8, జనవరి 2012, ఆదివారం

విమర్శలను ఎదుర్కోవడం లో జవహర్ లాల్ నెహ్రు ... ఇందిరాగాంధీ కాలం నుంచి సోనియా వరకు........... సామజిక మాధ్యమాలపై సెన్సార్షిప్ సాద్యమా ?


దేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూను ఈ దేశ ప్రజలు కనిపించే దైవంగా భావించే వారు. అప్పటివరకు బ్రిటీష్ పాలన అనుభవించిన మనకు ప్రజాస్వామిక పాలన ఎలా ఉంటుందో చూపిన వారు. ప్రజల్లో ఆయన పట్ల విపరీతమైన అభిమానం ఉండేది. ఇప్పుడంటే ఇమేజ్ కోసం మీడియాను మేనేజ్ చేసుకోవడం మన నాయకులకు తెలుసు. అలాంటి మేనేజ్‌మెంట్ టెక్నిక్‌లు ఏమీ లేని కాలంలోనే ఆయన పట్ల జనంలో విపరీతమైన అభిమానం ఏర్పడింది. అలాంటి నెహ్రూపై ఒక పత్రికలో విపరీతంగా విమర్శిస్తూ తరుచుగా వ్యాసాలు వచ్చేవి. తీరా చివరకు తెలిసిందేమిటంటే ఆ వ్యాసాలు రాసింది స్వయంగా నెహ్రూనే తనను తాను సమీక్షించుకోవడానికి స్వయంగా ఆయనే తనపై ఇలాంటి వ్యాసాలు రాసుకునే వారట!
అది నెహ్రూ కాలం
ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ ఆమె ఇద్దరు కుమారులు రాజీవ్‌గాంధీ, సంజయ్‌గాంధీ ముగ్గురూ భోజనం చేస్తున్నారు. ఏదో ఒక విషయంపై వాడిగావేడిగా చర్చ సాగుతోంది. ఇంతలో సంజయ్‌గాంధీ పరుషంగా ఒక మాట అన్నాడు. రాజీవ్‌గాంధీకి కోపం వచ్చింది. తల్లితో మాట్లాడే పద్ధతి అదేనా? అంటూ సంజయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమ్ముడి మాటలపై ఏమీ అనడం లేదేమిటని తల్లిని కూడా అడిగాడు. ఇందిరాగాంధీ నవ్వుతూ సంజయ్‌గాంధీ తన తల్లితో పరుషంగా మాట్లాడితే నేను దానికి తగినట్టుగానే స్పందించేవాడిని, కానీ అతను ఈ దేశ ప్రధానమంత్రితో పాలనపై తన అసంతృప్తిని పరుషంగా వ్యక్తం చేశాడు. అతనికా హక్కు ఉంది అని సమాధానం చెప్పారు.
దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిన ఇందిరాగాంధీ సైతం దేశ ప్రధానిని విమర్శించే హక్కు పౌరుడికి ఉందని అంగీకరించారు.
అది ఇందిరాగాంధీ కాలం
* * *
ప్రస్తుతం మనమున్నది కోడలి గారి కాలంలో...
కోడలిగారిని సామాజిక మాధ్యమాల్లో ఎవరో ఏదో విమర్శ చేశారట! దాంతో కేంద్ర మంత్రి కపిల్‌సిబల్ వాటిపై సెన్సార్‌షిప్ విధించే ఆలోచన చేశారు. కపిల్‌సిబాల్ ఇటీవల విలేఖరుల సమావేశంలో సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్స్‌లో రాజకీయ నాయకులపై వస్తున్న అభ్యంతరకరమైన కామెంట్స్‌పై తీవ్రంగా స్పందించారు. శ్రీమతి సోనియాగాంధీ పట్ల అభ్యంతరకరమైన రాతలు సామాజిక మాధ్యమాల్లో( సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్స్) రాస్తున్నారని, ఈ వీటి ఆంక్షలు విధించే విషయం పరిశీలిస్తున్నట్టు ప్రకటించారు. దేశంలో ఇది పెను సంచలనానికి దారి తీసింది. సామాజిక మాధ్యమాలపై ఆంక్షలా అంటూ నెట్ జనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్‌లో కపిల్‌సిబల్ తీరుపై మండిపడ్డారు. దీనిపై దేశ వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి.
మేడమ్ గోప్యత కోసం పదికోట్ల మంది నెట్‌జనుల స్వేచ్ఛను హరిస్తారా? అంటూ ప్రశ్నించారు. న్యాయవాదిని ఐటి మంత్రిగా నియమిస్తే ఇలానే ఉంటుంది అంటూ ప్రముఖ స్టాక్ బ్రోకర్ రాకేష్ ఝున్‌ఝున్ వాలా మండిపడ్డారు. ఇది ఐటం సాంగ్ కోసం మాయావతిని ఎంపిక చేసుకోవడం లాంటిదే అని దురుసుగా వ్యాఖ్యానించారు.
సామాజిక మాధ్యమం ఈ దశాబ్దపు అద్భుతమేకాదు శతాబ్దపు అద్భుతంగా భావించే వాళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆన్‌లైన్‌లో కొంత మంది
స్నేహితులతో నిరంతరం సామాజిక మాధ్యమం వల్ల టచ్‌లో ఉండవచ్చు. ఆన్‌లైన్‌లో పాత స్నేహితులను కలువ వచ్చు, కొత్త స్నేహాలు చేసుకోవచ్చు. రెండు మూడు దశాబ్దాల క్రితం చదువుకుని ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్న వారు సామాజిక మాధ్యమం పుణ్యమా అని మళ్లీ ఆన్‌లైన్‌లో టచ్‌లో ఉంటున్నారు. ప్రపంచంలో ఎక్కడెక్కడి వారు ఒక చోట చేరుతున్నారు. సాహిత్యం కావచ్చు, రాజకీయాలు కావచ్చు ఒకే రకమైన అభిరుచి గల వారు కొన్ని వేల మంది స్నేహితులుగా మారవచ్చు. అదీ ఇదీ అని లేదు. ఏ రంగంలో అభిరుచి ఉన్న వారైనా ఏకం కావచ్చు. గ్రూపులు, ఫోరంల ద్వారా ఎక్కడెక్కడి వారు ఏకమవుతున్నారు. ఏ అంశంపైనైనా వారు నిర్మోహమాటంగా తమ అభిప్రాయాలను వెల్లడించుకుంటున్నారు. కొన్ని అభిప్రాయాలు కొందరికి నచ్చకపోవచ్చు, కొన్ని వివాదస్పదం కావచ్చు కానీ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం మాత్రం అభినందనీయం.
బ్రిటీష్ పాలనా కాలంలో సంఘ సంస్కర పరులు తమ భావాల వ్యాప్తికి పత్రికలు ప్రారంభించారు. తరువాత స్వాతంత్య్ర పోరాటం కోసం పత్రికలను ప్రారంభించారు. తరువాత సంపన్నులు వ్యాపారంగా పత్రికలు ప్రారంభించారు. ఇటీవల కాలంలో రాజకీయ పక్షాలు, కార్పొరేట్ కంపెనీలు పత్రికలు, చానల్స్ ప్రారంభిస్తున్నారు. మీడియా పార్టీల వారిగా విడిపోయింది. కార్పొరేట్ కంపెనీ తమ అభిప్రాయాలను వెల్లడించడానికి మీడియా ఉంది, రాజకీయ పార్టీ తమ పార్టీ ప్రచారం కోసం మీడియాను ఏర్పాటు చేసుకొంది. మరి సామాన్యుడు తన అభిప్రాయం చెప్పాలంటే సాధమేది. ఇలాంటి ప్రశ్నకు సమాధానంగా ఉద్బవించిందే సామాజిక మాధ్యమం. ఏ అంశంపైనైనా కావచ్చు సోనియాగాంధీ తీరు మీకు నచ్చలేదా? ప్రధానమంత్రి పప్పెట్‌గా వ్యవహరించడాన్ని మీరు జీర్ణం చేసుకోలేక పోతున్నారా? విడుదలైన సినిమా పరమ చెత్తగా ఉందని మీ కనిపిస్తుందా? క్షణం కూడా ఆలస్యం అవసరం లేదు. సామాజిక మాధ్యమంలో మీ అభిప్రాయాన్ని మీరు నిర్మోహమాటంగా వెల్లడించవచ్చు. మీ అభిప్రాయం బాగుందని మిమ్ములను మెచ్చుకునే వారు, చెత్తగా ఉందని విమర్శించే వారు నిమిషాల్లోనే తమ స్పందన తెలియజేస్తారు. అంటే ఒక రకంగా పైసా ఖర్చు లేకుండా ఎవరికి వారు సొంత మీడియాను ఏర్పాటు చేసుకోవడం అన్న మాట. కోట్ల రూపాయల పెట్టుబడితో, వ్యయ ప్రయాసల కోర్చి ఏర్పాటు చేసుకునే మీడియా తరహాలో క్షణాల్లో పైసా ఖర్చు లేకుండా మన అభిప్రాయాలు ప్రపంచానికి చాటి చెప్పే సౌకర్యం కచ్చితంగా అద్భుతమే.
సామాజిక మాధ్యమాలకు ఇది ఒక కోణం
అదే సమయంలో వీటి వల్ల తీవ్రమైన నష్టాలు సైతం ఉన్నాయి.
సోనియాగాంధీని కించపరిచే విధంగా సామాజిక మాధ్యమాల్లో వచ్చిన రాతలను చదివిన వారు ఎంత మంది ఉంటారో తెలియదు కానీ కచ్చితంగా కపిల్ సిబల్ ప్రకటనతో ఈ విషయం కొన్ని కోట్ల మందికి తెలిసి వచ్చింది. సోనియాగాంధీ
ఏ విషయం బయటకు మాట్లాడరు కాబట్టి సామాజిక మాధ్యమాలపై సెన్సార్ విధించాలనే ఆలోచన ఆమెకే వచ్చిందా? లేక ప్రభువును మించిన ప్రభు భక్తి ప్రకటిస్తున్న కపిల్ సిబల్‌కు వచ్చిందా? సోనియాగాంధీకి సంబంధించిన వ్యవహారంపై కపిల్ స్వతంత్రంగా ఈ నిర్ణయం తీసుకున్నారని భావించలేం. సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్స్‌పై ఆంక్షలు విధించాలనే ఆలోచనకు సంబంధించిన అంశం కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం కాదు. కపిల్ నుండి వచ్చిన ఈ ప్రకటనకు అమెరికా సైతం విస్తుపోయింది. ప్రజాస్వామిక దేశమైన ఇండియా నుండి ఇలాంటి ప్రకటనను ఊహించలేమని అమెరికా ప్రకటించింది. అభ్యంతరకరమైన రాతలపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం సమంజసమే. అయితే దీన్ని సాకుగా చూపించి సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు విధించాలనే ఆలోచన ప్రమాదకరం. ప్రజాస్వామిక వాదులు ఎవరూ దీన్ని హర్షించరు. ఈరోజు మీడియా కార్పొరేట్ కంపెనీల చేతుల్లో ఉంది. గతంలో మాదిరిగా మీడియాకు విశ్వసనీయత లేదు. కార్పొరేట్ కంపెనీల చేతుల్లో ఉన్న మీడియా ప్రజల సమస్యల కన్నా తమ సంస్థ ప్రయోజనంపైనే ఎక్కువగా దృష్టి పెడుతుంది. వ్యాపారం అన్నప్పుడు తన వ్యాపార ప్రయోజనాలకు పెద్ద పీట వేయడం సహజమైన చర్యనే. ఇలాంటి పరిస్థితిలో ఆవిర్భవించిన సామాజిక మాధ్యమాలు ప్రజల మాధ్యమాలుగా నిలుస్తున్నాయి. ప్రస్తుతానికి ఇంగ్లీష్ చదువులు చదివిన మధ్యతరగతి కంప్యూటర్ ఆధార ఉద్యోగుల హడావుడి మాత్రమే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. సువిశాల భారత దేశంలో స్వల్ప సంఖ్యలో ఉన్న వీరికి పరిమితం అయిన సమయంలోనే అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం సాగించినప్పుడు సామాజిక మాధ్యమాలు చూపిన ప్రభావం ప్రభుత్వాన్ని సైతం విస్మయపరిచింది. వీటిపై ఆంక్షలు విధించాలనే ఆలోచన వెనుక అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని అణిచివేసే చర్య దాగి ఉందనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా సామాజిక మాధ్యమాల ద్వారా అవినీతికి వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం కచ్చితంగా ప్రభుత్వానికి ఇబ్బందికరంగానే తయారైంది. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలని సామెత. సామాజిక మాధ్యమాల్లో సభ్యులుగా ఉన్న యువత సంఖ్య స్వల్పమే కావచ్చు కానీ విద్యావంతులైన వీరి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. సహజంగా వీరు మార్పును కోరుకుంటారు. 125 ఏళ్ల నుండి ఒకే పార్టీ రాజ్యం చేయడం వీరికి నచ్చదు. వారసత్వ రాజకీయాలు నచ్చవు. విదేశీయురాలైన సోనియాగాంధీ నాయకత్వం నచ్చదు. అలాంటప్పుడు సామాజిక మాధ్యమాలు కాంగ్రెస్ నాయకత్వానికి నచ్చకపోవడం సహజమే.
సామాజిక విప్లవకారుడు
టైమ్ మేగజైన్ ప్రతి సంవత్సరం ఈ ఏటి మేటి వ్యక్తిగా ఒకరిని గుర్తిస్తుంది. ఈ సంవత్సరం వ్యక్తిని కాదు మొత్తం సామాజిక మాధ్యమాన్ని గుర్తించింది. ప్రజల సమస్యలపై నిరసన గళం వినిపించిన ఉద్యమ కారుడిని ఈ ఏటి మేటి వ్యక్తిగా నిరసన కారుడిని ఎంపిక చేసింది. నిరసన కారుడు అంటే ఒక వ్యక్తిని గుర్తించడం కాదు. ఇటీవల కాలంలో జరిగిన మొత్తం ఉద్యమాలను దృష్టిలో పెట్టుకుని నిరసన ది ప్రొటెస్టర్ అనే పేరుతో నిరసన కారుడిని ఎంపిక చేశారు. నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ఇటీవల తలెత్తిన పలు ఉద్యమాలకు గుర్తింపుగా ఈ ఎంపిక జరిగింది. అయితే ఈ ఉద్యమాలన్నింటిలో సామాజిక మాధ్యమాలే కీలక పాత్ర వహించాయి. అందుకే టైమ్ మేగజైన్ ఈ సంవత్సరం సామాజిక ఉద్యమ మాధ్యమాన్ని ఈఏటి మేటి వ్యక్తిగా గుర్తించినట్టు అయింది.
సామాజిక మాధ్యమాల ద్వారా అన్నీ అద్భుతాలే, ఎలాంటి నష్టాలు లేవు, సమస్యలు లేవు అని ఎవరూ చెప్పడం లేదు. మంచి ఎంతుందో అంతకు మించి చెడు కూడా జరుగుతోంది. అమెరికాలో కాపురాలు కూలడంలో ఫేస్‌బుక్ ప్రధాన పాత్ర వహిస్తున్నట్టు ఇటీవల కొన్ని సర్వేలు వెల్లడించాయి. అశ్లీల బొమ్మలు, మాటలకు అంతు లేదు. మార్పును కోరుతూ అమెరికా ఓటర్లు విలక్షణమైన తీర్పును ఇచ్చి ఒబామా రాష్టప్రతి కావడానికి దోహదం చేశారు. దీనికి సామాజిక మాధ్యమాలు కీలక పాత్ర వహించాయి. అలాంటిది స్వయంగా ఒబామా తమ పిల్లలకు ఫేస్‌బుక్ అకౌంట్ అవసరం లేదని ప్రకటించారు. ఈ వార్తను అమెరికా పత్రికలు ప్రధానంగా ప్రచురించాయి. మా పిల్లలు వ్యక్తిగత విషయాలను ఈ వయసులో ఫేస్‌బుక్ ద్వారా అందరికీ చెప్పుకోవలసిన అవసరం లేదు అందుకే వారికి ఫేస్‌బుక్ ఖాతా అవసరం లేదనుకుంటున్నట్టు ఆయన తెలిపారు.
సోనియాగాంధీని, సినిమా తారలనే కాదు బాబారాందేవ్ వంటి సన్యాసిని సైతం సామాజిక మాధ్యమాలు వదిలిపెట్టడం లేదు, వెకిలి మాటలు, బూతు బొమ్మలతో వెంటాడుతున్నాయి.
పెద్దవారే కాకుండా 18 ఏళ్ల లోపు వయసు వారు సామాజిక మాధ్యమాలకు బానిసలు అవుతున్నారని అమెరికాకు చెందిన అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ సంస్థ ఆరోగ్య అధ్యయనాల్లో ఈ విషయం తేలింది.
సామాజిక మాధ్యమాల గ్రూపుల్లో చర్చలు చివరకు ఆందోళనకు వేధింపులకు కారణమవుతున్నాయి. వేధింపులకు పాల్పడినా పట్టుబడమూ అనే ధీమాతో కొంతమందిలో నేర ప్రవృత్తి పెరిగిపోతున్నట్టు తేలింది. అయితే ఇన్ని నష్టాలు ఉన్నాయని సామాజిక మాధ్యమాలకు పిల్లలను దూరంగా ఉంచడం ద్వారా వారిని వెనక్కు నెట్టవద్దు అనేది నిపుణుల సూచన. వీటిలోని మంచి చెడులను వివరించి చెడు వైపు ఆకర్శితులు కాకుండా చూసుకోవాలి. లాటరీ వచ్చిందనో, వంటరిగా ఉన్నాను ప్రేమించుకుందామనే సందేశాల ద్వారానో సామాజిక మాధ్యమాలను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలకు సంబంధించి దేశంలో దాదాపు పదివేల కేసుల వరకు ఉన్నాయి.
సామాజిక మాధ్యమాల వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో, అంతకు మించి నష్టాలూ ఉన్నాయి. ఆ రెండింటిలో ఏది కోరుకోవాలో చాయిస్ మన చేతిలోనే ఉంది.
నష్టాలు ఉన్నాయని ఆంక్షలు విధించలేం. ప్రపంచంలో కొన్ని వందల భాషలు ఉన్నాయి. ప్రపంచ వరకు ఎందుకు మన దేశంలోనే ఎన్నో భాషలు ఉన్నాయి. ఒక్కో భాషలో సామాజిక మాధ్యమాల్లో ఏం రాస్తున్నారో పరిశీలించి, సెన్సార్ విధించడం సాధ్యమా? ఒక్క మన దేశంలోనే రోజుకు 25 మిలియన్ల భారతీయులు ఫేస్‌బుక్ ఉపయోగిస్తున్నారు. వంద మిలియన్ల మంది గూగుల్‌ను ఉపయోగిస్తున్నారట! వీరి రాతలను సెన్సార్ చేయడం సాధ్యమా?
ఐఎస్‌ఐ అండతో భౌతికంగా దాడులు జరుగుతుంటేనే నివారించలేకపోతున్నాం ఇక కంటికి కనిపించకుండా జరిగే అక్షర దాడులను అరికట్టడం సాధ్యమా?
మరేం చేయాలి అంటే ఒక నిపుణుడు మంచి సలహా ఇచ్చారు. ఉపేక్షించాలి. ఔను నిజం ఊపేక్షించడానికి మించిన శిక్ష లేదు.
పూర్వం రోమ్ లో సెనెట్‌కు ఎవరైనా నచ్చకపోతే వారిని తిరస్కరిస్తూ ‘డామ్‌నాటియో మెమోరి’ అనే ప్రకటన చేసేదట! అంటే వారి జ్ఞాపకాలను చెరిపివేస్తున్నట్టు చేసిన ప్రకటన. అలాంటి ప్రకటన చేసిన తరువాత ఆ వ్యక్తి పేరును అన్ని రికార్డుల నుండి తొలిగిస్తారు. బర్త్ రికార్డ్స్ , రోమన్ ఆర్మీ రికార్డ్స్ వంటి వాటి నుండి తొలగిస్తారు. అంటే చరిత్రలో వారి పేరును చెరిపేస్తారన్నమాట!
అంటే ఆ వ్యక్తిని పూర్తిగా ఉపేక్షించడం.
కొన్ని కోట్ల మంది అకౌంట్లను పరిశీలించి ఎవరు అభ్యంతర కరంగా రాశారో పరిశీలించి సెన్సార్ చేయడం కన్నా అలాంటి వారిని ఉపేక్షిస్తే అంత కన్నా పెద్ద శిక్ష అవుతుంది కదా! బూతు బొమ్మలు, రాతలు కనిపించినప్పుడు సహజంగా ఆ గ్రూపులో ఉన్న ఇతరులే ఫిర్యాదు చేస్తారు.
ఇక ఇంత సువిశాల మైన దేశానికి నాయకత్వం వహించేవారు ఎవడో పనికిమాలిన వాడు ఫేస్‌బుక్‌లో ఏదో రాశాడని కలవరపడితే అది వాడికి సంతోషం కలిగిస్తుంది తాను విజయం సాధించాననే భావన కలిగిస్తుంది. అంటే కపిల్ సిబల్ ఒక రకంగా అలాంటి అభ్యంతర కరమైన రాతలు రాసిన వారిని ప్రోత్సహించినట్టు అయింది.
అభ్యంతరకరమై అంశాలు కనిపించినప్పుడు ఫిర్యాదు చేస్తే కొన్ని సామాజిక మాధ్యమాలు వాటిని తొలగిస్తున్నాయి. కొన్ని పట్టించుకోవడం లేదు. ఇలాంటి వికృత చర్యలను ఖండించాల్సిందే, అరికట్టడానికి ప్రయత్నించాల్సిందే అంతే తప్ప వీటిని సాకుగా చూపించి మొత్తం సామాజిక మాధ్యమాలను కంట్రోల్ చేయాలని ప్రభుత్వం ప్రయత్నించడం సహించరానిది.
వీళ్లు నిషేధించారు
పలు దేశాలు సామాజిక మాధ్యమాలను నిషేధించాయి. చైనాతో పాటు కొన్ని ఇస్లామిక్ దేశాలు సామాజిక మాధ్యమాలను నిషేధించాయి. ఇండియా లాంటి ప్రజాస్వామిక దేశంలో అది సాధ్యమా?
ఫేస్‌బుక్, యూ ట్యూబ్, ట్విట్టర్, బ్లాగర్, వికీమీడియా వంటి సామాజిక మాధ్యమాలను చైనా, పాకిస్తాన్, ఇరాన్, సిరియా, ఇథియోపియా, టర్కీ, థాయ్‌లాండ్, ఇండోనేషియా, యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ దేశాలు నిషేధించిన దేశాల జాబితాలో ఉన్నాయి.
నిజంగా మన దేశంలో సామాజిక మాధ్యమాలపై సెన్సార్ విధించాలనే ఆలోచన బూతు రాతల నివారణకా లేక పాలకులపై ప్రజల్లో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అసంతృప్తి జ్వాలలను అణిచివేయడానికా? అన్నా హాజారే ఉద్యమానికి సామాజిక మాధ్యమాల ద్వారా మద్దతు లభించినప్పటి నుండి వీటిపై ఆంక్షలకు ప్రభుత్వం ఆలోచిస్తుందనే వాదన వినిపిస్తోంది.
నాటి నినాదం: అరచేతిని అడ్డుపెట్టి సూర్యోయాన్ని ఆపలేరు
నేటి నినాదం: సెన్సార్‌షిప్‌తో సామాజిక మాధ్యమాల ఉద్యమాన్ని ఆపలేరు. 

ఆదివారం ఆంధ్రభూమి లో పూర్తి పాఠం 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం