10, ఫిబ్రవరి 2013, ఆదివారం

రాహుల్ పెళ్ళి కోసం కోర్ కమిటీ ... బాబు నవ్వాడు



ఇక్కడి పౌరసత్వం తీసుకోని విదేశీయులు కుడా ప్రధాన మంత్రి పదవి చేపట్టే అవకాశం ఉన్న దేశం మనది .. అలాంటిది  బ్రమ్మ చారులకు  అడ్డే ముంటుంది ... అయినా ముందు  చూపుతో ఓట్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాహుల్ పెళ్లి  చేయాలని 15 ఏళ్ల  సుదీర్ఘ   చర్చల  తరువాత సోనియా నిర్ణయించారు .

భారతీయ సంప్రదాయాలను గౌరవించే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని రాహుల్ గాంధీ ముసిముసి నవ్వులతో ప్రకటించారు. పెళ్లి ఏర్పాట్లలో సోనియాగాంధీ బిజీగా ఉన్నారు. కాంగ్రెస్ వార్ రూమ్‌లో రాహుల్ పెళ్లి విషయంపై నాలుగవ సారి సమావేశం జరిగింది. ఏకాభిప్రాయం కుదిరితే తప్ప నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని గులాంనబీ ఆజాద్ ప్రకటించారు. దీనికి నెల రోజులు పట్టవచ్చునని అన్నారు. నెల అంటే 30 రోజులే కానవసరం లేదని పనె్నండు నెలలు కూడా కావచ్చునని ఆయన తెలిపారు. 

దీనిపై వాయిలార్ రవి అభిప్రాయాన్ని కోరగా దీనిని మీడియా తప్పుగా అర్ధం చేసుకోవద్దని, ఎన్ని రోజులైనా పట్టవచ్చు అని చెప్పినంత మాత్రాన దాన్ని రాహుల్ ఇక పెళ్లి చేసుకోరు అనే భావంతో అర్ధం చేసుకుంటున్నారని అన్నారు. అయితే రాహుల్ పెళ్లి చేసుకుంటారని మీరు చెబుతున్నారా? అని విలేఖరులు గుచ్చి గుచ్చి ప్రశ్నించగా, ఆ విషయం నేనెలా చెబుతాను, నేను కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్‌నే కానీ, కాంగ్రెస్ నాయకుల కుటుంబ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ను కాదని అన్నారు. షిండే వివరణ కోరగా, హోంమంత్రిగా మా ఇంటి వ్యవహారాలే నాకు తెలియదు, ఇక సోనియా ఇంటి విషయాలపై అడగడం మీడియాకు భావ్యం కాదని అన్నారు.

***
అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అన్నా హజారేకు కుడిభుజంగా నిలిచి ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ తో జనం ముందుకు వచ్చిన అరవింద్ కెజ్రీవాల్‌కు కాంగ్రెస్ హై కమాండ్ అంటే కోపం ఎందుకో తెలుసా? కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్ చరిత్రను తవ్వి వెలికి తీసి దీన్ని బయట పెట్టారు. ఇది చాలా రోజుల క్రితం నాటి మాట అంటే మరీ అనగనగా ఒక రాజు అంత పాత కాలం కాదు. ప్రియాంక, రాబర్ట్ వాద్రాలకు పెళ్లి కాక ముందు నాటి మాట! కెజ్రివాల్ ప్రియాంకను పెళ్లి చేసుకోవడం ద్వారా గాంధీ కుటుంబంలో సభ్యుడు కావాలనుకున్నారు. దాని కోసం ఆయన దిగ్విజయ్ సింగ్‌ను కలిసి తన మనసులోని మాట చెప్పాడు. దీనికి దిగ్విజయ్ ససేమిరా అంగీకరించేది లేదన్నారు. దాంతో సోనియాగాంధీ కుటుంబంపై కక్షపెంచుకున్న కెజ్రివాల్ రాబర్ట్ వాద్రా, డిఎల్‌ఎఫ్ కుంభకోణం అంటూ ఆరోపణలు చేస్తున్నారు. కెజ్రివాల్ గాంధీ కుటుంబంలో చేరడానికి ఏ మాత్రం అర్హత లేని వాడు. అతనికి డ్యాన్స్ రానేరాదు ఇంతకు మించిన అనర్హత ఏముంటుంది.
***
సిబిఐ జగన్‌ను దేశంలోనే అత్యంత క్లీన్‌చిట్ గల నాయకునిగా ప్రకటించింది. ఇంత కాలం విచారణ పేరుతో వేధించినందుకు క్షమాపణలు కోరుతూ జగన్‌కు లేఖ రాసింది. రాజకీయ ఒత్తిడి వల్ల మచ్చలేని నాయకునికి మచ్చ అంటించాలని తాము ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరకు ఫెవికాల్ సైతం పని చేయలేదని సిబిఐ ప్రకటించింది. జగన్ జైలులో ఉండగా, ఆయన ప్యాంటుకు అంటుకున్న గడ్డిపరకను సైతం తిరిగి జైలుకు అప్పగించి వెళ్లారని, తన 150 ఏళ్ల జీవితంలో ఇలాంటి అరుదైన సంఘటన చూడలేదని జైలు ఉద్యోగి జయనాధం చానల్ ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పాడు. జగన్ జైలు నుంచి బయటకు వచ్చేంత వరకు తన తల్లి గర్భం నంచి బయటకు వచ్చేది లేదని కంకిపాడుకు చెందిన సుబ్బలక్ష్మి కడుపులోని బిడ్డ తిరగబడింది.
***
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ప్రజల కోసం పాదయాత్ర చేస్తూ ఈరోజు మధ్యాహ్నం అలసిపోయి స్పృహ తప్పి పడిపోయారు. డాక్టర్లు చెప్పినా వినకుండా స్పృహ లేకుండా నిస్పృహతో బాబు అలానే నడిచారు. జగన్ అంతు తేల్చేంత వరకు, భూగోళం అంతు చూసేంత వరకు అవసరం అయితే చంద్రలోకం వరకు ఇలా నడుస్తూనే ఉంటానని ప్రకటించారు. బోసినవ్వులతో ఉన్న చిన్నారిని చూసి బాబు ఈ పాదయాత్రలో నవ్వారు. బాధల్లో ఉన్న వారిని చూసి కన్నీరు కార్చారు. అయితే బాబు నవ్వుతున్న ఫోటోలు, కన్నీరు పెట్టిన ఫోటోలు నిజమైనవి కావని మార్ఫింగ్ చేశారని, ఆ రెండూ ఆయనకు అలవాటు లేదని ఆధారాలతో సహా నిరూపిస్తానని గోనె ప్రకాశ్‌రావు సవాల్ చేశారు. దీనికి స్పందించిన ఎన్టీఆర్ భవన్ 3456 ఫోటోలను మీడియాకు విడుదల చేసింది. ఆ ఫోటోలను డౌన్‌లోడ్ చేసుకోలేక బలహీనులైన ముగ్గురు నలుగురు మీడియా వాళ్లు నీరసంతో పడిపోయారు. ఈసారి ఎలాగైనా బాబును ముఖ్యమంత్రిని చేస్తామని జనం గుండెలు బాదుకుంటూ చెప్పారు.
***
రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిగా మారిందని టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి చూసి ఆవేదన చెందిన ఆయన తానిక సమైక్యాంధ్ర వాదిగా ఉంటానని ప్రకటించారు.
***
రాష్ట్రంలోని పరిస్థితుల పట్ల ఆవేదన చెందిన రాయపాటి సాంబశివరావు, కావూరి సాంబశివరావు తమకు ఎలాంటి పదవులు వద్దని, తమ స్థానంలో బడుగు బలహీన వర్గాలకు కాంట్రాక్టులు, పదవులు ఇవ్వాలని వారిద్దరు సంయుక్తంగా సోనియాగాంధీకి లేఖ రాశారు.
***
***
సోనియా నివాసంలో కాంగ్రెస్ పెద్దలు కిరణ్ కుమార్‌రెడ్డితో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. తొలుత ఈ సమావేశం తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి అని అంతా అనుకున్నారు. కానీ తరువాత అసలు విషయం తెలిసింది. ముఖ్యమంత్రికి కాంగ్రెస్ తరఫున తెలుగు నేర్పించే బాధ్యత ఎవరికి అప్పగించాలని సాగిన మంతనాల్లో ఆ బాధ్యత గులాంనబీ ఆజాద్‌కు అప్పగించాలని నిర్ణయించారు. ఏకాభిప్రాయం కుదరడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నారని, తెలంగాణపై సైతం ఇదే విధంగా ఏకాభిప్రాయం కుదురుతుందని దిగ్విజయ్‌సింగ్ స్పష్టం చేశారు.....
****
ఆగండాగండి ఇవన్ని నిజమైన వార్తలు కావు .

అమెరికాలో www.theonion.com పేరుతో ఒక వెబ్ పత్రిక ఉంది. ఇలానే మన దేశంలో సైతం ది ఫేకింగ్ న్యూస్ (www.fakingnews. com) అని ఒక వెభ్ పత్రిక ఉంది. ఇందులో వ్యంగ్య వార్తలు భలే రంజుగా ఉంటున్నాయి. తెలుగులో ఇలాంటి ప్రయత్నం ఎందుకు చేయరు అని చర్చ జరిగితే, తెలుగు మీడియాలో వార్తలు అలానే ఉన్నాయి కదా? ఇంకా ప్రత్యేకంగా ఎందుకు అని కొక్కిరాయి సమాధానం వచ్చింది.  కేజ్రివాల్ గురించి  ఇందులో ప్రస్తావించిన దిగ్విజయ్ సింగ్ పరిశోధన వార్త అందులోదే. మిగిలిన వన్నీ ఈ వెబ్‌సైట్ తెలుగులో ఉంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన నుంచి పుట్టినవి. ఇవి వార్తలు కావు. ఊహలు మాత్రమే!
.

7 కామెంట్‌లు:

  1. చక్కగా‌ నవ్వించాయి. బాగున్నాయి.

    రిప్లయితొలగించండి
  2. రాహుల్ పెళ్లిలో కట్నకానుకల చర్చలు హిందీలో జరిగాయి. వీటిని ఉండవల్లి దగ్గరుండి ఇటాలియన్ భాషలోకి తర్జుమా చేసారు.

    కొద్ది రోజులకు రాజమండ్రిలో సభ పెట్టి పెళ్ళికూతురు వైపు వారు చెప్పేవన్నీ అబద్దాలని అన్నారు పైగా పెళ్లిపిల్లను ఖాసీం రాజ్వీతో పోల్చారు. అమ్మాయి దూరపు చుట్టాల ఆహ్వానంతోనే వారి బంగళాను కబ్జా చేసుకుమ్మామని బల్ల గుద్దారు. అమ్మాయి కుటుంబం యొక్క ఆస్తంతా తమదేనని, ఆ వాటా తేలందే శోభనం జరగనివ్వమని తేల్చారు. సమైక్యవాదాన్ని వదిలేది లేదనీ, అవసరమయితే రెండో కుటుంబ వ్యవస్తీకరణ సమితి ఎర్పరచవొచ్చని నొక్కి వక్కాణించారు.

    ఉండవల్లి "జై రాహుల్ వివాహం" సభకు ఎన్నడు లేనంతగా అక్షరాలా 126 జనం వచ్చారు. ఆయన రాజకీయ చరిత్రలో ఇది ఒక రికార్డు సృష్టించింది.

    ABN ఆంధ్రజ్యోతి ఈ సభను లైవుగా చూపించింది. ఇందిరా గాంధీ దహనకాండ నుండి ఫుటేజ్ చూపించి దీనిని భారీ సభగా పేర్కొనింది.

    పరకాల ప్రభాకర్ ఈ సభకు వచ్చిన వారి సంఖ్యను 98,76,33,452 గా అంచనా వేస్తూ ఒక రెండు వందల పేజీల పుస్తకం రాసారు. ఆయనతో సహా ఎనిమిది మంది ఈ పుస్తకాన్ని 30/-కి కొన్నారు. మరో 28,723 ప్రతులను ఉచితంగా పంచారు. దీనితో దేశమంతా బఠానీలు అమ్మేవారు పండుగ చేసుకున్నారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గొట్టిముక్క్లవారూ,
      క్షమించండి. మీ వ్యాఖ్యలో రాజకీయం పాలు యెక్కువైపోయినట్లుండటం కారణంగా వ్యంగ్యం కాస్త వాసి చెడినట్లుగా తోస్తున్నది.

      తొలగించండి
    2. @శ్యామలీయం: మీరు Borowitz Report, The Onion వగైరాలు చదివినట్టు లేదు. అందులో ఇలానే ఉంటాయి. ఈ ప్రచురణలు వ్యంగ్యాన్ని రాజకీయ ఆయుధంగానే వాడతాయి.

      వ్యంగ్యం తటస్తంగా ఉండాలని కోరుకోవడం వేరు, తటస్తంగా లేనందుకు తూలనాడడం వేరు. "వ్యాఖ్యను వ్యాఖ్యగానే చూడాలి".

      తొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం