31, మార్చి 2011, గురువారం

మాస్క్ లీడర్స్..


ఏ మండోయ్- అని శ్రీమతి ఎంత గట్టిగా పిలిచినా వినిపించుకోకుండా నాయక భర్త కారెక్కి వెళ్లిపోయారు. భార్యతో మాట్లాడేందుకు ఒక మాస్క్, ప్రియురాలితో మాట్లాడేప్పుడో మాస్క్, ప్రజలతో మాట్లాడేప్పుడు ఇంకో మాస్క్, పార్టీ వారి కోసం మరొక మాస్క్, మీడియా ముందుకు ఒక మాస్క్.... సందర్భాన్ని బట్టి మాస్క్‌లను వెంట వెంటనే మార్చేసేందుకు ఎప్పుడూ కనీసం అరడజను మాస్క్‌లు లేందే అడుగు బయటపెట్టని భర్త ఈ రోజు ఒక్క మాస్క్ కూడా లేకుండా సొంత ముఖంతోనే వెళ్లాడు.

బట్టలే లేకుండా బయట తిరగొచ్చు కానీ మాస్క్‌లు లేకుండా ఈ కాలంలో బయటే కాదు ఇంట్లో కూడా ఉండలేరు అలాంటిది ఈయనేంటి అలా వెళ్లాడని ఆమె తనలో తానే మదనపడసాగింది. కర్ణుడికి కవచకుండలాలు శరీరంలో భాగంగా అయినట్టే ఈ కాలంలో మాస్క్‌లు శరీరంలో అంతర్భాగం.
చక్రం లేని కృష్ణున్ని గద లేని భీమున్ని, నిండుగా గుడ్డలు తొడుక్కున్న హీరోయిన్‌ను ఊహించలేనట్టే మాస్క్‌లు లేని రాజకీయ నాయకున్ని ఊహించలేలేకపోతున్నానని శ్రీమతి బాధ పడింది.

శ్రీమతి పిలుపును అస్సలు పట్టించుకోకుండా పరుగుపెట్టాడు. శ్రీమతి తొలుత కంగారు పడ్డా తరువాత, సిరికింజెప్పడు; శంఖ చక్ర యుముంజేదోయి అని శ్రీమహాలక్ష్మి అనుకున్నట్టుగా తానూ అనుకుంది.
భార్యకు కూడా చెప్పకుండా శంఖ, చక్రాలను తీసుకెళ్లకుండా ఆ శ్రీమహావిష్ణువు ఎలా పరుగులు తీశాడో, అచ్చం మా ఆయనా అలానే వెళుతున్నాడు అని నవ్వుకుంది. మా ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి కచ్చితంగా ఆయనలోనూ శ్రీమహావిష్ణువు అంశ ఉంది అందుకే అలా మాస్క్‌లను ఇంట్లోనే పెట్టి పరుగులు తీశాడని తృప్తి పడింది.
**********

హేమాహేమీలైన నాయకులంతా మాస్క్‌లు లేకుండా తమ అసలు స్వరూపంతో సమావేశానికి వచ్చారు. మాస్క్‌లు ధరించక పోవడం వల్ల ఒక్కో నాయకుడి మనస్ఫూర్తిగా తాను ఏ మనుకుంటున్నాడో అదే మాట్లాడాడు. తొలుత చంద్రబాబు ఉపన్యాసం మొదలు పెట్టారు.‘‘ వైఎస్ ఆర్ లాంటి బలమైన నాయకున్ని ఓడించాలని తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నాను. ఎన్ని హామీలివ్వం ఎవరు పట్టించుకుంటారని అనుకున్నాను.
ఇప్పుడదే నా కొంపు కూలుస్తుందనుకోలేదు. నా నరనరాన సమైక్యాంధ్ర ఉంది. ఉండక చస్తుందా? సమైక్యాంధ్ర ఉంటేనే కదా! మళ్లీ ఏదో ఒక నాడు ముఖ్యమంత్రి పదవి చేపట్టవచ్చుననే ఆశ ఉంటుంది. పుట్టింది సీమలో ఆర్థిక బలం కోస్తాలో, పార్టీ బలం తెలంగాణలో, నా కష్టాలు పగవాడికి కూడా వద్దు. మూడు ప్రాంతాలు కలిసుంటేనే నాకు మళ్లీ ముఖ్యమంత్రి లభించే చాన్స్ ఉంటుంది.
ఇటు తెలంగాణ వారితో తెలంగాణ పోరాటం, సీమాంధ్రవారితో సమైక్యాంధ్ర ఉద్యమం నడిపిస్తున్నాను, వ్యవహారం ఎక్కువ రోజులు సాగేట్టుగా లేదు. 2020 వరకు పాలించి, ఆ తరువాత మా అబ్బాయికి పట్ట్భాషేకం చేయాలని ఎన్ని కలలు కన్నాను. నగదు బదిలీ పథకం మా వాడే కనిపెట్టాడని చెప్పి మా అబ్బాయికి మెల్లగా అధికార బదిలీ చేయాలనుకుంటే ఊహించని విధంగా కష్టకాలం వచ్చిపడింది ’’ అంటూ చంద్రబాబు గద్గద స్వరంతో పలికాడు.

చిరంజీవి ఏదో చెప్పేందుకు ఉబలాటపడుతున్నట్టున్నారు. ఆయన్ని చెప్పనివ్వండి అంటూ సిపిఐ నారాయణ సూచించగానే చిరంజీవి మైకందుకున్నాడు. ‘‘ బాబుగారూ తొమ్మిదేళ్లు పదవి అనుభవించిన వారు మీరే అలా ఏడిస్తే మరి నేనెలా ఏడవాలి. తెలంగాణ ఏర్పాటు ఖాయం అనుకుని సీమాంధ్రను దునే్నద్దామనుకుని సమైక్యాంధ్ర అంటూ యాత్ర మొదలు పెట్టారు. దీంతో తెలంగాణలో పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. కాంగ్రెస్‌లో విలీనం అయి కేంద్రంలో మంత్రి పదవి చేపడదామనుకుంటే దుష్టశక్తులు అడ్డుకున్నాయి. ఇప్పుడు చూస్తే తెలంగాణ వచ్చేట్టు కనిపించడం లేదు. అలా అయితే సీమాంధ్రలో నన్ను పట్టించుకునేదెవరు? అటు సినిమాల్లోకి వెళ్లి నటించలేను. ఇటు రాజకీయాల్లో నా నటనను ఎవరూ నమ్మడం లేదు.
నా బతుకు రెంటికి చెడ్డ రేవడిలా అయింది. చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. దయచేసి నా రాజకీయ జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఏర్పాటుకు మీరంతా సహకరించండి. అప్పుడు సీమాంధ్రలో అధికారం నాదే అవుతుంది. ఇనే్నళ్లు మీరూ మీరూ అధికారం పంచుకున్నారు, మాకు ఇప్పటికైనా అధికారం ఇవ్వరా? ’’ అంటూ చిరంజీవి తన కుర్చీలో కూలబడ్డారు.

‘‘ ఎక్కడున్నా ఓవర్ యాక్షన్ చేయడం మా పార్టీలో మాకు వెన్నతో పెట్టిన విద్య. తెలంగాణ వచ్చేస్తుందేమో అనుకుని వీరోచితంగా ఉపన్యాసాలు ఇచ్చేశాను, అవన్నీ నిజమే అని బాబు గారికి కూడా అనుమానం వచ్చినట్టుగా ఉంది. ఇప్పుడు తెలంగాణ రాకపోతే నా పరిస్థితేం కావాలి? ’’ అని నాగం జనార్దన్‌రెడ్డి దీనంగా అడిగాడు. ‘‘నోరు తెరవగానే పాండిత్యం బయటపడిపోయినట్టు గుమ్మనంగా ఉన్నంత కాలం నా అంతటి వీరుడు లేడని అంతా అనుకున్నారు.

పార్లమెంటులో టిడిపి జెండాలను పట్టుకుని వీరోచితంగా ఊగినప్పుడే నా తెలివితేటలు బయటపడిపోయాయి. ఇప్పుడు నన్ను తెలంగాణ వాళ్లు నమ్మేట్టుగా లేరు, సీమాంధ్ర వాళ్లు ఓస్ ఇంతేనా అని పెదవి విరుస్తున్నారు. నన్ను జనం నమ్మడం లేదు. అధిష్ఢానం నమ్మేట్టుగా లేదు. అందరి కన్నా ఎక్కువగా నష్టపోయింది నేనే’’ అని జగన్ వాపోయారు. మీ నాన్నగారు అధికారంలో ఉన్నప్పుడు అందరి కన్నా ఎక్కువ లాభపడ్డది కూడా మీరే కదా! అని నాగం వెనక నుంచి చురక అంటించారు. తరువాత మాటా మాటా పెరిగింది.
*******

పరిస్థితిని ముందుగానే ఊహించిన శ్రీమతులు మాస్క్‌లను వెంటపెట్టుకుని హాలులోకి వచ్చి తమతమ భర్తలకు ఆ మాస్క్‌లు అందించారు. ఒళ్ళు విదిల్చి నాయకులంతా మళ్లీ మాస్క్‌లు ధరించి, తాము అప్పటి వరకు మాట్లాడింది అక్కడే వదిలేసి బయటకు అడుగు పెట్టారు. అమ్మో మాస్క్‌లు లేకుండా ఒక్క గంట కూడా రాజకీయాల్లో జీవించలేం అని నాయకులంతా కోరస్‌గా అనుకున్నారు. మాస్ లీడర్స్ అంతా మాస్క్ లీడర్లే అని తమకు తామే కితాబు ఇచ్చుకున్నారు. ******

30, మార్చి 2011, బుధవారం

సమరోత్సాహం

చరిత్ర అంటే రాజులు, రాణుల శృంగారం కాదని చరిత్రను తవ్విచూసిన మహాకవులు ఎప్పుడో చెప్పారు. పూర్వం రాజుల చరిత్ర అంటే వారి సమరోత్సాహాన్ని ప్రదర్శించేదే కదా! ఏ రాజు వీరోచిత కథను చూసినా రాజుగారి వీరోచిత కార్యానికి పొరుగు రాజు మురిసిపోయి తన కూతురును ఇచ్చి పెళ్లి చేశాడు అనే వాఖ్యతో రాజుగారి వీరోచిత అంకం ముగిసేది.

ఆ రాజుగారి కథ ఎన్ని అంకాల్లో ఉంటే ఆయనగారికి అన్ని పెళ్లిళ్లు జరిగేవి. అంతెందుకు చివరకు శ్రీకృష్ణడి నీలాపనిందల కథలో జాంబవంతుడితో యుద్ధం చేసి అతన్ని ఓడించి ఆయన కూతురును పెళ్లి చేసుకోవడంతోనే ముగుస్తుంది కదా! అనగనగా ఒక రాజు కథ ముగింపు ఎప్పుడూ రాజుగారి కొత్త పెళ్లితోనే ముగుస్తుంది. పాపం అనే్నసి పెళ్లిళ్లతో ఆ రాజుగారి కుటుంబ పాలన ఎలా ఉండేదో కానీ కథలో మాత్రం ప్రజలను కన్నబిడ్డల్లా పాలించారని ఉంటుంది. ఆ కాలంలో ముసలి రాజు కూడా అంత ఉత్సాహంగా ఉండడానికి కారణం బహుశా ప్రతి విజయంతో ఒక కొత్త పెళ్లి కూతురు లభించడమే కావచ్చు.

రాజుగారికి అనే్నసి పెళ్లిళ్లు మంచి సంప్రదాయమా? కాదా? అంటే చరిత్రలో దీనిపై చర్చ జరిగినట్టు ఎక్కడా కనిపించదు. యుద్ధలు చేయడం వీరోచిత కార్యమని కొందరు, బౌద్ధం వ్యాపించిన తరువాత యుద్ధాలు తప్పు అనే బలమైన వాదన వినిపించింది కానీ విజయం సాధించినప్పుడల్లా రాజుగారు పెళ్లి చేసుకోవడంతో యుద్ధానికి శుభం కార్డు పడే సంప్రదాయం గురించి చర్చ కనిపించదు. పట్టపురాణి కుమారుడిని యువరాజుగా ప్రకటించాలా? లేక కోరిపెళ్లి చేసుకున్న చిన్నరాణి కుమారున్ని యువరాజుగా ప్రకటించాలా? అనే చర్చ చరిత్రలో, ఇతిహాసాల్లో కనిపిస్తుంది కానీ ఒకటికి మించిన పెళ్లిళ్లు అవసరమా? తప్పా కాదా? అనే చర్చ మాత్రం కనిపించదు.

రాముడు వనవాసానికి వెళ్లడం మొత్తం రామాయణమంతా ఎవరి బిడ్డను యువరాజుగా ప్రకటించాలనే వివాదంపైనే కదా! చివరకు మహాభారత యుద్ధమంతా అదే కదా! వారసత్వం కోసం అంతగా పట్టుపట్టిన వాళ్లు ఒకరికి మించి సంబంధాలు వద్దనేదానిపై ఎందుకు మాట్లాడలేదో? లేక మాట్లాడినా చరిత్ర కెక్కలేదా? మన రాజులు అంతటి వృద్ధాప్యంలో సైతం యుద్ధాలు చేసేందుకు అంత ఉత్సాహంగా ఉండడానికి కారణం ఏమిటో? బహుశా యుద్ధంలో విజయం సాధిస్తే అమ్మాయితో పెళ్లి కానుక వారిలో ఆ ఉత్సాహానికి కారణమేమో!
శృంగారం కలిగించినంత ఉత్సాహం మరేదీ కలిగించదని అందుకే కొందరు రాజులు యుద్ధాన్ని, శృంగారాన్ని రెండు కళ్లలా భావించారని చరిత్ర చెబుతోంది. వృద్ధాప్యంలో ఉత్సాహానికి శృంగారం కీలక పాత్ర వహించింది. పూర్వమంటే రాజులు యుద్ధాలు చేసి రాజ్యాన్ని, రాజకన్యను బహుమతిగా పొంది మరింత ఉత్సాహంతో మరో యుద్ధానికి సన్నద్ధం అయ్యేవారు. యుద్ధంలో గెలిస్తేనే రాజ్యం లభిస్తుంది, శృంగారంలో మాత్రం గెలిచినా, ఓడినా సంతోషం లభిస్తుంది అందుకే విజయం తరువాత లభించే శృంగారానికి రాజులు పెద్ద పీట వేసేవారట! మరిప్పుడు రాజ్యాలు లేవు, విజయం సాధించగానే కొత్త పెళ్లితో కొత్త ఉత్సాహం వచ్చే అవకాశం లేదు. అయినా వయసు మీరినా ఉత్సాహం తొణికిసలాడాలంటే? ఏం చేయాలి. సినీతారల చర్మ సౌందర్య రహస్యం లక్స్ అని అందరికీ తెలిసిపోయింది. కానీ వృద్ధ నాయకుల ఉత్సాహా రసహ్యం ఏమిటి? అందరికీ ఒకటే కారణం కానవసరం లేదు. తివారీకి ఉత్సాహం కలిగించిన అంశం మరోనేతకు కలిగించకపోవచ్చు. 86 ఏళ్ల వయసులో తనకంటూ సొంత శృంగార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని రారాజులా వెలిగిపోయిన తివారీకి పెద్ద వయసులో రావలసిన కష్టం కాదిది. రాజరికపు జిత్తులతో రణరంగపుటెత్తులతో సతమతవౌ మా మదిలో మదనుడు సందడి చేయుట చిత్రం భళారే విచిత్రం అని ఎన్టీఆర్ గారి దానవీర శూరకర్ణ సినిమాలో దుర్యోధనుడు తన భార్య భానుమతితో నృత్యం చేస్తూ శృంగారంలో మునిగిపోయి తనకు తానే ఆశ్చర్యపోయినట్టుగానే ఎన్‌డి తివారీ సైతం తన వీరత్వానికి తానే ముచ్చటపడ్డారు. తెలంగాణ, సమైక్య ఉద్యమాలతో రాష్ట్రం అట్టుడికి పోతుంటే 86 ఏళ్ల వయసులో తాను శృంగారంలో రగిలిపోవడం ఏమిటని తివారీ బోలెడు ఆశ్చర్యపోయారు.

ఇంత లేటు వయసులో అంత ఘాటు శృంగారం నడిపినందుకు అభినందించాల్సింది పోయి ఈ వయసులో నన్ను ఇబ్బంది పెడతారా? అని తివారి బోలెడు అసంతృప్తి చెందుతున్నారు. ఇటీవల హిందీ చానల్స్‌లో తివారి శృంగార నృత్యాలను ప్రసారం చేస్తున్నారు. ఉత్తరఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తివారీ శృంగార వ్యవహారాలను ఆధారం చేసుకుని రూపకాలను హిందీ చానల్స్‌లో ప్రసారం చేస్తున్నారు.

తివారీ వేణువు వాయిస్తుంటే గోపికలు చుట్టూ చేరి నృత్యం చేస్తున్న అల్బమ్‌లు ఉత్తరాదిలో ఊపేస్తున్నాయి. హిందీ చానల్స్ అన్నింటిలో వీటిని ప్రసారం చేస్తున్నారు. వాటిని చూస్తూ తివారీ ముసిముసి నవ్వులు నవ్వుకోవడం మినహా ఏమీ కోపగించుకోవడం లేదనేది ఉత్తరఖండ్ పత్రికల కథనం. వయసులో ఉండగానే నేను చాలా అందగాన్ని, నా గురించి మాట్లాడేప్పుడు ఆ విషయం గుర్తు పెట్టుకోండి అని చెప్పారు. తాను రిటైర్ అయ్యే ప్రసక్తే లేదని, తానింకా క్రియాశీలక రాజకీయాల్లోనే ఉంటానన్నారు. తమతమ రంగాల్లో నిరంతరం విశేషంగా కృషి చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారికి హఠాత్తుగా మధ్యవయసులో ఇలాంటి చిలిపి పనులు చేయాలనిపిస్తుందట!

