6, అక్టోబర్ 2014, సోమవారం

భేతాళుడు చెప్పిన రుణ మాఫీ కథ

‘‘రాజా నీకు శ్రమ తెలియకుండా ఒక కథ చెబుతాను ’’అని శవంలోని భేతాళుడు అనగానే విక్రమార్కుడు నవ్వాడు. ‘‘రాజా ఈ కాలంలో కూడా కథ లేమిటనే కదా నీ నవ్వుకు అర్ధం. కథలను అంత తేలిగ్గా తీసిపారేయకు! అందమైన అమ్మాయి అబ్బాయికి పడిపోయేది కథలు వినే! నాయకుల నిజ స్వరూపం తెలిసినా ఓటర్లు పడిపోయేది ఎన్నికల సమయంలో వాళ్లు చెప్పే కథలు వినే! హీరో అయినా హీరోయిన్ అయినా ముందు పడిపోయేది కథ విన్నాకే! అందుకే కాలం ఏదైనా కథ పవర్ తగ్గలేదు. కథ చెబుతా విను అంటూ భేతాళుడు చెప్పడం ప్రారంభించాడు.
***
అనగనగా రెండు రాజ్యాలు.
ఏ కథ అయినా అనగనగా ఒక ఊరు అని లేదా అనగనగా ఒక రాజ్యం అని ప్రారంభం అవుతుంది. కానీ అనగనగా రెండు రాజ్యాలు అని చెప్పాల్సి రావడానికి కారణం ఒకప్పుడు ఇదీ ఒక రాజ్యమే. కాలమాన పరిస్థితుల్లో వచ్చిన మార్పుల వల్ల రెండు రాజ్యాలు అయ్యాయి. చంద్రవర్మ, విష్ణువర్మ ఈ రెండు రాజ్యాలను పాలిస్తున్నారు. ఇద్దరు రాజులు ఒకే పాఠశాలలో చదువుకొని వచ్చారు. ఈ ఇద్దరే కాదు పాలించే రాజులందరిదీ ఒకే సిలబస్, ఒకే స్కూల్. అందువల్ల అంతకు ముందే వీరిద్దరి మధ్య స్నేహం, వృత్తిపరమైన ద్వేషం, వైరం అన్నీ ఉన్నాయి. రాజ్యాధికారం చేపట్టాక ఇద్దరి మధ్య పోటీ ఏర్పడింది.


మాకు పట్ట్భాషేకం చేస్తే రైతుల అప్పులను రాజ ధనాగారం నుంచి చెల్లిస్తామని ఇద్దరూ హామీ ఇచ్చారు. రంగరంగ వైభవంగా పట్ట్భాషేకం జరిగింది. దేశ దేశాల ప్రధానులు, దేశంలోని ప్రజలు పట్ట్భాషేకాన్ని వేనోళ్లుగా పొగిడారు. పట్ట్భాషేక వేడుకలు ముగిశాక ధనాగారం వైపు ఆశగా అడుగులు వేశారు. తాళం తీసి చూస్తే పట్ట్భాషేకానికి ఎంత ఖర్చు చేశారో అంత మొత్తం సొమ్ము కూడా ధనాగారంలో లేదు. రైతుల అప్పులు అన్నీ ఇప్పుడే తీర్చలేం అని విష్ణువర్మ చెప్పగానే రైతుల్లో హాహాకారాలు బయలు దేరాయి. రాజుగారి సొంత ఊరిలోనే రైతులు రోడ్డున పడ్డారు. గొట్టాలు రోడ్డుపైకి వచ్చి విప్లవ శంఖాలు పూరించాయి. తడబడ్డ రాజు ఆలోచనలో ఉన్నామని ప్రకటించారు. పొరుగున ఉన్న చంద్రవర్మ సైతం దీన్ని తీవ్రంగా ఖండించారు. విష్ణువర్మ తన హామీని సంపూర్ణంగా నెరవేర్చకపోతే పొరుగుదేశం రైతుల కోసం మేము సైతం ఉద్యమిస్తామని చంద్రవర్మ ప్రకటించారు. దీం తో విష్ణువర్మ తన హామీ నెరవేరుస్తాడని రైతులకు పూర్తి నమ్మకం కలిగింది. దేవుళ్ల పటాల స్థానంలో రైతులు విష్ణువర్మ ఫోటోలను అమర్చుకున్నారు. రైతులు నాగళ్లకు విష్ణువర్మ ఫోటోలు తగిలించి పూజలు చేసి పొలం దున్నతున్న బొమ్మలు రాజ్యమంతా రాజ్యమేలాయి. కొన్ని రోజులు గడిచాయి. లెక్కలు, కూడికలు, తీసివేతలతో మేధావులు కుస్తీ పట్టారు. చంద్రవర్మ రైతుల అప్పు పాతిక శాతం తీర్చి మూప్పాతిక శాతం అప్పుకు లిఖిత పూర్వకంగా భరోసా ఇచ్చి గండం నుంచి బయటపడ్డాడు.


విష్ణువర్మ మాత్రం అలా పూజలు అందుకుంటూనే ఉన్నాడు. అమావాస్య అడ్డంగా వచ్చింది, చక్రవర్తి కరుణించడం లేదు, కోశాధికారికి జలుబు చేసింది అంటూ కాలం వెళ్లబుచ్చుతున్నాడు. రాజాధి రాజ రాజమార్తాండ జయహో అంటూ విష్ణువర్మ కీర్తనను వందిమాగదులు వేనోళ్లుగా పొగడసాగారు.
***
రాజా కథ విన్నావు కదా ఇప్పుడు చెప్పు ఇద్దరు రాజుల పోటీలో విజేత ఎవరు? గెలించింది ఎవరు? ఓడింది ఎవరు? అని భేతాళుడు ప్రశ్నించాడు.
‘‘నేను చంద్రవర్మ పేరు చెబుతానని అనుకున్నావేమో కాదు.. ముమ్మాటికీ విష్ణువర్మదే విజయం...’’ అన్నాడు విక్రమార్కుడు. ప్రేమలో, యుద్ధంలో అన్నీ చెల్లుబాటు అవుతాయి. యుద్ధంలో గెలుపు ముఖ్యం, ప్రజాస్వామ్యంలో అధికారం ముఖ్యం. ఎలా గెలిచాడు అని కాదు గెలవడం ముఖ్యం. కోశాగారం నుంచి నిధులు తీసి రైతులకు చెల్లించడంలో గొప్పతనం ఏముంది. ఖాళీ ఖజానా... రైతుల కోసం నిధులు ఇచ్చింది లేదు, మాట నిలుపుకొన్నది లేదు. కానీ పూజలందుకుంటున్న ప్రచారం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. రాజు దేవుని రూపం అంటారు. కానీ ఏకంగా దేవునిలా రాజు పూజలు అందుకుంటున్నట్టు ప్రచారం పొందడం సామాన్యమైన విజయమా? నా సమాధానం నీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. కానీ ఏ కోణంలో చూసినా విష్ణువర్మదే విజయం అని విక్రమార్కుడు చెప్పాడు.


విక్రమార్కుడికి మౌనభంగం కలగగానే సంప్రదాయం ప్రకారం భేతాళుడు తిరిగి చెట్టుపైకి వెళ్లాలి. కానీ ఏదో ఆలోచనలో మునిగి భేతాళుడు అక్కడే ఉండిపోయాడు. రాజా నా సందేహం ఇంకా తీరలేదు. విష్ణువర్మ ఇంతకూ రైతులను రుణవిముక్తి చేశాడా? లేదా? చేయకపోతే ఎప్పుడు చేస్తాడు ఈ ఒక్క సందేహం తీర్చండి లేకపోతే ఈ ప్రశ్న నన్ను నిద్ర పోనివ్వదు అని భేతాళుడు వేడుకున్నాడు.


విక్రమార్కుడు నవ్వి పిచ్చివాడా! దైవలీలను విప్పిచెప్పడానికి మనమెంతటి వారం. ఆ రెండు రాజ్యాల విభజన జరిగి ఎవరి రాజ్యం వాళ్లు పాలించుకుంటున్న తరువాత కూడా ఇంతకూ విష్ణువర్మ రాజ్యవిభజనకు అనుకూలమా? వ్యతిరేకమా? అనే ప్రశ్నకు సమాధానం లభించలేదు. ఇక రుణమాఫీకి సమాధానం దొరుకుతుందని నువ్వెలా అనుకుంటున్నావు. దేవుడు ఉన్నాడా? లేడా? అంటే నువ్వేమంటావు. కోడి ముందా గుడ్డు ముందా? అంటే నువ్వేం చెబుతావు. చెట్టు ముందా? విత్తు ముందా? అని అడిగితే సమాధానం లభిస్తుందా? అని విక్రమార్కుడు అడిగాడు.


‘‘లేదు రాజా! బ్యాంకుకు వెళ్లి అడిగితే నీ అప్పు అలానే ఉందంటున్నాడు. పొలంలోకి వెళ్లి చూస్తే విష్ణువర్మ ఫోటోలకు పూజలు జరుగుతున్నాయి. ఏది నిజం... ఏది అబద్ధం. అర్ధం కాక మీరైనా సందేహం తీరుస్తారేమోనని అడిగాను’’ అని భేతాళుడు వినయంగా అడిగాడు. ‘‘యద్భావం తద్భవతి’’ అన్నట్టు దేవుడు ఉన్నాడు అనుకుంటే ఉన్నాడు లేడు అనుకుంటే లేడు. అలానే రుణమాఫీ అయింది అనుకుంటే అయింది కాలేదు అనుకుంటే కాలేదు. ఇంతకు మించి ఆలోచిస్తే నా తల కాదు నీ తల ముక్కలవుతుంది అని విక్రమార్కుడు చెప్పగానే భేతాళుడు బుర్ర గోక్కుంటూ చెట్టు పైకి వెళ్లాడు. సమాధానం లేని ఇలాంటి ప్రశ్నలపై ఆలోచించడం కన్నా చెట్టుపైన తలక్రిందులుగా వేలాడడమే మేలు అనుకున్నాడు భేతాళుడు.

3 కామెంట్‌లు:

  1. బాగా రాశారు. ఏమీ చేయక పోయినా అన్నీ చేసినట్టు చూపే ఆస్థాన టీవీ భజంత్రీ గాళ్ళు, పాత పాపాల కేసులనుంచి పీక్కోలేకా, లాక్కోలేకా సతమతమవుతూ ఇంకేమీ పట్టించుకోని ప్రతిపక్షనాయకుని గురుంచి కూడా భేతాళుడికి తెలిసే వుంటుందనుకుంటానండీ!

    రిప్లయితొలగించండి
  2. ఆంధ్రాలో ఋణ మాఫీ జరగకపోవడం ఒక రకంగా మంచిది. ఇలాగైతే కాంగ్రెస్ తిరిగి వస్తుంది, ఆంధ్రాలో సమైక్యవాదం అంత బలంగా లేదని ఋజువవుతుంది. కనీసం కాంగ్రెస్ తిరిగి రాకుండా చెయ్యడానికైనా చంద్రబాబు ఋణాలు మాఫీ చేస్తాడనే భ్రమలు నాకు లేవు.

    రిప్లయితొలగించండి
  3. ఇంతకీ అసలు రహస్యం ఏమిటో బేతాళుడికి కానీ విక్రమార్కుడికి కానీ తెలీదు. చంద్రవర్మ మంత్రులతో పాటు నీటి పారుదల, విద్యుత్ లాంటి ప్రముఖ శాఖలు అన్నిటికీ సలహాదారులను పెట్టాడు. వీరు తమతమ రంగాలలో నిష్ణాతులు మరియు ప్రతిభాశీలులు.

    బాబూవర్మ అందుకు భిన్నంగా ఒకే ఒక్క సలహాదారుని నియమించాడు: అదీ మామూలుగా ఎవరూ ప్రాముఖ్యత ఇవ్వని మీడియా సంబంధాలు. ఈ ఒక్క సలహాదారుడి మరియు మహారాజు వారి ప్రాపగండా నేర్పరితనం పుణ్యమా అంటూ ప్రజలు ఎవరికీ పరిపాలనలో ఒక్క లోపమూ కానరాలేదు. ఒక్క పథకం అమలు కాకున్నా వందిమాగాదుల జయజయద్వానాలతో రాష్ట్రం హోరోట్టి పోయింది.

    Napoleon comes back to life and visits USA & USSR. After his visit to the USA, he tells the president: “If I had your military equipment and training, I wouldn’t have lost the battle of Waterloo!”

    He then goes to USSR and at the the airport, before leaving, says: “If I had your press, television and media, no one to this day would have known I lost the battle of Waterloo!”

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం