15, జూన్ 2014, ఆదివారం

కొత్త ముఖ్యమంత్రుల సరికొత్త స్టైల్

కార్పొరేట్ కంపెనీలకే కాదు రాజకీయ నాయకులకు సైతం బ్రాండ్ ఇమేజ్ ముఖ్యమని నాయకుల గట్టి నమ్మకం. జాతీయ నాయకులు ఈ రహస్యాన్ని ఎప్పుడో కనిపెట్టాశారు. బ్రాండ్ ఇమేజ్‌ను తొలుత గుర్తించింది మహాత్మాగాంధీనే అనిపిస్తోంది. చేతిలో పొన్నుకర్ర పట్టుకున్న నాయకుడు అనగానే మర్రి చెన్నారెడ్డి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పొన్నుకర్ర చెన్నారెడ్డి అంతగా కలిసిపోయాయి. ఆ పొన్నుకర్రపై ఆ కాలంలో రక రకాల పుకార్లు రాజ్యమేలేవి. ఇప్పుడంటే అవి నవ్వులాటగా అనిపించవచ్చు కానీ అప్పుడు నిజమే అనిపించేది. ఆయన పొన్నుకర్రలోపల చురుకైన కత్తి ఉంటుందని .... ఇంకా ఏవేవో పుకార్లు రాజ్యమేలేవి. జవహర్‌లాల్ నెహ్రూ అనగానే కోటుపై గులాబీ పూవు ధరించిన రూపం గుర్తుకొస్తుంది.


దృశ్యపరంగానే కాకుండా కొన్ని మాటలు కొందరు నాయకులకు మారు పేర్లుగా వినిపిస్తాయి. యువనేత అంటే వైకాపా అధ్యక్షుడు అని వేరుగా చెప్పాల్సిన అవసరమే లేదు. వెన్నుపోటు అనగానే గతంలో నాదెండ్లకు మారు పేరుగా నిలిచేది. మందులకు పేటెంట్ కాలం తీరిపోయినట్టు వెన్నుపోటుకు నాదెండ్ల అనుబంధం 95తో తీరిపోయింది. ఆయనతో అనుబంధం తీరిపోతే మరి ఎవరితో అనుబంధం ఏర్పడింది అని మీరు అడిగితే మీకు రాజకీయ పరిజ్ఞానం లేనట్టే. అలా అడిగితే ఆ బ్రాండ్ పాపులారిటీకి ఇక అర్ధమే లేదు.


ఆసియన్ పెయింట్స్ అనగానే బ్రష్ పట్టుకుని రంగులేసే చిన్న కుర్రాడు కళ్ల ముందు ప్రత్యక్షమవుతాడు. కంపెనీలు ఇలా వినియోగదారుల హృదయాల్లో ముద్రించుకు పోయినట్టుగా రాజకీయ నాయకులు సైతం ఏలాగోలా ఓటర్ల హృదయాల్లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకోవాలని తంటాలు పడుతుంటారు. ధైర్యంగా పోలీసు వాడికి గుండెను చూపి కాల్చమన్న దృశ్యం ప్రకాశం పంతులుగా బ్రాండ్ నేమ్‌గా మారిపోయింది. అయితే ఆయన తన ఆత్మకథలో సైతం అలా గుండె చూపింది నేను కాదు ఒక ముస్లిం యువకుడు, నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన నేను మద్రాస్ నగరంలో నడుస్తుంటే పోలీసు తుపాకి చూపి అడ్డుకున్నప్పుడు ఆగ్రహంతో కాలుస్తావా? కాల్చు అంటూ ముందుకు వచ్చింది ముస్లిం యువకుడు ప్రకాశం పంతులు చెప్పినా ప్రజలు మాత్రం ప్రకాశంను అలానే మనస్సుల్లో చిత్రించుకున్నారు.


సంఘ్ సేవకునిగా బ్రహ్మచారి జీవితం గడుపుతూ ఉతుక్కోవడానికి కాస్త కలిసొస్తుందని పొట్టి చేతుల షర్ట్‌ను మోదీ ఎంపిక చేసుకుంటే ఇప్పుడది మోదీ బ్రాండ్‌గా మారిపోయింది. దేశంలోని యువతకు ఇప్పుడు లెటెస్ట్ ఫ్యాషన్ గురు మోదీ. ఆయన డ్రెస్సింగ్‌లే ఫ్యాషన్ పాఠాలు.
లోకో భిన్నరుచి అన్నట్టు ఒక్కో నాయకుని అలవాటు ఒక్కోరకంగా ఉంటుంది. ఎవరి అలవాటు వారిష్టం. తమిళ అమ్మ జయలలిత ఐదేళ్ల ముఖ్యమంత్రి పదవీ కాలంలో రెండు మూడు సార్లు కూడా విలేఖరుల సమావేశంలో మాట్లాడినా గొప్పే. వారి సచివాలయంలోకి మీడియాకు నిరంతర అనుమతి అనేది ఉండదు. పిలిస్తేనే వెళ్లాలి. ఒకరు ఐదేళ్లలో రెండు సార్లు మీడియాతో మాట్లాడే ముఖ్యమంత్రి అయితే అదే సమయంలో రోజుకు ఐదుసార్లు మీడియాతో మాట్లాడే ముఖ్యమంత్రి సైతం ఉన్నారు.


తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రెండు వారాల వ్యవహార శైలి చూస్తే ఆయన తన సొంత బ్రాండ్‌ను సృష్టించుకోవడంలో బిజీగా ఉన్నారనిపిస్తోంది. తూటా కన్నా బలంగా పేల్చే మాటలే ఆయన బ్రాండ్ ఇమేజ్ అయితే అది ఉద్యమ కాలంలో.. ఇప్పుడాయన ముఖ్యమంత్రి కావడం వల్ల పాత బ్రాండ్‌ను నిలుపుకుంటూనే పాలకుడిగా కొత్త బ్రాండ్‌ను సృష్టించుకునే పనిలో పడ్డారు. మీడియా వ్యవహారంలో తమిళ అమ్మ బ్రాండ్‌ను కొంత వరకు అనుకరించినా, పాలనలో మాత్రం తన సొంత బ్రాండ్ రూపొందించుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా కెసిఆర్ కుర్చీలో కూర్చుంటే ఆ పక్కన ఉండేది నా కుర్చీనే అని చాలా మందే కలలు కన్నారు. కుర్చీ లేకపోయినా పరవాలేదు కానీ కెసిఆర్‌కు ఎలా పాలించాలో పాఠాలు చెబుదామని కొందరు తలలు నెరిసిన పాత్రికేయులు పాఠ్యపుస్తకాలను సంకలో పెట్టుకుని తిరిగారు. కానీ ఆయన మాత్రం లఘు దర్శనంతోనే సరిపుచ్చుకోండి అంటూ దగ్గరకు రానివ్వడం లేదు. తెలుగు నాట మీడియాను నమ్ముకుని బాగుపడ్డవాడు లేడు, మీడియాను నమ్మక చెడిపోయిన వాడు లేడు అని కెసిఆర్ గట్టిగా నమ్ముతున్నట్టుగా ఉంది. 2004లో మీడియా ఎవరికి అండగా నిలిచిందో వారు గెలవలేదు, 2009లో మీడియా ఎవరినైతే తీవ్రంగా వ్యతిరేకించిందో వారి గెలుపును ఆపలేకపోయింది అనేది కెసిఆర్ వాదన. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితులు గెలుపు ఓటములపై ప్రభావం చూపాయి తప్ప మీడియా కాదు అనేది ఆయన నమ్మకం. అందుకే మీడియాకు దూరంగా, ప్రజలకు దగ్గరగా ఉండే విధంగా తన బ్రాండ్ ఇమేజ్ కల్పించుకోవడానికి కెసిఆర్ ప్రయత్నిస్తున్నారు. మీడియాను దూరంగా పెడుతూ అదే సమయంలో విధాన నిర్ణయం ఏదైనా అఖిలపక్ష సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాలు తెలుసుకున్న తరువాతే అంటూ అందరి మాటలకు విలువ ఇచ్చే కొత్త రాజకీయం చూపిస్తానంటున్నారు.

 ప్రమాణస్వీకారం చేసిన వారంలోనే ఏడుసార్లు అధికారికంగా, మరో మూడుసార్లు అనధికారికంగా విలేఖరుల సమావేశంలో మాట్లాడింది ఒకరైతే, రాష్ట్రంలో ఒక్కసారి కూడా ముఖ్యమంత్రిగా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేయని నాయకులు ఒకరు. ఎవరి స్టైల్ వారిదే. అంతిమంగా కొత్త బ్రాండ్ ఇమేజ్ ఏలా ఉందో ఎన్నికల్లో ప్రజలు తీర్పు చెప్పాల్సిందే. మీడియా తీర్పులు చెప్పినా,జనం నాడికి , మీడియా తీర్పుకు సంబంధం ఉండడం లేదు.


గతంలో రాజకీయ నాయకుడు అనగానే ఖద్దరు ధరించి బానపొట్టతో నడవలేక నడవ లేక నడిచే 60 ఏళ్ల సగటు వయస్సు వ్యక్తి అనే ముద్ర బలంగా ఉండేది. ఈ నాయకులు తమ పొట్టను తమ వెంట తీసుకు వెళ్లడానికే తంటాలు పడతారు. రోజులు మారాయి నవతరం నాయకులు కనిపిస్తున్నారు. వీరికి పొట్టలు లేనంత మాత్రాన ఆరగించరు అనుకోవద్దు .. కొందరి శరీర తత్వం అంతే ఎంత తిన్నా కనిపించదు, కొందరు ఎంత తక్కువ తిన్నా పొట్ట పెరుగుతుంది. జీవితంలోనే కాదు రాజకీయాల్లోనూ అంతే..

2 కామెంట్‌లు:

మీ అభిప్రాయానికి స్వాగతం