మన రాష్ట్రంలో సైతం కొంత మంది తమ తమ రంగాల్లో సొంత సామ్రాజ్యాలు నిర్మించుకున్న వారు రిటైర్‌మెంట్ వయసులో పాతికేళ్ల అమ్మాయిలను పెళ్లి చేసుకున్న సందర్భాలుఉన్నాయి. 60 ఏళ్ల వయసులో సినిమా రంగంలో రిటైర్ అయి రాజకీయాల్లోకి వచ్చి, ముఖ్యమంత్రి పదవి చేపట్టి, 73ఏళ్ల వయసులో ఎన్‌టి రామారావు మళ్లీ పెళ్లి చేసుకున్నారు కదా! సమరోత్సాహానికి నాయకులకు ఇది తప్పదేమో!

గాంధీభవన్‌లో బాబు.. ఎన్టీఆర్ భవన్‌లో జగన్! @2014



మండలి ఎన్నికల్లో తొమ్మిది స్థానాలకు ఎన్నికలు జరిగితే మూడు పార్టీలకు మూడేసి సీట్లు వచ్చాయి. 2014లో సాధారణ ఎన్నికల్లో సైతం ఫలితాలు ఇలానే ఉండొచ్చనిపిస్తోంది. ఇలానే ఉంటే మూఢు పార్టీలో ఏవో రెండు పార్టీల మధ్య స్నేహం కుదిరితే తప్ప ప్రభుత్వం ఏర్పాటు సాధ్యం కాదు. అప్పుడుచంద్ర బాబు జగన్‌తో చేతులు కలుపుతారా? లేక కాంగ్రెస్‌తో చేతులు కలుపుతారా? లేక జగన్‌ను కాంగ్రెస్ అక్కున చేర్చుకుంటుందా? ఒక్కసారి ఫ్యూచర్‌లోకి వెళ్లి ఆలోచిస్తే....


సాధారణ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఎవరికీ మెజారిటీ రాలేదు.... ఎన్టీఆర్ భవన్‌కు జగన్ రాగానే ఒక్కసారిగా అతనిపై పూలవర్షం కురిసింది. అచ్చం వైఎస్‌ఆర్‌లానే జగన్‌మోహన్‌రెడ్డి చేతులు జోడించి అక్కడి వారికి నమస్కారం చేశారు. సార్ నేను మీ నాన్నకు వీరాభిమానిని అని తళతళలాడే పచ్చచొక్కా వేసుకున్న తెలుగు నాయకుడొకరు జగన్‌తో కరచాలం చేశాడు.
మీ నాన్న ఫోటో నా గుండెలపై ఉంది చూడండి సార్ అంటూ ఒకనేత చొక్కా విప్పి చూపించారు. అంతకు ముందు ఈయన ఎన్టీఆర్ ఫోటో కూడా గుండెలపై ఇలానే పొడిపించుకున్నాడు అది చెరిపేసి మీ నాన్న బొమ్మను పచ్చబొట్టుగా పొడిపించుకున్నాడు. నేను అలా కాదు నా కుడిచేయి మీద మీ నాన్న పేరు పచ్చబొట్టు పొడిపించుకున్నాను చూడండి సార్. అని మరో నేత మల్లేశ్వర్ కుడి చేయి ముందుకు చాపాడు. కుడిచేయి సంగతి సరే కానీ వారి ఎడమ చేతిని చూపమనండి సార్ ఎవరి పేరుందో తెలుస్తుంది అని మహిళా నేత మాణిక్యమ్మ దూసుకొచ్చింది.

మీ పార్టీ ఆఫీసులో మిమ్ములను అభిమానించే వారెవరూ కనిపించడం లేదు అంతా మా నాన్న అభిమానులే ఉన్నారుఅని బాబును చూస్తూ, జగన్ నవ్వాడు. ఆ మాటలు విననట్టుగానే బాబు జగన్‌ను తన చాంబర్‌కు తీసుకువెళ్లాడు. అంతా చెబితే ఏదో అనుకున్నాను మీ పార్టీ ఆఫీస్ కార్పొరేట్ ఆఫీస్‌ను తలదనే్న విధంగా ఉంది అని జగన్ అభినందించి, ఇక చర్చలు ప్రారంభిద్దాం మీ పార్టీ సీనియర్లను పిలవండి అని జగన్ కోరాడు. మీరేదో రాజకీయాల్లో తెలివైనవారనుకున్నాను, ఇంత కాలం అయినా నా సంగతి తెలియలేదా? నా రూటే సెపరేటు, ముందు నిర్ణయం తీసుకున్న తరువాత సీనియర్లతో చర్చించడం నా పద్దతి అని బాబు నవ్వాడు.

మనం ఇద్దరం కలిస్తే కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేం. ఇద్దరం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం, ఇద్దరి విధానాలు అమలు చేద్దాం, ఇద్దరం అధికారాన్ని పంచుకుందాం అని ఇద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. చర్చలు ముగించి ఇద్దరూ విలేఖరుల సమావేశానికి వచ్చారు. ‘‘కాంగ్రెస్ వ్యతిరేకతే ఊపిరిగా జీవించే నేను, రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జగన్‌తో చేతులు కలపాలని నిర్ణయించుకున్నాను.

మా ఇద్దరి ఉమ్మడి లక్ష్యం కాంగ్రెస్ వ్యతిరేకత అందుకే ఇద్దరం కలిశాం. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకు వెళతాం, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీలేని పోరాటం సాగిస్తాం. సోనియాగాంధీని నేను వ్యతిరేకిస్తున్నాను, జగన్ వ్యతిరేకిస్తున్నారు. దాంతో మా ఇద్దరి సిద్ధాంతాలు కలిశాయి. ఇద్దరం కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం ’’ అని చంద్రబాబు ప్రకటించారు. ‘‘ తాను విద్యార్థిగా ఉండేప్పుడే చంద్రబాబు విధానాల పట్ల ఆకర్షితుడ్ని అయ్యాను’’ అని జగన్ ప్రకటించారు.

‘‘యువకులుగా ఉన్నప్పుడే మా నాన్న, బాబు మంచి మిత్రులు, ఏనాటికైనా బాబుతో కలిసి పని చేయాలని కలలు కన్నాను. ఇన్నాళ్లకు నా కలలు ఫలించాయి’’ అని జగన్ సంతోషంగా ప్రకటించారు. ఇద్దరూ చేతులు పైకెత్తి మీడియాకు ఫోజులిచ్చారు

.*****
గాంధీభవన్‌లో గంగాభవానీ తీన్‌మార్‌కు అనుగుణంగా డ్యాన్స్ చేస్తున్నారు. బాబు కారు నుంచి కాలు కింద పెట్టి గాంధీభవన్ భూమిని చేతితో తాకి ముద్దాడాడు. తల్లి నుంచి తప్పిపోయిన పిల్లాడు ఎక్కడెక్కడో తిరిగి చాలా కాలం తరువాత తిరిగి తల్లిఒడికి చేరినట్టుగా ఉంది నా పరిస్థితి అని బాబు భావోద్వేగానికి గురయ్యారు. బిడ్డకు తల్లిమీద కోపం ఉంటుందేమో కానీ తల్లికి తన పిల్లల మీద ఎప్పుడూ కోపం ఉండదు ఎంత కాలానికి తిరిగి వచ్చినా ఆదిరిస్తుంది అనిచెప్పి రోశయ్య బాబును లోనికి తీసుకు వెళ్లారు.

పిసిసి అధ్యక్షుని చాంబర్‌లో కూర్చోని చర్చలు మొదలు పెట్టారు. మీరు బయటి నుంచి మద్దతు ఇవ్వాలి అంటూ చంద్రబాబు ఏదో చెప్పబోతుంటే చాల్లేవయ్యా ఇంకా బయటి నుంచి మద్దతు లోపలి నుంచి మద్దతు డైలాగులు వద్దు కానీ నేరుగా పాయింట్‌లోకి రా అని కిరణ్‌కుమార్‌రెడ్డి సలహా ఇచ్చారు. ఇద్దరి మధ్య రహస్య ఒప్పందం కుదిరింది.
బాబు విలేఖరుల ముందుకు వచ్చి నా పుట్టింటికి నేను తిరిగి వచ్చినట్టుగా ఉంది. నేను ఎప్పుడూ అధికారాన్ని ఆశించలేదు. పదవి కోసం కాదు రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసమే కాంగ్రెస్‌తో చేతులు కలపాలని నిర్ణయించుకున్నాం. వైఎస్‌ఆర్ ఈ రాష్ట్రాన్ని దోచేశారు. అతని కొడుకు జగన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని మింగేస్తాడని కాంగ్రెస్‌తో చేతులు కలపాలని నిర్ణయించుకున్నాను.

నా నిర్ణయంలో రాష్ట్ర ప్రయోజనాలే తప్ప వ్యక్తిగత ప్రయోజనాలు లేవు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నాలో ఇంకా 30 శాతం కాంగ్రెస్ రక్తం ఉందని చెప్పాను. అది 50 శాతానికి చేరిందని చెప్పడానికి గర్విస్తున్నాను’’ అని ముగించారు.

*******
పిసిసి అధ్యక్షుడు జగన్ ఇంటికి వచ్చి బెల్ కొట్టారు. మా సంగతి నీకు తెలియనట్టుగా ఉంది తలుపు తీయకపోతే గోడ దూకి వస్తాం అని నాయకులు బిరబిరమంటూ లోనికి దూసుకొచ్చారు. మనం మనం ఒకటి మన రెండు పార్టీల్లోనూ కాంగ్రెస్ ఉంది అంటూ నాయకులు జగన్‌ను బుజ్జగించారు...

2014లోనే కాదు మరో 50 ఏళ్లయినా రాజకీయాలు ఇలానే ఉంటాయి.

29, మార్చి 2011, మంగళవారం

ముప్పయ్యవ ఏట అడుగిడుతున్న తెలుగుదేశం వన్నె తగ్గిన విజయవిశ్వాసం



కేవలం సినిమా గ్లామర్‌తోనే ఏర్పాటైన టిడిపి ఎన్టీఆర్ మరణం తరువాత కూడా తొమ్మిదేళ్ల పాటు అధికారంలో ఉండడం విశేషమే. ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన బలమైన పునాదులు కావచ్చు, రాష్ట్రంలో ఏర్పడిన రెండు పార్టీల వ్యవస్థ కావచ్చు టిడిపి ఎన్టీఆర్ తరువాత కూడా బలంగానే ఉంది. అయితే ఇప్పుడా పార్టీ మూడు దశాబ్దాల్లో ఎప్పుడూ లేనంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఎన్టీఆర్ హయంలో టిడిపి రాష్ట్రంలో అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని బలమైన ముద్రవేసింది.
వార్తా పత్రికలు చదివే అలవాటు లేని ఎన్టీఆర్ ఏకంగా ఒక రాజకీయ పార్టీనే ఏర్పాటు చేశారు. ఆయనకు రాజకీయాల్లో ఏ మాత్రం అనుభవం లేకపోవచ్చు కానీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో బలంగా తనదైన ముద్ర వేశారు. రెండు రూపాయలకు కిలో బియ్యం వంటి జనాకర్షక పథకం కావచ్చు, పరిపాలను ప్రజల ముంగిటకు తీసుకువెళ్లే మాండలిక వ్యవస్థను ఏర్పాటు చేయడం కావచ్చు.
రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు జాతీయ రాజకీయాల్లో సైతం ఎన్టీఆర్ తన ప్రభావాన్ని చూపించారు. కాంగ్రెసేతర పార్టీలను ఏకం చేసేందకు కృషి చేశారు. ఉక్కు మహిళగా పేరు పొందిన ఇందిరాగాంధీ సైతం ఎన్టీఆర్ ప్రజాకర్షణ శక్తిని అంగీకరించి, ‘నాదెండ్ల- రాంలాల్ ఎపిసోడ్’ తరువాత ఎన్టీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిగా చేయక తప్పలేదు. దశాబ్దాల పాటు సినిమాల్లో రారాజుగా వెలిగిపోయి ఎదురులేని వ్యక్తిగా నిలిచిన ఎన్టీఆర్ రాజకీయాల్లో సైతం అదేధోరణి చూపారు. అదే చివరకు ఆయన కొంప ముంచింది.
తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఏడాది లోగానే నాదెండ్ల భాస్కర్‌రావు దించేశారు. తిరిగి అధికారంలోకి వచ్చి అసెంబ్లీని రద్దు చేసి మధ్యంతర ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చి ఐదేళ్లపాటు ఉన్నారు. ఆ తరువాత 1994లో అధికారంలోకి వచ్చినప్పుడు పట్టుమని ఎనిమిది నెలలు కూడా అధికారంలో ఉండలేకపోయారు. పాలనలో ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నా, టిడిపికి బలమైన ఓటు బ్యాంకును ఏర్పాటు చేసినా ఆయనకు రాజకీయాల్లో అనుభవం లేదు అని చెప్పే విధంగా రెండుసార్లు కూడా ఆయన వెన్నుపోటు బారిన పడ్డారు.
కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా సైతం దక్కకుండా చేసి అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ ఎనిమిది నెలలు కూడా అధికారంలో ఉండలేకపోయారు. జనాకర్షణ వేరు రాజకీయాలు వేరు అని ఎన్టీఆర్ చంద్రబాబు ఉదాంతాలు నిరూపిస్తున్నాయి. చంద్రబాబుకు జనాకర్షణ తక్కువే కానీ తెర వెనుక వ్యవహారాల్లో దిట్ట. తెర వెనుక రాజకీయాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 1999లో బిజెపి హవాలో రెండవ సారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఆ తరువాత రెండేళ్లకే టిఆర్‌ఎస్ ఆవిర్భవించింది. టిఆర్‌ఎస్ పుట్టుక టిడిపికి చావుదెబ్బగా మారింది. టిడిపికి 2001 నుంచి పతనం మొదలైంది. అప్పటి నుంచి ఇంకా కోలుకోలేదు.
2009లో టిఆర్‌ఎస్‌తో జత కట్టినా టిడిపికి అధికారం దక్కలేదు. టిడిపి ఆవిర్భావం తరువాత తొలిసారిగా కాంగ్రెస్ వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. మరోసారి అధికారంలోకి వస్తామనే నమ్మకం కాంగ్రెస్ పెద్దల్లో సైతం పెద్దగా కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితిలో రేపు అధికారం మాదే అనే ధీమా టిడిపిలో కనిపించాలి.
కానీ అలాంటి పరిస్థితి లేదు. రాష్ట్రం ఏమవుతుందో, తెలంగాణ సంగతి ఏం చేస్తారో అనే గందరగోళంతో పాటు ఏం జరిగితే పార్టీ పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నలు టిడిపిని వెంటాడుతున్నాయి. మూడు దశాబ్దాల టిడిపిలో సగ భాగం ఎన్టీఆర్ జమానా కాగా, మిగిలిన సగం చంద్రబాబుది. చంద్రబాబు జమానాను రెండుగా విభజిస్తే తొలి భాగం అధికారంలో ఉన్నప్పుడు ఐటి, కంప్యూటర్ జమానా కాగా, రెండో భాగం ప్రతిపక్ష పాత్ర. చంద్రబాబు అధికారంలో ఉన్నంత కాలం ఆయన వెనక భారీ పోస్టర్ ఒకటి కనిపించేది.
ప్రభుత్వ ప్రకటనల్లోనైనా, సిఎమ్‌గా , పార్టీ అధ్యక్షునిగా విలేకరుల సమావేశాలు జరిగే హాలులోనైనా ఈ పోస్టర్ తప్పని సరిగా కనిపించేది. కంప్యూటర్ వౌస్ పట్టుకుని కంప్యూటర్ వైపు చూస్తున్న బాబు, వెనక హైటెక్ సిటీ. బాబు అధికారంలో ఉన్నప్పటి కాలానికి అద్దం పట్టే విధంగా ఉండేదీ పోస్టర్. బాబు ఓడిపోగానే హఠాత్తుగా పోస్టర్లను మార్చేశారు. ఇప్పుడాయన వెనక పచ్చని పొలాలు, ఆ పొలాల్లో పని చేస్తున్న రైతు కూలీలు, రైతులు, ఒక వైపు రైతును తలపించే విధంగా పాగాతో ఎన్టీఆర్ మరోవైపు నాగలి చేతపట్టిన చంద్రబాబు -ఇలా కనిపిస్తోంది. టిడిపి నాయకత్వం శక్తివంచన లేకుండా కొత్త పోస్టర్‌ను ప్రచారంలో పెట్టినా అధికారంలో ఉన్నప్పటికీ హైటెక్ పోస్టర్ ప్రజలపై బలమైన ముద్ర వేయడంతో కొత్త పోస్టర్ జనం హృదయాల్లోకి వెళ్లలేకపోతోంది.
ఈ విషయం స్వయంగా చంద్రబాబే చెబుతున్నారు. హైదరాబాద్‌లోని ఫ్యాప్సీ కేంద్రంలో రైతుల సమావేశాలు జరుగుతున్నాయి. అన్ని పార్టీల నాయకులు మాట్లాడుతున్నారు, అలానే చంద్రబాబు మాట్లాడుతూ 2జి స్పెక్ట్రమ్‌గురించి రైతులకు సుదీర్ఘంగా చెబుతుంటే అవన్నీ మాకెందుకండి రైతుల సంగతి చెప్పండి అంటూ రైతులు గట్టిగా అరిచారు. దానికి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేస్తూ నాకు మీకన్నా ఎక్కువ ఆవేశం ఉంది, మీ కోసం నేను వారం పాటు నిరాహార దీక్ష చేస్తే మీరు రాలేదు, స్పందించలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.

నిజమే అధికారంలో ఉన్నప్పుడు హైటెక్ బాబుగా పడిన ముద్రను తొలగించుకుని రైతు బాబు ముద్ర కోసం దీక్ష సాగించారు. ఆ దీక్ష ఎంత వరకు విజయవంతం అయిందో ఆయన మాటల్లోనే తేలిపోయింది. రైతులు, ఉద్యోగులు, కార్మికులకు వ్యతిరేకి అనే బలమైన ముద్రలు చంద్రబాబుపై ఉన్నాయి. ప్రతిపక్షంలోకి వచ్చి ఆరేళ్లవుతున్నా తనపై పడిన ముద్రలను చెరిపేసుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తోంది, అధికార పక్షాన్ని ముచ్చమటలు పోయించాల్సిన పరిస్థితి రావడం లేదు.
ఎన్టీఆర్ హయాంలో తెర వెనుక మంత్రాంగానికి చంద్రబాబు తెలివి తేటలు బాగా ఉపయోగపడ్డాయి. తరువాత నేరుగా చంద్రబాబే నాయకత్వం వహించడంతో ఆయనకు కుడిభుజం ఎడమ భుజం అంటూ ఎవరూ లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. దేశంలో అత్యంత శక్తివంతమైన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన రతన్ టాటాను ఒకసారి విలేఖరుల సమావేశంలో మీ విజయరహస్యం ఏమిటని ప్రశ్నించారు. సమర్థత, నిజాయితీ, నిబద్ధత కలిగిన బృందం వల్ల నేనీ విజయాలు సాధించాను. ఎవరి సామర్ధ్యం ఏమిటో గుర్తించి వారికి బాధ్యతలు అప్పగించిన తరువాత అనవసర జోక్యం చేసుకోను అదే నా విజయ రహస్యం అని చెప్పారట! వ్యాపార సామ్రాజ్యంలోనే కాదు రాజకీయాల్లోనైనా చివరకు కుటుంబంలోనైనా అంతే.
విజేతకు సమర్ధవంతమైన బృందం ఉండాలి. అన్ని పనులు నేనే చేస్తాను అనుకునే వారు చివరకు ఏ పనీ చేయలేరు. ఒక మంచి బృందాన్ని ఎంపిక చేసుకోవడంలోనే వైఎస్‌ఆర్ విజయం దాగుంది. చిత్రంగా వైఎస్‌ఆర్, చంద్రబాబు ఒకప్పుడు మంచి మిత్రులు. నమ్మకమైన బృందాన్ని ఏర్పాటు చేసుకోవడం, బాధ్యతలు అప్పగించడం అనే దానిలో ఇద్దరు పరస్పర విరుద్ధ మనస్తత్వంతో ఉంటారు. వైఎస్‌ఆర్ నమ్మారంటే బాధ్యతను అప్పగించి విజయం సాధించినా విఫలమైనా సమానంగా తీసుకుంటారు. చంద్రబాబు అలా ఎవరినీ నమ్మరు, పూర్తి బాధ్యతలు అప్పగించరు, విజయం సాధిస్తే తన ఘనత అంటారు, వైఫల్యం చెందితే అది ఇతరులపైకి నెడతారు. సీమాంధ్రలో జగన్, తెలంగాణలో తెలంగాణ అంశం టిడిపి నాయకత్వాన్ని కలవరపెడుతోంది. ఈ రెండు విషయాల్లో టిడిపి నాయకత్వం చేయగలిగింది ఏమీ లేదు. అయతే విస్తృతమైన ప్రచారం ద్వారానే ఏమైనా సాధించవచ్చును అనే భావన టిడిపిలో ఇంకా బలంగానే ఉంది.

28, మార్చి 2011, సోమవారం

చవట హీరోలు

అదేదోపాత సినిమాలో వాణిశ్రీ తనను ప్రేమించడంలో పోటీపడుతున్నవారితో ఎవరెక్కువ చవటలైతే వారినే ప్రేమిస్తానని పోటీ పెడుతుంది. చవటాయను నేను నీకంటె చవటాయను నేను అంటూ ఇద్దరూ పోటీ పడతారు. వీరులెవరనే విషయంలోనే కాదు ఈ ప్రపంచంలో చవటలెవరనే విషయంలో సైతం పోటీ ఉంటుంది. వారు నిజంగా చవటలా? కాదా? అనే విషయం ఎలా ఉన్నా వాణిశ్రీని దక్కించుకోవాలంటే చవటల పోటీల్లో నెగ్గాల్సిందే మరి? వాణిశ్రీని దక్కించుకోవడానికి చవటాయల పోటీనే అంత తీవ్రంగా ఉంటే ఇక రాజ్యలక్ష్మిని దక్కించుకోవాలంటే హీరోయిజంలో ఎంత పోటీ ఉంటుందో ఆలోచించండి. మార్కెట్‌లో దేనికి డిమాండ్ ఉంటే దాని కోసం పోటీ ఎక్కువగా ఉండడడం సహజమే! హీరోయిజానికి గ్లామర్ ఉంటే తనను మించిన హీరో లేరంటారు. అదే విలనిజానికి క్రేజి ఉంటే తనను మించిన విలన్ లేనే లేరని మీసాలు మెలేస్తారు. మార్కెట్‌లో తన విశ్వసనీయత గ్రాఫ్ నేలపై పడిపోయిందని సొంత వాళ్లు సైతం గుసగుసలాడుకోవడంతో చిర్రెత్తుకొచ్చిన బాబు దేశ రాజకీయాల్లో నా అంత విశ్వసనీయత గలవారెవరున్నారని సవాల్ విసిరారు. ఇది సవాల్ విసరడం కాదు అత్మవిశ్వాసం అంత కన్నా కాదు దేశంలోని రాజకీయ నాయకులందరినీ అవమానించడమేనని బాబు విశ్వసనీయత గురించి బాగా తెలిసిన వారు చెప్పుకొచ్చారు. నేనెప్పుడూ విశ్వసనీయత ట్రేడ్‌మార్క్ షర్ట్స్‌నే వాడతాను అంటూ జగన్ కాలరెగరేసి మరీ చెబుతున్నారు. తానెంత చెప్పినా కనీసం ఇంట్లో వాళ్లకైనా విశ్వాసం కలిగించలేకపోతున్నానని గ్రహించినట్టున్నారు ఇప్పుడా విషయం పక్కన పెట్టి అసలు హీరో ఎవరు అనే చర్చ లేవదీశారు. లక్షల కోట్లు దోచిన వారు హీరోనా నేను హీరోనా మీరే తేల్చుకోండి అంటూ ప్రజలపైకి ప్రశ్న వదిలారు. తమ కుటుంబంలోనే డజన్ల కొద్ది హీరోలుండగా, తాను కాకుంటే మరెవరు హీరో అనేది ఆయన బాధ. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, తారక రత్న, కళ్యామ్‌రామ్‌ల వంటి హీరోలు తనకు కుడి ఎఢమ భుజాలుగా, ముందు వైపు వెనకవైపు నిలిచి ఏ క్షణంలో అంటే ఆ క్షణంలో తన కోసం ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు తాను కాకుంటే ఇంకెవరు హీరో అనేది ఆయన బాధ. పోనీ వీళ్లు సరిపోరు అనుకుంటే తమ్ముడి కొడుకూ హీరోనేనాయె. వాళ్లంతా వేషాలేసుకునే హీరోలు. వారి హీరోయిజం తెరకే పరిమితం. ఒంటి చేత్తో ఈ హీరోలందరినీ మట్టికరిపించి రాజగురువుకు సైతం చుక్కలు చూపించిన రియల్ హీరో వైఎస్‌ఆర్ కుమారుడిగా తానే అసలైన హీరోను అనేది జగన్ వాదననట . హీరోల సంతానం నటహీరోలైనప్పుడు రాజకీయ హీరోలో వారసులు రాజకీయ హీరోలు కావలసిందే కదా? అని గడుసుగా ప్రశ్నిస్తున్నారు. మీరే హీరోలైతే సినిమా రంగంలో ఎలాంటి గాడ్‌ఫాదర్స్ లేకుండా సినిమా రంగానికి వచ్చి కులం కాని చోట మూడు దశాబ్దాలు మెగాస్టార్‌గా వెలిగిపోయిన తననెవరూ రియల్ హీరోగా చూడడం లేదేమిటనేది చిరంజీవి బాధ. ఎన్టీఆర్‌కు 60 ఏళ్ల వయసులో తనను ఆదరించిన ప్రజల కోసం ఏదో చేయాలనే తపనతో సినిమా జీవితాన్ని త్యాగం చేస్తే తాను అంత కన్నా ఐదేళ్ల ముందే సినిమా జీవితాన్ని త్యాగం చేసినా రాజకీయాల్లో తనకు లభించాల్సిన గుర్తింపు లభించలేదనేది ఈ రీలు హీరో బాధ. వీరెవరూ కాదు అసలు అధికారం ఎవరి చేతిలో ఉంటే వాడే నిజమైన హీరో అని కిరణ్‌కుమార్‌రెడ్డి డైలాగ్ కింగ్ డబ్బింగ్ సాయికుమార్ రేంజ్‌లో గొంతు చించుకుని చెప్పినా ఎవరూ వినడం లేదు. ఎన్టీఆర్ జీవిత చరిత్రలో చంద్రబాబు విలన్‌గా కనిపిస్తే, చంద్రబాబు ఆత్మకథలో బాబే హీరో కావడం సహజం. ఒకరికి హీరోగా కనిపించిన వారు అందరికీ హీరోగా కనిపించాల్సిన అవసరం లేదు. ఎవరి చూపు వారిది. తెలంగాణ వ్యవహారంలో ఎవరేం చెప్పినా కెసిఆర్ హీరో, అదే సీమాంధ్రుల దృష్టిలో ఆయనో విలన్ . ఎన్టీఆర్ రాముడిగా నటిస్తే కదిలి వచ్చిన దైవం అని మొక్కారు. రావణుడిగా నటిస్తే తెరపైకి రావణుడు నడిచొచ్చాడేమోనని మైమరిచి పోవడమే కాకుండా అసలు రావణుడే హీరోనేమో అనుకున్నారు. ఎన్టీఆర్ రాముడిగా, రావణుడిగా నటించి మెప్పించారు. రెండు పాత్రల్లో ఎవరు హీరో అంటే ఏం చెబుతాం? కులాలకు, ప్రాంతాలకు ఆత్మగౌరవ నినాదం వ్యాపించినప్పుడు చరిత్రను తవ్వితీసి ఎవరి హీరోలను వారు వెలుగులోకి తీసుకు రావడాన్ని తప్పు పట్టలేం. ఒకప్పటి ప్రపంచ బ్యాంకు చైర్మన్ ఉల్ఫెన్‌సన్, నాటి అమెరికా అధ్యక్షుడు క్లింటన్, మైక్రోసాఫ్ట్ బిల్‌గేట్స్‌లనే ప్రపంచ హీరోలుగా తెలుగునాట అప్పటి పాలకులు చూపించేవారు. అధికారం పోయాక ఎప్పుడూ లేని విధంగా మహాత్మాజ్యోతి ఫూలేనే నిజమైన జాతీయ హీరో అంటూ వేనోళ్లుగా పొగిడారు. కాలం మారుతున్నప్పుడు ఎప్పుడూ ఒక్కరే హీరోగా నిలిచిపోరు. పూలే మరణించిన చాలా దశాబ్దాల తరువాత హీరోగా గుర్తింపు పొందారు. అలానే ఇప్పుడు హీరోలుగా వెలుగొందుతున్నవారు కొంత కాలం తరువాత కనుమరుగు కావచ్చు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు,శాశ్వత శత్రువులే కాదు శాశ్వత హీరోలు సైతం ఉండరు. అధికారం ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనేది మొన్నటి మాట ఇప్పుడు వద్దన్నా నాలుగు రాళ్లు వెనక పడతాయి. అధికారంలో ఉన్నప్పుడే నాలుగు విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం మంచిదనేది నేటి మాట! రష్యాలో ఒకప్పుడు హీరోలుగా వెలిగిపోయిన వారిని ఆతరవాత విలన్లుగా భావించి విగ్రహాలు తొలగించేస్తున్నారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమునికి కల్వకుర్తి కామన్‌మాన్ ఓటమి అంటే ఏమిటో చూపించి హీరోగా నిలిచాడు. వాజ్‌పాయి లాంటి ప్రతిపక్ష నాయకునితో కూడా దుర్గాదేవిగా అభినందనలు అందుకున్న ఇందిరాగాంధీకి సైతం ఓటమంటే ఏంటో చూపించి సామాన్యుడే హీరో అని నిరూపించారువోటర్లు. నిజానికి కాలాన్ని మించిన హీరో ఎవరుంటారు? కాలమే విలన్‌ను హీరోగా, హీరోను విలన్‌గా మార్చేస్తుంది .

27, మార్చి 2011, ఆదివారం

అదృష్ట జాతకులు

కనులుతెరిస్తే జననం, కనులు మూస్తే మరణం రెప్పపాటే కదా? జీవితం అన్నాడో కవి. అలానే అదృష్ట దురదృష్టాల మధ్య ఉండే కాలమే రాజకీయ జీవితం అనిపిస్తోంది. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడట! జీవితంలో అనుకున్నది సాధించాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది కానీ రాజకీయాల్లో మాత్రం అనుకున్నది సాధించాలంటే కష్టపడడం కన్నా కాలం కలిసి రావడం ముఖ్యం. ముఖ్యమంత్రి పదవి కోసం ఎంతో మంది ఎనె్నన్నో ఎత్తుగడల్లో మునిగిపోతే కనీసం మంత్రి పదవి కూడా చేపట్టని కిరణ్‌కుమార్‌రెడ్డి ఒళ్లో వచ్చి అది వాలిపోవడం అంటే ఆయన్ని మించిన అదృష్ట జాతకుడు ఎవరుంటారు? ఎవరి సమస్యల్లో వారు మునిగిపోయి ప్రజా సమస్యలపై ఆయన్ని ఎవరూ అడిగే పరిస్థితి లేకపోవడం కూడా ఆయన పాలిట అదృష్టమే. ప్రభుత్వం పడిపోకుండా ప్రతిపక్షం సైతం కంటికి రెప్పలా కాపాడుతుంటే అంతకు మించిన అదృష్టం ఏ ముఖ్యమంత్రికైనా ఏముంటుంది. కొంపదీసి ప్రభుత్వం పడిపోతుందా? అని ప్రతిపక్ష నేత కంగారు పడుతుంటే, నాకేమీ కాదని కిరణ్‌కుమార్‌రెడ్డి ధీమాగా ఉన్నారంటే ఆయన అదృష్టాన్ని ఏమనాలి.ఎన్టీఆర్‌ను అంతా కారణ జన్ముడంటారు కానీ ఆయన గొప్ప అదృష్టజాతకుడు. తెలుగు వారి కీర్తిపతాకాన్ని ఢిల్లీ వీధుల్లో రెపరెపలాడించిన ఇద్దరు నేతలు ఎన్టీఆర్, పివి నరసింహారావు .ఈ ఇద్దరిని మించిన అదృష్ట జాతకులు రాజకీయాల్లో ఉన్నారా? వీరిద్దరి ముగింపు ఎలా ఉన్నా అధికారం చేపట్టిన కాలం మాత్రం వీరిని మించిన అదృష్టవంతులు లేరనిపించింది. అంతే కాదు రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వారిని మించిన అదృష్టవంతులు లేరు. ఇప్పుడున్న కిరణ్‌కుమార్‌రెడ్డిని చూసినా ఇప్పటి వరకు ఈ పదవిని చేపట్టిన వారందరి జీవితాలను చూసినా వీరినా పదవి వరించడాన్ని మించిన అదృష్టం ఏముంటుందనిపిస్తోంది. అధిష్ఠానం దేవత లాటరీలో ఎవరి పేరు వస్తే వారినే కదా? రాష్ట్రంలో ముఖ్యమంత్రి పీఠం వరించేది. ఎన్టీఆర్‌ది అదృష్టం అంటే కాదని గట్టిగా వాదించే వారి సంఖ్య తక్కువేమీ కాదు. ఆయన మరణ పరిస్థితి దురదృష్టకరం కావచ్చు కానీ ఆయన జీవితం అదృష్టానికి ప్రత్యక్ష రూపం. దేశంలో స్వాతంత్య్ర పోరాటం ఉధృతంగా సాగుతున్న కాలంలో ఎన్టీఆర్ నాటకాల్లో నటిస్తూ సినిమాల్లో వేషాల కోసం ప్రయత్నించారు. పోనీ ఆ తరువాతైనా ఆయన రాజకీయాలపై ఆసక్తి చూపారా? అంటే అదీ లేదు. కనీసం పత్రికలు చదివేందుకు సైతం ఇష్టపడలేదు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత సైతం ఆయన పత్రికలు చదవడానికి ఇష్టపడలేదు. మనం వార్తలు సృష్టించాలి కానీ మనం వార్తలు చదవడం ఏంటి బ్రదర్ అనేవారట! ఆయన సహనటుడు అక్కినేని నాగేశ్వరరావు ఇదే విషయంలో ఇప్పటికీ ఆశ్చర్యపోతారు. ముఖ్యమంత్రులుగా ఉన్న నాయకులు సైతం ఎన్టీఆర్‌కు తెలియదు ఆయన ఎవరు బ్రదర్ అని నన్ను అడిగే వారు, కాంగ్రెస్‌లో చాలా మంది ప్రముఖులతో నాకు పరిచయం ఉంది బ్రహ్మానందరెడ్డిమొదలుకుని చెన్నారెడ్డి వరకు నాకు సన్నిహితులు .అలాంటిది వస్తే గిస్తే నేను రాజకీయాల్లోకి రావాలి కానీ బ్రదర్ రావడం ఏమిటో అంటూ ఆ మధ్య అక్కినేని గత జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. సరే మరి ఎన్టీఆర్ రాజకీయం ఇలా ఉంటే అప్పటి నాయకుల పరిస్థితి ఎలా ఉంటేది? కమ్యూనిస్టు యోధునిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన పుచ్చల పల్లి సుందరయ్య లాంటి వారు డైలాగులకే పరిమితం కాకుండా తమ జీవితాన్ని నిజంగానే ప్రజలకు అంకితం చేశారు. పిల్లలను కంటే ప్రజల కోసం ఆలోచించకుండా కుటుంబంపై ప్రేమ పుట్టుకు వస్తుందేమోనని సుందరయ్య పిల్లలనే వద్దనుకున్నారు. ఎన్టీఆర్ కుటుంబ నియంత్రణకు వ్యతిరేకంగా త్రికరణ శుద్ధిగా కట్టుబడి ఉండడమే కాకుండా తన భావాలతో అధిక సంతానం అధిక ప్రయోజనం అనే కథాంశంతో తాతమ్మ కల సినిమా తీశారు. జవసత్వాలు సహకరించినంత వరకు హీరోగా వెలిగిన వారొకరు, జీవితాన్ని ప్రజలకే త్యాగం చేసిన వారొకరు వీరిద్దరు ఎన్నికల గోదాలో దిగినప్పుడు సుందయ్య అడ్రస్ లేకుండా పోయారు, ఎన్టీఆర్ పార్టీ పెట్టిన ఎనిమిది నెలలకే అధికారంలోకి వచ్చారు. మరి ఎన్టీఆర్‌ను అదృష్టజాతకుడనుకుండా మరేమందాం. ఉత్తరాది రాజకీయాల్లో తలపండిన శరద్‌పవార్, అర్జున్‌సింగ్, తివారి లాంటి వారిని వెనక్కి నెట్టి ప్రధానమంత్రి పదవి చేపట్టి, మెజారిటీ లేకున్నా ఐదేళ్ల కాలం పాలించిన పివి దేశ రాజకీయాల్లోనే అదృష్టజాతకుడు కాదంటారా? ఎన్టీఆర్ చివరి ఏడాది కాలం దురదృష్టం ఆయన్ని వెంటాడింది కానీ లేకపోతే రెండో తెలుగు ప్రధాని అయ్యేవారు. ప్రతిపక్షానికి పది శాతం సీట్లు కూడా మిగల్చకుండా అధికారం కైవసం చేసుకున్న ఆయన ఏడాది కూడా అధికారంలో లేకపోవడాన్ని మించిన దురదృష్టం ఏముంటుంది. వెన్నుపోటు పాలు కాకపోయినా, మరణించి ఉండకపోయినా ఆయన్ని ప్రధానమంత్రి పదవి వరించి ఉండేది కదా! రాజకీయాల నుంచి విరమించుకుందామని ఇంటిదారి పట్టిన పివిని ప్రధానమంత్రి పదవి వరించడం ఏమిటి? విజయవంతంగా ఐదేళ్ల కాలం పూర్తి చేసుకోవడం అదృష్టానికి పరాకాష్ఠ . చివరకు టికెట్ దక్కకపోవడం, మరణించిన తరువాత ఢిల్లీలో ఇంత చోటు దక్కక పోవడం అంటే రాజకీయాల్లో దురదృష్టం కాకుండా మరేమిటి? పెద్దగా కష్టపడకపోయినా ముఖ్యమంత్రి పదవి వళ్లో వచ్చి వాలిపోవడం చంద్రబాబు పాలిట అదృష్టం అయితే పదవి నుంచి దిగిపోయాక ఎంత ప్రయత్నించినా జనాన్ని నమ్మించలేకపోవడం ఆయన పాలిట దురదృష్టం. ఎన్టీఆర్ తరువాత రాజకీయాల్లో అంతటి అదృష్టవంతుడిగా నిలవాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. ఆయన్ని అదృష్టం వరిస్తుందా? దురదృష్టం వెంటాడుతుందా? అనేది తేలాలంటే వేచి చూడాల్సిందే! ఏ చెట్టు లేని చోట అవేవో చెట్లే మహావృక్షాలు అయినట్టు రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడన్నీ బోన్‌సాయి చేట్లే ఉన్నప్పుడు జగన్ మహావృక్షంగా నిలిస్తే ఆయన్ని మించిన అదృష్టవంతుడు ఎవరుంటారు?

26, మార్చి 2011, శనివారం

త్యాగమే రాజకీయం

జీవితంలో విలువలను త్యాగం చేస్తే కానీ విలువలపై ఉపన్యాసాలు ఇచ్చే స్థాయికి చేరుకోలేమని విలువలపై బోధనలు సాగించే కొందరి జీవితాలు చెప్పకనే చెబుతాయి. సాధారణంగా రాజకీయ నాయకులు తమ త్యాగాల గురించి తాము గొప్పగా చెప్పుకుంటారు కానీ నిజానికి మనిషి జీవితమే త్యాగమయం కదా? చదువుకునే వయసులో ఎన్నో ఆశయాలుంటాయి.
కాలేజీ నుంచి విశాలమైన వాస్తవిక జీవితంలోకి అడుగుపెట్టిన తరువాత బతుకుపోరుసాగించాలంటే అప్పటి వరకు అనుకున్న ఆశయాలను త్యాగం చేయాల్సిందే కదా? ఉద్యోగంలో చేరాక అప్పటి వరకు అవినీతికి దూరంగా ఉండాలనే లక్ష్యాన్ని త్యాగం చేయకపోతే బతుకు తారా? మీరు చాలా అందంగా ఉన్నారండీ అంటూ తొలిసారి కామెంట్ వినిపించినప్పడు బుగ్గలు సొట్టలు పడి ఆ అమ్మాయి మరింత అందంగా మారుతుంది. తన అందానికి ఇంట్లోని చిన్న అద్దం సరిపోదని పెద్ద తెరపై కనిపించి అందరిని ఆనందంలో ముంచెత్తాలని అప్పటికప్పుడే నిర్ణయం తీసుకుంటుంది. లక్స్ సబ్బును నిజంగానే సినీతారలు వాడతారని, తానూ వాడితే సినీ తార అంత అందంగా కనిపిస్తానని గట్టిగా నమ్మి ఫిల్మ్‌నగర్ బాట పడుతుంది.
ఛీ లక్ష్మీ నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నీవు లేనిదే నా ఊపిరి లేదనుకున్నాను, నువ్వే నా సర్వస్వం అనుకున్నాను . నువ్వు అనుమానించిన తరువాత ఈ బతుకు వృధా ట్యాంక్‌బండ్‌లోనూ, కిందో పడి చచ్చిపోతాను నా బతుక్కు అర్ధం లేదు అని నాగ్ చెప్పగానే కరిగిపోయిన లక్ష్మి ....నీమీద అనుమానం కాదు నాగ్ ఈ సమాజం అంటే భయం. నలుగురు ఏమంటారో అనే భయం తప్ప నీమీద నాకెప్పుడూ అనుమానం లేదు. నిన్ను అనుమానించడం అంటే నన్నునేను అనుమానించుకున్నట్టే అని టీవి సీరియళ్లను ఎక్కువగా ఫాలో అయ్యే లక్ష్మీ అంతే హృద్యంగా పలికింది.
నిజంగా నేనంటే నీకంత అభిమానమా లక్ష్మీ అంటూ భుజం మీద చేయి వేసి నాగ్ తన కౌగిలిలో బంధించాడు. కరిగిపోయిన లక్ష్మీ ఇంత కాలం తాను ప్రాణం కన్నా మిన్నగా అనుకున్నవన్నీ త్యాగం చేశానని గ్రహించే లోపు ఐస్‌క్రీమ్‌లా కరిగిపోయింది. ఆ తరువాత నాగ్ ఏమయ్యాడో చెప్పడం అవసరమా? పెళ్లికి ముందు మనిద్దరికి ఒకరిపై ఒకరికి నమ్మకం లేదు, పెళ్లి చేసుకున్నా ఎక్కువ కాలం కలిసుంటామనిపించడం లేదు అందుకే నీకు నచ్చిన వాన్ని నువ్వు చేసుకో నాకు తగిన అమ్మాయిని నేను చేసుకుంటాను, మనిద్దరం ఒకరికొకరు అస్సలు తగిన వారం కాదని నాగ్ లక్ష్మికి తేల్చి చెప్పాడు. మరి నా త్యాగం అని ఏడుపు ముఖం పెడితే పిచ్చి లక్ష్మి త్యాగం ఎప్పుడూ ప్రతిఫలాన్ని కోరదు అంటూ ఈటీవిలో అర్ధరాత్రి చూసిన పాత సినిమాలో హరనాథ్ డైలాగును అప్పచెప్పి, వెనక్కి చూడకుండా ముందడుగు వేశాడు. నేను డబ్బును, సమయాన్ని త్యాగం చేశాను, నువ్వు సర్వం త్యాగం చేశావు అని కొత్త సినిమాలో డైలాగు చెప్పాలని ముందు అనుకున్నా పాత సినిమా డైలాగు నచ్చి అదే చెప్పాడు.జీవితమంతా త్యాగాల మయమే. త్యాగాలు లేకపోతే జీవితమే లేదు.
పేరులోనే త్యాగాన్ని చేర్చుకున్న త్యాగయ్య తన జీవితాన్ని ఆ దేవునికే త్యాగం చేశారు. చాలా మంది నాయకులు రౌడీ జీవితాన్ని త్యాగం చేసి ప్రజా జీవితంలో అడుగుపెడడారు. అధికార వికేంద్రీకరణకు రౌడీలను మించిన ఉదాహరణ ఏముంటుంది. ఒక్కో వీధిని ఒక్కో రౌడీ పంచుకుని ప్రజల సమస్యలు పరిష్కరిస్తుంటారు. నిజమైన అధికారాన్ని అనుభవించే ఆ జీవితాన్ని త్యాగం చేసి ఐదేళ్లకోసారి ఓటు కోసం జనం కాళ్లావేళ్లా పడడం చూస్తుంటే వారి త్యాగాలకు సరైన గుర్తింపు లేదేమోననిపిస్తోంది. రాష్ట్రంలో పేరుమోసిన ఫ్యాక్షన్ నాయకునిపై ఒక చానల్ మహోన్నత మానవతావాది అంటూ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. సిగ్గు అనేపదాన్ని త్యాగం చేస్తే తప్ప ఇంత గొప్ప కార్యక్రమాన్ని రూపొందించలేరు. సిగ్గు, బిడియం అనేవి మనిషి ఎదుగుదలను అడ్డుకుంటాయని మనస్తత్వ నిపుణలు చెబుతూనే ఉంటారు. ఇది అక్షర సత్యం సిగ్గు, లజ్జవంటివాటిని త్యాగం చేయలేకనే చాలా మంది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు తమ జీవితాలు గడుపుతుంటారు. వీటిని త్యాగం చేసిన వారు చక్కని విజన్‌తో జీవితంలో ఎంతో ముందుకు వెళతారు. బంధుప్రేమను త్యాగం చేయలేక ఎన్టీఆర్ దెబ్బతింటే బంధుప్రేమను త్యాగం చేయడం ద్వారానే బాబుకు అధికారం దక్కింది. ఎన్టీఆర్ ఆత్మాభిమానం వదిలేస్తే మరింత కాలం ముఖ్యమంత్రిగా ఉండడంతో పాటు ప్రధానమంత్రి పదవి సైతం చేపట్టేవారు. అధికారం నుంచి దించిన బంధుగణం , రెండోపెళ్లిని తప్పు పట్టింది. సరే మీరు చెప్పినట్టే నడుచుకుంటాను అని ఆయన అని ఉంటే రాష్ట్ర రాజకీయ చరిత్ర మరో విధంగా ఉండేది. కానీ ఆయన మాత్రం ఎందుకో కానీ పదవీ త్యాగానికి సిద్ధపడ్డారు కానీ ఆత్మగౌరవాన్ని వదిలిపెట్టలేదు. పురాణాల్లో దుర్యోధునుడు సైతం చివరి వరకు ఆత్మాభిమానాన్ని త్యాగం చేసేందుకు సిద్ధపడలేదు.కాశీకి వెళ్లిన వారు తమకు ఇష్టమైనదేదో ఒకటి వదిలిపెట్టాలంటారు.
కానీ చిత్రంగా మన నాయకులు కాశీకి వెళ్లకపోయినా , ఇచ్చిన మాటలను త్యాగం చేసేస్తుంటారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటలను అమలు చేయకపోవడం అనే మాటకు నాయకులంతా కట్టుబడి ఉంటారు.
వాగ్దానాలను త్యాగం చేయడంలో మన నేతలను మించిన వారు లేరు.
తెలంగాణపై రాజకీయ పార్టీలన్నీ తమ హామీలను త్యాగం చేసి దేశంలోనే రాష్ట్రం పరువు తీశారని అంతా తిడుతున్నారు కానీ మాటకు కట్టుబడి ఉండకపోవడం అనే విధానానికి కట్టుబడి ఉన్నారని ఎందుకు అభినందించరు. నాయకుల త్యాగాలకు సరైన గుర్తింపు లేకుండాపోతోంది పాపం.....
25.1.2011

25, మార్చి 2011, శుక్రవారం

రైతు నవ్వాడు


స్ర్తీపాత్ర లేని పంచ వార్షిక కర్షక నాటకాల పోటీల ప్రారంభ సూచికగా గంట కొట్టారు. వేదికపై అంతా గందర గోళంగా ఉంది. విశాలమైన వేదికపై నట నేతలు నాటకాలను ప్రదర్శించడం, వీటికి న్యాయనిర్ణేత ఒక రైతు కావడం ఈ నాటకోత్సవాల ప్రత్యేకత. గతంలో ఎప్పుడూ లేనంత గట్టి పోటీ ఈసారి నాటకాల్లో కనిపిస్తోంది. నటుల సంఖ్య కూడా పెరిగింది.తెరపైకెత్తగానే ధవళవస్త్రాలతో అలంకరించిన పరుపుపైన పసుపు వస్త్రాలు ధరించిన నేత బాబు పడుకుని ఉన్నారు.
ఆయనకు తలవైపున ఎర్ర నారాయణ, కింద వైపున ఎర్ర రాఘవ ఉన్నారు. అరే అచ్చం మహాభారత యుద్ధానికి ముందు సహాయం కోరడానికి శ్రీకృష్ణుని వద్దకు అర్జునుడు, దుర్యోధనుడు వచ్చిన సీన్‌లానే ఉందే అని నాటకాన్ని తిలకిస్తున్న ముసలాయన అనుకున్నాడు. అప్పటి వరకు తెల్లని దుప్పటి కప్పుకున్నాయన కెమెరా వెలుతురు పడగానే తలను దుప్పటి నుండి పైకి పంపాడు. ఆయన్ని చూడగానే ముసలాయన ఈయన్ని ఎక్కడో చూశాను బాగా గుర్తున్న ముఖం అని అనుకున్నాడు.
వెనక పెద్ద భవంతి, పక్కన ఒక ల్యాప్ టాప్‌తో నిత్యం కనిపించేవాడాయన. ఈ నటుడు ఎవరబ్బా అని ముసలాయన ఆలోచిస్తుంటే పక్కన పోస్టర్‌లో చూసి ఔను ఆయనే కానీ పోస్టర్ మారింది భవంతి, ల్యాప్‌టాప్ ఉండాల్సిన చోట పొలం దున్నుతున్న రైతు బొమ్మ ఉంది అనుకున్నాడు.
శ్రీకృష్ణుడుగా శ్రీరాముడుగా , రావణాసురుడిగా నటించినా ఎన్టోడిని గుర్తుపట్టకుండా పోతామా? ఏంటీ అనుమానం లేదు ఈయన కచ్చితంగా నాగలి చేత పట్టిన ఆ కంప్యూటర్ బాబే అని ముసలాయన నిర్ధారించుకున్నాడు. మహా బలసంపన్నుడైన భీముడంతటి వాడు అజ్ఞాతవాసంలో వంటవాడిగా, అతిలోక సౌందర్యవతి ద్రౌపది సైరంధ్రిగా మారినట్టు కష్టకాలంలో ఈయన ల్యాప్‌టాప్ వదిలి నాగలి చేతపట్టుకున్నాడు పాపం ఆయనకు ఏం కష్టం వచ్చిందో అని పెద్దాయన బాధపడ్డాడు. పక్కనున్న మనవడు అదేం కాదు తాతయ్య ఇది నాటకంలో వేషం అంతే దానికంత బాధపడితే ఎలా? సీజన్‌ను బట్టి సారు పాత్రలు మార్చేస్తుంటాడు అని నచ్చజెప్పాడు.
బాబు దుప్పటిని సర్దుకుంటూ మీరు నన్ను ఎన్ని బాధలైన పెట్టండి భరిస్తాను నా రైతు సోదరులను మాత్రం బాధపెట్టకండి అంటూ కళ్లు తుడుచుకున్నాడు. విద్యుత్ చార్జీలు తగ్గించమని ఉద్యమం చేసిన రైతులను తూటాలకు బలి చేసిన సీన్ ఎర్రన్నల కళ్ల ముందు మెదిలి సిగ్గనిపించింది.
రక్తకన్నీరు నాగభూషణంకే కన్నీళ్లు తెప్పించేంత అద్భుతంగా ఉంది సార్ అంటూ ల్యాప్‌టాప్ బాబు డైలాగులు విని సొంత వాళ్లు చెప్పారు. ఒకవైపు ఈ నాటకం సాగుడుండగానే మరోవైపు నుండి యువనేత ఆవేశంగా రైతుల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం ఇదే మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయం. షేర్ హోల్డర్లకు కచ్చితమైన లాభాలు సమకూర్చిపెట్టడంలో మార్కెట్‌లో మాకున్న విశ్వసనీయత మీకందరికీ తెలుసు. వినియోగదారుల్లో టాటా బ్రాండ్‌కున్నంత విలువ పొలిటికల్ మార్కెట్‌లో మా కుటుంబ బ్రాండ్‌కుందనే విషయం మీకు మేం చెప్పాల్సిన అవసరం లేదు. రైతుల ద్వారానే మా బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని అలాంటి రైతుల కోసం మేం ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం అని యువనేత ప్రకటించగానే చప్పట్లు మారుమ్రోగాయి.
ఇంతలో వేదికపై కలకలం చెలరేగింది. రెండు వైపుల నుండి పెద్ద సంఖ్యలో ఆందోళన కారులు దూసుకు వచ్చారు. వేదికపైన 42 శాతం వాటా మాకు కేటాయించి , మిగిలిన చోటులో మీ ఇష్టం వచ్చిన నాటకాలు వేసుకోండి అని గులాబీ దళమాయన హెచ్చరించారు. మా వాటా ఎంతో తేల్చాకే మీ నాటకాలు ఆడనిస్తాం లేదంటే ఇక్కడే కూర్చోని గట్టిగా అరుస్తూ మీ డైలాగులు ఎవరికీ వినిపించకుండా చేస్తాం అని కృష్ణపక్షం దళం వాళ్లు హెచ్చరించారు. అప్పటి వరకు నాటకాలాడుతున్నవారు ఏకమైన ఈ రెండు దళాలను వేదికపై నుంచి కిందకు తోసేశారు.
దశాబ్దాల పాటు నటించి బోరేసింది ఇప్పుడు మళ్లీ నటించక తప్పదా? అంటూ చిరుజీవి నిస్సారంగా వేదికపైకి వచ్చారు. నటించే కాలంలో మేరు పర్వతమంత ఎత్తులో ఉండే ఆయన్ని అంతా మెగాజీవి అని పూజించే వాళ్లు. రాజకీయాల్లోకి వచ్చాక సైజు మరీ తగ్గిపోయి చిరుజీవి అయ్యారు. పంచ కట్టుకుని పోలంలోకి వెళ్లి రైతు లారా మీ కన్నీళ్లను తుడిచేందుకు వస్తున్నాను. చమటోడ్చి ఆరుగాలం కష్టపడి పండించిన మీకు గిట్టుబాటు ధర... అంటూ ఒక్కక్షణం ఆగి చేతిలోని మైకును డైలాగు స్కిృప్ట్‌ను నేలకేసి కొట్టాడు.
‘‘ఎవడ్రా ఈ డైలాగులు రాసింది. ఇందులో పంచ్ ఏమైనా ఉందా? ఇంత చచ్చు డైలాగులు నా జీవితంలో ఎప్పుడూ చెప్పలేదు. హీరోయిన్ నడుం మీద చేయి వేసి డైలాగు చెప్పానంటే జనం ఊగిపోవాలి, ఫ్యాన్స్ రెచ్చిపోవాలి
కానీ ముసలి ముతక రైతులను పట్టుకుని ఓదారుస్తూ ఏవేవో డైలాగులు చెప్పమంటున్నారు. బావా అల్లు ఏం చేస్తున్నావ్ ఈ సినిమా నడుస్తుందని నాకైతే అనిపించడం లేదు అని చిరుజీవి అనగానే అల్లు పరిగెత్తుకొచ్చి ఇది మీరు నటిస్తున్న కొత్త పాత్ర అని చెవిలో ఏదో చెప్పగానే చిరుజీవి లుంగీ మడిచి పొలంలో అడుగు పెట్టి తన పాత్రలో జీవం పోశారు.... స్థూలకాయం చేత నడవడం కష్టంగా ఉన్నప్పటికీ మూడు రంగుల పార్టీ శ్రీనివాసుడు పోలంలో అడుగుపెట్టాడు. అడుగుపెట్టడమే పొలం పనాసారూ అని రైతు ఆశ్చర్యపోయాడు.
బక్కోడా నీకేంట్రా నా లావు చూసి మాట్లాడు అని శ్రీనివాసుడు కసురుకున్నాడు. వెనక నుంచి ఎవరో చేతితో బలంగా తోయడంతో యువకిరణుడు వేదికపై వచ్చి పడ్డాడు. ఇంగ్లీష్‌లో ఆయనేదో చెప్పాడు. రైతులకు మాత్రం అర్థం కాలేదు.నేతలాడుతున్న రైతు నాటకాన్ని చూసి రైతు కడుపుబ్బా నవ్వుకున్నాడు. ఆ నవ్వులో తాను పుట్టెడు బాధల్లో ఉన్న విషయం కూడా ఆ రైతుకు గుర్తుకు రాలేదు. న్యాయనిర్ణేతగా ఎవరో ఒకరిని ఉత్తమ నటుడని చెప్పడం మిగిలిన వారిని అవమానించడమే అవుతుంది, నా వల్ల కాదు అంటూ రైతు నవ్వుతూనే ఉండిపోయాడు. 1౪-౧౨-2010

24, మార్చి 2011, గురువారం

మనకూ ఉన్నారు మగ రాడియాలు

- నీరా రాడియా బాగున్నావా!

నేనెవరో నీకు తెలియక పోవచ్చు కానీ నీవేమిటో ఈ దేశానికి తెలుసు. గొప్పవాళ్లు అనుకుంటున్న చాలా మంది అసలు రూపం ఏమిటో నీవు చెప్పేంత వరకు తెలియలేదు. నా కళ్లు తెరిపించావు గోపి అంటూ మా తెలుగు సినిమాల్లో డైలాగు వింటే నవ్వోస్తుంది, కానీ నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది. వంద కోట్ల మంది జనంలో నీ అంత శక్తిసామర్ధ్యాలున్న వారు ఎంత మందుంటారు?
మనది పవిత్ర భారత దేశమని, ప్రజాస్వామ్యవ్యవస్థ అని , మీడియా నాలుగో స్తంభమని, చదువుకున్న సమాచారం నా బుర్రలో చాలా కాలం నుంచి తిష్ఠవేసుకుంది. ఆ బూజును ఒక్కసారిగా నేను దులిపేశావు. మన టెక్ట్స్ బుక్స్ అన్నింటిని తిరిగి రాయాల్సిన అవసరం ఉందని నీవు ఋజువు చేశావు రాడియా! మంత్రివర్గాన్ని ఖరారు చేసేది రాడియాలు తప్ప ప్రధానమంత్రి కాదని ఎంత చక్కగా చెపావు!
టాటాను తాత అని ముద్దుగా పిలుచుకుంటారు. నైతికతకు ప్రాణం పోస్తే ఇలానే ఉంటాడనించేది ఆయన్ని చూస్తే, నాస్తికులకు సైతం ఆయన నడిచే దైవం. అలాంటి టాటాలోని మరో కోణాన్ని ఈ ప్రపంచానికి చూపించిన నీవు నిజంగా ఒక శాస్తవ్రేత్తవు. మీడియా స్వేచ్ఛపై దాడి అంటూ ప్రతి చిన్నదానికి అరిచిగోల చేసిన వారి జ్ఞాననేత్రాలు తెరుచుకునే విధంగా లాబీయింగ్‌లో మీడియా, పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు అంతా ఒకటేనని ఎంత బాగా నిరూపించావు! లుచ్చాలు, లఫంగాలు అంటూ ఏవేవో పేర్లు పెట్టి మనుషులను విడదీశారు. కానీ మనుషులంతా ఒకటే వారికి అప్పగించిన బాధ్యతలు బట్టి వేరువేరు పేర్లతో పిలుస్తారు కానీ ప్రాణమున్న మనుషులంతా ఒకటే అని నిరూపించావు!
బట్టలమ్ముకునేవారిలో సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న మహనీయులు ఎవరు ? అనిడిగితే ఎదుటి వాడు అయోమయంలో పడిపోకుండా ఉంటాడా? ముంబై నుంచి తక్కువ ధరకు అరువుగా బట్టలు తెచ్చుకుని అందంగా అలంకరించి ఇక్కడ ఎక్కువ ధరకు అమ్మడానికి మించిన సిద్ధాంతం వారికేముంటుంది. అచ్చం అలానే బిజెపి, కాంగ్రెస్, డిఎంకె ఇంకా చిన్నాచితక పార్టీలో ఏ పార్టీది గొప్ప సిద్ధాంతమో తేల్చుకోలేక మేం కొట్టుకు చస్తుంటే అందరి సిద్ధాంతం ఒకటే అందరి పనులు ఒకటే అని మా కళ్లు తెరిపించావు రాడియా! నీ మీద ఒకవైపు ఎంత అభిమానం ఉన్నా మరోవైపు నీపై కొంత కోపం కూడా ఉంది...
.ఈ దేశాన్ని ఉత్తరాది వాళ్లే పాలించేస్తున్నారు. మా దక్షిణ భారతీయు లప్రతిభా పాటవాలకు గుర్తింపే లేకుండా పోతోంది. నిజానికి మాకూ ఉన్నారు మగ రాడియాలు. నీ అంత కాకపోయినా రాష్ట్ర స్థాయిలో నీలానే సాహసాలు చేసిన వారున్నారు. కానీ దక్షిణాది వాళ్లం అందులో తెలుగు వారం కావడం వల్ల గుర్తింపే లేకుండా పోయింది. మన్‌మోహన్ మంత్రివర్గంలో రాజాను చేర్చి, తద్వారా టెలికాం కంపెనీలకు ప్రయోజనం కలిగించే విధంగాజరిగిన నీ కృషి అమోఘం.
నీవు కేవలం మంత్రివర్గంలో ఒక వ్యక్తిని చేర్చినందుకే ఇంత కీర్తి పొందుతున్నావ్! కానీ మా తెలుగు మగరాడియాలు ఏకంగా ప్రభుత్వానే్న మార్చిపారేశారు.ఎంతో శక్తివంతుడైన ఎన్టీఆర్‌ను ఒక్క బాబే దించేశాడనుకుంటున్నావా? కాదు కాదు ఇప్పుడు నీవు రాజాను మంత్రివర్గంలో చేర్చడానికి లాబీయింగ్ చేసినట్టుగానే మా తెలుగు మగ రాడియాలు ఎన్టీఆర్‌ను అధికారం నుంచి దించడానికి తీవ్రంగా ప్రయత్నించారు. విజయం సాధించారు. ఈ మగరాడియాలు నైతిక విలువల గురించి బోధించే స్థాయికి ఎదిగిపోయారు.
నీవంటే సంస్కరణల రెండవ దశలో రాణించావు కాబట్టి నీ పనికి కన్సల్టెన్సీ ఫీజు అని ముద్దు పేరు పెట్టుకుని తెల్లధనమే మెక్కేశావు. మా మగరాడియాలకు అలాంటి అవకాశం లేని కాలం కాబట్టి గుట్టుచప్పుడు కాకుండా నొక్కేసి ఎక్కడికో ఎదిగిపోయారు. ఒక వేళ నీకు ఆసక్తి ఉంటే ముద్దుకృష్ణమ నాయుడు అని ఒక ఎమ్మెల్యే ఉన్నారు. 95లో వెన్నుపోటులో పాలు పంచుకున్న ‘నాలుగో స్తంభం వారి’ జాతకాలు నా వద్ద ఉన్నాయని అప్పుడాయన రోజూ చెప్పే వారు. ఆ జాబితా సంపాదించడానికి ప్రయత్నించు.
నువ్వు ఫోన్ చేస్తే మాట్లాడరు ఎందుకంటే నీ కాల్స్ అన్ని ట్యాపింగ్ అవుతున్నాయి కాదా? వారి జాబితా నువ్వు సంపాదిస్తే విజయవంతంగా పనులు ఎలా సాధించవచ్చునో వారు మెలుకువలు నేర్పిస్తారు. ఔను అంతంత పెద్ద ఘన కార్యాలు చేసిన తరువాత కూడా నీవెప్పుడూ టీవిల్లో నైతిక విలువల గురించి ఉపన్యసిస్తూ కనిపించలేదేమిటి? టాటా వంటి ఒకే ఒక కస్టమర్ దగ్గర 60 కోట్లు వసూలు చేశావు, పద్మశ్రీ వంటి అవార్డులు పొందిన జర్నలిస్టులకు సైతం నీ లాబీయింగ్ వ్యవహారాల్లో పాత్ర కల్పించావు. నైతిక విలువల గురించి ఉపన్యసించడానికి నిన్ను మించిన అర్హతలు ఎవరికున్నాయి చెప్పు.
ఇప్పటికే చాలా ఆలస్యం చేశావు. ఎలాగూ నీకు మీడియాలో సైతం మంచి పరిచయాలున్నాయి. అందమైన ముఖం ఉంది. బోలెడు ఆస్తి ఉంది , నైతిక విలువలపై ఉపన్యసించడానికి ఇంతకు మించి ఇంకేం కావాలి. వెంటనే కొన్ని చానల్స్‌ను సంప్రదించి సమాజంలో, రాజకీయాల్లో పడిపోతున్న నైతిక విలువల గురించి చక్కగా ఉపన్యసించేయ్! ఒకటిరెండు సార్లు నవ్వుకుంటారేమో తరువాత చచ్చినట్టు వింటారు. అనుమానం ఏమైనా ఉంటే తెలుగు న్యూస్ చానల్స్ చూసి నీ భాషలోకి అనువాదం చేయించుకుని విను. మన మేడిపండు వ్యవస్థల పొట్టవిప్పి చూపిన నీకు వేలవేల దండాలు. నీరా రాడియా! భారత రత్నకు నిజమైన అర్హురాలివి నీవే. ఇక ఉంటాను..- ఇట్లు నీ అభిమాని ...సగటు జీవి!

23, మార్చి 2011, బుధవారం

వీకీలిక్స్ లో తెలంగాణా



గౌరవనీయులు వికీలిక్స్ ప్రధాన సంపాదకుడు జూలియన్ అసాన్జ్‌కు ....

బాగున్నారా? ఏదో మర్యాద కోసం అడుగుతున్నాను కానీ మీరు కచ్చితంగా బాగుండే ఉంటారు. మీరు బాగుండక పోతే ఇన్ని దేశాలను ఎలా వణికిస్తారు. మీకు తెలుగు వస్తుందా? అనే సందేహం నాకేమాత్రం లేదు. మీకు తెలియని విషయం లేదు, మీకు రాని భాష లేదు. కాబట్టి ఈ ఉత్తరాన్ని మీరు పూర్తిగా చదువుతారని నాకు గట్టినమ్మకం.
ప్రపంచంలో వందల దేశాలున్నాయి, వాటికి వేలాది భాషలున్నాయి. వేలాది భాషల్లో కోట్లాది ఫైళ్లు ఉన్నాయి. ఆ ఫైళ్లలో కోట్ల కోట్ల కాగితాలు, వాటిలో లెక్కలేనని రహస్యాలున్నాయి. ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి. మా దేశంలో మంత్రివర్గంలో ఎవరుండాలో అమెరికా నిర్ణయిస్తుందని మీరు రహస్యాన్ని బయటపెట్టడం మాకు చాలా సిల్లీగా అనిపిస్తోంది.
సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నది పచ్చి వాస్తవం. ఐతే అందరికీ తెలిసిన ఈ చిన్న విషయాన్ని అదేదో పెద్ద రహస్యం అన్నట్టుగా చెబితే నవ్వులాటగా ఉంటుంది అలానే మా దేశ మంత్రివర్గాన్ని అమెరికా నిర్ణయిస్తుందన్న విషయం మీకు కొత్తగా ఉందేమో కానీ మాకు ఎప్పుడో తెలుసు.మరి మా వాళ్లు ఈ వార్తపై మా వాళ్లు అంతగా ఆశ్చర్యపోయారెందుకనుకుంటున్నావా? మా కందరికీ ఎప్పుడో తెలిసిన విషయం వీకీలిక్స్‌కు ఇప్పుడు తెలిసిందా? అని ఆశ్చర్యపోయారు. సరే రహస్యం అనేది అంటు రోగం లాంటిది ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది అందుకే మాకు అన్ని దేశాల నుంచి రహస్య సమాచారం అందుతుందని మీరు చెప్పారు.

మీ మాటను మన్నించి మా దేశం గురించి నీకో రహస్యం చెప్పాలనిపించింది. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం అన్నట్టు మీ నుంచి కొన్ని రహస్యాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు మీకో రహస్యం చెప్పడం ధర్మం అనుకున్నాను. ఆర్థిక మంత్రిగా ఎవరుండాలో, మన్‌మోహన్ తరువాత ప్రధానిగా ఎవరుండాలో అమెరికా నిర్ణయించడం మీకు ఆశ్చర్యం కలిగించింది కదూ! మా అందరికీ తెలిసింది మీకు బోలెడు ఆశ్చర్యం కలిగించేది మరో విషయం చెప్పనా?
మా మంత్రివర్గాన్ని అమెరికా ఖరారు చేయడం కాదు ఏకంగా మా దేశాన్ని అమెరికా పాలిస్తానని ముందుకు వస్తే దేశంలో మెజారిటీ జనం ఎగిరి గంతేస్తారు.ఒక్క మా ఆంధ్ర రాష్ట్రం సంగతే చూడండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలా? వద్దా అంటే ఏర్పాటు చేయాల్సిందే అని రాష్ట్రం సగం మంది అరిస్తే, ఏర్పాటు చేస్తే సహించేది లేదని మరో సగం మంది అరుస్తారు. తెలంగాణ, సీమాంధ్ర పేరుతో ఏ విషయంపైనైనా సగం మంది అటు సగం మంది ఇటు ఉంటారు. మరి అమెరికా పాలనకు ఒప్పుకుంటారా? అంటే రెండు వైపులా జనం ఒప్పుకుంటారు, జనం ఒప్పుకోరు....మీకో రహస్యం చెప్పాను కదా! మరిక మాక్కావలసిన రహస్యం మీరు చెప్పాలి.
మా దేశంలో ఎవరికీ తెలియని కొన్ని రహస్యాలు మీకు మాత్రం కచ్చితంగా తెలిసే అవకాశం ఉంది. దాని కోసమే మీకీ ఉత్తరం రాస్తున్నాను.
ఇంతకూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తారా? లేదా? జూన్‌లో తెలంగాణ వస్తుందా? అని ఇదే ప్రశ్న కెసిఆర్‌ను అడిగితే మేలో వస్తే నీకేమైనా అభ్యంతరమా? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. సరే ఇక బాబు కళ్లలో సూటిగా చూస్తూ మీకు ఢిల్లీలో చక్రం తిప్పిన అనుభవం ఉంది కదా! ఇంతకూ తెలంగాణ వస్తుందంటారా? లేదా? అని అడుగుదామంటే ప్రశ్న తరువాత ముందు ఆయన కళ్లు ఒకటి ఒకవైపు మరోటి మరోవైపు చూస్తోంది. రెండు కళ్లు ఒకవైపు చూస్తే అడుగుదామనుకుంటే దానికాయన ససేమిరా అంటున్నారు.
ఫెస్ రీడింగ్‌ను బట్టి తెలుసుకుందామనుకుని ఆయన ముఖాన్ని పరీక్షగా చూస్తే తెలంగాణ వస్తుందేమోననే భయం కనిపిస్తోంది, రావద్దనే కోరిక కనిపిస్తోంది, ఏమవుతుందో? అనే ఆందోళన నాట్యమాడుతోంది. సరే వీరంతా ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు వీళ్లకేం అర్ధమవుతుంది అధికారంలో ఉన్న ముఖ్యమంత్రికి తెలుస్తుందిలే అనుకుంటే నేనెరుగ నేనెరుగ మా అమ్మనడుగు అంటూ ఆయన చిన్నప్పుడు నేర్చుకున్న పాట పాడుతున్నాడు.
తెలంగాణ సంగతి తరువాత ముందు నన్ను ప్రజలు హైదరాబాదీ అనుకుంటున్నారా? సీమ వాసి అనుకుంటున్నారా? అని ఎదురు ప్రశ్నించారు. జనం సంగతి తరువాత ముందు మిమ్ములను మీరు సిఎంను అనుకుంటున్నారా? స్పీకర్‌ను అనుకుంటున్నారా? తేల్చుకోండి అని ప్రశ్నకు ప్రశ్నను సమాధానంగా చెప్పి బయటపడ్డాం.
బాబు ముఖకవళికలు చదవడం కష్టం కానీ చిదంబరం మాటలను అర్ధం చేసుకోవడం అంత కన్నా కష్టం. ఆయన్ని దూరం నుంచి చూస్తే తెలంగాణ ఏర్పాటు కోసం చక చకా ఏర్పాట్లు చేస్తున్నట్టు కనిపిస్తారు. దగ్గరి నుంచి చూస్తే సమైక్యాంధ్ర పాట పాడుతున్నట్టు అనిపిస్తుంది. ఇక ప్రణబ్ ముఖర్జీ బెంగాలీ యాస మీ అమెరికా వారికే అర్ధం కాకపోతే మాకే మర్ధమవుతుంది. తెలంగాణ గురించి సోనియాగాంధీ ఏమనుకుంటున్నారో కోర్ కమిటీ సభ్యులకు సైతం తెలియదనే విషయం మాకు బాగా తెలుసు.
సోనియాగాంధీ తెలంగాణపై ఏ మనుకుంటున్నారో? అమెరికా అభిప్రాయం ఏమిటో కాస్త మీరే బయటపెట్టండి.వికీలిక్స్‌లోని సమాచారం వాస్తవమైంది కాదని నమ్మవద్దని మా ప్రధాని చెప్పడం మీకు బాధకలిగించినట్టుగా ఉంది, మా ప్రధాని చెప్పినదంతా అబద్ధమనే పూర్తి నమ్మకం మాకుంది. మా దేశంలో అసలేం జరుగుతుందో మీరే చెప్పి మా కళ్లు తెరిపించండి. మా ప్రధాని సోనియా చేతిలో రిమోట్ అని అంతా అనుకున్నారు. మన్‌మోహన్ సోనియా కు రిమోట్ అయితే మొత్తం దేశాన్ని అమెరికా తన రిమోట్‌తో నడిపిస్తుందని ప్రపంచ కళ్లు తెరిపించారు. ఔను ఇప్పుడు మేం విశ్వమానవులం!అభినందనలతో ......
మీ అభిమాని..

22, మార్చి 2011, మంగళవారం

౩౦ ఏళ్ళ వెనక్కి వెళితే ......

- బుద్దా మురళి

ఓలమ్మీ తిక్కరేగిందా? ఒళ్లంతా తిమ్మిరెక్కిందా? తిక్కరేగి తిమ్మిరెక్కిందా- అంటూ సదానందం ఉషారుగా పాడుతూ భార్య సదాలక్ష్మిని వెనకి నుండి ఒక్కటిచ్చాడు. మీ సరసం మండినట్టే ఉంది ముసలోడికి దసరా వేషం అన్నట్టు షష్టిపూర్తి చేసుకున్నాక ఇదేం పాడు రోగమండి- అంటూ సదాలక్ష్మి గయ్యిమంది. మనవలు మనవరాళ్లు చూస్తే పరువు పోతుంది నోరుమూసుకొని కృష్ణారామా అనుకుంటూ కూర్చోండి - అని కసరుకుంది. అయినా సదానందం ఆమె మాటలు పట్టించుకోకుండా మరింత ఉత్సాహంగా ఆకుచాటు పిందె తడిసే .... అంటూ గొంతెత్తి పాడసాగాడు.
‘‘ మీకేదో ఐనట్టుందండి అన్నగారు అరవై ఏళ్ల వయసులో 16 ఏళ్ల పడుచు హీరోయిన్లతో స్టెప్పులు వేస్తూ, అలాంటి పాటలు పాడారాని మీరు కూడా పాడుతున్నారా? ఏంటి? అయినా, 60 ఏళ్ల వయసులో హీరోగా నటించినా, 73 ఏళ్ళప్పుడు సన్యాసం తీసుకుని 74 ఏళ్లకు ప్రేమించి పెళ్లి చేసుకున్నా అన్నగారికే చెల్లింది మీరు, నేను ఎంతటి వారం అన్నగారి ముందు అల్పులం ’’ అంటూ సదాలక్ష్మి ముద్దుగానే చెప్పింది.

సదానందం ఊతకర్రను తీసి బయట పారేసి, ‘‘ పదండి వెనక్కి పదండి వెనక్కి తోసుకు పోదాం వెనక్కి వెనక్కి’’ - అంటూ పిడికిలెత్తి పాడాడు.రిటైరైన తరువాత ఇంట్లోనే కూర్చోవడంతో ఏమీ తోచక భర్తకు ఏదో ఐందని అనుమానించిన సదాలక్ష్మి భర్త నుదుటిమీద చేయి పెట్టి చూసింది. మామూలుగానే ఉంది మరేంటి ఇలా మాట్లాడుతున్నాడని కంగారు పడింది. పిచ్చి సదా నాకేమీ కాలేదు. నాకు మళ్లీ పడుచుదం వచ్చేసింది. నా వయసు ఇప్పుడెంతనుకుంటున్నావ్? అని అడిగాడు.
మొన్ననే కదండి 60 ఏళ్లు నిండాయి, మనవలు, మనవరాళ్లు, మన పిల్లలు ఘనంగా షష్టిపూర్తి కూడా చేశారు కదండి అని అమాయకంగా అడిగింది. నిజమేనోయ్ అప్పుడు నాకు 60 ఏళ్లు నిండాయి కానీ ఇప్పుడు నా వయసు అందులో సగం మాత్రమే నువ్వు పేపర్లు సరిగా చదవడం లేదన్నమాట! రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది. రాష్ట్రం అంటే అందులో ఉన్న మనం కూడా వెనక్కి వెళతాం కదా? అంటే ఇప్పుడు నా వయసు 30 ఏళ్లు అన్నమాట! 30 ఏళ్లు వెనక్కి వెళ్లినప్పుడు ఆకుమాటు పింద తడిసే పాటలు కాకుండా రోబో పాటలు పాడతానా ఏంటి? అని సదానందం గడుసుగా ప్రశ్నించాడు.
ఆయోమయంగా ఉన్న ముఖాన్ని భార్య మార్చకముందే సదానందం తుర్రున బయటకు పరుగు తీశాడు. అంతకు ముందే మిత్ర బృందానికి సందేశం పంపాడు అంతా పార్క్‌లో సమావేశమై పార్టీ చేసుకుందామనిరిటైరైన మిత్ర బృందం పార్కులో కలుసుకోవడం రోజూ జరిగేదే ఐనా ఈరోజు మాత్రం అందరిలో చాలా సంతోషం కనిపిస్తోంది. ముందుగా మనను 30 ఏళ్ల వెనక్కి తీసుకు వెళ్లిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, మనం 30 ఏళ్ల వెనక్కి వెళ్లామనే విషయాన్ని పరిశోధించి వెల్లడించిన తెలుగుదేశం పార్టీకి మా కృతజ్ఞతలు అంటూ మిత్రబృందం తరఫున సదానందం ఉపన్యాసం మొదలు పెట్టాడు. మనకీ విషయం తెలియకపోతే ఎంత నష్టపోయేవాళ్లం, రిటైర్ ఐపోయాం కదా? అని రామకోటి రాసుకుంటూ కూర్చోమని అంతా సలహాలిస్తుంటే బుద్ధిమంతుడిలా ఆచరణలో పెట్టేశాను. మా ఇంట్లో టీవి అంటే కార్టూన్ నెట్ వర్కే కదా? నిన్న ఇంట్లో పిల్లలు లేకపోవడంతో న్యూస్ చానల్ చూసే చాన్స్ దక్కింది. ఆయనెవరో పాపం మాసిపోయిన గడ్డంతో దిగులుగా ఎప్పుడూ కుర్చీ వైపు చూస్తుంటాడు చూడు ఆయన అంటూ సదానందం చెప్పబోతుంటే ఆయన్ని చంద్రబాబు అంటారని కింది నుండి మిత్రుడు అరిచాడు. ఔను తెలుసులే నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు ప్రతి రోజు మధ్యాహ్నాం సరిగ్గా పనె్నండు గంటల ఐదు నిమిషాలకు ఆకస్మిక తనిఖీ అంటూ వచ్చేవారు.
ఆయన్ని చూసి మా గడియారాలను సరి చేసుకునే వారం. ఆకస్మిక తనిఖీకి ఆయన అంత ఠంచనుగా వచ్చేవారు నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆయన బొమ్మ లేకుండా టీవి కనిపించేది కాదు. నేను రిటైర్ అయ్యాక టీవి చూడడం లేదనుకోండి. ఆయన ఏదో మీటింగ్‌లో మాట్లాడుతూ రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిన అద్భుత విషయాన్ని చక్కగా వివరించాడు.
మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం ఎనే్నళ్లు ముందుకు వెళ్లిందో? అని కింద నుండి ఎవరో అరిచారు. ఆ సంగతి ఎవరూ అడగలేదు,అది మనకు అనవసరం మనకు ఉపయోగపడే విషయానే్న మనం తీసుకోవాలి. అందుకే ముందే 30 ఏళ్లు వెనక్కి పంపిన రోశయ్యకు, ఆ విషయాన్ని మనకు చాటి చెప్పిన బాబుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పి ఇప్పుడు మనం మన రెండో యవ్వనాన్ని అనుభవిద్దాం అంటూ సదానందం తన ఉపన్యాసాన్ని కొనసాగిస్తుంటే అక్కడి వారంతా 30 ఏళ్లు వెనక్కి వెళ్లి కలల్లో మునిగిపోయి.సార్ నా మాట వినండి సికింద్రబాద్ స్టేషన్ ఎదురుగానే ఉన్న బిల్డింగ్ 40వేలకు అమ్ముతానంటున్నాడు. తీసుకోండి బాగుంటుంది అని బ్రోకర్ నచ్చజెపుతున్నాడు.
అది సరే కానీ మాదాపూర్‌లో ఓ పదెకరాలు కొందామనుకుంటున్నాను ఏ మంటావ్ అని సుబ్బారావు మిత్రున్ని అడిగాడు. గోదావరి జిల్లాలో చక్కగా నాలుగు పంటలు పండే భూమి ఎకరాను అమ్మి ఇక్కడ ఎందుకూ పనికి రాని పదెకరాల భూమి కొనడం అవసరమంటావా? అని మిత్రుడు నిలదీశాడు.
హైదరాబాద్ అభివృద్ధికి నా వంతు కృషి చేసేందుకు మాదాపూర్‌లో లక్షకు పదెకరాలు కొని తీరాలనిపిస్తోంది అని సుబ్బారావు తన నిర్ణయాన్ని ప్రకటించేశాడు. కూకట్‌పల్లిలో రూపాయికి గజం స్థలం ఉందట ఓ వెయ్యి గజాలు కొంటే ఎలా ఉంటుంది? అని అప్పారావు అడిగాడు....గట్టిగా చప్పట్లు వినిపించడంతో అందరికీ నిద్ర వదిలింది.
సుబ్రమణ్యం మైకు అందుకుని ‘‘మీరు మరీ చిత్రంగా ఊహిస్తున్నారు. రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందంటే రాష్ట్రంలో నివసించే మనం వెనక్కి వెళ్లినట్టు కాదు. సరిగ్గా 30 ఏళ్ల క్రితం ఇప్పటి అధినాయకులు అధికారం కోసం పరితపించారు. ఇప్పుడు సరిగ్గా మళ్లీ అలానే పరితపించాల్సిన పరిస్థితి వచ్చింది. అదీ 30 ఏళ్లు వెనక్కి వెళ్లిన కథ అంతే తప్ప ఇదేమన్నా రైలింజనా ఇష్టం వచ్చినట్టు ముందుకు వెనక్కి వెళ్లడానికి’’ అని ముగించాడు.
-౧౬.౧౧.2010

21, మార్చి 2011, సోమవారం

కుం భ కో ణాలు - పబ్లిక్ ఇష్యు

- బుద్దా మురళి
November 30th, 2010

పత్రికల్లో కుంభకోణాల వార్తలు చదివినప్పుడు ఎవరికైనా కడుపు రగిలిపోకుండా ఉంటుందా? ఏం మేం మాత్రం మనుషులం కాదా? మాకూ చీమూనెత్తురు లేదా? మీలో ప్రవహించే రక్తం రంగు ఎరుపే మాలోని రక్తం రంగూ ఎరుపే మరి కుంభకోణాలు మీకు మాత్రమే పరిమితం కావడం ఏం ధర్మం. ఈ అన్యాయాన్ని ఇంకెంత కాలం భరించాలి.

పెద్ద మనుషుల ఒప్పందం అంటూ 40 శాతం ఉద్యోగాల కోసం తెలంగాణ వాదులు రోడ్డున పడ్డారు. సంతోషం మాకేం అభ్యంతరం లేదు. మరి కుంభకోణాల్లో మా వాటా కోసం ప్రశ్నించేదెవరు? ఎప్పుడూ చీకటి రోజులే ఉండవు. ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు మన కోసం గొంతెత్తేవారు తప్పకుండా ఉంటారు. మనమంతా ఈ కుంభకోణాలను వౌనంగా భరిస్తూనే కాలం గడిపాం.
కానీ జస్పాల్ భట్టి అలా అందరిలా వౌనంగా ఉండిపోలేదు. ఈ అంశంపై రోడ్డున పడ్డారు. కుంభకోణాలు చేయడం కేవలం మంత్రుల హక్కు మాత్రమే కాదు అది ప్రతి ఒక్కరి హక్కు కావాలనే డిమాండ్‌తో జస్పాల్ భట్టి చండీ గఢ్‌లో నానె్సన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొనే అదృష్టం మనకు దక్కక పోయినా మనసులోనే మనం మద్దతు తెలుపుదాం.
అధికారంలో ఉన్న మీరే అంతా దోచుకుంటే మేం అధికారంలోకి వచ్చాక ఏం చేయాలనే ఆవేదన ప్రతిపక్షంలో కనిపిస్తే, అధికారం లోకి రావడానికి మేం ఎంత ఖర్చు చేశాం, మళ్లీ అధికారంలోకి రావడానికి ఈ మాత్రం కుంభకోణాలు చేయకపోతే ఎలా అనే ఆవేదన అధికార పక్షంలో కనిపిస్తోంది. అవినీతి అంటే అధికార, ప్రతిపక్షాలకు సంబంధించిన వ్యవహారం మాత్రమేమా? మరి మనలాంటి ఔత్సాహికులేం కావాలి? లక్ష కోట్ల బడ్జెట్‌లో ఏదీ మా వాటా? అని ప్రశ్నించినట్టుగానే లక్షా 76వేల కోట్ల రూపాయల స్పెక్ట్రమ్ కుంభకోణంలో ఏదీ మా వాటా? అనే ప్రశ్న మనం వేస్తే తప్పా? అన్నింటిలోనూ సంస్కరణలు తెచ్చారు, మరి కుంభకోణాల్లో సంస్కరణలు అవసరం లేదా? వీటిలో ప్రజల భాగస్వామ్యం అవసరం లేదా?

ప్రజాస్వామ్యానికి అర్థం ఇదేనా? మనసుంటే మార్గం ఉంటుంది.లక్షా 76వేల కోట్ల రూపాయల కుంభకోణం, 70వేల కోట్ల రూపాయల కామనె్వల్త్ కుంభకోణాల్లో సామాన్యులను భాగస్వామ్యం చేయడం ఎలా సాధ్యం? అని పాలకులు తప్పించుకోవాలని ప్రయత్నించవద్దు. భారీ పెట్టుబడులు అవసరం అయినప్పుడు కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు వెళ్లి నిధులు సమీకరిస్తున్నాయి కదా? అదే విధంగా భారీ కుంభకోణాలకు సైతం ముందుగా కొంత పెట్టుబడి అవసరం అవుతుంది. దాని కోసం పబ్లిక్ ఇష్యూకు వెళ్లాలి. అప్పుడు కుంభకోణం ఫలాలు సామాన్యులకు సైతం అందుతాయి. కుంభకోణాలను నివారించలేరు కాబట్టి వాటిని చట్టబద్ధం చేసి పబ్లిక్ ఇష్యూకు వెళ్లే అవకాశం కల్పించాలి.

అత్యంత లాభసాటి వృత్తి అయిన కుంభకోణాలను పరిశ్రమగా గుర్తించక పోవడం అన్యాయం. ముడుపులు, లంచాలు అనే పదాలను తీసేసి కన్సల్టెన్సీ ఫీజు అనే పేరు పెట్టి చట్టబద్ధం చేసిన వారు, ఆ పనిని ఒక పరిశ్రమగా గుర్తించి పబ్లిక్ ఇష్యూకు వెళ్లడానికి అవకాశం కల్పించాలి. కుంభకోణాలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని చల్లార్చడానికి ఇంత కన్నా మంచి అవకాశం లేదు. ఈనేల, గాలి, నీరు, ప్రకృతి అందరిదైనప్పుడు కుంభకోణాలు మాత్రం కొందరికే ఎందుకు పరిమితం కావాలి? ప్రజలే పాపం చేశారని కుంభకోణాలకు దూరంగా ఉండాలి? ఏం పుణ్యం చేసుకున్నారని కొందరికే కుంభకోణాలు పరిమితం కావాలి.
దేవున్ని దర్శించుకోవడానికి అందరికీ హక్కున్నప్పుడు కుంభకోణాలు చేసే హక్కు మాత్రం కొందరికే ఎందుకు? పరిమితం చేయాలి. కుంభకోణాలు ప్రజల ప్రాథమిక హక్కుగా మారాలి. గాలి పీల్చుకునే స్వేచ్ఛ ప్రతివారికీ ఉన్నట్టుగానే కుంభకోణాల హక్కు ఉండాలి.ఈనెల పెన్షన్ రావడానికి ఇంకెన్ని రోజులు పడుతుందో? మరీ నెలకు 30 రోజులుండడం అవసరమా? అనుకుంటూ మాజీ ఎంపిగారు క్యాలండర్‌పైకి దృష్టి పెట్టారు.
అప్పుడే అక్కడికొచ్చిన శ్రీమతి మాజీ ఎంపి గారు , టీవిలో ప్రముఖ రాజకీయ నాయకుడితో ప్రముఖ జర్నలిస్టు మనసులోని మాట వినసాగారు.‘‘రాజకీయాల్లో నైతిక విలువలు పెంచడానికి తాను చేస్తున్న కృషిని అన్నయ్య ఎంత బాగా వివరిస్తున్నారో? మీరు కూడా నైతిక విలువల గురించి ఉపన్యసించే స్థాయి రాజకీయాల్లో సంపాదిస్తారని ఎంత ఆశపడ్డాను. కానీ.. ’’’ అంటూ శ్రీమతి మాజీ ఎంపి గారు కళ్లు తుడుచుకున్నారు. అప్పుడే అక్కడికొచ్చిన అసంతృప్తి రావు, ‘‘ ఏ మాట కామాటే చెప్పుకోవాలి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న ఆ ప్రముఖ రాజకీయ నాయకుడు రాజకీయాల్లో విలువలపై బాగా మాట్లాడతారు.
‘మీ అల్లుడికి అదేదో కార్ల ఏజెన్సీ ఇప్పించారట!’ అని జర్నలిస్టు అడిగితే ‘ఆ కార్ల కోసం ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ల వ్యాపారంతో నాకు సంబంధం లేదని చెబుతాను ’ అని ఆ ప్రముఖుడు సమాధానం చెబుతున్నారు.ఏజెన్సీ ఇప్పించడంలోతన పాత్ర పోషిస్తారు కానీ, కార్ల అమ్మకాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటారు? ఎంపిలకు ప్లాటు ఇస్తే నేను తీసుకోలేదు - అని ఆ ప్రముఖ రాజకీయ నాయకుడు చెబుతుంటే, ఔను రెండువేల కోట్ల పవర్ ప్రాజెక్టు అయితే ఓకే తప్ప అందరితో పాటు ముష్టి ఐదువందల గజాలు ఇస్తే ఎందుకు తీసుకుంటారు- అని అసంతృప్తి రావు మనసులోనే అనుకున్నారు.
అటు రాజకీయఅన్నయ్య ఇటు జర్నలిస్టు అన్నయ్య ఇద్దరూ తమ తమ రంగాల్లో నైతిక విలువలపై ఉపన్యాసాలు ఇచ్చే స్థాయికి చేరుకున్న ‘ఆదర్శ్’ మూర్తులు.ఆయా రంగాల్లో ఉన్న ప్రతి వ్యక్తి తానూ ఏదో ఒక రోజు ఆ విధంగా నైతిక విలువల గురించి ఉపన్యసించే స్థితికి చేరుకోవాలని కోరుకుంటారు. అది సాధ్యం కావాలంటే కుంభకోణాలు అందరి ప్రాథమిక హక్కు కావాలి.నీతి: నైతిక విలువలపై ఉపన్యసించే స్థితికి చేరుకునేవారు మహానుభావులు......

20, మార్చి 2011, ఆదివారం

ముగ్గురు మరుగుజ్జులు

- బుద్దా మురళి
అటు చూస్తే సచిన్ బ్యాటింగ్, ఇటు చూస్తే మంత్రులు ఫైటింగ్.... వీటి మధ్య ఏ చానల్ చూడాలో ఇంటి పెద్దాయన తేల్చుకోలేక పోతున్నారు. వీరి ఫైట్ కన్నా కార్టూన్ నెట్‌వర్క్‌లో మిక్కీవౌస్ ఫైటింగ్ కడుపుబ్బా నవ్విస్తుందని చెప్పే ధైర్యం చేయలేని పిల్లలు.... వీరి బాధను గమనించిన నాయనమ్మ వారిని పిలిచి మీకు వాటికన్నా ఆసక్తికరమైన కథ చెబుతాను వినండి అనగానే పిల్లలంతా ఉత్సాహంగా ముందుకు వచ్చారు.

త్రిలింగ దేశం యువరాణి రాజ్యలక్ష్మి యుక్త వయసులో అడుగు పెట్టబోతోంది. మరో మూడేళ్లలో ఆమెకు పెళ్లి చేసి తీరాల్సిందే. ముగ్గురు యువరాజులను ఎంపిక చేసి వారి చిత్రపటాలను యువరాణికి చూపించారు. రాజులు ఎన్నిసార్లయినా పెళ్లి చేసుకుంటారు, ఎంత వయసు వచ్చినా ఆశ చావకుండా రాజ్యలక్ష్మిని చేపట్టేందుకు ఎదురు చూస్తుంటారు.
ఎంత వయసులోనైనా స్వయం వరంలో తమ ప్రతిభ ప్రదర్శించే అవకాశం వారికి ఉండడం వల్ల వారి వయసుతో నిమిత్తం లేకుండా స్వయం వరంలో ఉన్నవారందరినీ యువరాజులుగానే భావించాలి. నెరిసిపోయిన గడ్డంతో వయసు మీరిన యువరాజు ఒకరు, ఎలాంటి చరిత్ర లేకుండా ఉన్న యువరాజు ఒకరు, ఇంకా సరైన వయసు రాని యువరాజు ఒకరు వీరి ముగ్గురిని స్వయం వరానికి ఆహ్వానించారు.
ఆ ముగ్గురూ మరుగుజ్జులే.సుసంపన్నమైన దేశానికి అందమైన యువరాణికి పెళ్లి అంటే వీరులు శూరులు, అందగాళ్లు ఎంతో మంది క్యూలో నిల్చుంటారు కదా? మరి మరుగుజ్జులనే స్వయం వరానికి ఎందుకు ఆహ్వానించాలి అనే సందేహం వస్తుంది.
కానీ, త్రిలింగ దేశానికున్న వాస్తు దోషం, రాజ్యలక్ష్మి గ్రహ స్థితిగతులు, జాతక ఫలం రీత్యా ఆమె ఈ ముగ్గురిలో ఎవరో ఒకరిని చేపట్టాలి. దేశ ప్రజలకు, రాజ్యలక్ష్మికి ఇష్టం ఉన్నా లేకున్నా, నచ్చినా నచ్చక పోయినా తప్పదు. ముగ్గురు మరుగుజ్జుల చరిత్ర తక్కువేమీ కాదు.. ముగ్గురూ స్వయం ప్రకాశం లేని వారే.

పెద్దరాజు గాఢ నిద్రలో ఉన్నప్పుడు మంచం నుండి తోసేసి కుర్చీని సంపాదించుకున్న చరిత్ర ఒకరిది. రాజమాత అనుగ్రహంతో కుర్చీ పొందిన వారొకరు. తండ్రి పేరుచెప్పి కుర్చీ కోసం ఆశపడుతున్న వారొకరు. స్వయం వరంలో ముగ్గురు యువరాజులను చూడగానే యువరాణి రాజ్యలక్ష్మి ఫక్కున నవ్వింది.
కానీ చిత్రంగా ఆ ముగ్గురు చాలా ఎత్తుగా కనిపిస్తున్నారు. రాజసభలో కూర్చున్న వారే కాదు మొత్తం రాజ్యంలోని అందరి కన్నా వారు ఎత్తులో కనిపిస్తున్నారు. వారు అంత ఎత్తులో కనిపించడానికి కారణం తెలిసిన తరువాత యువరాణి మరింత నవ్వుకుంది. వారు మరుగుజ్జులే అయినా చాలా ఎత్తుగా కనిపించేందుకు అవసరమైన మంత్ర తంత్రాలు వారికి తెలుసు....
ఇలా నాయనమ్మ కథ చెబుతుంటే పొట్టిగా ఉన్నవాళ్లు పొడుగ్గా ఎలా కనిపిస్తారు? బూస్ట్ తాగారా? అని ఓ గడుగ్గాయి సందేహం వ్యక్తం చేసింది. మాయాబజార్ సినిమా చూశారా? అని నాయనమ్మ అడిగింది. చూశామని పిల్లలు చెప్పగానే అందులో ఘటోత్కచుడి నోట్లోకి లడ్డూలు వచ్చి పడ్డ దృశ్యం గుర్తుంది కదా? నిజానికి లడ్డూలు అలా పైకి రావు అదంతా ఫోటోగ్రఫీ మహిమ అన్నమాట! అలానే వయసు మీరిన తెల్లగడ్డం యువరాజు కెమెరాల ట్రిక్ వల్ల కొంత కాలం హిమాలయాలంత ఎత్తులో ఉన్నట్టు కనిపించారు.

మయాబజార్ సినిమాలో సినిమాటోగ్రాఫర్ ఒక్కరే అంత అద్భుతాన్ని సృష్టించినప్పుడు త్రిలింగ దేశంలో బోలెడు మంది ఫోటోగ్రాఫర్లు తలుచుకుంటే ఎంత అద్భుతాన్ని సృష్టించగలరో ఊహించుకోండి. తన చుట్టూ పత్రికలను కప్పుకుని అతను చాలా అద్భుతమైన వానిగా కనిపించే వారు. కొంత కాలానికి అసలు వర్షాలే లేక ఎండలు విపరీతంగా రావడంతో ఆ పత్రికలు ఎండకు పలచబడి యువరాజు అసలు రూపం ప్రజలకు తెలిసిపోయింది.
హిమాలయాలంత ఎత్తున కనిపించిన వ్యక్తి కాస్తా మళ్లీ మరుగుజ్జగానే కనిపించసాగారు.ఇక రెండో ఆయన సైజు ఆయనకూ తెలుసు, దేశ ప్రజలకూ తెలుసు. కానీ ఆ దేశాన్ని ఏలే రాజమాత అతనికి మహాశక్తిసంపన్నమైన ఒక కుర్చీని బహూకరించింది. ఈ కుర్చీపై ఎలాంటి వారు కూర్చున్న చాలా ఎత్తుగా కనిపిస్తారు. ఆ ఎత్తు కుర్చీ మహిమ తప్ప వ్యక్తిలోని శక్తి కాదు.
ఇక మూడవ వ్యక్తి నూనూగు మీసాలతో ఇంకా సరైన వయసు రాకుండానే స్వయం వరంలో హడావుడి పడుతున్నాడు. అతనెప్పుడూ తన తండ్రి కీర్తిని జేబులో పెట్టుకుని వస్తారు. దాంతో అతనూ వయసుకు మించిన కీర్తి, అసలు ఎత్తుకు మించిన ఎత్తుతో కనిపిస్తారు. పైకి ఎలా కనిపించినా వీరి ఎత్తుల్లోని అసలు రహస్యం రాజ్యలక్ష్మికి తెలుసు.కానీ ఈముగ్గురిలోనే తాను ఒకరిని ఎంపిక చేసుకోవాలి తప్ప మరో మార్గం లేదు. త్రిలింగ దేశ ప్రజలు మాత్రం ఆవేదనతోనే ఉన్నారు. ఎలాంటి దేశానికి ఎలాంటి పరిస్థితులు వచ్చాయని బాధపడసాగారు. ముగ్గురు మరుగుజ్జులను చాలా సేపు చూసి వారి గుణగణాలను పరిశీలించిన రాజ్యలక్ష్మి తన నిర్ణయం ప్రకటించడానికి లేచి నిలబడింది.
‘‘ ఎంతో ఎత్తుగా కనిపిస్తున్న మీ ముగ్గురు మరుగుజ్జులనే విషయం నాకు తెలుసు, మీలో ఒకరినే నేను ఎంపిక చేసుకోవాలనే విషయం కూడా అంత కన్నా బాగా తెలుసు. అయితే నా నిర్ణయాన్ని ప్రకటించేందుకు మూడేళ్ల వ్యవధి ఉన్నందున మీకో పరీక్ష. ఈ మూడేళ్ల కాలంలో మీలో కొద్దిగానైనా ఎవరు ఎత్తుగా పెరిగితే వారినే పెళ్లి చేసుకుంటాను ’’ అని రాజ్యలక్ష్మి ప్రకించింది. దాంతో ముగ్గురు ఆ క్షణంలోనే ఎత్తుపెరిగే కసరత్తుల కోసం పరుగులు తీశారు. లేపనాలు తింటున్నారు.కనిపించిన వారికల్లా మొక్కుతున్నారు.... అంటూ నాయనమ్మ చెబుతుంటే ‘‘సస్పెన్స్‌ను తట్టుకోలేక పోతున్నాం, రాజ్యలక్ష్మి ఎవరిని వరించింది’’ అని పిల్లలు అడిగారు. ‘’ ఏమో నాకేం తెలుసు ఆ విషయం తెలియాలంటే ఇంకా మూడేళ్లు ఆగాలని రాజ్యలక్ష్మే చెప్పింది కదా? ఈ లోపు వారి ఎత్తు పెరిగేందుకు ఏమైనా ఐడియాలు ఉంటే మీరూ చెప్పండి’’, అంటూ నాయనమ్మ ముగించింది.

హిట్లర్ పునర్మరణం .....

February 2nd, 2011
పై లోకంలో గ్రేట్ విలన్స్ క్లబ్ సమావేశం జరుగుతోంది ఎవరిలోనూ ఉత్సాహం కనిపించడం లేదు. ఏంటీ అంతా దిగులుగా ఉన్నారని హిట్లర్ గాడ్సేను పలకరించాడు. ‘‘ఇక్కడ జీవితం మరీ బోర్‌గా అనిపిస్తోంది. మా దేశంలో అభివృద్ధి చూస్తే ముచ్చటేస్తొంది. ఈ సమయంలో నేనక్కడ లేకపోతిని కదా? అని ఆలోచిస్తే బాధకలుగుతోంది ’’ ఆనిగాడ్సే బాధగా హిట్లర్ వైపు చూశాడు.
ఆ మాటలకు హిట్లర్ నొచ్చుకున్నాడు. అభివృద్ధిలో తన హయాం నాటి రికార్డును ఏ దేశం అధిగమించలేదు.‘‘నాగరికత మొదలయ్యాక 1933 నుంచి 1939 వరకు జర్మనీలో అభివృద్ధి నా హయాంలో జరిగినంత వేగంగా ప్రపంచంలో ఏ దేశంలో ఎప్పుడూ జరగలేదనేది వాస్తవం అభివృద్ధి గురించి నాకు చెబుతారా? ’’ అని హిట్లర్ కోపంగా అన్నాడు.
హిట్లర్ ఇంకా ఏదో చెబుతుంటే ,‘‘ ఔను నిజమే ఆరేళ్లలో మీ హయాంలో జర్మనీలో ప్రపంచంలో ఎక్కడా లేనంత వేగంగా అభివృద్ధి జరిగింది, తరువాత 39 నుంచి 45 వరకు ఆరేళ్లలో రెండో ప్రపంచ యుద్ధంలో అంతకన్నా వేగంగా జర్మనీ సర్వనాశనం అయింది కదా?’’, అని గాడ్సే నవ్వాడు. తమ బాస్‌ను అలా అనే సరికి గోబెల్స్ చిన్నబుచ్చుకున్నాడు. ఆ యుద్ధంలో నేను గెలిచి ఉంటే ప్రపంచం ఇప్పటి కన్నా ఎంతో వేగంగా అభివృద్ధి సాధించి ఉండేది అని హిట్లర్ చెబితే, సరే అభివృద్ధి సంగతి ఇప్పుడెందుకు కానీ అంతా కలిసి భారత్ వెళ్లొద్దాం ఏమంటారని ఇడీ అమీన్ ప్రతిపాదించాడు.
నేను రెడీ . భారత్‌లో ఆంధ్రప్రదేశ్ అని ఒక అద్భుతమైన ప్రదేశం ఉంది అక్కడికి వెళదాం-అని గోబెల్స్ ఉత్సాహంగా చేయి పైకెత్తాడు. ‘‘పుట్టింటికి వెళ్లడానికి ఉత్సాహ పడిన కొత్త పెళ్లికూతురులా నీకా ఉత్సాహం ఏమిటి? ఆందులోనూ ఆంధ్రప్రదేశ్‌కా ఏముందక్కడ?’’ అని హిట్లర్ చిరాగ్గా అడిగాడు.‘‘నా పేరును జర్మనీలో జనం ఎప్పుడో మరిచిపోయారు కానీ తెలుగునాట ప్రతి నేత నోట నా నిరంతరం నా నామస్మరణే. పైకి చెప్పకపోయినా, ఒప్పుకోకపోయినా నా విధానాలను తూచా తప్పకుండా అనుసరించే తెలుగునేతలు కదలాడు నేల కన్నా నా దృష్టిలో పవిత్రమైనది, చూడదగినది ప్రపంచంలో మరోటి లేదు’’ అని గోబెల్స్ తన్మయంతో పలికాడు.
సంపన్నులు బిలియనీర్స్ క్లబ్ ఏర్పాటు చేసుకున్నట్టుగానే గ్రేట్ విలన్స్ అంతా పై లోకంలో ఒక జట్టుగా ఏర్పడ్డారు. వీరందరూ హిట్లర్‌ను తమ కుల పెద్దగా ఎంపిక చేసుకున్నారు. ఎంపిక చేసుకోకపోతే గ్యాస్ చాంబర్‌లో పెట్టి మళ్లీ చంపేస్తాడేమోనని భయపడి ఎంపిక చేసుకున్నారని గిట్టని వారంటే మా బాస్ వాగ్దాటి వల్ల ఈ పదవి దక్కిందని గోబెల్స్ పై లోకంలో ప్రచారంలో పెట్టాడు.
అంతా కలిసి తెలుగునాడు సందర్శనకు వెళదాం అని నిర్ణయించకున్నారు. ఉద్యోగులకు రెండెళ్లకోసారి ఎల్‌టిసి సౌకర్యం ఉన్నట్టుగానే గ్రేట్ విలన్స్ క్లబ్ సభ్యులు అదృశ్య వేషాల్లో తమకు నచ్చిన ప్రాంతానికి వెళ్లే సౌకర్యం దశాబ్దానికోసారి కల్పిస్తారు. పైలోకాధీశుని అనుమతితో గ్రేట్ విలన్స్ క్లబ్ సభ్యులంతా తెలుగునాడుపై అడుగు పెట్టారు.ముందు గాంధీ విగ్రహానికి దండం పెట్టుకుని చేసిన పాపాన్ని క్షమించమని అడుగుతాను అని గాడ్సేచెప్పడంతో అంతా సరేనని అటువైపు అడుగులు వేశారు.
అక్కడంతా కోలాహాలంగా ఉంది. అవినీతిని అంతమొందిస్తాం అంటూ పుష్కర కాలం పదవి అనుభవించి అవినీతిలో కొత్త పుంతలు తొక్కిన తెలుగునేత అవినీతికి వ్యతిరేకంగా గట్టిగా నినాదాలు చేస్తున్నారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు లంచం తీసుకోవడం జన్మహక్కు, తక్కువ లంచాన్ని ఆమోదించేది లేదు అంటూ లంచం విలువ పెంచిన కొందరు తెగ హడావుడి చేస్తున్నారు. మంత్రులుగా ఉన్నప్పుడు తమతమ శాఖల్లో శక్తికొద్ది వెనకేసుకువచ్చిన వారంతా ఒక జట్టుగా ఉన్నారు. వీరందరినీ చూడగానే క్లబ్ సభ్యులు మురిసిపోయారు.
ఔరా! ఔరా! మనం ఈ నేలపై అడుగుపెట్టగానే వీరిలో ఎంత మార్పు! మొన్నటి వరకు అందిన కాడికి దండుకున్న వీరు ఇప్పుడు మారిపోయారు అంటూ హిట్లర్ సంబరపడ్డారు. గోబెల్స్ పరిగెత్తుకొచ్చి తొందరపడి సంతోషపడకండి ఇప్పుడే సమాచారం తెలుసుకోని వచ్చాను, ఇంతకు మించిన వింతలు కూడా అక్కడక్కడ జరుగుతున్నాయి. మనం నేలమీద అడుగుపెట్టినందుకు మారిపోవడం కాదు... జనం కోసం అంతా తలా ఒక వేషం వేసుకున్నారట! ఇప్పుడు అవినీతి వ్యతిరేక సీజన్ నడుస్తోంది. అంతా అవినీతిపై ఉద్యమం ప్రకటించారు అంతే అని అసలు విషయం చెప్పారు.
వీరంతా అటు నుంచి ముందుకు కదిలితే, ‘‘ నా జీవితం ప్రజలకే అంకితం, గాంధీ, నెహ్రూ, నేను పుట్టిన ఈ దేశంలో పేదల సమస్యలు నన్ను కదిల్చివేశాను. మా నాన్న చనిపోయిన తరువాత తెలుగునాట ప్రజల పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటుందని కలలో కూడా ఊహించలేదు. నేనెక్కువగా బెంగళూరులో ఉన్నందున తెలుగువారి కష్టాలు తెలియలేదు. పెద్ద పదవి ఇవ్వండి మీ కష్టాలు తీరుస్తాను ’’, అంటూ యువనేత చెప్పుకుపోతున్నాడు. అటు నుంచి ముందుకు వెళ్లారు. కొత్తబిక్షగాడు పొద్దెరగడన్నట్టు, నవ మేధావి ఒకరు చదువు, ‘‘కెరీర్ ఉద్యోగం ఇదేనా మీ జీవిత లక్ష్యం, సమాజం ఎటుపోతుందో చూడండి .
మా అభిమాన నాయకున్ని మీ అభిమాన నాయకుడిగా గౌరవించండి అధికారం అప్పగించండి .. కదలండి’’ అంటూ విద్యార్థుల ముందు ఆవేశంగా ఉపన్యాసం ఇస్తున్నాడు. ఆరువేల జీతం నుంచి వంద కోట్లకు ఎదిగే రహస్యం మాకూ చెబితే మేమూ కదులుతాం సార్ అంటూ కొంటెవిద్యార్థి ఒకడు గట్టిగా అరిచాడు.అదృశ్య శక్తితో తెరపై చూసిన గ్రేట్ విలన్స్‌కు దిమ్మతిరిగిపోయింది. మాది పెద్దాపురం కంపెనీ అండి ... భార్యాభర్తల పవిత్ర బంధంపై ఉపన్యాసం ఇవ్వడానికి వెళుతున్నాను అంటూ వయ్యారంగా చెబుతోంది ఒకావిడ. ఇవన్నీ చూశాక హిట్లర్ తెలుగునేలకు తల కొట్టుకుని పునర్మరణం పొందాడు. మిగిలిన గ్రేట్ విలన్స్ స్పృహ తప్పి పడిపోయారు. మనవి గట్టిగుండెలు కాబట్టి మనం మాత్రం మన నేతల హారర్ లైవ్ మూవీని చూసి తట్టుకుంటున్నాం.

నేతల తెలివి

February 9th, 2011
ఏమేవ్ చిన్నోడి టెక్ట్స్ బుక్స్ ఒకసారి ఇలా తీసుకురా! పరుగులాంటి నడకతో హడావుడిగా ఇంట్లోకి అడుగుపెడుతూ విశ్వనాథం భార్యను కేకేశాడు. విశ్వనాథం జీవితం రాజకీయాలంత సుదీర్ఘమైంది. రాష్ట్ర రాజకీయాలను ఆయన జీవితాన్ని విడివిడిగా చూడలేం. సినిమాల్లో హీరోలు ఒక్క బ్రేక్ దొరికితే చాలని ఎదురు చూసినట్టుగానే విశ్వనాథం రాజకీయాల్లో ఒక్క బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న విశ్వనాథం చదువుకునే రోజుల్లో క్లాస్‌లో ఉన్న సమయం కన్నా రాజకీయ పార్టీల మీటింగుల్లో గడిపిన సమయం ఎక్కువ. అతను మోసిన పుస్తకాల బరువు కన్నా జెండాల బరువు అధికం.
ఇందిరాగాంధీ పోయాక వాళ్ల అబ్బాయి ప్రధాని అయ్యారు, తరువాత ఆయన భార్య చక్రం తిప్పుతున్నారు. ఇప్పుడు మనవడు రాహుల్‌ను ప్రధానమంత్రి పదవి కోసం ముస్తాబు చేస్తున్నారు. కానీ పాపం విశ్వనాధంకు మాత్రం బ్రేక్ రాలేదు. ఏదైనా ఒక పదవి ఇవ్వండి స్కాం చేయకపోతే అడగండి - అని గట్టి హామీ ఇచ్చినా ఆయన ప్రతిభను నమ్మడం లేదు.విశ్వనాథానికి పెళ్లి, పిల్లల విషయంలో సైతం ఆలస్యం అయింది. కాంగ్రెస్‌లో కుటుంబ పాలనే , ఆ పార్టీని నమ్ముకుంటే కలిసొచ్చేట్టు లేదని విశ్వనాధం వారసత్వ రాజకీయాలు, కుటుంబ రాజకీయాలను వ్యతిరేకిస్తూ అన్నగారు పెట్టిన పార్టీ వైపు ఆశగా అడుగులు వేశాడు.
వారసత్వ వ్యతిరేక సిద్ధాంతంతో పుట్టిన పార్టీ వారసత్వం అన్న తరువాత ఎవరికీ అని అల్లుళ్లిద్దరి మధ్య గట్టి పోటీ జరిగింది. మురారీ మురారీ నడుమ నారీ అన్నట్టు అల్లుళ్లిద్దరిని పక్కకు తప్పించి వదిన రంగ ప్రవేశం చేశారు. పెద్దల్లుడి సహకారంతో చిన్నల్లుడు ‘అన్నా వదిన’లను పక్కన తోసేసి, అధికారం చేపట్టి సొంత బలంతో పెద్దల్లుడిని పక్కకు పడేశాడు. ఇప్పుడు చిన్నల్లుడి కొడుకు వారసత్వం చేపట్టే కాలం సమీపించింది. ఇక్కడా నాకు అవకాశం దక్కేట్టు లేదనుకున్న విశ్వనాథం సామాజిక న్యాయాన్ని నమ్ముకుని చిరంజీ చేయి పట్టారు. సామాజిక న్యాయం ప్రొడ్యూసర్‌కు అన్నీ తొందరే తాదూర కంత లేదు మెడకో డోలు అన్నట్టు, రాజకీయాల్లో తాను నిలదొక్కుకోకముందే తమ్ముళ్లను, బావమరిదిని రంగంలో దించాడు. మామ సక్సెస్ అయితే తరువాత అధికారం దక్కేది అల్లుడికే కదా! అని సామాజిక నేత అల్లుడు కాచుకొని కూర్చున్నాడు.
చదువు అబ్బని వారంతా రాజకీయాల్లో చేరినట్టు, రిటైర్ అయిన హీరోలంతా రాజకీయాల్లో చేరినట్టు విశ్వనాధం సైతం తిరిగి కాంగ్రెస్ సముద్రంలో కలిశాడు. ఎక్కడి నుంచి వచ్చాడో మళ్లీ అక్కడికే చేరుకున్నాడు. కాంగ్రెస్ నుంచి మొదలై టిడిపి, ప్రజారాజ్యం మీదుగా మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చి పడ్డ తన రాజకీయ జీవితంలో తానేం సాధించానా? అని విశ్వనాధం ఆలోచించుకుంటే ఆయనకు దిక్కుతోచలేదు.

హే! భగవాన్ ఎవరెవరరికో అవకాశాలు కల్పిస్తున్నావు నా సంగతేమిటని దీర్ఘంగా ఆలోచిస్తున్న విశ్వనాధానికి మంత్రి మాటలు కళ్లు తెరిపించాయి. భర్త హడావుడి చూసి కంగారు పడ్డ మాణిక్యం ఏమైందండి అని గాబరాగా అడిగింది. ఏమీ కాలేదు కానీ ముందు వాడి బుక్స్ ఇలా ఇవ్వు అని అడిగాడు. ఇన్నాళ్లకు తన భర్త కొడుకు చదువు గురించి పట్టించుకుంటున్నందుకు ఆమెకు సంతోషం వేసింది. ఆ పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని విశ్వనాథం జనగణమన అధినాయక జయహే అని కంఠతా పట్టాడు. తరువాత వందేమాతరంపై కుస్తీ పట్టాడు. అన్ని టెక్ట్స్ బుక్స్‌ను ముందేసుకున్నాడు.
ముందు సంతోషపడ్డా భర్త ప్రవర్తన ఆమెను ఆయోమయంలో పడేసింది. భార్య పరిస్థితి అర్థం చేసుకున్న విశ్వనాథం మాణిక్యం డియర్ గాబరాపడకు అంటూ అప్పటికే సిద్ధం చేసుకున్న కొశ్చన్ బ్యాంక్ చూపించాడు. ఇంత కాలం రాజకీయాల్లో అదృష్టం కలిసి రాలేదని బాధపడ్డాడం ఇప్పుడు మన బాధలన్నీ తీరిపోనున్నాయి అంటూ కొశ్చన్ బ్యాంక్‌లోని ప్రశ్నలు చదివాడు. చైనా వాల్ పొడవెంత? ఆ గొడల నిర్మాణానికి ఉపయోగించిన ఇటుకలెన్ని? ఆంధ్రప్రదేశ్‌లో మిర్చి ఎక్కువగా పండించే జిల్లా ఏదీ? మెదక్ జిల్లా కంది గ్రామంలో కందులు పండుతాయా? లేదా? కాకరకాయ శాస్ర్తియ నామం ఏమిటి? ఎంత వేడిలో నీరు ఆవిరిగా మారుతుంది. వర్షాలు ఎలా కురుస్తాయి. దేశంలో అత్యధిక వర్షపాతం గల ప్రదేశం ఏదీ? గవర్నర్ అధికారాలేమిటి? రాజ్యాంగం ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది? అంటూ విశ్వనాథం చదువుతూ పోతుంటే మాణిక్యం మరింత ఆందోళన చెందింది. నీ పరిస్థితి నాకర్ధమైంది డియర్ పదవి రాలేదని పిచ్చిపట్టిందనుకుంటున్నావేమో అదేం కాదు. ఇది చూడు అంటూ రెండు వార్తలు ఆమెకు ఇచ్చాడు. జగన్ పోలవరం కాలువ పొడవు ఎంతో చెబితే ముఖ్యమంత్రి పదవి ఇస్తామని మంత్రి డిఎల్ రవీంద్ర ప్రకటించారు. దీనికి జగన్ శిబిరం సమాధానం చెబుతూ ఇది తెలుగు రాష్ట్రం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలుగు ముఖ్యమంత్రి , ఆయన ఎవరి సహాయం లేకుండా జనగణమన పాడితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అంబటి రాంబాబు చెప్పాడు. యక్షుడి ప్రశ్నలకు సమాధానం చెప్పినందుకే కదా? చనిపోయిన తమ్ముళ్లను ధర్మరాజు తిరిగి బతికించుకున్నది. ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతాను నా రాజకీయ జీవితాన్ని బతికించుకుంటాను అని విశ్వనాథం ఆనందంగా గెంతాడు.పోలవరం కాలువ పొడవెంతో చెబితే ముఖ్యమంత్రి పదవి ఇస్తానన్నవాళ్లు ఇన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పినందుకు మంత్రిపదవి ఇవ్వకుండా ఎలా ఉంటారో నేనూ చూస్తా అని విశ్వనాథం పలికాడు. ఐనా! ఐదు పదాల ప్రమాణస్వీకరాన్ని చదివేందుకు ఏడుసార్లు తడబడి ఆరు తప్పులు చేసిన కిరణ్‌కుమార్‌కు అంత కఠిన పరీక్ష అన్యాయం అని మాణిక్యం సానుభూతిగా చెప్పింది. బ్రేకింగ్ న్యూస్: ఎంతో కష్టపడి జాతీయ గీతం తప్పుల్లేకుండా పాడడం నేర్చుకున్నాను. ఇచ్చిన మాట ప్రకారం నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని మంత్రి శంకర్‌రావు సోనియాగాంధీని కలిశారు.