9, జనవరి 2013, బుధవారం

సచివాలయం బయట చిలక జ్యోతిష్యుడు .. లోపల ముఖ్యమంత్రి జ్యోస్యం ....అధికార పక్షం + ప్రతిపక్షం =జ్యోతిష్యం



వాస్తు జ్యోతిష్యుడి సలహా మేరకు సచివాలయం ప్రధాన ద్వారం మారింది. అంతకు ముందున్న ప్రధాన ద్వారం వద్ద ఉదయం పది గంటలు కాగానే ఠంచనుగా ఫుట్‌పాత్‌పై ఒక చిలక జ్యోతిష్యుడు ప్రత్యక్షమవుతాడు. అదే సమయానికి సచివాలయం లోనికి సిఎం వెళతారు. లోనికి వెళ్లే సిఎంలు తరుచుగా మారవచ్చు కానీ బయట ఉన్న జ్యోతిష్యుడు మాత్రం ఎక్కువ కాలం ఉంటాడు.

 జ్యోతిష్యుడికి డబ్బులిచ్చి కాసేపు మాట్లాడితే ముందుంది మంచి కాలం అంటూ భరోసా ఇస్తాడు. వాడిచ్చిన భరోసాతో ఇప్పటి కష్టాలు మరిచిపోతాం. చిలక జోస్యుడు రెండు మూడు రూపాయల ఫీజుతో మిమ్ములను ఊహల్లో రెండు మూడు తరాలు తిన్నా తరగని సంపన్నుడిని చేసేస్తాడు. అటు నుంచి ప్రధాన ద్వారం గుండా లోనికి వెళితే..(ముందు లోనికి వెళ్లే పలుకుబడి ఉండాలి. అలా ఉండి లోనికి వెళితే) ముఖ్యమంత్రి అని ఒకరుంటారు. చిత్రంగా ఆయన ఛాంబర్‌లో కూడా అచ్చం ఆ జ్యోతిష్యుడి నినాదమే ఉంటుంది. ముందుంది మరింత మంచి కాలం అంటూ. బహుశా కారులో వెళుతున్నప్పుడు ఈ జ్యోతిష్యుడిని చూసి ముఖ్యమంత్రికి ఆ నినాదం తట్టిందేమో! నాయకుల ఉపన్యాసాలు విన్నాక జ్యోతిష్యుల కు ఆ నినాదం తట్టిందో, జ్యోతిష్యుల మాటలు విన్నాక నాయకులకా నినాదం చిక్కిందో ఏదైతేనేం అది ఇద్దరికి సరిగ్గా సరిపోయే మాట. అటు రాజకీయంలో, ఇటు జ్యోతిష్యంలో రెండు రంగాల్లో క్లిక్కయింది. రోడ్డు పక్కనుండే జ్యోతిష్యుల నినాదాలకు కాపిరైట్ హక్కులేమీ ఉండవు.

ఇంతకూ విషయం ఏమిటంటారా? శ్రీమాన్ సిపిఐ నారాయణ గారు రాజకీయ సిద్ధాంతం జ్యోతిష్యం ఒకటే అని తేల్చేశారు. బ్లాక్ అండ్ వైట్ నుంచి సినిమాలు అప్పుడప్పుడే కలర్‌లోకి వచ్చిన కాలంలో ప్రేమించుకోవడానికి ముందు హీరో హీరోయిన్ల మధ్య గిల్లి కజ్జాలు ఉండేవి. ప్రేమించుకున్న తరువాత ప్రేమ లేఖల రాయబారం సాగేది. అలానే సిపిఎం కార్యదర్శి బివి రాఘవులు, సిపిఐ కార్యదర్శి నారాయణల మధ్య చిలిపి రాజకీయ విమర్శలు చాలా రోజుల నుంచి సాగుతూనే ఉన్నాయి. వామపక్షేతర నాయకుల్లా వీళ్లు కెమెరాల ముందు తిట్టుకోరు. ఉత్తరాలు రాసుకుని మీడియాకు విడుదల చేస్తారు.

 సిపిఎం వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటుంది అని నారాయణ అన్నట్టు వార్తలు వచ్చాయి. అత్త కొట్టినందుకు కాదు తోటికోడలు నవ్వినందుకు కోపం వచ్చినందన్నట్టు, తాను చెప్పాల్సిన విషయం నారాయణ చెప్పడం ఏమిటని రాఘవులుకు కోపమొచ్చింది. వాల్మీకికి శోకం నుంచి శ్లోకం పుట్టినట్టు రాఘవులుకు కోపం నుంచి సెటైర్ పుట్టింది. నారాయణ జ్యోతిష్యం మొదలు పెట్టారా? సిపిఐ కార్యాలయాల్లో జ్యోతిష్య దుకాణాలు పెట్టుకోండి అంటూ సెటైర్ వేశారు. రాఘవులు చెప్పింది అక్షర సత్యం. కమ్యూనిజం అంటే జ్యోతిష్యం చెప్పడమే కదా? అం టూ నారాయణ ‘ద్వేషలేఖ’ రాసి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. కమ్యూనిస్టు కార్యాలయాలన్నీ జ్యోతిష్యాలయాలేనని, మార్క్సిజం, లెనినిజం భవిష్యత్తు చెబుతాయని, జ్యోతిష్యం కూడా భవిష్యత్తునే చెబుతాయి కదా? అనేది నారాయణ వాదన. జ్యోతిష్యంలో వామపక్షాల సామర్ధ్యం ఏమిటో కానీ ఈ పార్టీల భవిష్యత్తు మాత్రం అందరికీ తెలుసు. జ్యోతిష్యంపైన, దేవుడిపైన నమ్మకం లేని వాళ్లు సైతం వామపక్షాలకు గతమే తప్ప భవిష్యత్తు లేదు, వాళ్లను ఆ దేవుడు కూడా రక్షించలేడు అని చెప్పేస్తారు. రాజకీయ నాయకులు, జ్యోతిష్యులు కవల పిల్లల్లాంటి వాళ్లే. రూపం వేరు కావచ్చు కానీ చేసే పని, చెప్పే మాటలు ఒకటే. అపరిచితుడిలో అనేక రూపాలు ఉన్నట్టు, జ్యోతిష్యుడిలో అధికార పక్షం ఉంటుంది, ప్రతి పక్షం ఉంటుంది. అవసరాన్ని బట్టి రూపం బయటకు వస్తుంది.

అధికారంలో ఉన్న నాయకుడి మాటలు వినండి. తన పాలనా సామర్ధ్యం వల్ల రాష్ట్రం వెలిగిపోతుందని అధికారంలో ఉన్న నాయకుడు చెబుతాడు. ప్రపంచ పటంలో నా వల్లే రాష్ట్రాన్ని చేర్చారంటాడు. అభివృద్ధిలో దూసుకుకెళుతున్నాం, ఇప్పుడు మీకు మంచి కాలం నడుస్తోంది, ముందుంది మరింత మంచి కాలం అంటాడు. మరి మేమేం చేయాలి అని మనం ప్రశ్నిస్తే, ఇంకేం చేస్తారు మీ ఓటు నాకివ్వండి బొందితో కైలాసానికి పంపిస్తానంటాడు. అదే ప్రతిపక్ష పార్టీ వాళ్ల ఉప న్యాసాలు వినండి. జీవితంపై విరక్తి, భయం, జుగుస్స, కోపం, ఆగ్రహం, ఇంకా వర్ణించలేని ఏవేవో మనలో మొదలవుతాయి. మనం ఇంత కష్టాల్లో ఉన్నామా అని మన దుస్థితికి మనకే ఏడుపొస్తుంది. ఇన్ని కష్టాలు పడుతూ ఎలా బతుకుతున్నామని ఆశ్చర్యం కూడా వేస్తుంది. వా..! అని ఏడుస్తూ ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు అని ప్రతిపక్ష నాయకుడ్ని అడిగితే ఇంకేం చేస్తావు నీకున్న ఆ ఒక్క ఓటు నాకు వేయి భూ లోకంలో స్వర్గం చూపిస్తానంటాడు.

ఇప్పుడు జ్యోతిష్యుడి వద్దకు వెళదాం ఈ రెండు రూపాలు కలిపి చూపిస్తాడు. నీ తల రాతే ఇలా ఉంది. నీ కన్నీ కష్టాలు, గ్రహ స్థితి బాగాలేదు. దుష్ట శక్తులు నీ మీద ప్రతీకారం తీర్చుకుంటున్నాయి అంటూ మాటలతో పై లోకాలకు పంపే ప్రయత్నాలు చేస్తుంటే మనం అతని ఉపన్యాసాన్ని అడ్డుకుని నన్ను ఇప్పుడేం చేయమంటారు అని అడుగుతాం. ఇదిగో ఈ యంత్రంతో నీ పరిస్థితి మొత్తం మారిపోతుందని చెబుతుండగానే యంత్రం లాగేసుకుం టాం. అంతే స్పీడ్‌గా మన చేతిలోని కరెన్సీని వాడు లాగేసుకుంటాడు. ఇక నీకే భయం లేదు పో... ఇక నీకు పట్టిందల్లా బంగారమే. అడుగు పెట్టిన చోటల్లా విజయమే అంటూ భరోసా ఇస్తాడు. తొలుత ప్రతిపక్ష వాణి వినిపించిన వాడు కరెన్సీ చేతులు మారగానే అచ్చం ముఖ్యమంత్రి ఇచ్చినంత భరోసా ఇవ్వడం అంటే ఒక జ్యోతిష్యుడు ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఇద్దరికి సమానం అన్నమాట!

జ్యోతిషం నిజం అవుతుందనే గ్యారంటి  ఉండదు.. నాయకుల మాటలు  కుడా అంతే. కానీ ఇద్దరి మాటలు వినడానికి ఇంపుగా ఉంటాయి. నిజం అవుతాయని అనిపిస్తుంది .. అయితే బాగుండు అనే  ఆశ పుడుతుంది .   రాజకీయ సమరం లో  అధికార పక్షం, ప్రతి పక్షమే కాదు, జీవన సమరంలో ప్రతీ పక్షం చెప్పేది  జ్యోతిస్యమే కదా 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం