29, సెప్టెంబర్ 2014, సోమవారం

ఆ హీరో జీవితం విషాద గీతం



దేశంలో సంపన్న సెలబ్రిటీ షారూఖ్ ఖాన్ ఇల్లు మన్నత్  ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్. ఎందుకంటే ఆ ఇంటి ఖరీదు అక్షరాలా రెండువేల కోట్ల రూపాయలు. ఆయన సినిమా రెండువందల కోట్ల రూపాయల వసూళ్ల రికార్డు సృష్టించింది. తన ఆదాయానికి తగ్గట్టు ముంభైలో రెండువేల కోట్ల రూపాయల ఖరీదైన ఇంటిలో నివసిస్తున్నారు. అదే ముంబైలో ఒకప్పుడు హిందీ సినిమా రంగాన్ని పాలించి, తన సినిమాల ద్వారా ఇప్పటికీ సజీవంగా ఉన్న భరత్ భూషణ్ ఒక చావిడిలో నివసించే వారు. చివరకు చేతిలో చిల్లిగవ్వ లేకుండా పేదరికంలో కన్ను  మూశారు. షారూఖ్ ఖాన్ కు ముందు చూపు ఉంది భరత్ భూషణ్ కు లేనిది అదే .. ముందు రతం వారి జీవితాలను గుణ పాఠం గా తీసుకోని నేటి తరం ముందు చూపుతో వ్యవహరిస్తోంది . 
 1950 ప్రాంతంలో రాజ్‌కపూర్, దిలీప్‌కుమార్, దేవానంద్‌ల సమకాలీకుడైన భరత్ భూషణ్ మీనాకుమారి, నూతన్, మధుబాల వంటి వారితో నటించారు. హిందీ సినిమా గంధర్వులు మహమ్మద్ రఫీ, మన్నాడే, ముఖేష్ వంటి గాయకుల సూపర్ హిట్ పాటలు ఎన్నో భరత్ భూషణ్‌పై చిత్రించినవే.
***
బైజు బావ్రా విడుదలై 62 ఏళ్లవుతుంది. ఓ దునియాకే రఖ్‌వాలే ... ఈ పాటను ఆస్వాదించేందుకు మనకు భాషతో పనేముంది. ఆ సినిమా పాటలు ఇప్పటికీ హిట్ సాంగ్స్‌లో టాప్‌లో ఉంటాయి. ఆ సినిమా హీరో భరత్ భూషణ్. అతను నటుడు, స్క్రిప్ట్ రైటర్, నిర్మాత. అనేక సినిమాలకు అతనే కథ రాసుకున్నాడు. సినిమా కథల రచనలో బిజీగా గడిపిన ఆయన తన జీవిత స్క్రిప్ట్‌ను మాత్రం సరిగా రాసుకోలేక నిరుపేదగా తనువు చాలించారు.
***
ప్రపంచ ప్రఖ్యాత శాస్తవ్రేత్త ఒకరు తన ఇంటి తలుపునకు రెండు కన్నాలు చేశాడట! రెండు పిల్లులు బయటకు వెళ్లి రావడానికి అని సమాధానం. రంధ్రమే చేయాలనుకుంటే పెద్దది ఒకటే చేస్తే సరిపోతుంది కదా? చిన్నపిల్లి, పెద్ద పిల్లి దానే్న ఉపయోగించుకుంటుంది. నిరంతరం తమ పరిశోధనల్లోనే మునిగిపోయే శాస్తవ్రేత్తల గురించి ఇదో జోకు. ఇది జోకే కావచ్చు కానీ శాస్తవ్రేత్తలకు తమ రంగంలో అపారమైన పరిజ్ఞానం ఉండవచ్చు... వచ్చు కాదు ఉండి తీరుతుంది. అలా ఉండడం వల్లనే వారు గొప్పవారవుతారు. అయితే ఒక రంగంలో అపారమైన జ్ఞానం ఉన్న వారికి ఇతర రంగాల్లో సైతం ఉంటుందనే నమ్మకం లేదు. తమ ప్రపంచంలోనే మునిగిపోయి మిగిలిన ప్రపంచంపై కనీస అవగాహన లేకపోతే జీవితంలో కష్టాలు తప్పవు. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో తగిన పరిజ్ఞానం లేకపోతే ఎంత గొప్ప మేధావినైనా, కళాకారుడినైనా రోడ్డున పడేస్తుంది జీవితం.
అలా రోడ్డున పడ్డ మరో మహానటుడు భరత్ భూషణ్..
***
దేశంలో అన్ని భాషల్లో రోజుకో డజను సినిమాలు తయారవుతున్నాయి. ఒక్క తెలుగులోనే రోజుకో సినిమా సెట్‌పైకి వస్తోంది. అలాంటిది సినిమాలు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అద్భుతమైన వంద సినిమాల జాబితా రూపొందిస్తే అందులో బైజుబావ్రా ఉంటుంది. వంద మరీ ఎక్కువ పది చాలు అనుకుంటే అందులోనూ బైజుబావ్రా ఉండి తీరుతుంది.
బైజుబావ్రా సినిమా ఎంతో మందికి స్టార్‌డమ్ తీసుకు వచ్చింది. హిందీ చలన చిత్ర సీమను ఏలిన భరత్ భూషణ్, మీనాకుమారి, సంగీత దర్శకులు నౌషాద్ అలీ, గాయకులు మహమ్మద్ రఫీ వంటి హేమా హేమీలకు మంచి గుర్తింపు తీసుకు వచ్చిన సినిమా ఇది. విడుదలై ఆరు దశాబ్దాలు అవుతున్నా ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు సంగీతాభిమానులను అలరిస్తూనే ఉన్నాయి. భారతీయ సినిమా చరిత్రలో బైజు బావ్రా ఒక సంచలనం. మీకు హిందీ రాకపోవచ్చు. ఆ భాషలో ఒక్క పదానికి కూడా అర్థం తెలియకపోవచ్చు. కానీ బైజు బావ్రాలోని పాటలు వింటే సంగీత సాగరంలో మునిగిపోయి మిమ్ములను మీరు మరిచిపోతారు.
భారతీయ భాషలన్నింటిలోనూ ముసలి హీరోలే రాజ్యం ఏలుతున్న కాలంలో హిందీ సినిమా అందగాడిగా భరత్ భూషణ్ గుర్తింపు పొందారు. చాక్లెట్ హీరో అంటూ ఇప్పుడు కొందరు బాలీవుడ్ హీరోలను ముద్దుగా పిలుస్తున్నారు కానీ ఆ గుర్తింపు 1955లోనే పొందిన నటుడు భరత్ భూషణ్.
భరత్ భూషణ్ ఎక్కువగా సంగీత ప్రధానమైన సినిమాల్లో నటించారు. అన్నీ విషాదాంతమైన కథలే. సంగీత ప్రపంచంలో మునిగి పోయిన మహనీయులు తమ వ్యక్తిగత కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశారు. చివరకు అలాంటి పాత్రల్లో నటించిన భరత్ భూషణ్ జీవితం సైతం విషాదాంతమే. మీర్జాగాలిబ్, బసంత్ బహార్, కవికాళిదాసు, బర్సాత్‌కీరాత్, సంగీత్ ఇవి భరత్ భూషణ్ నటించిన కొన్ని సంగీత ప్రధానమైన సినిమాలు.
***
నువ్వు సినిమా రంగానికి వెళ్లడానికి వీలు లేదు అంటూ తండ్రి గర్జించాడు. కుమారుడి మీద కోపంతో కాదు. జీవితంపై భయంతో. స్థిరత్వం ఉండని సినిమా రంగంలోకి తన కుమారుడు వెళితే బతుకు ఏమవుతుందో అనేది ఆ తండ్రి భయం. నాపై నాకు నమ్మకం ఉంది సినిమా పరిశ్రమలో నాకు మంచి అవకాశాలు వస్తాయని అందరిలానే కుమారుడు వాదించాడు. అతను చెప్పినట్టే జరిగింది ఎవరూ ఊహించని విధంగా సినిమా రంగంలో రారాజుగా నిలిచాడు. కానీ ఆతని తండ్రి అనుమానించినట్టూ జరిగింది. చేతిలో చిల్లిగవ్వ లేకుండా దుర్భరమైన పేదరికంలో తనువు చాలించాడు ఆ మహానటుడు భరత్ భూషణ్.
అతని సినిమాల్లో పాత్రల్లానే భరత్ భూషణ్ తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు.
ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో పుట్టిన భరత్ భూషణ్ తండ్రి రాయ్ బహుద్దూర్ మోతీలాల్ గవర్నమెంట్ ప్లీడర్. తన కుమారుడిని ప్రభుత్వ ఉద్యోగిగా చూడాలనేది అతని కోరిక. తండ్రి నిర్ణయాన్ని వ్యతిరేకించి భరత్ భూషణ్ సినిమా రంగానికి వచ్చారు. అలీఘర్ యూనివర్సిటీలో డిగ్రీ పొంది ఉద్యోగంపై ఆసక్తి లేక సినిమా ప్రపంచంలో అడుగు పెట్టారు.
సంపన్న కుటుంబానికి చెందిన శారదను పెళ్లి చేసుకున్నారు. అనారోగ్యంతో ఆమె మరణించాక, తన సహ నటి రత్నను పెళ్లి చేసుకున్నారు. 1941లో చిత్రలేఖలో నటిస్తే, 1952లో వచ్చిన బైజుబావ్రా వరకు ఆయనకు పెద్దగా గుర్తింపు రాలేదు. బైజుబావ్రాతో ఆయనే కాదు హీరోయిన్ మీనాకుమారితో పాటు ఆ సినిమా సంగీత దర్శకుడు, గాయకుడు అంతా స్టార్లు అయిపోయారు. బైజుబావ్రాలో జంటగా నటించిన మీనాకుమారితో అతను నిజంగానే ప్రేమలో పడిపోయాడు. ప్రత్యర్థుల నుంచి బెదిరింపులు తప్పలేదు.

సంగీత సాహిత్యాభిమాని అయిన భరత్ భూషణ్ సొంత ఇంటిలో పెద్ద గ్రంథాలయమే ఉండేది.
హీరోగా సంపాదనకు కొదవ లేదు. భారీ అంచనాలతో కొన్ని సినిమాలు నిర్మిస్తే అవి భారీ నష్టాలు తెచ్చాయి. ఆస్తులు కళ్ల ముందే కరిగిపోయాయి. పెద్ద పెద్ద భవంతులు, కార్లు అన్నీ ఒకదాని తరువాత ఒకటి భరత్ భూషణ్‌తో అనుబంధాన్ని తెంపుకున్నాయి. జూదంలో ఎంతో ఆస్తి కరిగిపోయింది. వ్యసనాలకు ఎంత ఖర్చు అనే లెక్కలు లేవు కానీ చేతిలో చిల్లి గవ్వలేని దశకు చేరుకున్నారు అనేది మాత్రం నిజం.
భరత్ భూషణ్ 1992 జనవరి 27న ముంబైలో తనువు చాలించారు.
భరత్ భూషణ్ విషయంలో తండ్రి అనుమానం నిజమైంది. తన కోరిక నెరవేర్చుకున్నాడు. సినిమాను ప్రేమించిన భరత్ భూషణ్ తన జీవితాన్ని కూడా ప్రేమించుకొని ఉంటే బాగుండేది. తన సంపాదన ఎలా వస్తోంది? ఎలా పోతోంది అనే కొద్దిపాటి అవగాహన, రేపు ఎలా అనే ఇంకొంచం ముందు చూపు ఉండి ఉంటే భరత్ భూషణ్ లాంటి అందమైన హీరో జీవిత ముగింపు కూడా అందంగానే ఉండేది. జీవితం నుంచి మన నిష్క్రమణ అందంగా ఉండాలా? బాధాకరంగా ఉండాలా? అని నిర్ణయించుకునే అవకాశం మన చేతిలో ఉంటుంది. మన చేతల్లో ఉంటుంది.
*

1 కామెంట్‌:

మీ అభిప్రాయానికి స్వాగతం