2, జూన్ 2013, ఆదివారం

ఇంటిలోనే లోక కల్యాణం!

వెయ్యి అబద్ధాలు ఆడయినా ఒక పెళ్లి చేయాలంటారు. ఒక్కకల్యా ణానికే వెయ్యి అబద్ధాల వరకు మినహాయింపు ఉన్నప్పుడు ఇక లోక కల్యాణం కోసం ఎన్ని అబద్ధాలు అడొచ్చు లెక్క తేలాలంటే లెక్కలేనన్ని రోజులు పడుతుంది. లోకంలో.. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎక్కడ ఏం చేసినా అందులో కచ్చితంగా లోకకల్యాణం ఉండే ఉంటుంది. లేకపోతే వాళ్ళెందుకా పని చేస్తారు? రాక్షసులు, దేవతలు ఎవరేం చేసినా లోక కళ్యాణం కోసమే! అనుమానం ఉంటే ఏ పురాణాన్నైయినా చదవండి. ఏ నాయకుడి పురాణాన్నయినా వినండి. లోకకల్యాణం కోసమే అని స్పష్టంగా తెలుస్తుంది. దేవతలు రాక్షసులు అన్నా దమ్ముళ్ళే. అలానే కురువంశానికి చెందిన కౌరవులు, పాండవులు అన్నదమ్ములే. రాజకీయ నాయకులను అధికార పక్షం, ప్రతిపక్షం అని సులభంగా అర్ధం కావడానికి మనం పిలుచుకున్నట్టు పాండవులు, కౌరవులు అని పిలుచుకుంటాం కానీ ఇద్దరిదీ కురు వంశమే!! రాక్షసులైనా, దేవతలైనా, కౌరవులైనా పాండవులైనా, అలానే అధికార పక్షం అయినా విపక్షం అయినా ఎవరేం చేసినా లోక కల్యాణం! కోసమే చేస్తారు. అధికార పక్షం వారికే లోకకల్యాణం పనులు చేసే అవకాశం ఉంటుందని విపక్షానికి ఆ అదృష్టం ఉండదనేది అపోహ మాత్రమే! పురాణాలు చూస్తే దేవతలే కాదు రాక్షసులు సైతం లోక కల్యాణంకోసం ఎన్నో పనులు చేశారు. ఒక నటుడు హీరోగా నటిస్తే, ఇంకొకడు విలన్‌గా నటిస్తాడు. అంతా మాత్రాన హీరో అనే వాడు మంచివాడని, విలన్ చెడ్డవాడని ఎలా అంటాం? దర్శకుడు ఎవరిని ఏ పాత్రకు ఎంపిక చేస్తే ఆ నటుడు ఆ పాత్రలో నటిస్తాడు అంతే. (చాలా సార్లు షూటింగ్ ముగియగానే హీరో, విలన్ ఇద్దరూ విలనే్ల. హీరోయిన్ మాత్రం పాపం!)

రాజకీయాల్లో కూడా అంతే సినిమాల్లో దర్శకుడు ఒక్కో పాత్రకు ఒక్కొక్కరిని ఎంపిక చేస్తాడు. ప్రజా స్వామ్యంలో ఓటరే దర్శకుడు ఎవరికి ఏ పాత్ర ఇవ్వాలో నిర్ణయిస్తాడు. 60 ఏళ్లు దాటినా హీరోగా నటించే అదృష్టం ఎవరో కొద్ది మందికే ఉంటుంది! హీరో వేలువిడిచిన పిన్నమ్మ చిన్నతల్లి, మనవడికి కూడా హీరో అయ్యే చాన్స్ ఉంటుంది. లోక కల్యాణం కోసం మనం వారిని హీరోలుగా చూడాల్సిందే. సినిమా ప్రపంచం చేతిలో ఉంటుంది కాబట్టి అది చెల్లుబాటు అవుతుంది. కానీ ఓటరు నిర్దయుడు. ముఖ్యమంత్రి పీఠం నాకు బాగా నచ్చింది అక్కడే కూర్చుంటాను అని ఎంత మారాం చేసినా వాడు వినడు. ఋషుల మనస్సు దోచి తపస్సును భగ్నం చేసేందుకు రక రకాల నృత్యాలు చేసే రంభా ఊర్వశి, మేనకల్లా ఓటరు దీక్షను భగ్నం చేసి మనసు కుర్చీని లాక్కెళ్లాలని ఎవరి ప్రయత్నాలు వారు చేస్తారు.

దేవ వేశ్యలను అపార్ధం చేసుకుంటాం కానీ వాళ్లు అలా ఋషుల ముందు నృత్యాలు చేసేది తమ సుఖం కోసమా కాదు కానే కాదు లోక కళ్యాణం కోసం. అంతటి అందగత్తెలు మాసిన గడ్డంతో ఏళ్ల తరబడి చెట్ల, పుట్టలతో సహవాసం చేస్తూ అడవుల్లో తపస్సు చేసే ఏ మాత్రం గ్లామర్ లేని ఋషులను కవ్విస్తూ నృత్యం చేయాలంటే ఎంత కష్టం. షోలేలో గబ్బర్ సింగ్ ముందు హేమామాలిని నాట్యం చేసినంత కష్టం. అంత గ్లామర్ ఉన్న రంభా, ఊర్వశి, మేనక, తిలోత్తమలు స్వాముల ముందు నృత్యం చేయడం లోక కల్యాణం కోసం.

 హిందీ అయినా తెలుగైనా, ఏ భాషా చిత్రాలైనా ఇప్పుడు నాలుగు రోజులు నడవాలంటే ఐటం సాంగ్స్ తప్పని సరి. కొన్ని సినిమాల్లో అయితే హీరోయినే్ల ఐటెం గర్ల్స్‌గా ప్రత్యక్షం అవుతున్నారు. ఇదేదో ఈ కాలంలో మన దర్శకులు కనిపెట్టిన విషయమేమీ కాదు. పురాణాల కాలం నుంచి ఉన్నదే. తొలి ఐటం గర్ల్ రంభ. హీరోయిన్‌గా సినిమా మొత్తం అతి తక్కువ బట్టలతో నటించడం కన్నా ఐటెం సాంగ్‌లో నృత్యం చేయడమే లాభసాటి అని కొందరు హీరోయిన్లు గ్రహించేశారు. అంత మాత్రాన మనం రంభను చిన్నచూపు చూస్తామా? ఐటెం గర్ల్స్‌ను చిన్నచూపు చూస్తామా? వారైనా వీరైనా లోక కల్యాణం కోసమే ఆ పని చేస్తారు.
కైకేయి శ్రీరామున్ని అడవులకు పంపినా, రావణుడు సీతను అపహరించినా, ఆ రాముడు చెట్టు చాటు నుంచి వాలిని సంహరించినా, అంతా లోక కల్యాణం కోసమే. ఈ లోక కళ్యాణంలో కొందరు విలన్ పాత్రలో కనిపిస్తే, కొందరు హీరో పాత్రలో కనిపిస్తారు కానీ ఇద్దరి లక్ష్యం లోక కల్యాణంమే!

నారదున్ని జగడాల మారిగా ఆడిపోసుకుంటారు సినిమా ముగియగానే చివర్లో అంతా ఆయన లోక కళ్యాణం కోసమే ఈ పని చేశారని గ్రహిస్తారు. ఏదైనా సినిమాలో హీరో విలన్‌గా కనిపిస్తే తెలుగు ప్రేక్షకుడు తొందరపడి ఒక నిర్ణయానికి రాడు. ఏదో బలమైన కారణం ఉండడం వల్లనే లోక కల్యాణం కోసం హీరో అలా విలన్‌లా ప్రవర్తిస్తున్నాడని, చివరలో అసలు విషయం బయటపడుతుందని గ్రహించేస్తారు. లోక జ్ఞానం లేకపోవడం వల్ల మహనీయులు చేసే పనిలోని లోక కల్యాణాన్ని మనం గ్రహించ లేకపోతున్నాం. తానేం చేసినా లోక కల్యాణం కోసమే అని విపక్ష నేత ప్రకటించారు. 63 ఏళ్ల వయసులో ఆయన లోకకల్యాణం కోసం పాదయాత్ర చేశారు. తన కుమారుడిని వారసునిగా తీర్చి దిద్దుతున్నారు. బాబూ అధికారం ముళ్ల కిరీటం అని సోనియా చెప్పినా లోక కల్యాణంకోసం రాహుల్‌గాంధీ ముళ్ల కిరీటం ధరించేందుకు కసరత్తులు చేస్తున్నారు. 63 ఏళ్ల వయసులో బాబు లోక కల్యాణం కోసం పాదయాత్ర చేశారు. అంతే తప్ప ముఖ్యమంత్రి పదవి కోసం కానే కాదు. తన స్థానంలో లోకేశ్‌ను కూర్చోబెట్టడానికి బాబు ప్రయత్నిస్తున్నారంటే లోక జ్ఞానం లేని వాళ్లు విమర్శలు చేయవచ్చు కానీ ఆయనా పని చేస్తున్నది లోక కల్యాణం!  కోసమే.
అమెరికా ఇరాన్ మీద దాడి చేసినా, ఇరాక్ ను పాలించే  సద్దాం హుస్సేన్‌ను చంపినా లోక కల్యాణం కోసమే. మేం ప్రపంచంలోని ఏ దేశంపై దాడి చేసినా అది లోక కల్యాణం! కోసమే తప్ప పెట్రోల్ బావుల కోసం కానే కాదు అని అమెరికా చెప్పిన తరువాత కూడా అనుమానించడం అంటే లోక కళ్యాణాన్ని అడ్డుకోవడమే. విష్ణువు మోహిని అవతారం ఎత్తింది లోక కల్యాణం కోసమే. తెలుగు నేత వేషాలతో విశ్వరూపం చూపింది లోక కల్యాణంకోసమే. లోక కళ్యాణం కోసం నేత అలా ముందుకు వెడుతుంటే, విమర్శించే వారు లోక కంటకులు. నాయకుల లోక కల్యాణం! చరిత్రను ప్రస్తావించేది కూడా లోక కల్యాణం!కోసమే.
ముక్తాయింపు .. కల్యాణం అంటే తెలుసు కాని ఇంతకు లోకమంటే? 
ఎవరి నిర్వచనం వారిది .. కొందరికి కుటుంబమే లోకం, కొందరికి సామాజిక వర్గమే లోకం ..  కొందరికి తామే లోకం అనిపిస్తుంది  త్యాగ జీవులకు తమ సంతానం లోనే లోకం కనిపిస్తుంది . యశోదకు కృష్ణుడి నోటిలో విశ్వం కనిపిస్తే ముచ్చట పడ్డ మనం కుమారుడి ముఖం లో లోకాన్ని చూసుకుంటే ఎందుకు తప్పు పట్టాలి . 

2 కామెంట్‌లు:

మీ అభిప్రాయానికి స్వాగతం