3, మార్చి 2014, సోమవారం

ఆ పిల్లకు పెళ్లవుతుందా? కెసిఆర్ దారెటు?

‘‘చూడోయ్ అప్పారావు మా వాడికి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాల్సిందే. లేకపోతే పరిస్థితులు దారుణంగా ఉంటాయ్ ’’
‘‘సుబ్బారావు బావగారు భలే జోకులేస్తారు. మా అమ్మాయి కుందనపు బొమ్మ, కాలేజీ ఫస్ట్. చదువు సాగుతుండగానే క్యాంపస్ సెలక్షన్‌లో కంపెనీల ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. మీ వాడి క్యారక్టర్ ఊరందరికీ తెలుసు. నవ్వులాటకు కూడా ఇలాంటి మాటలు మాట్లాడకండి బావగారు ’’
‘‘నేను సీరియస్‌గా చెబుతున్నాను. మీ అమ్మాయి పుట్టినప్పుడు నేనూ మా ఆవిడ కలిసి ఆస్పత్రికి వచ్చినప్పుడు నువ్వేమన్నావు. బావగారూ మీ కోడలు పుట్టింది అన్నావా? లేదా? ’’ సుబ్బారావు ప్రశ్నిస్తుండగానే పక్కనున్న పచ్చయ్య నాయుడు ‘‘ఔను అన్నాడు మేం విన్నాం. మాట మీద నిలబడాల్సిందే లేకపోతే మేం కూడా ఊరుకోం. మీ అమ్మాయి బాగా చదువుకొంటుందని ట్యూషన్‌కు అంతా మీ అమ్మాయి వద్దకే వస్తున్నారు. అదే వీధిలో ఉన్న మా ట్యూషన్ భవన్‌ను మూసుకోవలసిన పరిస్థితి కల్పించావు. మీ అమ్మాయి ట్యూషన్ చెప్పక ముందు మా భవన్ విద్యార్థులతో కళకళలాడేది. ఇప్పుడు ప్రచార కరపత్రాలు పంచేవాడికి భోజనం దండగ అనిపిస్తోంది. మీ వల్లే మా వ్యాపారం దెబ్బతింది. నువ్వు మీ అమ్మాయిని సుబ్బారావు అబ్బాయికిచ్చి పెళ్లి చేయాల్సిందే’’ అని పచ్చయ్య నాయుడు సుబ్బారావు కన్నా గట్టిగా వాదించాడు.


‘‘వెయ్యి అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయాలంటారు. సుబ్బారావు అబ్బాయి చాలా మంచోడు అనో, పెళ్లయితే వాడే జులాయి తిరుగుళ్లు మానేస్తాడు అనో చెప్పాలి. కానీ వాడు జులాయి నిజమే మీ అమ్మాయిని ఇచ్చి తీరాల్సిందే అని మీ ఒత్తిడేమిటయ్యా’’ అని దారిన పోయే దానయ్యలు పచ్చయ్య నాయుడిపై మండిపడ్డారు.
‘‘ఇదిగో అప్పారావు బావా ఎవరేమనుకున్నా సరే. నువ్వు చెబితేనే కదా ఆ భవంతిని రెండు భాగాలుగా చేసింది. నీ మాట నేను విన్నందుకు నా మాట నువ్వు వినాల్సిందే మర్యాదగా పెళ్లికి ఒప్పుకుంటే సరి లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు’’


సుబ్బారావు అలా నవ్వుతూనే ‘‘నీ చమత్కారం మండిపోను. ఆ బిల్డింగ్‌లో ఎప్పుడు చూసినా గొడవలే, ఎంత కాలం భరిస్తావు, దాన్ని రెండుగా మార్చేయ్ పీడా పోతుంది. ఎవడి బతుకు వాడు బతుకుతాడు అని మంచి ఉద్దేశంతో చెప్పాను. దాని కోసం మా అమ్మాయిని చూస్తూ చూస్తూ ఏబ్రాసి వాడికిచ్చి పెళ్లి చేయమనడం భావ్యమా? ’’ అని అప్పారావు అడిగాడు.
‘‘మా వాడు ఎంత ఏబ్రాసినో నీ కన్నా నా కన్నా మన ఊరోళ్లందరికీ ఇంకా బాగా తెలుసు. ఆ విషయం నువ్వేమీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నా మాట వినకపోతే ఊళ్లో ఎలా ఉంటావో, మీ అమ్మాయి పెళ్లి ఎలా అవుతుందో చూస్తాను’’ అని సుబ్బారావు చాలెంజ్ చేశాడు. అప్పారావులో ఏ మాత్రం ఆందోళన కనిపించడం లేదు. వాళ్ల అమ్మాయి తెలివి మీద అతని కంత నమ్మకం. మహా మహా అపర చాణుక్యులనే మట్టి కరిపించిన బుర్ర ఆమెది, సమస్యను నిచ్చెనగా మార్చుకోవడం ఆమెకు తెలుసు అంటూ అప్పారావు ముందుకు కదిలాడు.


***
‘‘ ఇదీ కథ’’


‘‘ఇది కథనా...? ఇదేం కథ? కథ అంటే దానికి అర్ధవంతమైన ముగింపు ఉండాలి. ఇంతకూ ఆ అమ్మాయి సుబ్బారావు కొడుకునే చేసుకుందా? లేక అతని రౌడీఇజాన్ని ఎదిరించి తనకు నచ్చిన వాడ్ని చేసుకుందా? ఏం జరిగిందో ముగింపు చెప్పకుండా వెళితే ఎలా? ’’
‘‘ ఆ సంగతి నాకేం తెలుసు. కెసిఆర్ చెప్పాలి ’’
‘‘ కెసిఆర్‌కేం సంబంధం? ’’
‘‘ ఎందుకు లేదు. ఆసలు ఈ కథలో కథానాయకుడు ఆయనే కదా? ముగింపు ఆయన చేతిలోనే ఉంది. ?’’
‘‘ ఎలా?’’
‘‘2001లో పుట్టినప్పటి నుంచి రాజకీయ పక్షాలన్నీంటినీ మూడు చెరువుల నీళ్లు తాగించిన కెసిఆర్ ఇప్పుడు డైలమాలో పడ్డారు. పెద్దమ్మ సోనియాగాంధీనేమో టిఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయాలని కోరుతోంది. చిన్నమ్మను కూడా గుర్తు పెట్టుకోండి అని బిజెపి నేత సుస్మా స్వరాజ్ పార్లమెంటులోనే గుర్తు చేశారు. ఇప్పుడు అటు పెద్దమ్మకు, ఇటు చిన్నమ్మకు మధ్య కెసిఆర్ నలిగిపోతున్నాడు. కాంగ్రెస్‌లో విలీనం కావాలా? బిజెపితో పొత్తు పెట్టుకోవాలా? రెండు పార్టీలను సంతృప్తి పరచాలంటే 60 శాతం పార్టీని కాంగ్రెస్‌లో 40 శాతం బిజెపిలో విలీనం చేస్తే సరిపోతుంది అని చెబితే గడుగ్గాయి సమాధానం అవుతుంది తప్ప సమస్యకు పరిష్కారం లభించదు’’


‘‘తెలంగాణ ఏర్పాటుతో యువత ఎంతో ఆశలతో పరుగులు తీసేందుకు సిద్ధంగా ఉంది. నూటా పాతికేళ్ల వృద్ధ కాంగ్రెస్‌తో కలిసి మెల్లగా నడవడం నష్టమేనని లెక్కలు చెబుతున్నాయి. చూస్తూ చూస్తూ వృద్ధ పార్టీతో చేతులు కలిపి పరిగెట్టే అలవాటున్న ఆయన కుంటుతూ నడవలేడు.’’
‘‘ నిజమే కానీ మాట ఇచ్చాడు కదా? ఎలా తప్పుతాడు. ప్రజల్లో చులకన కారూ’’
‘‘దేశానికి స్వాతంత్య్రం రాగానే కాంగ్రెస్‌ను రద్దు చేయాలని మహాత్మాగాంధీ చెప్పారు. మరి ఇంకా రద్దు చేయడం లేదేమిటని కాంగ్రెస్‌ను ఎవరైనా ప్రశ్నిస్తున్నారా?
తెలుగుదేశం పార్టీ నాతోనే పుట్టింది నాతోనే మరణిస్తుందని ఎన్టీఆర్ రామారావు మంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడు ప్రకటించారు. ఆయన పోయి 18 ఏళ్లు గడుస్తున్నా, వరుసగా రెండు సార్లు ఓడిపోయినా టిడిపిని ఇంకా కొనసాగించడం ఏమిటి రద్దు చేయండి అని టిడిపి నాయకులను ఎవరైనా ప్రశ్నిస్తున్నా? ఎవరి పార్టీ వారిష్టం.’’
‘‘మీ పార్టీని కలిపేయకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ అవుతుందని జైరాం రమేష్ చెబుతున్నాడు కదా? ’’
‘‘పిల్లి శాపనార్ధాలను పట్టించుకునేదెవరు? ఉభయ రాష్ట్రాల్లోనే తెలుగు నేతలు ఒకరిని మించిన వారు ఒకరు. బాబు కెసిఆర్‌లే కాదు.. పెద్ద పెద్ద నేతలంతా యువజన కాంగ్రెస్‌లో ఓనమాలు దిద్దిన వారే, జగన్‌దీ కాంగ్రెస్ డిఎన్‌ఏనే అందరి డిఎన్‌ఏ ఒకటే కాబట్టి ఎవరెలాంటి ఎత్తులు వేస్తారో ప్రత్యర్థులు ఊహించగలరు పై ఎత్తులు వేయగలరు. చివరి వరకు సస్పెనే్స కదా?


‘‘ ఇంతకూ ఆ పిల్లకు పెళ్లవుతుందా? కెసిఆర్ దారెటు? ’’
‘‘ కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు కదా? ఐదేళ్ల కాలం గడిచి కక్కోచ్చింది ఎన్నికలు జరిగి తీరాలి. సర్వేలు కూడా బోగస్ అని తేలింది కదా? ఏమవుతుందో కాలమే చెబుతుంది ’’

1 కామెంట్‌:

  1. Vaapu chusi balupu anukonte anthakante dharidram inkoti ledhu..... oka samasyani tholiginchukovadaniki inko samasya thechipettukonna congresski thagina sastri jaragalsindhe....

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం