7, ఆగస్టు 2013, బుధవారం

గుమ్మడి కాయ- హైదరాబాద్- అనపకాయ

హైదరాబాద్ బూడిద గుమ్మడి కాయ లా ఉంటుంది. దీన్ని అనపకాయలా మార్చినప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో జరుగుతుందని, నువ్వెన్నయినా చెప్పురా! సోనియాగాంధీ అలా చేసి ఉండాల్సింది కాదు! మనలాంటి వాళ్ల అభిప్రాయాలు తెలుసుకుని ఉంటే పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదు కదా? ’’ అంటూ ప్రభాస్ హోటల్‌లో మిత్రులకు ఉపన్యాసం ఇవ్వసాగాడు.
 వాళ్ల నాన్న హోటల్ ముందు స్కూటర్ ఆపి ‘‘దరిద్రం వెదవా ఒక్క పనీ సరిగా చేయలేవా! ఆఫీసుకెళ్లాలి షర్ట్ ఐరన్ చేసి పెట్టరా! అంటే ఇదేనారా ఐరన్ చేసే పద్ధతి అంటూ తిట్టాల్సినవి హడావుడిగా తిట్టి వెళ్లిపోయాడు. ఈయన పని చేసేదేదో బాలీ
వుడ్ అయినట్టు ఈయన్ని చూసి ఐశ్వర్యారాయ్ మనసు పారేసుకుంటుందన్నట్టు పెద్ద ఫోజు ’’అని అని తిట్టుకుని మళ్లీ చర్చల్లో మునిగారు.
‘‘మీ పార్టీ అధ్యక్షుడు అన్ని కోణాల్లో ఆలోచించి తీసుకున్న నిర్ణయమే కదరా మళ్లీ సోనియాగాంధీని తప్పంటావు’’ అని అశోక్ గుర్తు చేశాడు. ‘‘మీకు మా నాయకుడ్ని ఆడిపోసుకోవడం తప్ప మరో పని లేదా? మాట మీద నిలబడడమే మీ యువ నాయకుడి బ్రాండ్ ఇమేజ్ అని ప్రచారం చేసుకుంటారు కదా. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని ఇప్పుడు మాట మార్చాడు కదా ఇదేనా మీ నాయకుడి మాట తప్పని తనం’’ అని ప్రభాస్ ఎత్తిపొడిచాడు. ఆయా ప్రాంతాల వాస్తు ప్రకారం నిర్ణయం మార్చుకున్నారు తప్ప నాయకుడి తప్పు కాదు అని అశోక్ సమర్ధించుకున్నాడు.

భాస్కర్ జోక్యం చేసుకుని మా అధ్యక్షుని నిర్ణయం కూడా అంతే మేం సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించడం లేదు. ముహూర్తాన్ని వ్యతిరేకిస్తున్నాం. మనం బస్సెక్కాలన్నా, ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టాలన్నా ముహూర్తం చూస్తాం కదా? కానీ సోనియాగాంధీ ఇంత కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించేప్పుడు సరైన ముహూర్తంలో ప్రకటించలేదని ప్రభాస్ చెబితే పక్కనే ఉన్న పంతులుగారి కొడుకు ప్రకాశ్ జోక్యం చేసుకుని అది బ్రహ్మాండమైన ముహూర్తం అని మా నాన్న చెప్పాడు అన్నాడు. అందరూ నమ్మనట్టుగా చూస్తే, నిజంరా బాబు నామీద ఒట్టు తంగిరాల పంచాంగాన్ని చూసి మరీ చెప్పాడు తలమీద చెయ్యి పెట్టి నమ్మమన్నాడు. ప్రభాస్ వెంటనే అదీ అసలు విష యం నేమాని వారి పంచాంగం చూస్తే సరైన ముహూర్తం దొరికేదే కానీ తంగిరాల పంచాంగాన్ని బట్టి ముహూర్తం నిర్ణయించారు కాబట్టి సమస్య అక్కడే వచ్చింది. అని తన వాదనను బలపర్చుకున్నాడు.

 మరి ఆ రోజు నువ్వు ఇంటర్వ్యూకు నేమాని పంచాంగం చూసి మంచి ముహూర్తంలో వెళితే సెలక్ట్ కాలేదు కదరా? అని పక్కనున్న సులేమాన్ అడిగాడు. సందట్లో సడేమియా అని పంచాంగాల గురించి నీకేం తెలుసు, తెలిసినా నీకెందుకురా! అని అంతా సులేమాన్ నోరు మూ యించారు.

 అది సరే మీ నాన్న రాక ముందు హైదరాబాద్ గుమ్మడి కాయ అని ఏదో చెప్పావు. అక్కడికే వస్తున్నా! దిష్టిపడకుండా గుమ్మడి కాయను కడతారు. హైదరాబాద్ నగరం కూడా అచ్చం గుమ్మడి కాయలా ఉండేది. దాని వల్ల ఎంత అభివృద్ధి చెందినా ఎవరి దిష్టి తగల లేదు. దిష్టికే దిష్టి తగలదు కదా! కానీ హైటెక్ సిటీ అంటూ, ఇంటర్నేషనల్ ఏయిర్ పోర్ట్ అంటూ దక్షిణం వైపు నగరాన్ని విస్తరించారు. దీంతో గుమ్మడి కాయలా ఉన్న హైదరాబాద్ కాస్తా ఆనపకాయలా మారిపోయింది. గుమ్మడి కాయ దిష్టిని తట్టుకుంటుంది కానీ అనపకాయ తట్టుకోలేదు కదా? అందుకే ఈ సమస్యలన్నీ వచ్చాయని ప్రభాస్ చెబుతుంటే అంతా అవాక్కయ్యారు.

అందుకేనా హైదరాబాద్ వాస్తు సరిచేయడానికే మంత్రి టిజి వెంకటేశ్ గద్వాల, ఆలంపూర్‌ను రాయలసీమలో కలిపేయాలని మంచి ఉద్దేశంతో చెబితే అక్కడ ఆయన ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి అలా చెబుతున్నాడని తప్పుగా అర్ధం చేసుకున్నారు అని ముఖేష్ గుర్తు చేశాడు.

ఇదేమీ పట్టనట్టు నిఖిల్ నింపాదిగా కూర్చుంటే ...
ఏరా అంతా కంగారు పడుతుంటే నువ్వేంటి అంత నిబ్బరంగా ఉన్నావని అడిగారు.
మీ కంగారు చూస్తుంటే నాకు నవ్వొస్తున్నదిరా! ఏదో అయిపోతుందని తెలంగాణ వచ్చేస్తుందని మీరంతా అనుకుంటున్నారు కానీ అలాంటిదేమీ జరగదు. నేను చెబుతున్నాను రాసి పెట్టుకోండి అన్నాడు.
అంత ధీమాగా ఎలా చెప్పగలవు అని అడిగితే
జిన్నా ఎలా చనిపోయాడు? అని ప్రశ్నించాడు.
ఏదీ ఆ సైకిల్ పంక్చర్ బాగు చేసే జిన్నా నా? లారీ గుద్ది పోయాడన్నారు. అబ్బా ఆ జిన్నా కాదురా పాకిస్తాన్ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నా ఎలా పోయాడు? అని అడిగాడు.
ఎలా పోతే మనకేంటి? అని అడిగారు.
అసలు కథ అక్కడే ఉంది.
మహాత్మాగాంధీని గాడ్సె హత్య చేయడం వెనుక ఎవరున్నారనుకుంటున్నారు?
సంజయ్‌గాంధీ బతికుంటే మన దేశం పరిస్థితి ఇలా ఉండేది కాదు మహామహానాయకులు ఎంతో మంది తెరమరుగై ఉండేవారు.
అది సరేరా! జిన్నాకు, గాంధీకి, తెలంగాణపై ప్రకటనకు సంబంధం ఏమిటి/
అదంతే బాబు కొన్ని విషయాలు అంత సులభంగా అర్ధం కావు.
అది సరే మన దేశానికి ఆగస్టు 15, 1947లో స్వాతంత్య్రం వచ్చింది కాదంటావా ?. 
ఎందుకంటాను ?
మరింకే తెలంగాణ రాదు.
ఆ ,,ఆ ...???????

ముక్తాయింపు .. కొన్ని చర్చలు అంతే ,, వాటికి లాజిక్ ఉండదు ,,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం