6, ఫిబ్రవరి 2013, బుధవారం

ఈ పిల్లకు మొగుడెవరో?


టీవీని చూస్తూ ఈ పిల్లకు మొగుడెవరొస్తారో? అని పరంధామయ్య ఎదురుగా ఉన్న పరశురామయ్యను అడిగాడు.

 మా గోల్డ్ టీవిలో ఎప్పటిదో పాత సినిమా వస్తోంది. మురళీ మోహన్ గుడ్డివాడు. కర్ర పట్టుకుని పాట పాడుతూ జోలెపట్టి అడుక్కుంటున్నాడు. కారులో వెళుతున్న ప్రభ ఆ పాట వింటూ తన్మయంలో మునిగిపోయింది. జోలెపట్టి అడుక్కుంటున్న మురళీ మోహన్‌ను ప్రభ తన్మయంగా చూస్తోంది. ‘‘ఇందులో పెద్దగా ఆలోచించాల్సిందేముందోయ్ ఆమెకు మురళీ మోహన్‌తోనే పెళ్లవుతుంది. హీరో ముష్టివాడైనా కుష్టి వాడైనా హీరోయిన్ అతనే్న ప్రేమిస్తుంది. రేపిస్టోడైనా పాపిష్టోడైనా హీరోయిన్ హీరోనే ప్రేమించాలి ఇది సినిమా థర్మం. కావాలంటే పందెం’’ అని పరశురామయ్య చెబుతుంటే, పరంధామయ్య అడ్డు తగిలి ‘‘నేనడిగింది ఈ సినిమాలో ప్రభ పెళ్లి గురించి కాదు. వచ్చే ఏడు రాజ్యలక్ష్మి పెళ్లీడుకొస్తుంది కదా మొగుడెవరంటావు ’’ అని అడిగాడు.

 ఇంటర్ నెట్ ఆన్ చేయగానే ముందు వివాహ ప్రకటనలే స్వాగతం పలుకుతున్నాయి కదా? మన చిన్నప్పుడు పెళ్లిళ్ల పేరయ్యలు చేసే పనిని ఇప్పుడు అవేవో మాట్రిమోనియం డాట్ కాంలట వందల కోట్ల వ్యాపారం చేసేస్తున్నాయి. వివరాలు పంపలేకపోయావా? వేల సంబంధాలు వచ్చి వాలిపోతాయి కదా? అని పరశురామయ్య చెప్పుకొచ్చాడు.
మరో ఏడాది అయితే పెళ్లి కాంట్రాక్టు ముగుస్తుంది కదా అప్పుడు ఈ అమ్మాయికి మొగుడెవరో అని అడుగుతున్నాను అని చిలిపిగా నవ్వుతూ మళ్లీ ప్రశ్నించాడు. 

ఎంటోరా! ఈ మధ్య విడాకులు మరీ ఎక్కువయ్యాయి. చిన్న చిన్న సమస్యలకే విడాకుల వరకు వెళుతున్నారు. కొత్త దేవుడి కన్నా పాత దయ్యం మేలంటారు కదా? విడాకులు తీసుకుని మళ్లీ పెళ్లి చేసుకున్నా వాళ్లు కలిసుంటారనే నమ్మకం ఏమిటి? అని పరశురామయ్య ప్రశ్నించాడు. పరుశూ నువ్వింకా అర్ధం చేసుకోలేదురా! శ్రీరామునికి ఏటేటా పెళ్లవుతుంది కదా? అలానే రాజ్యలక్ష్మికి ఐదేళ్ల కోసారి పెళ్లి జరపాల్సిందే కదా? ఎలాంటి మొగుడు వస్తాడా? అని ఆలోచిస్తున్నాను. ఐదేళ్ల పెళ్లి అంటే మాటలు కాదు అని పరంధామయ్య నవ్వాడు. 

ఓహో రాజ్యలక్ష్మి పెళ్లి అంటే ఎవరో అమ్మాయి అనుకున్నాను. నువ్వు మాట్లాడుతున్నది ఐదేళ్ల పెళ్లి గురించా అని పరశురామయ్య గట్టిగా నవ్వాడు. ఇంతకూ ఎవరితో పెళ్లవుతుందని నువ్వు అనుకుంటున్నావు? నీ ఎరుకలో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అని పరశురామయ్య అదే ధోరణిలో అడిగాడు. లేకేం మూడు నాలుగు సంబంధాలు ఉన్నాయి. వాళ్లకు సర్వ అవలక్షణాలూ ఉన్నాయి. పరంధామయ్య నిరాశ ధ్వనించినట్టుగా చెప్పాడు. 

మా వాడికి మీ రాజ్యలక్ష్మిని కట్టబెట్టండి వీడంత మొనగాడు మరొకడు లేడు అంటూ ఎవరి చానల్‌లో వాళ్లు గోల గోలగా మార్కెటింగ్ చేసుకుంటున్నారు. ఒక్కో చానల్ ఒక్కో పెళ్లి కొడుకును ప్రమోట్ చేయడమే కాకుండా తమకు పోటీగా ఉన్న పెళ్లి కొడుకు ఎంత దుర్మార్గుడో కథలు కథలుగా వర్ణిస్తున్నారు. ఇవన్నీ చూశాక రాజ్యలక్ష్మికి అసలు పెళ్లి మీదనే విరక్తి కలుగుతుందేమో ననిపిస్తోంది. ఆ ప్రచారం చూడడం కన్నా దూరదర్శన్‌లో పందుల పెంపకం కార్యక్రమం భరించడం ఈజీ అనిపిస్తోంది అని పరశురామయ్య చెప్పాడు. ఇంతకూ మరి ఏం జరుగుతుందని అనుకుంటున్నావ్? అని ఆసక్తిగా అడిగాడు. ఇదిగో ఇప్పటి వరకు వచ్చిన సంబంధాలు ఇలా ఉన్నాయి.
‘‘అబ్బాయి వయసులో ఉన్నవాడే. తండ్రి ఆస్తి భారీగానే కలిసొచ్చింది. మాట మీద నిలబడే వంశం అని చెబుతున్నాడు. రెండు చేతులా సంపాదించాడు. బయటకు వదిల్తే మరింత సంపాదిస్తాడని పూర్తి నమ్మకం ఉంది. కానీ జైలులో ఉన్నాడు. చూస్తూ చూస్తూ జైలుపక్షికి రాజ్యలక్ష్మిని ఎలా కట్టబెడతారు? అదే అసలు సమస్య. 

మరొకరేమో షష్టిపూర్తి దాటిన వయ సు. పెళ్లికి తహతహలాడుతున్నాడు. నా పాతివ్రత్యం గురించి నా మొదటి మొగుడ్ని అడుగు అందట వెనకటికొకావిడ. ఈయనా అంతే తొమ్మిదేళ్లు కాపురం చేసినప్పుడు రాజ్యలక్ష్మిని నేనెంతగానో ప్రేమించాను, రాజ్యలక్ష్మి లేందే క్షణం ఉండలేను అంటున్నాడు. మీరేం డిమాండ్ చేసినా ఒప్పుకుంటాను నమ్మండి అంటున్నాడు. ఆయన మాటలు బాగుంటాయి . మాటలకు ఆచరణకు  అస్సలు సంబంధం ఉండకుండా  జాగ్రత్త పడతాడు . ఆయన మాట అస్సలు నమ్మలేం అదే ఈయనతో వచ్చిన చిక్కు. కాళ్లు బొబ్బలెక్కాయి, నీరసంగా ఉంది, గుండె కొట్టుకుంటోంది అంటూ ఆయన చెబుతున్నవి వింటుంటే నీరసం వచ్చేస్తోంది. రాజ్యలక్ష్మిని కట్టబెడితే జీవితం ఎంత హాయిగా ఉంటుం దో చెప్పాలి కానీ రోగాల జాబితా చెబితే జాలి పుడుతుందేమో కానీ రాజ్యలక్ష్మిని అప్పగించాలని అనిపిస్తుందా?
ఇక ఇప్పుడున్నాయన హై కమాండ్‌నే నమ్ముకున్నాడు. తానెంత మొనగాడో చెప్పుకోవాలి కానీ తల్లి చాటు బిడ్డలా అన్నింటికి హై కమాండ్‌పై ఆధారపడే మొగుడ్ని ఎంత త్వరగా వదిలించుకోవాలని చూస్తుందేమో కానీ మళ్లీ చేసుకోవాలని చూస్తుందా? నాకైతే అనుమానమే. ఇక ఎర్రన్నలిద్దరూ వాళ్ల సిద్ధాంతాలను వాళ్లు అర్ధం చేసుకోవడానికే జీవిత కాలం సరిపోదు ఇక రాజ్యలక్ష్మినేం ఒప్పిస్తారు. ఇక మరొకాయన ఆ మధ్య కమలం పువ్వు పట్టుకుని ప్రేమిస్తున్నానని తిరిగాడు, ఆమ్మాయి ఆయన వైపు చూసే లోగానే సైకిలెక్కి తుర్రుమన్నాడు. పువ్వు సైకిల్ చైన్‌లో పడి ఆయిల్ అంటుకుని ప్రేమకు పనికి రాని పువ్వయింది. ప్రేమకే పనికి రానప్పుడు పెళ్లి దాకా ఏం ఆలోచిస్తాం . ఇంకొకాయనేమో ఒక రాజ్యలక్ష్మిని రెండు ముక్కలు చేయండి, ఒకటి స్వీకరిస్తానంటున్నాడు.

ఇన్ని అవలక్షణాలున్న పెళ్లి కొడుకులను చూస్తుంటే రాజ్యలక్ష్మికి అసలు పెళ్లవుతుందా? అమె భవిష్యత్తు ఏమిటో? తలుచుకుంటేనే దిగులేస్తోంది. ఈ ఏడాదిలో ఏదో అద్భుతం జరిగితే తప్ప లేకపోతే వీరిలోనే ఎవరో ఒకరిని ఇష్టం ఉన్నా లేకున్నా మనువాడలి . పాపం రాజ్య లక్ష్మి .. 

5 కామెంట్‌లు:

  1. దిగులు పడకండి. ఒకసారి కళ్ళు తెరిచి చూస్తే, 'సత్తా' ఉన్న వరుడు కనిపిస్తాడు.

    రిప్లయితొలగించండి
  2. మీ ఆశా వాదం అద్భుతం .. ఆయనకు వార్డు లో గెలిచే సత్తా నే లేక పోటికి పెట్టలేదు . ఇక ముఖ్య మంత్రి పదవా ?.. ఈసారి టిడిపి పోటి చేస్తుంది కాబట్టి ఉన్నది కుడా పోతుంది

    రిప్లయితొలగించండి
  3. అందుకె మాష్టారు "గ్రామ రాజ్య లక్ష్మి" ని అధికారులకి కత్ట్టబెట్టరు మన కాంగీ లు ఇక రాజ్య లక్ష్మి ని కూడా ఏ రాష్త్ర పతికొ గవర్నరుకొ అంటగట్ట్ ఇ మరొ సంవత్సరం గడిపెస్తారు అప్పుడు దిక్కు లెక అక్కమొగుడె...సామేతలా మన రాజ్యలక్ష్మి పడి ఉంటుంది కాంగీ తొనె!

    రిప్లయితొలగించండి
  4. ముసుగు వేసుకొని ఖైదీ కన్నయ్య లా వస్తే చెప్పలేం కానీ నేరుగా హస్తం తో ఈ సారి ఆ పార్టీ వచ్చే చాన్స్ లేదు

    రిప్లయితొలగించండి
  5. అమ్మాయి ని కట్టబెట్టడానికి వరుడి సంపాదించే తెలివితేటలు ఒకటే అర్హత. గుణ గణాల తో పనేముంది. ఇంక రాజ్యలక్షి ని కట్టబెట్టడం లో వేరే లా ఎందుకు ఉంటుంది?
    "సత్తా" కు నిర్వచనం , డబ్బు ఉండడం, అది ఇంకా సంపాదించే అవకాశం ఉండడం అయినప్పుడు, జనాలకు మంచి చెయ్యాలని అనుకొనేది చేతకాని తనమే అవ్వడం లో వింత ఏముంది?
    అవినీతిని సమస్యనే కాదు అనుకొమ్మని చెప్పే వాస్తవ వాదం ముసుగు కప్పుకున్న నిరాశా వాదమా?
    లేక మార్పు కోరుకొనే ఆశా వాదమా? ఏది కావాలి మనకు?

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం