25, అక్టోబర్ 2015, ఆదివారం

బాబు+ తిరుపతి ప్రసాదం =మోదీ + యమునా తీర్థం

‘‘సినిమా కళనా వ్యాపారమా? కళాత్మక వ్యాపారమా? ’’
‘‘ నీ ప్రశ్నలో సమాధానం ఉందని నీ భ్రమ ’’
‘‘ అంటే సినిమా కళాత్మక వ్యాపారం కాదా? మరేంటి? ’’
‘‘రాజకీయం అంటే కళనా? సైన్సా? నువ్వేమనుకుంటున్నావో ముందు చెప్పు’’


‘‘రాజకీయం అంటే రాజకీయమే.. అందులో కళ, సైన్స్ ఏముంది? ’’
‘‘సినిమా అంటే సినిమానే అందులో కళేముంది, కళాత్మక వ్యాపారం ఏముంది అని నేను సమాధానం చెబితే సరిపోతుందా? ’’
‘‘సినిమా వేరు, రాజకీయం వేరు. ఇంతకూ నువ్వేమనుకుంటున్నావో చెప్పు’’
‘‘ సినిమా, రాజకీయం, మతం, అన్నీ లెక్కలే... ప్రతి దానిలో లెక్కలుంటాయి. అలా అని వెంకట్రామా అండ్ కో ఎక్కాల పుస్తకం చూస్తే ఈ లెక్కలు కనిపించవు. కానీ ప్రతి దానిలో కనిపించని లెక్కలుంటాయి.’’
‘‘నేను నమ్మను. నాకు రాజకీయాలన్నా చిరాకే లెక్కలన్నీ చిరాకే నీ సమాధానం నాకు అస్సలు నచ్చలేదు. ’’


‘‘నువ్వీ  మాట అనడం వెనక కూడా ఒక లెక్కంది. నాకు ఐటి నాలెడ్జ్ లేదనుకో ఐటి అంటే పరమ బోర్ నాకు చిరాకు అంటాను. నాలెడ్జ్ లేదు అని చెప్పడానికి అహం అడ్డొచ్చి చిరాకు అంటాం. అలానే రాజకీయాలపై అవగాహన లేక రాజకీయాలంటే చిరాకు అంటాం ఇదో లెక్క. ’’
‘‘నువ్వు నన్ను కన్‌ఫ్యూజ్ చేయాలని ప్రయత్నిస్తున్నావు. రాజకీయం లెక్కలు ఎలా అవుతుంది. ’’
‘‘బాబు గారు ఒకప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పారు. మోదీ మా రాష్ట్రానికి వస్తే అరెస్టు చేయిస్తాను అన్నారు. ఆదే మోదీతో ఇప్పుడు బాబుగారు చేతు లు జోడించి అడుగుతున్నాను అని మాట్లాడుతున్నారు. దీనే్నమంటావు’’
‘‘లెక్కలకు దీనికి సంబంధం ఏముంది? ’’


‘‘అక్కడికే వస్తున్నాను. కేంద్రంలో ఏ పార్టీకి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరం అయినన్ని సీట్లు రానప్పుడు కలగూర గంపలా ఎన్‌డిఏ, యుపిఏ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అప్పుడు బాబుగారికి వచ్చిన సీట్లు కీలకమయ్యాయి. దాంతో కేంద్రంలో చక్రం తిప్పారు. ఇప్పుడు మోదీ ప్రభుత్వానికి సొంతంగానే సంపూర్ణ మెజారిటీ వచ్చింది. ఏ పార్టీ మద్దతు అవసరం లేదు. లెక్కల్లో వచ్చిన తేడా వల్ల పరిస్థితులు మారిపోయాయి. రాజకీయాలంటే లెక్కలు కాకుంటే ఇంకేంటి? ఇంకో ఉదాహరణ చెప్పాలా? నాదెండ్ల ఎన్టీఆర్‌పై తిరుగుబాటు చేస్తే వెన్నుపోటు అన్నారు, అదే బాబు చేస్తే ప్రజాస్వామ్య పరిరక్షణ అన్నారు తేడా ఏంటో తెలుసా? లెక్కలే. నాదెండ్లకు ఎమ్మెల్యేల లెక్క సరిపోలేదు. బాబు హయాంలో లెక్క సరిపోయింది. లెక్కల్లో వచ్చిన తేడాతో ఒక సంఘటనకు రెండు వేరు వేరు పేర్లు . రాజకీయాలంటే లెక్కలే’’
‘‘మరి తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ కదా? తెలంగాణ ఇచ్చిందని కాంగ్రెస్‌ను ఆంధ్రలో ఓడించారు. తెలంగాణలో గెలిపించలేదు.. ఇక్కడ ఏ లెక్కలు పని చేశాయి’’
‘‘ఇక్కడా లెక్కలే పని చేశాయి... తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీనే అని ఉద్యమ నాయకుడు కెసిఆరే చెప్పారు. అందుకే కదా ఇంటిల్లిపాది వెళ్లి సోనియాగాంధీకి కృతజ్ఞతలు చెప్పారు. మేం అధికారంలోకి వస్తే వంద రోజుల్లో తెలంగాణ ఇస్తామని బిజెపి చెప్పింది. ప్రధానమంత్రిగా మోదీ స్పీడ్ చూస్తుంటే వంద రోజులు కాదు కదా వందేళ్లయినా వాళ్లు తెలంగాణ ఇవ్వకపోయే వారు. ఏడాదిన్నరలో ఉద్యోగులనే కేటాయించని వాళ్లు వంద రోజుల్లో తెలంగాణ ఇచ్చే వాళ్లా? పార్టీల లెక్కలు పార్టీల కుంటాయి. ప్రజల లెక్కలు ప్రజల కుంటాయి. తెలంగాణ ఇచ్చింది సోనియానే అని కెసిఆర్ చెప్పినా జనం తమ లెక్కలు తాము వేసుకుని టిఆర్‌ఎస్‌కే అధికారం అప్పగించారు. పెళ్లికి వెళ్లినా, అయ్యప్ప దీక్షలోనైనా, చివరకు గాంధీ భవన్‌లో గాంధీ జయంతిలోనూ కాంగ్రెస్ నేతలు ఘర్షణ పడకుండా ఉండలేరు. వారి చేతిలో అప్పుడే పుట్టిన పసికందు తెలంగాణను పెడితే ఏమవుతుందో జనం బాగానే లెక్కలు వేసుకుని టిఆర్‌ఎస్‌కు పట్టం కట్టారు. కాంగ్రెస్ లెక్క తప్పింది కానీ జనం లెక్క తప్పలేదు. ప్రజాస్వామ్యం అంటే జనం లెక్కలే కదా? ’’


‘‘మరి తెలంగాణ ఉద్యమ కారుడిగా కెసిఆర్ తెలంగాణలో గెలిచినప్పుడు విభజనను వ్యతిరేకిస్తూ రాజీనామాలు చేసిన జగన్ పార్టీ ఆంధ్రలో గెలవాలి కానీ, విభజకు ఆమోదం తెలుపుతూ రెండుసార్లు లేఖలు ఇచ్చిన బాబు పార్టీ గెలవడం ఇదేం లెక్క’’
‘‘ఇదీ కూడా లెక్క ప్రకారమే జరిగింది. పార్టీల లెక్కలు వేరు, జనం లెక్కలు వేరని ముందే చెప్పాను కదా? ఆంధ్రలో మెజారిటీ ప్రజలు విభజనను వ్యతిరేకిస్తున్నారు కాబట్టి రాజీనామాతో మెజారిటీ మనకే అని జగన్ లెక్కలేసుకున్నారు. విభజనతో సమైక్యాంధ్ర ఘట్టం ముగిసిపోయింది. పాలన అనుభవం ఎవరికి ఉంది? అని జనం లెక్కలేసుకున్నారు. అందుకే కిరణ్ కుమార్‌రెడ్డి సమైక్యాంధ్ర పార్టీకి పార్టీ గుర్తు చెప్పులే మిగిలాయి’’
‘‘సరే ఇప్పుడు అమరావతి శంకుస్థాపనలోనూ లెక్కలే ఉన్నాయంటావా? ’’
‘‘లెక్కలంటే రాజధాని కోసం సేకరించిన 33వేల ఎకరాల భూమి మాత్రమే కాదు. అన్ని వేల ఎకరాల సేకరణ వెనుక ఎవరి లెక్కలు వారికుంటాయి అది వేరు. అక్కడున్నవి అన్నీ లెక్కలే. అక్కడ రాజధానిని నిర్ణయించడం వెనుక లెక్కలుంటాయి. కెసిఆర్ ఇంటికి వెళ్లి బాబు పిలవడం, కెసిఆర్ వెళ్లి ప్రపంచంలోనే గొప్ప రాజధాని నిర్మాణంలో మా వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చి రావడం వెనుక ఎవరి లెక్కలు వారి కుంటాయి. పిలిచినాయన లెక్కలు పిలిచినాయనకు ఉంటాయి. వెళ్లినాయన లెక్కలు వెళ్లినాయనకుంటాయి. మోదీ లెక్కలు మోదీకుంటాయి. పవిత్రమైన తిరుపతి ప్రసాదం ఇచ్చి మోదీని బాబు ప్రసన్నం చేసుకుందామని లెక్కలేసుకుంటే యమునా నది తీర్థం ఇచ్చి మోదీ లెక్క సరి చేసుకున్నారు. ’’


‘‘వ్యాపారంలో ఏటేటా బ్యాలెన్స్ షీట్ చూసుకుంటారు. ప్రజాస్వామ్యం అంటే ఐదేళ్లకోసారి ప్రజలు రాజకీయ నాయకులు బ్యాలెన్స్ షీట్ చూసి లెక్కలు వేయడమే నన్న మాట. కులాలు, మతాలు, ఓట్లు లెక్కలే ప్రజాస్వామ్యం అని తెలిసొచ్చింది. ’’
‘‘ప్రజలకూ వాళ్ళ లెక్కలు వాళ్ళకుంటాయి ’’  

 - బుద్దా మురళి (జనాంతికం 24.10. 2015)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం