24, జనవరి 2012, మంగళవారం

మనపొగడ్తలంటే హీరోలకూ విసుగేస్తోంది -


ఈ హీరో అలాంటిలాంటి వాడు కాదు. బాక్సాఫీసు బద్దలు కొడతాడు, కొత్త చరిత్ర సృష్టిస్తాడు. ఎనిమిది దశాబ్దాల తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించాడు అంటూ ఎవరినీ వదలకుండా హీరోలందరినీ పొగడడం మన టీవిల ఆనవాయితీ. చివరకు ఈ పొగడ్తలు సినిమా వాళ్లకు సైతం విసుగు తెప్పిస్తోంది. ఒక హీరోను మాత్రమే ఇలా పొగడ్తలతో ముంచెత్తితే నన్ను ఒక్కరినే ఇలా అంటున్నారను కోవచ్చు కానీ కొద్ది పాటి డైలాగులను మార్చి అందరినీ అలానే పొగడ్తలతో ముంచెత్తుతున్నారాయె. అందుకే ఈ మధ్య అక్కినేని నాగార్జున సినిమా ప్రమోషన్ పేరుతో సాగుతున్న పొగడ్తల పట్ల విసుగు ప్రదర్శించారు. ఏముంటుంది అక్కడ ఒకరినొకరు పొగుడు కోవడం తప్ప అంటూ పెదవి విరిచారు. అందుకే సాధ్యమైనంత వరకు అలాంటి వాటికి దూరంగానే ఉంటున్నానన్నాడు.

 ఆడియో విడుదల, అభినందన సభ అంటూ పేర్లు ఏవైతేనేం అక్కడ హీరోలను ఆకాశానికి ఎత్తడం, దర్శకుని ప్రతిభను పొగడ్డం తప్ప ఏమీ ఉండడం లేదు. కానీ తెలుగు చానల్స్ మాత్రం సినిమా ప్రమోషన్ వ్యవహారాల్లో ఏ మాత్రం మార్పు లేకుండా ఇలానే సాగిస్తున్నారు. అట్టర్ ఫ్లాప్ సినిమా అయినా హిట్టయిన సినిమా అయినా ప్రమోషన్ కార్యక్రమాల్లో మాత్రం తేడా ఉండదు. ఒక సినిమా విడుదల కాగానే ఆ సినిమా హీరోతో కొద్ది మంది ముచ్చట్లు ఇంత అద్భుతమైన సినిమాలో నటించేప్పుడు మీ ఫీలింగ్, హీరోయిన్ గురించి ఏమనుకుంటున్నారు? దర్శకుని ప్రతిభ గురించి నాలుగు పొగడ్తలు పొగడండి అంటూ ప్రశ్నిస్తున్నట్టుగా ఉంటున్నాయి. నాతో సినిమా తీసిన దర్శకుడు మహామేధావి అనుకుంటే ఏ హీరో అయినా ఇంకేమంటాడు.

 అదే హిందీ సినిమాల ప్రమోషన్ మాత్రం చాలా భిన్నంగా సాగుతోంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు అటు సీరియల్ ప్రమోషన్, ఇటు సినిమా ప్రమోషన్ ఒకేసారి సాగిస్తున్నారు. సోనీ చానల్‌లో ‘బడే అచ్చే లగితే హే’ అంటూ పాపులర్ సీరియల్ వస్తోంది. ‘డర్టీ పిక్చర్’ సినిమా విడుదల సమయంలో ఈ సీరియల్‌ను సినిమా కోసం వాడుకున్నారు. అదే విధంగా సీరియల్ ప్రచారానికి ‘డర్డీ పిక్చర్’ హీరోయిన్ విద్యా బాలన్‌ను ఉపయోగించుకున్నారు. సీరియల్‌ని కథలో భాగంగా దంపతులు హనీమూన్ కోసం ఫ్రాన్స్ వెళతారు. వీరు బస చేసిన హోటల్‌లోనే ‘డర్టీ పిక్చర్’ యూనిట్ బస చేస్తుంది. హీరోయిన్ విద్యా బాలన్, సీరియల్ కథానాయికను పరిచయం చేసుకుంటుంది. హోటల్‌లో ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తారు. సినిమాలోని హీరో సీరియల్‌లోని హీరోతో మాట్లాడతాడు. ఇదంతా కథలో భాగంగానే సాగుతుంది. దీని వల్ల ఆ సీరియల్‌ను రెగ్యులర్‌గా చూసే వారికి కొత్తదనంగా ఉంటుంది. అదే సమయంలో సినిమాకు, సీరియల్‌కు ప్రచారం లభిస్తుంది. సోనీలోనే వచ్చే ‘సిఐడి ’ సీరియల్ విషయంలో సైతం ఇదే విధంగా ప్రచారానికి ఉపయోగించుకున్నారు. ఇలాంటి ప్రయత్నం తెలుగు సీరియల్స్, తెలుగు సినిమా విషయంలో కనిపించ లేదు. తెలుగు చానల్స్‌లో వచ్చే సీరియల్స్ అన్నీ తమిళం నుండి అనువాదం అవుతున్నవే కాబట్టి అది సాధ్యం కావడం లేదేమో! అనువాదం కాకుండా ఒకటి రెండు సీరియల్స్ డైరెక్ట్‌గా వస్తున్నాయి వాటి విషయంలోనైనా హిందీలో మాదిరిగా కొత్తదనంతో ప్రయత్నించవచ్చు.
ప్రయత్నం బాగుంది...
శ్యామల మంచి అందగత్తె. ఎంత అందగత్తె అంటే ఈ మధ్య ఆమె ఒక తెలుగు సినిమాలో నటించింది. చివరకు సినిమా రంగంలో ఎంతో మంది అందగత్తెలను చూసిన పోసాని కృష్ణ మురళి సైతం శ్యామల అందాన్ని ప్రస్తావించకుండా ఉండలేకపోయారు. జోగిని వంటి ఒక విష సంస్కృతికి బలైన జీవితం ఆమెది. తెలుగు చానల్స్ వాళ్లే ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. జోగిని జీవితం నుంచి బయటకు వచ్చి ఒక సంస్థను స్థాపించి తనలాంటి వారి కోసం ఆమె ప్రయత్నిస్తున్న సమయంలో చానల్స్ దృష్టిలో పడ్డారు. ఆమె జీవితాన్ని వీక్షకులకు పరిచయం చేయడంతో పాటు ఆమెతో కొన్ని కార్యక్రమాలు రూపొందించారు. అనంతరం ఎన్‌టీవి శ్యామలా డైరీ పేరుతో కార్యక్రమం రూపొందించారు. ఇందులో శ్యామల వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో మాట్లాడుతోంది. మీరు ముక్కు సూటిగా మాట్లాడతారు అని శ్యామల అన్నప్పుడు పోసాని సమాధానం బాగుంది.

 ప్రపంచంలో ఎవరూ ముక్కు సూటిగా మాట్లాడరు. నా మనసులో అనేక ఆలోచనలు ఉంటాయి, నాకు ప్రమాదం లేనివి, నాకు నష్టం కలిగించనివి మాత్రమే చెబుతాను కానీ ప్రతిదీ చెబుతానా? అని ప్రశ్నించారు. శ్యామల అందం నచ్చింది, శ్యామలపై నాకున్న అభిప్రాయం పైకి చెబుతానా? అని పోసాని అనగానే ఆమె ఏ మాత్రం తడుముకోకుండా శ్యామలపై మీ మనసులో ఏముంది అని అడిగింది. అందగత్తె అంతే మనసులో ఉన్నది అంతా చెప్పకపోవడం సభా మర్యాద అంటూ తప్పించుకున్నారు. ఇంటర్వ్యూలు చేయడం ఆమె వృత్తి కాదు. జోగిని వ్యవస్థ వంటి ఒక దురాగతానికి బలైన జీవితం ఆమెది. అలాంటిది ప్రొఫెషనల్స్ మాదిరిగా తడబడకుండా ప్రముఖుల ఇంటర్వ్యూలు నిర్వహించడం అభినందనీయం. కొన్ని జాతీయ పత్రికలు ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం లాంటి వారికి ఒక రోజు పూర్తిగా పత్రిక బాధ్యతలు అప్పగిస్తుంటారు. ఆ రోజు వారే సంపాదకీయం రాస్తారు. అదే విధంగా శ్యామల లాంటి ప్రయోగాలు చేయడానికి చానల్స్‌కు అవకాశం ఉంది. అయితే ఒక చానల్ శ్యామలను పరిచయం చేస్తే మిగిలిన చానల్స్ ఆమె కోసం కార్యక్రమాలు రూపొందిస్తున్నాయి. ఎవరికి వారు ఇలాంటి ప్రయోగాలు చేస్తే బాగానే ఉంటుంది. తెలుగు చానల్స్‌కు కొత్త ముఖాలు లభించవచ్చు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం