25, డిసెంబర్ 2012, మంగళవారం

బొత్సాకు ఒక చానల్ .. కిరణ్ కు రెండు .. బుల్లితెరను కబ్జా చేసిన రాజకీయం

పలు తెలుగు న్యూస్ చానల్స్ రాజకీయ పార్టీల అనుబంధ విభాగాలుగా తయారయ్యాయి. పార్టీల గుర్తుతోనే తమిళనాడులో పార్టీల చానల్స్ ఎప్పటి నుంచో ఉన్నవే. కానీ మన రాష్ట్రంలో మరో అడుగు ముందుకు వేసి చివరకు పార్టీల్లోని గ్రూపుల వారీగా చానల్స్ తయారయ్యాయి. కాంగ్రెస్ పార్టీ గ్రూపులకు నిలయం. గతంలో ఆ పార్టీకి అధికారం ఉన్నా చానల్స్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం ముఖ్యమంత్రి గ్రూపు రెండు చానల్స్ నడుపుతుంటే, పిసిసి అధ్యక్షునికి ఒక చానల్ ఉంది. చానల్స్ సంఖ్య పెరిగిపోవడం, ఆదాయం తగ్గడం, వ్యయం పెరగడం వంటి కొన్ని సమస్యలతో అప్పటి వరకు చానల్స్ నిర్వహించిన వారు ఇక మా వల్ల కాదు అని చేతులెత్తేయడంతో ఇలాంటి చానల్స్ రాజకీయ నాయకుల చేతిలోకి వెళుతున్నాయి.

 వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కొత్తలో ఆ రెండు పత్రికలు అంటూ టిడిపికి అండగా నిలిచే మీడియాను విమర్శిస్తూ మాకూ రెండు పత్రికలు రాబోతున్నాయి అని బహిరంగంగానే ప్రకటించారు. అయితే చిత్రంగా ఆ రెండింటిలో ఒకటి టిడిపి వైపు వెళ్లగా, మరోటి వైఎస్‌ఆర్ ఉన్నంత కాలం కాంగ్రెస్ కోసం పని చేసినా ఇప్పుడు మాత్రం కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శిస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కోసం పని చేస్తోంది.


జీ న్యూస్ మూతవేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. తరువాత ఏం జరిగిందో... అది పిసిసి అధ్యక్షునికి అనుకూల చానల్‌గా మారిపోయింది. అదే ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉంటే ఈ మార్పు స్పష్టంగా కనిపించేది కానీ పిసిసి అధ్యక్షుడు కాబట్టి అంతగా కనిపించడం లేదు. పార్టీకి క్రెడిట్ లభించే విధంగా ఇందులో వార్తలు ఉంటే. ఇక ఐ న్యూస్‌లో మాత్రం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇమేజ్ బూస్టప్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గతంలో ఒకే వర్గం చేతిలో మీడియా ఉన్నప్పుడు చంద్రబాబు పాలనను ఏ విధంగా ఆకాశానికి ఎత్తారో ఇప్పుడు ఐ న్యూస్‌లో కిరణ్‌కు ఆ స్థానం కల్పిస్తున్నారు. సమస్యలన్నీ అదిగమించి ఆయన దూసుకెళుతున్నారట! మరీ ఎక్కువైనట్టుగా ఉంది అంటూ స్వయంగా ముఖ్యమంత్రే ఇష్టాగోష్టి సమావేశంలో ఐ న్యూస్ గురించి అన్నట్టుగా సచివాలయం విలేఖరులు చెప్పుకుంటున్నారు. ఆయన అలా అన్నది నిజమో కాదు కానీ విషయం మాత్రం అలానే ఉంది. ఐ న్యూస్ స్వల్ప కాలంలోనే అనేక రంగులు మారింది. తొలుత అందులో జగన్ పెట్టుబడులు పెట్టారనే ప్రచారం సాగింది. ఆ తరువాత కొంత కాలానికి ఆ చానల్ జగన్‌ను వ్యతిరేకించడానికే ఏర్పాటు చేశారేమో అనే విధంగా ప్రచారం సాగింది. మొన్నమొన్నటి వరకు కూడా చంద్రబాబును ఆకాశానికెత్తుతూ జగన్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎవరి పెట్టుబడి మహత్యమో కానీ ఇప్పుడు మాత్రం ఎప్పుడు చూసినా కిరణ్‌ను ఆకాశానికెత్తుతూ కనిపిస్తున్నారు.

 కొంత కాలం ఉందో లేదో అన్నట్టుగా కనిపించి మాయమైన ఒక టీవిలో ముఖ్యమంత్రి సన్నిహితుడైన ఎమ్మెల్సీ పెట్టుబడులు పెట్టారని ప్రచారం సాగుతోంది. ఎ టీవిలో ముఖ్యమంత్రి గురించి బాగానే ప్రచారం చేస్తున్నారు. ఆయన ఎక్కడ మాట్లాడినా ఆ చానల్‌లో లైవ్‌గా ప్రసారం అవుతోంది. టెస్ట్ సిగ్నల్స్ పేరుతో సైతం కిరణ్ నామ స్మరణే. అన్ని రాజకీయ పక్షాలకు సొంత చానల్స్ ఉన్నందున మనం కూడా ఒక చానల్ పెట్టాలి అని గతంలో కాంగ్రెస్ మేధోమథనంలో నిర్ణయించారు. అయితే నేరుగా చానల్ పెట్టకపోయినా ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రికి మద్దతుగా మూడు చానల్స్ కనిపిస్తున్నాయి. టిడిపి అనుకూల చానల్స్ ఎప్పటి మాదిరిగానే చంద్రబాబు పాదయాత్రను ఆకాశానికెత్తుతుండగా, సాక్షి జగన్ పార్టీ కోసం నిర్విరామంగా కృషి చేస్తోంది. అదేం శాపమో బాబుకు మీడియాలో జనం బ్రహ్మరథం పడతారు. తీరా ఉప ఎన్నికలు వస్తే డిపాజిట్ దక్కనివ్వరు. 2009 నుంచి 42 నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు జరిగితే సగం నియోజక వర్గాల్లో డిపాజిట్ పోయింది. ఒక్క సీటు కూడా గెలవలేదు. చానల్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముఖ్యమంత్రికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న మా పార్టీ చానల్ పెట్టలేకపోతోంది అంటూ తెలుగు యువత ప్రశ్నించింది. మిగిలిన పార్టీలకు వారి పార్టీ ప్రచారానికి సొంత చానల్స్ అవసరం. టిడిపిని సొంత పార్టీగా భావించే మీడియా ఉన్నప్పుడు సొంత చానల్స్ అవసరం ఎందుకు? అనేది ప్రత్యర్థుల సమాధానం. 

ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర గడువు ఉండగానే పరిస్థితి ఇలా ఉంది అంటే ఎన్నికల నాటికి బుల్లి తెరనే యుద్ధ క్షేత్రం అవుతుందేమో! టీ న్యూస్ తెలంగాణ వాదానికి, టిఆర్‌ఎస్‌కు అండగా నిలుస్తోంది. అలా అని మిగిలిని చానల్స్ నిస్పక్షపాతంగా ఉంటున్నాయని కాదు. అంశాల వారిగా, ఒప్పందాల వారిగా కొన్ని చానల్స్ కొన్ని పార్టీలకు అండగా నిలుస్తున్నాయి. ఎన్నికల సమయానికి మద్దతు కోసం వేలం పాటలు సాగినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు.

2 కామెంట్‌లు:

మీ అభిప్రాయానికి స్వాగతం