనే బెయిల్‌పై బయటకు వస్తే దేశ వ్యాప్తంగా లక్షల మంది అభిమానులతో దేశంలోనే అత్యంత పెద్ద ర్యాలీ నిర్వహించవచ్చు. రాజకీయాల్లో ఉజ్వల భవిష్యత్తు ఉన్నవాడు రహస్య జీవితం గడుపుతున్నాడంటే అమాయకుడు కాదా? లాడెన్ వీడికన్నా అమాయకుడు. ప్రపంచ వ్యాప్తంగా నా అభిమానుల సంఖ్య పెరగడాన్ని చూసి ఓర్వలేక అమెరికా కుట్ర పన్నుతుంది అని మీడియా సమావేశంలో ప్రకటిస్తే సరిపోయేది రహస్యంగా దాచుకుని రహస్యంగానే అంతమయ్యాడు అమాయకుడు ’’


‘‘ఏంటీ దావూద్, లాడెన్‌లే నీ దృష్టిలో అమాయకులా? వామ్మో ఇంకా నయం హిట్లర్, ఈదీ అమీన్‌లు కూడా ప్రపంచ ప్రఖ్యాత అమాయకులని కితాబు ఇచ్చేస్తావ్’’
‘‘ అబ్బా ఈ మాట అన్నది నేను కాదోయ్ చెప్పాను కదా? వీళ్లు అమాయకులు అని బలమైన వాదన వినిపించారు. అదే నీకు చెబుతున్నాను’’
‘‘ఆ సంగతేమిటో కానీ కుట్రలు మాత్రం రోజు రోజుకు పెరిగిపోతున్నాయనేది మాత్రం నిజం. పాపం ఆవిడెవరో పాత సినిమాల్లో సావిత్రి గారంత అమాయకంగా కనిపిస్తున్నారు. కుమార్తెని దారుణంగా హింసించారని అరెస్టు చేశారు. పినతల్లి కావడమే ఆమె చేసిన నేరమా? తనపై కుట్ర జరిగిందని ఎంత బాగా చెప్పింది. గృహిణిగా ఉండిపోవడమే ఆమె చేసిన తప్పు రాజకీయాల్లో వచ్చి ఉంటే రాణించడమే కాకుండా బెయిల్‌పై బయటకు వచ్చినప్పుడు అభిమానులు బ్రహ్మరథం పట్టి ఉండేవారు. ’’
‘‘బ్లాక్‌టికెట్‌లు అమ్ముతుంటే పట్టుపడ్డవాడు, జేబులు కత్తిరిస్తూ దొరికిపోయిన వాడు మొదలుకొని అంతా కుట్ర అంటున్నారు. ఇంత మంది అంటున్నారు కాబట్టి నిజంగానే కుట్రేనేమో అనిపిస్తోంది ఒక్కోసారి’’
‘‘ ఔను పాపం చివరకు లండన్‌లో తలదాచుకున్న లలిత్‌మోదీపైన రాజస్థాన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులపైన, సుస్మాస్వరాజ్‌పైన ఏదో కుట్ర జరుగుతోంది. ’’


‘‘నిజమేనంటావా? తెలుగు ముఖ్యమంత్రిపైన కూడా కుట్ర జరిగిందంటున్నారు’’
‘‘జరగడం కాదు జరుగుతూనే ఉంది. వాళ్లు అమాయకులు కాబట్టి కేసు వేయడం లేదు కానీ వినియోగదారుల ఫోరంలో కేసు వేస్తే కెసిఆర్ ఇరుక్కుపోతారు’’
‘‘ఎలా? ’’
‘‘ ఓటుకు నోటులో బేరం ఆడింది నిజమే. 50లక్షల రూపాయల నగదు చెల్లించి ఓటుకు బేరం కుదుర్చుకున్నారు. దీనికి ఆధారాలు ఉన్నాయి. అంటే వస్తువు అమ్మకం, కొనుగోలుకు ఒప్పందం కుదిరిపోయింది. ఒప్పందాన్ని అమలు చేయకుండా వినియోగదారుడ్ని మోసం చేసినందుకు వినియోగదారుల ఫోరంలో కేసు వేస్తే తెలిసొస్తుంది. 50లక్షలు తీసుకున్నప్పుడు ఓటు వేయాలి, లేదా 50లక్షలు తిరిగి చెల్లించాలి ఇక్కడ ఈ రెండూ జరగలేదు అంటే ఒప్పందాన్ని ఉల్లంఘించి వినియోగదారుడ్ని మోసం చేసినట్టే కదా? ’’
‘‘ నిజమే కానీ పాపం ఆయనపై ప్రపంచ వ్యాప్తంగా ఏదో కుట్ర జరుగుతున్నట్టుగా ఉంది. చివరకు వీకిలిక్స్ వాడు ఆయన ఫోన్ ట్యాపింగ్ టెక్నాలజీని కొనుగోలుకు బేరం కుదుర్చుకున్న విషయాన్ని బహిర్గతం చేశాడు కదా? ఇదేనా పద్ధతి. కొనుగోలు, అమ్మకాల బేరాలను ఇలా బయటపెడితే విదేశాలను నమ్మేదెవరు? ’’
‘‘టి అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నన్ను దించడానికి అంతర్జాతీయ కుట్ర జరుగుతోంది అంటే నవ్వుకున్నాం కానీ ఇప్పుడు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది. కుట్రను చేధించలేమా? ’’
‘‘ఐపిసి అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క కుట్ర కేసు కూడా రుజువు కాలేదు’’

‘నీ అంచనా ప్రకారం దేశంలో ఎంత మంది అమాయకులు ఉన్నారంటావు?’’
‘‘ఎంత మందో తెలియదు కానీ.. మాపై కుట్ర పన్నారు అని మీడియా ముందు ప్రకటించే ఇలాంటి అమాయకుల సంఖ్య పెరగడం దేశానికే కాదు ప్రపంచానికే ప్రమాదం’’

9, జులై 2015, గురువారం

తెలంగాణా ,ఆంధ్ర రాష్ట్రాల్లో రాజకీయ పునరేకీకరణ

 

రెండు రాష్ట్రాల్లో 2019 ఎన్నికలే లక్ష్యంగా వేగంగా రాజకీయ శక్తుల పునరేకీకరణ జరుగుతోంది. ఆంధ్రలో అయినా తెలంగాణలో నైనా ప్రధాన పార్టీలు రెండింటి మధ్యనే పోటీ ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకొనే ఇష్టం ఉన్నా లేకున్నా నాయకులు రెండింటిలో ఏదో ఒక శిబిరంలో తలదాచుకోవడానికి తహతహలాడుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణలో ప్రారంభమయి, విభజన సమయంలో ఆంధ్రలో ఊపందుకుని ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయ శక్తుల పునరేకీకరణ సాగుతోంది. నిజమైన కార్యకర్తలకు న్యాయం చేయాలనే ఎన్టీఆర్‌ను అధికారం నుంచి దించాల్సి వచ్చిందని 95లో చంద్రబాబు చెప్పినా, పదవుల కోసం పార్టీ మారలేదు, బంగారు తెలంగాణ కోసమే పార్టీ మారాను అని తాజాగా పిసిసి మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ చెప్పినా, తెలంగాణ కోసమే టిడిపి నుంచి బయటకు వచ్చాను అని కెసిఆర్ చెప్పినా వాస్తవాలు ఏమిటనేది ప్రజలకు తెలుసు. నాయకులు తమ భవిష్యత్తు పట్ల తీవ్రంగా మదన పడుతున్నారు, కొత్త దారులు చూసుకుంటున్నారనేది మాత్రం వాస్తవం.
ఉభయ రాష్ట్రాల్లోని ప్రధాన రాజకీయ పక్షాల్లోని నాయకులందరిదీ అధికార రాజకీయాలే తప్ప సిద్ధాంతాలు అంటూ పెద్దగా ఏమీ ఉండవు. కాంగ్రెస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టిడిపి అని చెప్పుకుంటారు. అప్పటి వరకు కాంగ్రెస్‌లో ఒక వెలుగు వెలిగిన ఎంతో మంది నాయకులు హఠాత్తుగా టిడిపిలో చేరి పోయి మంత్రివర్గంలో, పార్లమెంటులో టిడిపి నాయకులుగా బ్రహ్మాండగా జీవించేస్తున్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలు మారిపోయాయా? లేక టిడిపి తన సిద్ధాంతాలు మార్చుకుందా? సిద్ధాంతాలే ప్రాణం అని నటించే నాయకులు అంత హఠాత్తుగా కొత్త పాత్రలో ఎలా లీనమయ్యారు. పార్టీ వారిని ఎలా స్వీకరించింది, ప్రజలు ఎలా అమోదించారు. సిద్ధాంతాల గురించి ప్రధాన రాజకీయ పక్షాలు ఎంత గొప్పగా చెప్పుకున్నా అధికారమే ఈ పార్టీల సిద్ధాంతం అనే విషయం ప్రజలకు బాగా తెలుసు. గంటా శ్రీనివాస్ లాంటి టిడిపి నాయకులు ఒక వెలుగు వెలుగుతున్నారు. వైఎస్‌ఆర్ హయాంలో మంత్రి, కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో మంత్రి, ఆ తరువాత ఇప్పుడు మళ్లీ టిడిపిలో మంత్రి.
ఎన్నికలకు ముందు ఆంధ్రలో నాయకులు భవిష్యత్తు రాజకీయ చిత్రపటాన్ని సరిగానే ఊహించారు. దుస్తులు మార్చినంత ఈజీగా పార్టీ మార్చడానికి మొహమాటం అడ్డు వచ్చి ఉండిపోయారు. ఏడాది గడిచిన తరువాత క్రమంగా వారు మారిన రాజకీయాలకు అలవాటు పడ్డారు. భవిష్యత్తును చూసుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడు అంటే ముఖ్యమంత్రి తరువాత అధికార కేంద్రం. పిసిసి అధ్యక్షులే పార్టీలు మారుతున్నారు అంటే మారిన రాజకీయాలను సరిగానే అర్ధం చేసుకున్నారు.
ఆంధ్రలో రాజకీయ ముఖ చిత్రం స్పష్టంగానే ఉంది. టిడిపి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్. భవిష్యత్తు రాజకీయాలు సైతం ఈ రెండు పార్టీల మధ్యనే సాగుతాయి. ప్రస్తుత ఆంధ్ర శాసన సభలో కాంగ్రెస్‌కు ఒక్కసీటు కూడా లేదు. వచ్చే ఎన్నికలు మహా అయితే బలమైన నాయకులు కొందర గెలుస్తారేమో కానీ అధికార పక్షం, ప్రతిపక్షం ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్‌కు అవకాశం మాత్రం లేదు. ఇక తెలంగాణ విషయానికి వస్తే ప్రస్తుత రాజకీయ పరిస్థితిని బట్టి చూస్తే మరో పదేళ్లవరకు టిఆర్‌ఎస్‌కు ఎదురులేదనే వాతావరణం నెలకొంది. అయితే ఆంధ్రలో టిడిపి వర్సెస్ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అనేది స్పష్టంగా కనిపిస్తుంటే, తెలంగాణలో టిఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గానే రాజకీయ ముఖ చిత్రం ఉంటుందా? ఎన్నికల నాటికి టిఆర్‌ఎస్ వ్యతిరేక శక్తులన్నీ కొత్త పార్టీ రూపంలో ముందుకు వస్తాయా? అనేది కాలం తేల్చాలి.
ఆంధ్రలో రెండు ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ ఉంటే, తెలంగాణలో మాత్రం అలాంటి పరిస్థితి లేదు. ఒక ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీ మధ్య పోటీ ఉంటోంది. ప్రచారంలో టిడిపి హడావుడి కనిపిస్తున్నా, అది రోజు రోజుకు క్షీణించే పార్టీనే తప్ప టిఆర్‌ఎస్‌కు పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. విభజన తరువాత ఆంధ్రలో బిజెపి విస్తరిస్తుందనే ఊహాగానాలు సాగాయి. బిజెపిపై అలా ఆశలు పెట్టుకున్న వారు ఏడాది పాలన తరువాత ఆశలను వదులుకున్నారు. అలాంటి వారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. బొత్స సత్యనారాయణ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరిపోయారు. వట్టి వసంతకుమార్‌తో పాటు పలువురు నాయకులు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. క్రియాశీలక రాజకీయాల్లో ఉండాలంటే అయితే టిడిపి లేదంటే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా ఆంధ్ర రాజకీయాలు ఉన్నాయి. విభజన తరువాత కొందరు కాంగ్రెస్ నాయకులు నిర్మొహమాటంగా టిడిపిలో చేరిపోగా, విభజన షాక్ నుంచి తేరుకోలేని వారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లోనే కొనసాగినా అలాంటి వారు ఇప్పుడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. నాయకులంతా ఆంధ్రలో ఆ రెండు పార్టీల మధ్యనే సర్దుకోక తప్పదు.
ఇక తెలంగాణ విషయానికి వస్తే టిడిపి ఎంత హడావుడి చేసినా తెలంగాణ ప్రజల దృష్టిలో అది ఆంధ్ర పార్టీనే. సెక్షన్8 అమలు చేయాలని ఆంధ్ర నాయకులతో సమానంగా తెలంగాణ టిడిపి నాయకులు డిమాండ్ చేయగలరు. రాష్టప్రతికి ఫిర్యాదు చేస్తారు. ఒక రాజకీయ పార్టీగా కాకుండా ఆంధ్ర యాజమాన్యంలోని ఒక కంపెనీగానే టిడిపిని నిర్వహిస్తారు. వ్యయాన్ని భరించే కంపెనీ యాజమాన్యం చెప్పినట్టుగానే సిబ్బంది వ్యవహరించాలి. అది అనివార్యం. టిటిడిపి నాయకులకు మరో గత్యంతరం లేదు. నిధుల కొరత లేదు. పార్టీ కోసం ఎంతైనా ఖర్చు చేయగలరు, కానీ పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి చేసే వ్యయంతో తెలంగాణలో పార్టీ పట్టుసాధించే అవకాశాలు లేవు. సొంతంగా వ్యయాన్ని భరించి, సొంతంగా పార్టీని నడిపించుకునే నాయకత్వం తెలుగుదేశం తెలంగాణ నాయకుల్లో లేదు. చంద్రబాబు వారికి ఆ అవకాశం ఇవ్వరు.
ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్. గ్రామ స్థాయిలో, నియోజక వర్గ స్థాయిలో కాంగ్రెస్‌కు బలమైన నాయకులున్నారు. పది జిల్లాల తెలంగాణలో కాంగ్రెస్‌కు ముఖ్యమంత్రి పీఠం చేపట్టే సామర్ధ్యం మాకుంది అని చెప్పుకొగల స్థాయి నాయకులు ఇరవై మందైనా ఉంటారు. అదే ఆ పార్టీ పాలిట శాపం. పెళ్లికెళ్లినా, చివరకు అయ్యప్ప దీక్షల్లోనైనా కాంగ్రెస్ నాయకులు కొట్టుకోకుండా ఉండలేరు. ఢిల్లీ నుంచి వచ్చిన పరిశీలకులు, పిసిసి అధ్యక్షుడు, సిఎల్‌పి నాయకుడు ఎవరున్నా గొడవలు లేని కాంగ్రెస్ సమావేశాన్ని ఊహించలేం. ఒకవైపు టిఆర్‌ఎస్ దూసుకెళుతూ, గ్రామ స్థాయిలో పార్టీ పటిష్టతకు ప్రయత్నిస్తుంటే, మరోవైపు కాంగ్రెస్ కీచులాటలతోనే కాలం గడుపుతోంది.
ఎన్నికల వ్యయాన్ని భరించడమే కాకుండా జనాకర్షణ గల నాయకుడిగా వైఎస్‌ఆర్‌కున్న గుర్తింపు వల్ల ఒక ప్రాంతీయ పార్టీ తరహాలో రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఆయన నాయకత్వం వహించగలిగారు. ఆ తరువాత కాంగ్రెస్‌కు బలమైన జనాకర్షణ గల నాయకుడే కరువయ్యారు. కెసిఆర్ విపరీతమైన తప్పులు చేస్తూ పోతే తప్ప కాంగ్రెస్‌కు భవిష్యత్తు ఉండదు. కెసిఆర్ కాంగ్రెస్‌కు అలాంటి చాన్స్ ఇవ్వరు. ఈ వాతావరణాన్ని చూసిన తరువాతనే సోనియాగాంధీకి సన్నిహితుడైన డి శ్రీనివాస్‌లాంటి వారు టిఆర్‌ఎస్ బాట పట్టారు. డి శ్రీనివాస్ వయసు 63 ఏళ్లు. ఇంకో పదేళ్ల వరకు టిఆర్‌ఎస్‌కు ఢోకా లేదు అనుకుంటే అప్పటికి ఆయన వయసు 73 అవుతుంది. ఆ వయసు వరకు ఆయనేం పోరాడతారు. పోరాడినా అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? వచ్చినా? ఆయనకు కాంగ్రెస్‌లో అవకాశాలు ఉంటాయా? అన్నీ సందేహాలే. ఇవన్నీ ఆలోచించే ఆయన ఎంతో ఆదరించిన కాంగ్రెస్‌కు భారమైన మనస్సుతో గుడ్‌బై చెప్పి టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కోణంలోనే పలువురు నాయకులు ఆలోచనలో పడ్డారు.
విభజనతో ఆంధ్రలో కాంగ్రెస్ ఖాళీ అయి, నాయకులు నిరుద్యోగులుగా మారినట్టే. తెలంగాణ ఉద్యమ కాలం నుంచే తెలంగాణలో టిడిపి నాయకులు పలువురు నిరుద్యోగులుగా మారారు. ఆ కాలంలో కెసిఆర్ పార్టీలో మా కన్నా జూనియర్. మేం పార్టీ మారి జూనియర్ నాయకత్వంలో పని చేయాలా? అనుకున్న చాలా మంది నాయకులు ఎటూ తేల్చుకోలేక రాజకీయ జీవితానే్న ప్రశ్నార్థకంగా మార్చుకున్నారు. దేవేందర్‌గౌడ్, నాగం జనార్దన్‌రెడ్డి లాంటి వారు ఇలాంటి సందేహాలతోనే స్పష్టమైన నిర్ణయాలు తీసుకోలేక రాజకీయాల్లో బాగా వెనకబడి పోయారు. కాంగ్రెస్ మరింతగా బలహీనపడినా, కెసిఆర్ పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడినా, రెడ్ల నాయకత్వంలో కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు జరిగే అవకాశం ఉంది. ఓటుకు నోటులో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడిన రేవంత్‌రెడ్డి తెలంగాణలో రెడ్డి కమ్మలు ఏకమవుతారని, తాను నాయకత్వం వహిస్తానని చెప్పుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రధానంగా కమ్మ, రెడ్ల మధ్య రాజకీయ పోరు సాగింది. ఈ పోటీ అమెరికా వరకు విస్తరించింది. కాంగ్రెస్ రెడ్లకు ప్రాతినిధ్యం వహిస్తే, టిడిపి కమ్మ వారికి ప్రాతినిధ్యం వహించింది. నాయకులు ఒప్పుకోరు కానీ ఇది వాస్తవం. ఆంధ్రలో రెడ్లకు ( వైఎస్‌ఆర్ కాంగ్రెస్) వ్యతిరేకంగా, కమ్మలకు ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు తెలంగాణకు వచ్చే సరికి రెడ్లు అధికారంలోకి రావడానికి ఎందుకు సహకరిస్తారు? బాబు సహకరించక పోతే వచ్చే ఎన్నికల నాటికి అన్ని పార్టీల్లోని రెడ్లు బయటకు వచ్చి ఒక ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉండి ఉండవచ్చు. ముఖ్యమంత్రి పదవి నా లక్ష్యం. నా లక్ష్యాన్ని చేరుకోవడానికి టిడిపి ఒక పని ముట్టు, నాకు నా లక్ష్యం ముఖ్యం. తప్ప పార్టీ కాదు అని రేవంత్‌రెడ్డి అసెంబ్లీ లాబీల్లో మీడియాతో అనేక సార్లు చెప్పారు. ఆంధ్రలో వచ్చే ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులు ఎవరు అనేది స్పష్టంగానే ఉన్నా, తెలంగాణలో మాత్రం కొత్త రాజకీయ పార్టీ అవతరిస్తుందా? లేక కాంగ్రెస్ పార్టీనే ప్రత్యామ్నాయంగా నిలుస్తుందా? అనేది వేచి చూడాలి. 
  • - బుద్దా మురళి

  • 09/07/2015
  • .

    5, జులై 2015, ఆదివారం

    నేరమేరా జీవితం!

    ‘‘బాస్ ఏం చేస్తున్నారు’’ సన్న గొంతుతో ఎంత మెల్లగా అడిగినా ఆ మాట అందరికీ వినిపించింది. చిన్న రాయి విసిరితే కొలనులోని నీళ్లలో అది కనిపించినట్టుగా నిశ్శబ్ధం ఆవహించిన ఆ గదిలో ఉన్న వాళ్లంతా అతని వైపు చూశారు. చీమే కాదు చివరకు దోమ రెక్కల చప్పుడు కూడా వినిపించేట్టుగా ఉందక్కడ.


    బాస్ ఏదో కీలక బాధ్యత ముగించుకుని వచ్చి ‘నేరమేరా జీవితం, నేరమేరా శాశ్వతం’ అంటూ పాడుకుంటూ చేతికంటిన రక్తాన్ని కడుక్కుంటున్నాడు. రక్తంలో నీళ్లు కలిశాయో, నీళ్లలో రక్తం కలిసిందో చెప్పడం కష్టంగానే ఉంది. అతని చేతికి అంతగా అంటింది రక్తం. విజయవంతంగా మర్డర్ పూర్తి చేసినప్పుడు బాస్‌కు కొద్దిసేపు ఎవరితోనూ మాట్లాడకుండా తనలో తానే పాటపాడుకోవడం అలవాటు.
    ఏంటి అని అక్కడున్న వ్యక్తిని కనులతోనే బాస్ ప్రశ్నిస్తే, అతను ఏదో చెప్పబోయాడు. ఇదేమన్నా బహిరంగ సభ అనుకున్నావా? గంటల తరబడి మాట్లాడేందుకు సైగలతోనే చెప్పాలని, సాధ్యం కానప్పుడు విషయం అర్ధం అయ్యేట్టు రెండు మూడు మాటల్లో చెబితే చాలు. మన వాళ్లు బ్రీఫ్‌డ్ మీ.. విషయం మొత్తం నాకు తెలుసు. ఇక నువ్వు వెళ్లవచ్చు అని ఆ వ్యక్తిని బాస్ పంపించి, ఏంటీ ఈ రోజు ముఖ్యమైన ప్రొగ్రాలు అని పిఎను అడిగాడు.
    ‘‘రాజకీయాల్లో విలువల గురించి అంతర్జాతీయ సదస్సులో మీరు కీలకోపన్యాసం చేయాలి. దీనికి చాలా మంది ప్రముఖులు వస్తున్నారు. మహాత్మాగాంధీ, వివేకానందుని కొటేషన్స్‌తో, మహాభారతం,రామాయణం , భగవద్గీతలోని శ్లోకాలను ఉపదహరిస్తూ మీ ఉపన్యాసం తయారు చేయించాను. ఒకసారి చూసి ఒకే చెబితే’’ అని పిఎ అడిగాడు.
    ‘‘్భగవద్గీత, రామాయణ, మహాభారత శ్లోకాలతో ఎవరయ్యా ఇది రాసింది ఓ ఓసారి పిలువు’’ అని ఆదేశించాడు.
    ‘‘ సార్ నేనే సార్ ఆ ఉపన్యాసం రాసింది’’ అని
    70 ఏళ్ల వృద్ధుడు వినయంగా చెప్పాడు.
    ‘‘సరే మీరిక వెళ్లవచ్చు’’ అని బాస్ అతన్ని పంపించి వేశాడు.
    ‘‘అతన్ని ఎందుకు పిలిచానో తెలుసా?’’ అని అక్కడున్న వారిని బాస్ అడిగాడు.


    ‘‘ఎందుకు తెలియదు సార్ అంత అద్భుతమైన శ్లోకాలతో ఉపన్యాసం తయారు చేసినందుకు సత్కరించాలనే పిలిచారు’’ అని అనుచరుడు వినయంగా చెప్పాడు.
    ‘‘మరదే ఓవర్ యాక్షన్ అంటే నేను మాట్లాడ మన్నాను కదా అని నోరు విప్పి మాట్లాడడమేనా? నేనూ మాట్లాడి నువ్వూ మాట్లాడితే ఇక మాటలకు విలువేముంది. నేను బాస్‌ను మీరు చెంచాలు నేను మాట్లాడితే మీరు వినాలి. వాడ్ని ఎందుకు పిలిచానో గ్రహించేంత తెలివి తేటలే మీకుంటే నా దగ్గరెందుకు పని చేస్తారు. నేనే మీ దగ్గర పని చేసేవాడ్ని.
    నీతి, విలువలు, భగవద్గీత, రామాయణం, మహాభారతం చదువుకుంటే ఎలా ఉంటారో మీకు చూపించేందుకు వాడ్ని పిలిపించాను. పాపం వాడు నీతులు నిజంగానే పాటించి 70 ఏళ్ల వయసులో కూడా మనలాంటి వాళ్లకు ఉపన్యాసాలు రాసిస్తే కానీ బతకలేని పరిస్థితిలో ఉన్నాడు. నేను చెప్పొచ్చేదేమిటంటే ఏదో నాలుగు ఇంగ్లీష్ కొటేషన్లు చెపితే సరిపోతుంది కానీ నిజంగానే నీతి వాఖ్యలు చెబితే ఆ ప్రభావం మనపై కూడా ఉండి నీతిగా ఉండాల్సి వస్తుంది. మన వృత్తికి అంత కన్నా ప్రమాదం లేదు. ఈ ఉపన్యాసాన్ని ఆ చెత్తబుట్టలో పారేసి మరోటి రాయించు. ఆ ముసలోడిలా నన్నుకూడా అడుక్కుతింటూ బతికేట్టు చేస్తారా? ఏంటి? నైతిక విలువల గురించి ఎక్కువగా ఉపన్యసించాలి. అంతే కానీ ఎక్కువగా ఆలోచించ వద్దు, అలా చేస్తే ఆ ప్రభావం మన జీవితంపై పడి, అనవసరంగా నీతికి బతకాల్సి వస్తుంది. నీతికి బతకడం అంటే అడుక్కు తినడమే. ఈ ఉపన్యాసం రాసినాయన్ని చూశారు కదా? నీతిగా బతికేందుకు, నీతిగా బతకాలని ఉపన్యాసాలు ఇవ్వడానికి తేడా తెలియనోళ్లు నా వద్ద ఇంత కాలం ఎలా పని చేస్తున్నారు.? ’’ అంటూ బాస్ అనుచరులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
    ‘‘అది కాదు సార్ మీ డైలాగులు చాలా కాలం నుంచి రొటీన్‌గా ఉన్నాయని, కాస్త స్పీచ్ చేంజ్ చేద్దామని ఈ ప్రయత్నం అంతే తప్ప మిమ్మల్ని మీ సహజ లక్షణం నుంచి బయటకు తీసుకు వచ్చే శక్తి ఎవరికీ లేదని మాకు తెలుసు సార్. మీరు కారణ జన్ములు మీకు మీరే సాటి ’’అంటూ ఆనుయాయులు బాస్‌ను ఓదార్చే ప్రయత్నం చేశారు.
    ఇంతలో ఫోన్ మ్రోగడంతో అంతా కంగారు పడ్డారు. ఒకరు ధైర్యం చేసి ఫోన్ ఎత్తి, సార్ దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడిన మన నేతకు కొన్ని గంటల్లో బెయిల్ లభించబోతోంది అని గట్టిగా అరిచాడు. బాస్ ముఖం విప్పారింది.


    తన గుట్టు మట్లు అన్ని అనుచరుడి గుప్పిట్లో ఉండడంతో బాస్ అనుచరుడికి ఘనంగా స్వాగతం పలికే ఏర్పాట్లు చేయమని అందరినీ పురమాయించాడు. నభూతో నభవిష్యత్ అన్నట్టుగా జైలు వద్ద స్వాగత ఏర్పాట్లు, ర్యాలీలకు ఏర్పాట్లు చేశారు. ఖర్చెంత అయిందని ఎవరి లెక్కలు వారు చెబుతున్నారు.
    రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడిన దొంగకు అంతటి ఘన స్వాగతం లభించడంతో నేర ప్రపంచం ఒక్కసారిగా ఆనందంలో మునిగిపోయింది. తప్పించుకు తిరుగుతున్న అంతర్జాతీయ నేరస్తులకు సైతం ఒక్కసారన్నా జైలుకు వెళ్లి అలా ఘనంగా బయటకు రావాలని కోరిక కలిగింది.
    ***
    ‘‘బాస్.... బాస్...’’
    ‘‘ఊరకే అలా పిలవకండయ్యా..నేను మీ బాస్‌నని ప్రత్యేకంగా చెప్పాలా? నాకా విషయం తెలియదా? ’’
    ‘‘అలాగే బాస్ సార్ ... జైలు నుంచి బయటకు వచ్చిన మన నేతకు మనం ఘనంగా స్వాగతం పలకడం దేశ దేశాల్లో మారు మ్రోగిపోతోంది. దావూద్ ఇబ్రహీం ఆచూకీని కేంద్ర ప్రభుత్వమే కనిపెట్టలేకపోయింది. అలాంటి దావూద్ మన కోసం పడి చస్తున్నాడు. మనం ఉపయోగించిన న్యాయవాది సేవల కావాలని, ఎంతైనా భరిస్తామని దావూద్ అడుగుతున్నాడు. ఒప్పుకోండి బాస్ ఒప్పుకోండి దావూద్ కేసులో మనం విజయం సాధిస్తే,ఈ రంగంలో మనమే విశ్వవిజేతలం. ప్రపంచంలోని కీలక కేసులన్నీ మన చేతికి వస్తే, మనకే కాదు దేశానికీ బోలెడు విదేశీ మారక ద్రవ్యం వస్తుంది’’ అని బాస్‌ను కోరారు.