16, ఏప్రిల్ 2014, బుధవారం

చూడాలని ఉంది

రాయబారిగా వచ్చిన శ్రీకృష్ణుడు కౌరవ సభలో తన విశ్వరూపాన్ని ప్రదర్శించినప్పుడు దృతరాష్ట్రుడికి సైతం కళ్లను ప్రసాదిస్తాడు. నల్లనయ్య విశ్వరూపాన్ని చూసి న కళ్లతో ఇక మరేదీ చూడలేనన్న దృతరాష్ట్రుడు తన మునపటిలానే గుడ్డితనాన్ని కోరుకుంటాడు. అద్భుతమైన ఒక సినిమాను చూసినప్పుడు ఇక మరే సినిమా చూడబుద్ధి కాదు. మంచి సాహిత్యం చదివినా అలానే అనిపిస్తుంది. మన జీవిత కాలంలో ఏదో ఒక అద్భుమైన దృశ్యాన్ని చూడాలని కోరిక ఉంటుంది. అది చూశాక మరో దృశ్యం కళ్ల ముందు నిలవదు. అలానే ఈ ఎన్నికల్లో ఎన్నో అద్భుతమైన దృశ్యాలు మనకు ప్రత్యక్షం అయ్యాయి, మరి న్ని అద్భుత దృశ్యాలు రాజకీయ తెరపైకి రాబోతున్నాయి.


ప్రశ్నించడానికే జనసేనను పుట్టించిన పవన్, దేశంలోని అవినీతిని కడిగేయడానికి గుజరాత్ మార్క్ కత్తిపట్టుకుని దేశం మీద పడ్డ మోడీ, ఒక్క రూపాయి జీతంతో నీతిమంతంగా స్టార్ హోటల్ స్థాయి పార్టీ కార్యాలయాన్ని, పార్టీని నడుపుతున్న నీతిబాబు,గనులను మింగేసిన శ్రీరాములు, ఆయన బాస్ గాలి జనార్దన్‌రెడ్డి ఒకే వేదికపై నుంచి జాతికి నీతి బోధ చేస్తే చూసి తరలించాలని ఉంది. ఇదేం తీరని కోరికేం కాదు, అత్యాశ అంత కన్నా కాదు. గాలి బిజెపిలోనే ఉన్నాడు కాబట్టి ఈ కోరిక తీరుతుంది, జైలులో ఉన్నాడు కాబట్టి ఇప్పుడే తీరదు. గాలి మినహా మిగిలిన నేతలంతా కర్నాటకలో కలిసి ప్రచారం చేసి బిజెపి గాలిని సృష్టించనున్నారు. ఆ దృశ్యాన్ని చూసేందుకు రెండు కళ్లు, నీతి బోధ వినేందుకు రెండు చెవులు చాలవు. గాలి జనార్దన్‌రెడ్డి గొప్పతనం గురించి ఒకవైపు జగన్ మరోవైపు బాబు చెబుతుంటే నా సామిరంగా చూసిన వారికి కన్నుల పండగే. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. 

నీతి బోధ చేసే హక్కు అందరికీ ఉన్నప్పుడు బిజెపిలో విలీనం అయిన శ్రీరాములుకు ఎందుకు లేదు, శ్రీరాముడ్ని బ్రాండ్ అంబాసిడర్‌గా ఉపయోగించుకున్న బిజెపికి ఎందుకు లేదు.


బంగారం తాకట్టు గురించి ఏ చిరుద్యోగిని అడిగినా ఠక్కున చెబుతాడు. బంగారం మార్వాడి కొట్టులో తాకట్టు పెట్టడం కన్నా, ముత్తుట్ ఫైనాన్స్‌లో బెటర్, అంత కన్నా జాతీయ బ్యాంకుల్లో మరింత బెటర్. మధ్యతరగతి జీవి కొద్దిపాటి డబ్బుకోసమే బంగారం తాకట్టుపెట్టేటప్పుడు ఇంతగా ఆలోచిస్తే సంపన్న రాజకీయ ప్రాణులు మన కోసం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేటప్పుడు ఇంకెంత ఆలోచిస్తారు. తెలుగు ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెడతారా? అని తెలుగులో మాట్లాడగలిగిన, మాట్లాడలేని నాయకులంతా తెగ విమర్శించే వారు. నిజమే కదా? మనం తాకట్టుపెట్టిన బం గారం సురక్షితంగా ఉండాలి, వడ్డీ రేటు తక్కువుండాలి. అలానే ఆత్మగౌరవం అంతగా భద్రత లేని, ప్రయోజనం లేని ఢిల్లీలో తాకట్టు ఎందుకు అనేది వారి ప్రశ్న. ఇంటి పక్కన ఉన్న మార్వాడి కొట్టు కన్నా కాస్త దూరం అయినా పరవాలేదు అని జాతీయ బ్యాంకుకు వెళతాం, అలానే ఢిల్లీ నుంచి మరో వెయ్యి కిలో మీటర్ల దూరం వెళ్లి పోటీ పడి తెలుగు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు. సినిమా తారలు గుజరాత్‌లో క్యూ కడితే, కాస్త పేరున్న బాబులు మాత్రం వ్యవహారం టెలిఫోన్‌లోనే నడిపిస్తున్నారు.


రారా కృష్ణయ్య... రా.. రా.. కృష్ణయ్య దీనులను కాపాడా రా... రారా.. కృష్ణయ్య అని పాడుతున్నట్టుగా నమో... నమో... అంటూ గుజరాత్‌కు పరుగులు తీస్తున్నారు. నిజానికి గుజరాతీలకు మంచి వ్యాపార దక్షత ఉంటుంది. వారితో వ్యాపారం నిక్కచ్చిగా ఉంటుంది. టన్నుల కొద్ది ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టేందుకు తెలుగు వాళ్లు పోటీ పడుతున్నారని తెలియగానే ఒకరికి తెలియకుండా ఒకరితో బేరాలు సాగించారు. మంచి తరుణం మించిన దొరకదు అని మన వాళ్లు పరుగులు పెడుతున్నారు. ఈ తాకట్టు వ్యాపారంలో గుజరాత్ నేత మోడీకి గుజరాత్ వ్యాపారి అంబానీ ఫైనాన్స్ దండిగానే ఉందని ప్రచారం. నిజా నిజాలు మోడీకి, అంబానీకి తెలియాలి. గుజరాతీల వ్యాపార దక్షతకు మురిసిపోయి వాళ్లకు తెలుగు ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టేందుకు ఉత్సాహ పడుతున్నారు.
ఎన్నికల ముందు మోడీకి కుడిభుజంగా బాబు, ఎన్నికల తరువాత ఎడమ భుజంగా జగన్ ఉంటే చూసే వారికి కన్నుల పండగే. మోడీకి కుడి ఎడమలుగా బాబు జగన్‌లు బుర్రకథలో వంత పాడే వారిలా మోడీ విజయ కథలు చెబితే వినాలనిపించడం లేదూ!


పెద్దగా సీట్లు రాని బాబుతో ఎన్నికల ముందు పొత్తు కన్నా ఎక్కువ సీట్లు వచ్చే నాతో ఎన్నికల తరువాత పొత్తు పెట్టుకోండి అంటూ జగన్ గుజరాత్‌కు చిలక రాయబారం పంపించేశాడు. రెండేళ్ల రాజకీయ అనుభవం ఉన్న జగన్‌కే ఇన్ని లెక్కలు తెలిస్తే మూడుసార్లు ముఖ్యమంత్రి అయిన మోడీకి ఎన్ని లెక్కలు తెలియాలి. ఎన్నికల ముందు బాబు ఎన్నికల తరువాత జగన్, ఒకరు ఎడమ పక్క మరొకరు కుడిపక్క నిలవక తప్పదు అని మోడీ లెక్కలు వేసుకున్నారేమో ! ఎంత లౌకిక పాఠాలు చెబుతున్నా, ఎన్నికల తరువాత కెసిఆర్ పోకుండా ఉంటారా? వస్తానంటే మోడీ వద్దంటారా? అప్పుడు ఈ ముగ్గురు నేతలను మోడీతో చూసి తనకా చాన్స్ దక్కనందుకు కిరణ్ ఏమనుకుంటారో? ఇలాంటి అరుదైన దృశ్యాన్ని చూసే అదృష్టాన్ని మనకీ ఎన్నికలు ప్రసాదించాయి.


2009 ఎన్నికల సమయంలో కెసిఆర్ ఇంటికి బాబు, రాఘవులు వెళ్లడం, టీ కప్పులో తుఫాను సృష్టిస్తామని చేసిన చారిత్మ్రాక దృశ్యాలను కనులారా చూడలేని వారికి ఈసారి అంతకు మించిన అరుదైన దృశ్యాలు కనిపించబోతున్నాయి. మూడు రంగుల కండువాలు తీసేసి మొత్తం కాంగ్రెస్ క్యాబినెట్‌లో సగం మంది బాబు పార్టీ నుంచి మరో సగం మంది వైకాపా నుంచి పోటీ చేస్తుండడం రాజకీయ వినోదాత్మక వింత దృశ్యమే. ఇంకా విచిత్రం 95లోనే బాబు తన ప్రతిభనూ చూపించారు, పదేళ్ల నుంచి చతికిలపడ్డారు. కానీ బాబులోని పాలనా దక్షత ఇప్పుడే గ్రహించామంటున్నారు ఆయన పార్టీలో చేరుతున్న వారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం