28, డిసెంబర్ 2011, బుధవారం

ట్రెండు మారింది స్క్రిప్ట్ మార్చండయ్యా!...రాజకీయ వ్యంగ్యం

గళ్ల లుంగి. ఒకవైపు పైకి మరోవైపు కిందికి. ముఖానికి పెద్ద గాటు. మెడకు కట్టుకున్న కర్చీప్. చేతిలో పెద్ద కర్ర. అతను భయంకరంగా కనిపిస్తున్నాడు. వాడి పేరు గంగులు అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని వందల తెలుగు సినిమాల్లో దొంగతనం చేసే గంగులు తప్పని సరిగా ఇలానే దర్శనమిచ్చేవాడు. దొంగకు ఆ కాలంలో ఈ మాత్రం బిల్డప్ ఉండాలి. రూపం సంగతి సరే దొంగలందరికీ అలా ఒకే చోట గాటు ఉండడం ఏమిటనే సందేహం అప్పుడప్పుడు వచ్చేది.


 వారధి నిర్మించడంలో సహాయం చేసిన ఉడతను శ్రీరాముడు ఆప్యాయంగా నిమిరితే గీతలు పడ్డాయట! ఒక ఉడతను ఆప్యాయంగా నిమిరితే మొత్తం ఉడతలకు గీతలు వంశ పారంపర్యంగా వస్తున్నప్పుడు ఒక గంగులు ముఖానికి గాటు పడితే దొంగలందరికీ గాటు ఉండడం సబబే అనిపించింది. మరిప్పుడో కర్చిప్ స్థానంలో మెడకు చక్కని టై వచ్చి చేరింది. గంగులు అనే మొరటు పేరు నుండి మిస్టర్ వర్మ అనో కోనేరు ప్రసాదు అనో చక్కని పేర్లు ఉంటున్నాయి. కాలం మారింది మరి గళ్ల లుంగీతో దోపిడీలు చేయాలంటే సాధ్యమయ్యే పనేనా? పేరు కూడా మారింది. ఇప్పుడు ఇష్టం ఉన్నా లేకున్నా, సూట్ అయినా కాకున్నా సూట్ వేసుకోవలసిందే! ఆనాటి గంగులులా దౌర్జన్యాలు చేస్తామంటే కుదరదు, దురుసుగా మాట్లాడడం సాధ్యం కాదు. చేతిలో కర్ర పట్టుకుని తిరగడం ఊహకే అందని కోరిక. భారీ కార్లలో, చక్కని సూట్‌లో కనిపించి తీరాల్సిందే లేకపోతే దగా మోసం మార్కెట్‌లో ప్రవేశమే ఉండదు. ఆర్థిక సంస్కరణల తరువాత దొంగల రూపే మారిపోయింది. వారు కూడా సంస్కరణల బాట పట్టేశారు.


గతంలో మహాభారత యుద్ధం సైతం బాణాలతో, గదలతో ముష్టిఘాతాలతో సాగేది. రామాయణం అంతే రాముడు మహాబలసంపన్నుడైనా, బాణాలతో బ్లాక్ అండ్ వైట్‌లో కొద్దిపాటి మెరుపులు మెరిపించేవాడు. టెక్నాలజీ పెరిగింది గ్రాఫిక్ మయాజాలం దేవుళ్లను సైతం వశం చేసుకుంది. కాలం మారింది టెక్నాలజీ పెరిగింది మరి దేవుళ్లు సైతం మారిన కాలానికి తగ్గట్టు యుద్ధాలు చేస్తున్నారు.
ఐతే ఏంటీ ? ఇంతకూ ఏం చెప్పదలుచుకున్నారని అడుగుతున్నారా?
మార్పు తప్ప ఏదీ శాశ్వతం కాదు ప్రపంచంలో అన్నీ మారుతాయి అంటారు. మారాల్సిందే. తప్పదు మరి! కాలం ఇంత మారినా దేవుళ్లు, మనుషులు, దొంగలు సైతం సంస్కరణల బాట పట్టి మారుతుంటే మన రాజకీయ నాయకులు మాత్రం దశాబ్దాల క్రితం నాటి స్కిృప్ట్‌ను మార్చడం లేదు. డైలాగులు మారడం లేదు.
అందుకే కాలం మారింది స్క్రిప్ట్ మార్చండయ్యా అనేది.


ప్రపంచం అంతా మారుతోంది. వ్యాపారాలు అన్నీ మారుతున్నాయి. పూటకూళ్ల ఇళ్లలో తిండి అమ్ముకునే కాలం నాటి డైలాగులనే స్టార్ హోటళ్ల కాలంలో నాయకులు వినిపిస్తున్నారు. ఇంకెప్పుడు మారుతారు, మారండయ్యా! కొత్త జనరేషన్‌కు తగ్గట్టు కొత్త డైలాగులు, కొత్త స్క్రిప్ట్‌లతో రండయ్యా! ