15, జులై 2013, సోమవారం

కాంగ్రెస్‌ను బతికించిన తెలంగాణ... ఇటు తెలంగాణా అటు కాపు.. రాహుల్ పట్టాభిషేకానికి తెలంగాణా


ఈ నెల 12న జరిగిన 
కోర్ కమిటీలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై నిర్ణయాన్ని ప్రకటించక పోవడం వల్ల ఇక తెలంగాణ రాదు అని కొందరు ఆశపడుతున్నారు . గంటన్నర పాటు సాగిన కోర్ కమిటీ సమావేశంలో ఒక వేళ తెలంగాణ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుని ఉంటే భయంకరమైన విమర్శలు వచ్చి ఉండేవి. పదో తరగతి పిల్లాడి పరిజ్ఞానం తెలుసుకోవడానికి కూడా రెండున్నర గంటల పాటు పరీక్ష జరుపుతారు. ముగ్గురు వ్యక్తులతో గంటన్నర పాటు చర్చించి పది కోట్ల మంది తెలుగు ప్రజల భవిష్యత్తు నిర్ణయిస్తారా? అంటూ ధ్వజమెత్తి ఉండేవారు.


తెలంగాణ అంశంపై కాంగ్రెస్ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోంది. ఈ అంశం ద్వారా ప్రత్యర్థులను దెబ్బతీయడం ఒకటి,  రాజకీయ ప్రయోజనం పొందడం మరోటి. మొదటి ప్రయోజనాన్ని కాంగ్రెస్ ఇప్పటికే నమోదు చేసుకుంది. తెలంగాణ అంశం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బతికించింది. అంతే కాదు రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి సైతం తెలంగాణ దోహదం కాబోతోంది. తెలంగాణపై కేంద్రం ఏం చేయబోతోంది అని ప్రశ్నిస్తే, తెలంగాణ ఏర్పాటు కాదు అని జరిగిన పరిణామాలను వివరిస్తూ ఎంత గట్టిగా వాదించవచ్చునో, వస్తుందని ఉదాహరణలు చూపుతూ అంత కన్నా గట్టిగా వాదించవచ్చు. విభిన్నమైన అభిప్రాయాలు అంత బలంగా ఏర్పడేట్టు చేయడంలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఏదో ఒకటి తేలిపోతే కాంగ్రెస్ బలహీనపడి, ప్రత్యర్థులు ఎప్పుడో బలపడేవారు.
ప్రజాస్వామ్యం, ప్రజాభిప్రాయం, దేశ ప్రయోజనాలు, రాష్ట్ర విస్తృత ప్రయోజనాలు  అంటూ పైకి ఎన్ని నీతివచనాలు చెప్పినా రాజకీయం ఒక యుద్ధం. రాజరికంలో రాజ్యవిస్తరణకు, అధికారాన్ని కాపాడుకోవడానికి కత్తిని నమ్ముకుంటే, ప్రజాస్వామ్యంలో ఎత్తుగడలను నమ్ముకోవాలి. అప్పుడు కత్తితో యుద్ధం జరిగితే ఇప్పుడు ఎత్తుగడలతో యుద్ధం చేస్తారు. ఆయుధం మారింది కానీ జరిగేది యుద్ధమే. తెలంగాణ అనే అంశంపై ఇప్పటి వరకు జరిగిన రాజకీయంలో కాంగ్రెస్ నష్టపోయిందేమీ లేదు.పైగా ప్రయోజనం పొందింది.
2009 ఎన్నికల్లో మహాకూటమిని మట్టికరిపించి వైఎస్‌ఆర్ అధికారంలోకి వచ్చినా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ప్రధాన ప్రతిపక్షానికి 92 మంది ఎమ్మెల్యేల బలం ఉండడం, కాంగ్రెస్ మెజారిటీ స్వల్పమే కావడం ఆయనకు రుచించలేదు. ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలంటే విపక్షాలను అస్థిర పరచక తప్పదని ఆపరేషన్ ఆకర్ష్‌కు శ్రీకారం చుట్టారు. వైఎస్‌ఆర్ లాంటి జనాకర్షణ గల నాయకుడి నాయకత్వంలో ఉన్నప్పటి కన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మైనారిటీలోనే ధీమాగా ఉంది. కాంగ్రెస్‌కు ఇంతటి ధీమాను ఇచ్చిన అంశం తెలంగాణ!
అసలు ప్రభుత్వం ఉందా? అనుకునే విధంగా పాలన సాగుతోంది. అయితే దమ్ముంటే ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టండి అని సవాల్ చేసే స్థితిలో ప్రభుత్వం ఉంటే, మేం అవిశ్వాసం పెట్టం అంటూ విపక్ష నేత బహిరంగంగా ప్రకటించారు. అలా అని వైఎస్‌ఆర్ కన్నా కిరణ్ కుమార్‌రెడ్డి సమర్ధుడైన నాయకుడని కాదు. తెలంగాణ అంశం అలా నానుతూ ఉన్నంతకాలం ప్రధాన ప్రతిపక్షం ఎన్నికలకు సిద్ధమయ్యే పరిస్థితి ఉండదు. ఈ ప్రతిపక్ష బలహీనతనే అధికార పక్షం బలం. ఒక్క ఎమ్మెల్యే బలం లేకపోయినా కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి ఢోకా లేదని ఎప్పుడో తేలిపోయింది.
ఎవరి అంచనాలు వారివి, ఎవరి విశ్లేషణలు  వారివి. తెలంగాణను ఇస్తామని, ఇవ్వమని చెప్పకుండా కాంగ్రెస్ రాజకీయం నడిపిస్తోంది. ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తే, టిఆర్‌ఎస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్, టిడిపిలు దూసుకెళతాయి, కాంగ్రెస్ కొచ్చిన ప్రయోజనం ఏమీ లేదు. నిర్ణయం ఎంత ఆలస్యం అయితే కాంగ్రెస్‌కు అంత ప్రయోజనం. తెలంగాణ అంశంపై నిర్ణయం తీసుకునే అధికారం కాంగ్రెస్ చేతిలో ఉండడం అనేదొక్కటే కాంగ్రెస్‌ను రాష్ట్రంలో బతికిస్తోంది. మాయలపకీరు ప్రాణం చిలుకలో ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రాణం తెలంగాణ అంశంలో ఉంది. అందుకే అంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ కాంగ్రెస్ ఎప్పుటికప్పుడు తెలంగాణపై చర్చలు సాగిస్తూ ముందుకెళుతోంది.

 ఒకవేళ వైఎస్‌ఆర్ ఉండి ఉన్నా మూడవ సారి అధికార పక్షాన్ని గెలిపించడం అంత సులభం కాదు. 2009 ఎన్నికల సమయంలోనే ఒకరిద్దరు కాంగ్రెస్ సీనియర్ల వద్ద తెలంగాణ అంశంపై వైఎస్‌ఆర్ తన మనసులోని మాట బయటపెట్టారు. 2009 వరకు మాత్రమే మనం తెలంగాణను అడ్డుకోగలం, 2014 నాటికి మనకు అంత శక్తి ఉండదు అనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసినట్టు కాంగ్రెస్‌లో ప్రచారంలో ఉంది.
2009 డిసెంబర్9న చేసిన ప్రకటనకు కట్టుబడి తెలంగాణను మూడేళ్ల క్రితమే ఏర్పాటు చేసి ఉంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఇలా ఉండేది కాదు. సీమాంధ్రలో జగన్, బాబు దూకుడుగా వెళ్లి ఉండేవారు. కార్యకర్తల బలం, ఆర్థిక బలం, ప్రచార బలం ద్వారా తెలంగాణలో సైతం చంద్రబాబు చొచ్చుకెళ్లగలిగే వారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు సైతం తెలంగాణలో స్పీడ్ బ్రేకులు పడేవి కాదు.
కానీ డిసెంబర్ 9 నాటి ప్రకటనకు వ్యతిరేకంగా సీమాంధ్ర నాయకులు ఉద్యమించడం రాజకీయంగా కాంగ్రెస్‌కే కలిసి వచ్చింది. అప్పటి నుంచి సమస్యను అలా నానుస్తూనే ఉన్నారు. 42 నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు జరిగితే సగం స్థానాల్లో టిడిపి డిపాజిట్ పోగొట్టుకుంది. తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి ఇబ్బంది కరంగా ఉంది. మూడేళ్ల క్రితమే కేంద్రం తెలంగాణకు అనుకూలంగానైనా, వ్యతిరేకంగానైనా ఒక నిర్ణయం అంటూ తీసుకుని ఉంటే టిడిపి పుంజుకోవడానికి అవకాశం ఉండేది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేంత సమయం టిడిపికి ఉండేది. కానీ అలాంటి చాన్స్ లేకుండా పోయింది. ఒక నిర్ణయాన్ని తీసుకుని అమలు చేసిన తరువాతనే కాంగ్రెస్ 2014 ఎన్నికలకు వెళ్లే పరిస్థితి. తెలంగాణ సమస్యకు పరిష్కారం అంటే తెలంగాణ ఏర్పాటే తప్ప మరో పరిష్కారాన్ని తెలంగాణ కోరుకునే వారు ఒప్పుకోరు.
డిసెంబర్9 చేసిన ప్రకటన ఉప సంహరించుకుంటున్నామని కేంద్రం ఎప్పుడూ ప్రకటించలేదు. డిసెంబర్ 23న చేసిన ప్రకటనలో సైతం అభిప్రాయాలు తెలుసుకుంటామని చెప్పారు కానీ నిర్ణయాన్ని ఉప సంహరించుకుంటున్నట్టు చెప్పలేదు. రాష్ట్రం నుంచి సిపిఎం మినహా మరే పార్టీ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరలేదు. రెండు వారాలు, మూడు వారాలు, నెల అంటూ రోజులు గడిపిన కాంగ్రెస్ ఇప్పుడు వేగాన్ని పెంచింది. ఇక ఎన్నికలకు వెళ్లే ముందు కాంగ్రెస్ తెలంగాణపై ఏ నిర్ణయమైనా సరే తీసుకోవడంతో పాటు అమలు చేయాలి కూడా. తీసుకున్న నిర్ణయం కొన్ని వందల సంవత్సరాల పాటు ప్రభావం చూపవచ్చు కానీ, ఆ నిర్ణయం తీసుకునేప్పుడు ఉన్న పరిస్థితులే నిర్ణయంలో కీలక పాత్ర వహిస్తాయి.
ఇప్పుడున్న పరిస్థితులు తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగానే ఉన్నాయి. పదేళ్ల పాలన  తరువాత కూడా  కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకు వచ్చేంత గొప్ప నాయకత్వమేమీ ఆ పార్టీకి లేదు. ఇది తెలంగాణకు కలిసి వచ్చే అంశం. ఇక రెండు రాష్ట్రాలుగా విభజన జరిగితే, తెలంగాణలో కాంగ్రెస్, టిఆర్‌ఎస్‌లు ప్రధాన శక్తులుగా నిలుస్తాయి. మొదటి నుంచి కాంగ్రెస్‌కు రెడ్లు అండగా నిలుస్తున్నారు. జగన్ పార్టీ ఏర్పాటు చేసిన తరువాత రెడ్లు జగన్ వైపు వెళుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో సమైక్యాంధ్రలో ఎన్నికలకు వెళితే కాంగ్రెస్ పరిస్థితి గతంలోని రికార్డును బద్ధలు చేసే విధంగా ఉండొచ్చు.  కాంగ్రెస్ అలాంటి సాహసానికి పునుకోక పొవచ్చు. తెలంగాణ ఏర్పాటు చేసి,  సీమాంధ్ర కాంగ్రెస్‌లో కాపుల ప్రాబల్యాన్ని పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. పిసిసి అధ్యక్షుడిగా బొత్స సత్యనారాయణ ఉన్నారు. అదే సామాజిక వర్గానికి చెందిన చిరంజీవిని కేంద్ర మంత్రిని చేశారు. చిరంజీవి ఇమేజ్ సొంతంగా ముఖ్య మంత్రి కావడానికి ఉపయోగపడలేదు. కానీ తన ఇమేజ్, కాంగ్రెస్ బలం కలిస్తే సీమాంధ్రలో కాంగ్రెస్ గౌరవ ప్రదమైన స్థానంలోనే నిలబడే అవకాశం ఉంది.
రాష్ట్రంలో అధికారం రెండు సామాజిక వర్గాలకే పరిమితం అయిందనే విమర్శ  సామాజిక వర్గాలన్నింటిలో ఉంది. అదే విధంగా కాపు సామాజిక వర్గం అధికారం కోరుకుంటోంది. ప్రజారాజ్యం వారిని తీవ్రంగా నిరాశ పరిచింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్, కాపు కాంబినేషన్ కలిసినప్పుడు కాంగ్రెస్‌కు అంతో ఇంతో ప్రయోజన కలగవచ్చు. రాజకీయాల్లో ఎన్ని విమర్శలు చేసుకున్నా, ఎవరిపై ఎన్ని కేసులు పెట్టుకున్నా పరస్పర ప్రయోజనాల కోసం ఎంతటి శత్రువులైనా కలిసిపోతారు. అలానే ఎన్నికల తరువాత టిఆర్‌ఎస్, వైఎఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీల బలం సైతం కేంద్రంలో మరోసారి యుపిఏ ప్రభుత్వం ఏర్పాటుకు ఉపయోగపడవచ్చు. తన కుమారున్ని ప్రధానమంత్రిని చేయాలనుకుంటున్న సోనియాగాంధీ కల నెరవేరవచ్చు. తెలంగాణ ఏర్పాటు చేయడం ద్వారా పార్లమెంటులో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నట్టుగా ఉంటుంది. రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిగా చూసే అవకాశమూ సోనియాగాంధీకి దక్కుతుంది. అలా కాకుండా ఎలాంటి మార్పు లేకుండా సమైక్యాంధ్రలో ఎన్నికలకు వెళితే ఫలితాలు ఎలా ఉంటాయో పలు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఇప్పటికే చూసింది. 

తెలంగాణ ప్రజల కోసమో, తెలంగాణ ప్రజలు చేసిన ఉద్య మం కోసమో, కెసిఆర్ కోసమో కాకుండా సొంత ప్రయోజనాల కోసం సోనియాగాంధీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వైఎస్‌ఆర్ అమలు చేస్తున్న పథకాలు అన్నీ అమలు చేస్తూ మరిన్ని కొత్త పథకాలు ప్రవేశపెట్టినా కిరణ్ కుమార్‌రెడ్డికి జన నేతగా గుర్తింపు రాలేదు.కిరణ్ కుమార్‌రెడ్డికి వైఎస్‌ఆర్‌లా ఇమేజ్ ఏర్పడి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది.
తెలంగాణా ఏర్పాటు కాంగ్రెస్ కు అనివార్యం . 

10 కామెంట్‌లు:

  1. తెలంగాణా ఏర్పాటు కాంగ్రెస్ కు అనివార్యం .

    తేల్చి చెప్పేరు బాగుంది.

    రిప్లయితొలగించండి
  2. మురళి గారు,

    ఈ మధ్యకాలంలో ఇంత మంచి విశ్లేషణ చదవలేదు. చాలా బాగా రాశారు.

    తెలంగాణా అంశాన్ని Delhi point of view తో మాత్రమే చూడాలి. అప్పుడే మనకి వాస్తవాలు అర్ధమవుతాయి.

    రిప్లయితొలగించండి
  3. వై వి రమణ గారు ధన్యవాదాలు .. కోర్ కమిటి జరిగిన మరుసటి రోజు తెలుగు చానల్స్ లో కొందరు తుస్సుమంది .. తస్సు మంది అని ఉత్సాహంగా విశ్లేషణలు చేశారు . కిరణ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారని పొగిడారు . రెండు రోజులు గడిచాకా ఆ రోజు కోర్ కమిటీ లో తెలంగాణకు అనుకూలంగానే నిర్ణయం జరిగిందా ? జాతీయ మీడియాలో అలానే వార్తలు వస్తున్నాయని ఈ రోజు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు

    రిప్లయితొలగించండి
  4. తెలంగాణ ఏర్పాటుద్వారానే కేంద్రం లో అధికారం లోకి వచ్చే అవకాశం కాంగ్రెస్ కు ఉండకపోవచ్చు. మిగిలిన రాష్ట్రాల ప్రజల వోట్ల ప్రభావం కూడా ఉంటుంది. అయితే తన స్వార్థం కోసం తెలుగు ప్రజల గొంతు కోయడానికి కాంగ్రెస్ వెనుకాడదు.

    రిప్లయితొలగించండి
  5. చక్కటి విశ్లేషణ మురళి గారు, నేను ఊహించని మరో కోణాన్ని చూపారు.

    రిప్లయితొలగించండి
  6. చిరంజీవికి అంత సీనుందా?

    మొన్నటికి మొన్న కాంగ్రేసువాళ్ళని ఛెడామడా తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టి అదే నోటితో నేడు కాంగ్రేసుకు ఓటేయండి సోనియమ్మ కొడుకుని ప్రధాని చేయండీ అని ఎన్నికల ప్రచారం చేయబోతే జనం నవ్వరా? ఛీ కొట్టరా? ప్రజల జ్ఞాపకశక్తీ వివేకమూ అంత పలుచన అని నమ్మకమా? నా అభిప్రాయంలో చిరంజీవిని ముందుపెట్టి ప్రచారం చేస్తే కాంరెసుకు పెద్ద దెబ్బ తగిలే అవకాశం చాలా ఎక్కువ.

    ఇక తెలంగాణ రాష్ట్రం ఇచ్చేయటం వలన కాంగ్రెసుకు లాభం ఉంటే ఇస్తుంది - దేశానికి ఏం ప్రయోజనం ఏం నష్టం అని ఆలోచించేత పిచ్చి విశాలహృదయం దానికి లేదు - ఎన్నడూ లేదు. ముందూ ఉండబోదు.

    రిప్లయితొలగించండి
  7. బుద్ధా మురళిగారు అతి జాగరూకతతో రాష్ట్రవిభజనను ఒక న్యాయాధీశునిలా విశ్లేషించారు!ఎక్కడా తొట్రుపడలేదు!తొందరపడలేదు,తబ్బిబ్బుపడలేదు!ఏ అనుభవం లేని రాహుల్ ప్రధానిగా రానించలేడని నేను నమ్ముతున్నాను!

    రిప్లయితొలగించండి
  8. రాహుల్ ప్రధానిగా రాణించ నవుసరం లేదండీ. నిజానికి మన్మొహన్‌జీగారు యేమాత్రం రాణించారు చెప్పండి? పదవి నంటి బెట్టుకో గలగటం ఒక్కటే ముఖ్యం.
    ప్రతిపక్షాలు ఒక నిజంగా బలమైన స్థిరమైన ప్రత్యామ్నాయాన్ని చూపగలిగే స్థితిలో లేనప్పుడు రాహుల్‌కి అడ్డేమిటి?
    రాజకుటుంబంలోని వ్యక్తికి హారతులెత్తే‌ కాంగెర్సునుండి రాజకుమారుడినే కాక సమర్థుడిని ప్రధానిగా ఆశించకండి.
    మన్మోహన్ ఒక డమ్మీ‌ ప్రధాని అని అందరికీ‌తెలుసు కదా, అది అవసరార్థమైన తమాషా అన్నమాట.
    భవిష్యత్తులో రాజకుమారుడొకరికి మైనాదిటితీరి ఓటుహక్కు లేకపోతే, రాజ్యాంగాన్ని సవరించి అయినా కాంగ్రెసు వాళ్ళు ప్రధానిని చేస్తారు.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం