14, ఏప్రిల్ 2014, సోమవారం

మగవారి మాటలకు అర్థాలే వేరులే...


ఆడవారి మాటలకూ అర్ధాలే వేరులే అని పాడుతున్న ఆ పురుషుడి మాటలకు సైతం అర్ధాలు వేరు. నువ్వంటే నాకు ఇష్టం లేదు అని అమ్మాయి అంటే అదేం కాదు మీ మాటలకు అర్ధాలు వేరు, మీరు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి అలా అంటున్నారు అని మగవాడు ఆమె మాటలకు కొత్త అర్ధం చెబుతాడు. ఒకవేళ ఆ అమ్మాయి నువ్వంటే నాకిష్టం నేను నిన్ను ప్రేమిస్తున్నాను అందనుకోండి. అప్పుడు సమస్యనే లేదు. ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే అనాల్సిన అవసరమే ఉండదు. అంటే అమ్మాయి ఏం మాట్లాడినా దాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికే మగవాడు ఈ మాటను ప్రచారంలోకి తెచ్చాడేమో. అందుకే మగవారి మాటలకూ అర్ధాలే వేరులే అనుకోవాలి. ప్రేమ విషయంలో ఆడ, మగ మాటల విషయంలో అర్ధాలు ఏవైనా రాజకీయాల్లో మాత్రం ప్రతి ఒక్క నాయకుడి మాటలకు అర్ధాలు వేరుగా ఉంటాయి.
బంధువుల అబ్బాయికి పెళ్లి కాలేదని మునిమాణిక్యం భార్యతో వాపోతుంటే నేను అప్పుడే అనుకున్నాను, బర్మాకెళొచ్చిన వాడికి పిల్లనెవడిస్తారని అంటుంది భార్య. బర్మాకు వెళ్లిరావడానికి పెళ్లి సంబంధం కుదరకపోవడానికి సంబంధం ఏమిటో అర్ధం కాక దానికీ దీనికి సంబంధం ఏమిటని ఆమెనే అడుగుతాడు. వంకర కాళ్లతో నడిచే వాడు బర్మాకు కాకుండా ఇంకెక్కడికి వెళతాడు లేండి అంటూ మరో మాట అనేస్తుంది. పెళ్లి, బర్మా, వంకర కాళ్లు ఒకదానికొకటి ఏ మాత్రం సంబంధం ఉండదు, అదే అడిగితే ఇంకేం చెబుతుందో అని మునిమాణిక్యం వౌనంగా ఉన్నట్టుగానే ఇప్పుడు ఓటర్లు ఎన్నికల కాలంలో వౌనంగా ఉండడమే మంచిదనుకుంటున్నారు.
కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేస్తున్న రాఖీసావంత్ ముంబై రోడ్లను కత్రినా కైఫ్ నడుములా మార్చేస్తానని చెబుతోంది. ఇద్దరి మధ్య ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి. ఆమె మాటలకు అర్ధం కత్రినా కైఫ్‌ను రోడ్డున పడేయాలన్న కోపమే తప్ప రోడ్లను అంత మృదువుగా మార్చాలనే కోరిక కాదు.
ఉత్తర ప్రదేశ్‌లో బిజెపి నేత అమిత్‌షా ఆయన తలపై వెంట్రుకలనే కాపాడుకోలేకపోయాడు, ఇక రాజకీయాల్లో ప్రతీకారం ఏం తీర్చుకుంటాడు అని సమాజ్‌వాది పార్టీ నేత ఆజంఖాన్ సందేహం వ్యక్తం చేశాడు. ఎన్నికల్లో ఒక పార్టీని ఓడించమని, మరో పార్టీ ప్రజలకు పిలుపును ఇవ్వడం సహజమే. ఐదేళ్లపాలనపై ప్రతీకారం తీర్చుకోనే విధంగా ఓటువేయమంటారు, దానికి తలపై వెంట్రుకలకు సంబంధం ఏమిటో? పోనీ బిజెపిలో తల వెంట్రుకలు బాగా కాపాడుకున్న వారికి ఓటువేయమని ఆజంఖాన్ చెబుతారు. అలా అయితే మోడీకి జై అంటారేమో ఆయన తలపైన జుట్టుతో పాటు గడ్డం కూడా బాగానే పెంచారు.
ఎన్నికల సీజన్‌లో నాయకులందరి మాటలు ఇలానే ఉంటాయి. పార్టీ ఎందుకు పెడుతున్నావయ్యా అంటే ప్రశ్నించేందుకు అని పవన్ కల్యాణ్ చెప్పినట్టు. ఆయనేదో ఈ ఎన్నికల్లో వీరవిహారం చేస్తాడని అభిమానులు బాగానే ఆశలు పెట్టుకున్నారు. ఆశలు పెట్టుకున్నవారిది తప్పు కానీ ఆయన మొదటి రోజే అసలు విషయం చెప్పాడు. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్‌కు జన సేవ పొడిగింపుఅని చెప్పనే చెప్పాడు. అంటే కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన చేసిన తరువాత ఆ ఫోర్స్ చేసింది లేదు, ఆయన ఏ సమస్యపై స్పందించింది లేదు. మళ్లీ పార్టీ ప్రకటన సమయంలోనే దాని గురించి ప్రస్తావించాడు. అంటే జనసేవపై ఎక్కువగా ఆశలు పెట్టుకోకండి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ లాంటిదే ఇది అని చెప్పకనే చెప్పాడు.
సినిమాల్లో హీరోను, హీరోయిన్‌ను ఎంపిక చేసుకున్నప్పుడు ప్రచారానికి రావాలనే కండిషన్ కూడా ఆ ప్యాకేజీలో భాగంగా ఉంటుంది. అలానే పవన్ కల్యాణ్ పార్టీ ఏర్పాటు మరో పార్టీ కోసం ప్రచారం వరకే ప్యాకేజీనా? లేక పోటీ చేసి సహాయం చేయాలనేది ప్యాకేజీలో భాగమే అనేది ఎన్నికలు అయితే కానీ స్పష్టం కాదు.
మల్కాజిగిరి పార్లమెంటు నియోజక వర్గంపై అన్ని పార్టీల నాయకులు అమితాసక్తి చూపించారు. అప్పటి వరకు పార్టీతో ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తికి టిడిపి టికెట్ ఇచ్చారు బాబుగారు. ఎప్పటి నుంచో ఆశలు పెట్టుకున్న వాళ్లు పార్టీలో ఇంత మంది ఉంటే వారందరినీ కాదని ఆయనకెందుకిచ్చారా?అని అందరి సందేహం. అదే విషయాన్ని బాబును అడిగితే పార్టీకి కొందరు ద్రోహం చేసి వెళ్లారు, పార్టీని కాపాడుకోవడానికే అని సమాధానం ఇచ్చారు. నిజమే పార్టీని కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలైనా తీసుకోవాలి తప్పు లేదు. ఆ మధ్య గాంధీ భవన్ ముందు బౌన్సర్‌లను కాపలాగా పెట్టారు. గతంలో ఎన్నికల సమయంలో గాంధీభవన్‌ను తగలబెట్టిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తగా బౌన్సర్‌లను ఏర్పాటు చేశారు. అలానే పార్టీని కాపాడుకోవడానికి మల్కాజిగిరి టికెట్ బాబు బౌన్సర్‌కు ఇచ్చాడేమో అనుకున్నారు. కానీ ఆయన బౌన్సర్ కాదు ప్రముఖ విద్యా వ్యాపారి. విద్యా వ్యాపారికి టికెట్ ఇస్తే ఆయన పార్టీని కాపాడడం ఏమిటో తమ్ముళ్లకు అర్ధం కాక బుర్ర గోక్కున్నాడు. డబ్బులున్నాయని ఇచ్చామని నేరుగా చెప్పవచ్చు కదా?అనేది కొందరి ప్రశ్న...
తల తిక్క సమాధానాల్లోంచి అసలు విషయం గ్రహించాలి కానీ నాయకులు ఏ విషయమైనా నేరుగా చెబుతారా? చెప్పనే చెప్పరు. కాంతానికి ఏదో విషయంలో మునిమాణిక్యంపై కోపం వచ్చిందని అంతే తప్ప ఆ కుర్రాడికి పెళ్లి కావద్దనో, కాదనో చెప్పడం కానే కాదు. ఆకాలం నాటి కాంతమే ఇలా మాట్లాడితే ఇక రాజకీయ నాయకులు విషయం నేరుగా చెబుతారా? మీ దగ్గర అంత డబ్బులేదు, అందుకే మీకు టికెట్ ఇవ్వలేదు ఆయన దగ్గర డబ్బుంది టికెట్ ఇచ్చాను అని చెబితే మీడియా ఊరుకుంటుందా?
ఎన్టీఆర్‌ను ఎందుకు దించావయ్యా బాబు అని అల్లుడిని అడిగితే ఎన్టీఆర్ విధానాలు అమలు చేయడంలో ఎన్టీఆర్ విఫలమయ్యారు. ఎన్టీఆర్ విధానాలు అమలు చేసేందుకే ఆయన్ని దించాను అని అల్లుడు చెప్పినప్పుడే అర్ధమైంది ఆయన మాటలకు అసలైన అర్ధాలు వేరుగా ఉంటాయి అని..
.

2 కామెంట్‌లు:

మీ అభిప్రాయానికి స్వాగతం