11, నవంబర్ 2014, మంగళవారం

నాయకుల చివరి కోరిక!

చివరి కోరిక తీరకుండా పోతే ఆత్మలుగా మారి వెంటాడతారు అనేదో నమ్మకం. అందుకే ఎంతో ఘోరమైన నేరం చేసిన వాడికి ఉరిశిక్ష అమలు చేసేప్పుడు కూడా చివరి కోరిక అడుగుతారు. ఉరి నుంచి తప్పించుకోవాలనేది వాని చివరి కోరిక అయినా అది తీర్చరు కాబట్టి ఆ మాట చెప్పరు.


వెకటికో గజదొంగ రాజుగారి సైనికులకు చిక్కాడు. ఉరిశిక్ష అమలు చేసే సమయంలో చివరి కోరిక ఏమిటి?అని అడిగారు. అతనికి ఇంకా చాలా కాలం బతకాలని ఉంది, ఆ కోరిక తీర్చరు కదా! ఏమో ప్రయత్నిస్తే ఫలించవచ్చు అని మనసులోనే అనుకుని ఏమీ చెప్పకుండా నవ్వాడు. దొంగ తప్పించుకొని పోయినా రాజు సహిస్తాడే కానీ తన ముందు నవ్వడం అస్సలు సహించడు. రాజైనా, బాసైనా బానిసల నవ్వును అస్సలు సహించలేరు. ఎలాగూ ఉరిశిక్ష అనుభవించబోతున్న వాడికి నవ్వినందుకు అంతకన్నా మించి ఇంకేం శిక్ష విధిస్తారు. చాన్స్ లేదు కాబట్టి రాజే ఒక అడుగు కిందికి దిగి, కారణం అడుగుతాడు. గుర్రాన్ని ఎగిరించే విద్య తెలిసిన నా లాంటి వాడిని ఉరితీస్తున్న మూర్ఖులను చూసి నవ్వు ఆపుకోలేకపోయాను అని మళ్లీ నవ్వుతాడు. నీకా విద్య తెలిస్తే ఆరునెలల గడువు ఇస్తున్నాను, గుర్రాలను, వాటిని ఎగిరించేందుకు కావలసిన సౌకర్యాలను నీకు అందుబాటులో ఉంచుతాను, ఆరునెలల్లో గుర్రాలు ఎగరకపోతే నీ ప్రాణాలు ఎగిరిపోతాయంటాడు రాజు. 

ఆరునెలల తరువాత ఏమవుతుంది అని తోటి ఖైదీ ఆసక్తిగా అడిగితే, ఏమో ఎవడు చెప్పొచ్చాడు... ఏమైనా కావచ్చు, నాకు శిక్ష విధించిన రాజు యుద్ధంలో ఓడిపోవచ్చు, ఈ రాజ్యాన్ని ఎవరైనా ఆక్రమించుకోవచ్చు. రాణిగారే విషం పెట్టి రాజును చంపొచ్చు ... ఇవేవీ జరగకపోతే ఆరునెలల్లో ఏమో గుర్రం ఎగరావచ్చు.. కానీ ఆరునెలలైతే రాజభోగం అనుభవించవచ్చు కదా? ఇదే నా చివరి కోరిక అని మనసులోని మాట చెబుతాడు గజదొంగ.
గజదొంగకే ఇన్ని తెలివి తేటలు ఉండి ఆరునెలల్లో ఏమైనా జరగవచ్చు అనుకుంటే ఇంత కన్నా ఎన్నో తెలివి తేటలు ఉన్న రాజకీయ నాయకులు ఐదేళ్లలో ఏమైనా జరగవచ్చు అనుకోకుండా ఉంటారా? ఏమో గుర్రం ఎగరావచ్చు అని నాయకులు అనుకుంటే వింతేముంది. 


విదేశాల్లోని నల్లధనం తెచ్చేస్తామని హామీ ఇచ్చేస్తే, జనం నమ్మి అధికారం అప్పగించేస్తారు. మరి తెస్తారా? అంటే ఐదేళ్లయితే అధికారం ఉంటుంది కదా? ఐదేళ్లలో ఏమైనా జరగవచ్చు, ప్రజలు ఈ విషయం మరిచిపోవచ్చు, ఏమో గుర్రం ఎగిరినట్టు, గోడకు కొట్టిన బంతి తిరిగి వచ్చినట్టు నల్లధనం రావచ్చూ!


రాజకీయ నాయకుల మనసులో చివరి కోరిక ఏముంటుందో కానీ పైకి మాత్రం ఓట్లు రాల్చే కోరికలే చెబుతారు. పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా చివరి కోరిక అంటాడో నాయకుడు. ప్రపంచంలో పేదరికం లేని దేశమే లేదు. ఒకవేళ భవిష్యత్తులో చంద్ర గ్రహమో, ఇంద్ర గ్రహమో ఏదో ఒక గ్రహం మీద మనుషుల ఉనికి తేలినా? లేక మనుషులే అక్కడికి పోయి నివసించడం మొదలు పెట్టినా వారితో పాటే పెదరికం అక్కడికి వెళ్లి తీరుతుంది. జీవ సంచారం ఉన్న ప్రతి చోట పేదరికం ఉంటుంది. జీవితాంతం అధికారంలో ఉండాలని, బతికి ఉన్నంత వరకు నన్ను గెలిపించండి అని ఇదే నా చివరి కోరిక అని పైకి చెబితే బాగోదు కానీ పేదరికం లేని సమాజ నిర్మాణమే నా చివరి కోరిక అంటే ఓట్లు రాలకుండా ఉంటాయా?
ముందుంది మంచి కాలం అని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్‌రెడ్డి చెబితే పాపం ఆయన్ని ఎవరూ సరిగా అర్ధం చేసుకోలేదు. లాస్ట్‌బాల్‌తో తెలంగాణను అడ్డుకుంటానన్నారు కాబట్టి ముందున్నది సమైక్యాంధ్ర అనే ఉద్దేశంతో ఆయనా మాట అన్నారేమో అనుకొని తెలంగాణ వాళ్లు వ్యతిరేకించారు. చివరకు సొంత నియోజక వర్గం వాళ్లు కూడా ఆయన్ని పట్టించుకోలేదు. 


బహుశా ముందుంది మంచి కాలం అని ఆయన మాటల ఉద్దేశం తెలంగాణ వచ్చే రోజులు ముందున్నాయి అని చెప్పదలుచుకున్నారేమో? అని తెలంగాణ వాళ్లు ఇప్పుడనుకుంటున్నారేమో! అయ్యో ఆయన కాంగ్రెస్ వాళ్లను ఉద్దేశించి ఆ మాట అన్నారేమో అని అప్పుడనుకున్నాం, టిడిపికి మంచి కాలం ముందుందనే ఉద్దేశంతో ఆ నినాదం ఇచ్చినట్టు ఉందని ఆంధ్ర టిడిపి నాయకులు ఇప్పటికి గ్రహించి ఉంటారు. చివరకు కాంగ్రెస్ వాళ్లు కూడా ఆయన మాటలను సరిగా అర్ధం చేసుకోలేదు. తమకు మంచి కాలం ముందుందని ఆయన చెబుతున్నారేమో అనుకున్నారు కానీ తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు ఆంధ్రలో టిడిపికి ముందుంది మంచి కాలం అని చెప్పడమే ఆయన ఉద్దేశం అని ఇప్పుడనుకుంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కిరణ్ కుమార్‌రెడ్డి అంత నిస్వార్థ నాయకుడు మరొకరు కనిపించరు. తనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన పార్టీని సర్వనాశనం చేసి తన గురించి కాక తమ వ్యతిరేక పార్టీల బాగు కోసం పని చేశారంటే ఆయనలో ఎంత నిస్వార్థపరుడైన నాయకుడుండాలి. ఇప్పుడు బిజెపిలో చేరేందుకు ఆయన ఉత్సాహం చూపిస్తున్నా, పొరుగు వారిని ప్రేమించమనే ఆయన సుగుణాన్ని చూసి వారూ భయపడుతున్నారేమో! ఏ విధంగానైతేనేం ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ కొత్త రికార్డు సృష్టించింది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కానీ రికార్డును ఆయన సృష్టించారు. బహుశా ఇదే ఆయన చివరి కోరిక కావచ్చు. ప్రస్తుత రాజకీయాల్లో ఆయన కోరికలు తీరే అవకాశాలు లేవు కాబట్టి ఇదే చివరి కోరిక అనుకోవాలి.
తన అవసరాలను మించి తన జీతం ఉండాలనేది సామాన్యుడి చిరకాల కోరిక, చివరి కోరిక. కానీ ఆ కోరిక ఎప్పటికీ తీరదు.


మన హీరోయిన్లు నిండుగా చీర కట్టుకుని నటిస్తే చూడాలనేది నా చివరి కోరిక అని ఓ సినిమా అభిమాని తీరని కోరికను బయటపెట్టాడు. అదేదో సినిమాలో జ్యోతిలక్ష్మి చీర కట్టింది చీరకే సిగ్గేసింది అని పాడినట్టు ఈ కోరిక గురించి తెలిస్తే హీరోయిన్లు సిగ్గుపడి పోరూ! మారుతున్న కాలంలో హీరోయిన్లు బట్టలను పూర్తిగా త్యజించే రోజులు వస్తాయేమో కానీ నిండుగా చీరకట్టుకుని నటించే రోజులు వస్తాయా? ఒకవైపు నడిరోడ్డు మీద ముద్దులు పెట్టుకోవడం మా జన్మహక్కు అని కొందరు ఉద్యమిస్తుంటే.. హీరోయిన్లు నిండుగా కనిపించాలని కోరుకోవడం ఎప్పటికీ తీరని కోరికే కాదు అత్యాశ కూడా.

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం