14, డిసెంబర్ 2014, ఆదివారం

శ్మశానాన పడక! పొరుగింటి నిద్ర!

కర్నాటక ఎక్సైజ్ మంత్రి సతీష్ జార్కి హొళి ఒక మంచి ముహూర్తం చూసుకుని బెలగాళి శ్మశాన వాటికలో పదివేల మంది అభిమానులతో కలిసి శ్మశాన నిద్ర చేశారు. కాటికి పోయిన వాడు తిరిగి రాడు అంటారు కానీ నేను వచ్చాను చూడండి అని కాలరెత్తి చూపిస్తున్నాడాయన. ఆ పదివేల మంది ఆక్కడే భోజనం చేసి శ్మశాన వాటికలోనే పడుకున్నారు. ఎందుకయ్యా అలా అంటే నా నిద్ర కోట్లాది మంది ప్రజలకు మేలుకొలుపు, చైతన్యం అంటూ కన్నడంలో ఇలాంటి బోలెడు మాటలు చెప్పుకొచ్చారు. ప్రజల మూఢనమ్మకాల విషయం ఎలా ఉన్నా ఆయనే పెద్ద మూఢనమ్మకంతో ఉన్నాడేమో ననిపిస్తోంది.


శ్మశానంలో ఒక్క రాత్రి నిద్ర పోయి అంతలా ధైర్యవంతునిగా మాట్లాడితే తెలుగు నాట మహనీయులు ఏం మాట్లాడాలి? ఆ మంత్రిగారు అక్కడే తిని, ఆరడుగుల నేలపై మహా అయితే ఐదారు గంటల పాటు పడుకుని ఉంటారు. అదే తెలుగునాట లెక్కలేనంత మంది నాయకులు శ్మశానాలకు చెందిన ఎకరాలు ఎకరాలను స్వాహా చేసి భవంతులను నిర్మించేశారు. ఒక్క రాత్రి తినడం కాదు అక్కడ ఏకంగా స్టార్ హోటల్స్ కట్టించిన వారున్నారు. కర్నాటక మంత్రిని చూశాక ప్రజలను చైతన్య పరచడానికే ఇలా శ్మశానాలను ఆక్రమించేసుకుని భవనాలు కట్టించుకుని నిద్ర పోతున్నామని చెబుతారేమో మన వాళ్లు!


ఒక్క రాత్రి శ్మశానంలో నిద్రతో కర్నాటక మంత్రికి ఆ రాష్ట్ర రాజకీయాల్లో మంచి క్రేజ్ లభించింది. అయితే రాజకీయాల్లో ఈ రాత్రులు కొత్తేమీ కాదు. రాత్రులకు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. ఇందులో ద్వంద్వార్థం ఏమీ లేదు. అన్ని వ్యాపారాల్లోలానే రాజకీయాల్లో కూడా పోటీ పెరిగిపోయింది. రిస్క్, పోటీ ఎక్కడ ఎక్కువుంటే అక్కడ ఆదాయం కూడా ఎక్కువగానే ఉంటుందనేది నిజమేననుకోండి. పార్టీలు పెరిగాయి, నాయకులు పెరిగారు. రోజుకు 18 గంటలు ప్రజల కోసం కష్టపడుతున్నామన్నా జనం ఆదరించడం లేదు, పక్కన పెట్టేస్తున్నారు. దాంతో ఇప్పుడు రాత్రి కూడా రాజకీయం కోసమే నిద్ర పోవలసిన పరిస్థితులు వచ్చాయి. తెలుగునాట పల్లె నిద్ర, పట్నం నిద్ర గూడెం నిద్ర అంటూ రకరకాల నిద్రలను ఎన్నికలకు ముందే ఉద్యమ కాలంలో టిఆర్‌ఎస్ నిర్వహించేసింది. అధికారంలోకి వచ్చాక నిద్ర కార్యక్రమాలను పక్కన పెట్టి నిద్ర పోతే అధికారం మరోసారి అంత ఈజీగా చేతికి దక్కదు కదా? ఇప్పుడు ఆస్పత్రి నిద్ర అంటూ కొత్త కార్యక్రమం చేపట్టారు.


ఈ ప్రోగ్రామ్ ఎలా పుట్టిందో తెలియదు కానీ ప్రచారంలో ఉన్న కథ మాత్రం ఆసక్తికరంగానే ఉంది. అధికారంలోకి వచ్చాక మరోసారి అధికారంలోకి రావడానికి నాయకులు నిద్ర పోకుండా కొత్త కార్యక్రమం కోసం నిద్ర లేని రాత్రులు గడుపుతూ తెగ ఆలోచించారు. ఐడియా రాలేదు కానీ ఆనారోగ్యం వచ్చి, ఆస్పత్రి పాలయ్యారు. ఆస్పత్రిలోనూ నిద్ర పోకుండా ఆలోచిస్తూ యూరేకా అని అరిచి అందరి నిద్రను చెడగొట్టారట నాయకులు. ఎందుకలా అరిచాడు అంటే ఆస్పత్రి నిద్ర కార్యక్రమం ఆలోచన రాగానే ఆనందాన్ని పట్టలేక అరిచారట! అక్కడి నుంచే ఆస్పత్రి నిద్ర అని కొత్త కార్యక్రమం ప్రారంభించారు. స్వయంగా వైద్యుడైన ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖను కూడా చూస్తున్న రాజయ్య ఎక్కడ ఆస్పత్రి కనిపిస్తే అక్కడికి బెడ్ తీసుకెళుతూ నిద్ర పోతున్నారు. ఆయన నిద్ర పోని జిల్లా ఆస్పత్రి లేదు. మంత్రిగారూ మీ ఆరోగ్యం జాగ్రత్త మీరిలా ఆస్పత్రి నిద్ర అంటూ జిల్లాలు పట్టుకొని తిరిగితే ఆస్పత్రి పాలవుతారు అని అభిమానులు గోల పెడుతున్నారు. ఇంటి బయట నిద్రలు జీవితంలో భాగం.
పెళ్లయ్యాక మూడు రాత్రులు కొత్త జంటకు జీవితాంతం మిగిలిపోయే మధుర స్మృతి.


కాలం గడిచిన తరువాత కొంత మంది గుట్టు చప్పుడు కాకుండా పొరుగింటి నిద్రపై దృష్టిపెట్టి జీవితాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు. ఇటీవల జరుగుతున్న నేరాలకు ఇలాంటి నిద్రలే కారణమని పోలీసు వారి లెక్కలు చెబుతున్నాయి. పక్కింటి నిద్ర మీద దేవుళ్లకు సైతం ఆసక్తే. ఏదో పోటీల్లో విజయం సాధించి గౌతముడు అహల్యను చేపడతాడు. పోటీలో ఓడిపోయినంత మాత్రాన మనసు ఊరుకుంటుందా? కోడి రూపం దాల్చి కొక్కరోకో అని అరిస్తే తెల్లారిందని గౌతముడు బయటకు వెళ్లిపోతే ఆ వేషంలో వచ్చిన ఇంద్రుడు పక్కింటి నిద్ర విజయవంతం అయిందనుకుంటుంటే గౌతముడు మధ్యలోనే ఇంటికి తిరిగి వచ్చి రెడ్ హ్యాండెడ్‌గా ఇంద్రున్ని పట్టుకుని చివరకు ఇంట్లో కూడా నిద్ర పోకుండా నీ శరీరం అంతా కళ్లయి పోవాలని శపిస్తాడు. రెండు కళ్లవాళ్లే నిద్ర పట్టక ఆలోచనలతో సతమతమవుతుంటే పాపం ఇంద్రుడి ఒళ్లంతా కళ్లు కావడం వల్ల ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపాడో.
ఇక మన నాయకుల వద్దకు వస్తే దేవెగౌడ నిద్రకు బ్రాండ్ అంబాసిడర్ లాంటి వారు. ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపితే కానీ రాజకీయాల్లో అవకాశం రాదు. అలాంటిది దేవగౌడను ఎకాఎకిన ప్రధానమంత్రి పదవి వరించింది. బహుశా రాజకీయాల్లో అవకాశాల కోసం నిద్రలేని రాత్రులు గడిపి బాగా అలసిపోయాక ఆ పదవి వచ్చినట్టుంది. దాంతో ప్రధానమంత్రి పదవి చేపట్టగానే కుర్చీనే బెడ్‌గా మార్చుకుని నిద్ర పోవడం అలవాటు చేసుకున్నారు. నిద్రకు దూరమై రోజుకు 18 గంటల పాటు కష్టపడుతున్నాను అని చెప్పుకునే చంద్రబాబు లాంటి వారికి నిద్ర ప్రధానమంత్రిని ఎంపిక చేయడం రాజకీయాల్లో ఓ వింత. నిద్ర పోతే అందరూ సమానమే, మేల్కొంటేనే ముఖ్యమంత్రి, సామాన్యుడు అనే తేడా ఉంటుందనే విషయం బాగా తెలిసిన బాబు ఎక్కువ సమయం మేల్కొని ముఖ్యమంత్రిగా మురిసిపోయేవారు. ఈ సీక్రెట్ దేవెగౌడకు చెప్పి ఉంటే పాపం ఆయన నిద్ర పోయేవారు కాదేమో! నిద్రలోనే ఆయన పదవీ కాలం కాస్తా ముగిసిపోయింది. పదవి పోయాక ఆయన మళ్లీ పదవి కోసం కలలు కన్నా ప్రయోజనం లేకుండాపోయింది.


వారం రోజుల పాటు ఇల్లూ వాకిలి వదిలి ఊరి బయట నిద్ర పోవడం కొన్ని గ్రామాల్లో ఆచారం. అలా చేస్తే ఊరికి పట్టిన శని విరగడ అయి అదృష్టం వరిస్తుందనేది వారి నమ్మకం. వారి నమ్మకం నిజమవుతుందో లేదో కానీ ఈ కొత్త కొత్త రాత్రులు మాత్రం రాజకీయ నాయకులకు బాగా కలిసివస్తున్నాయి.

1 కామెంట్‌:

మీ అభిప్రాయానికి స్వాగతం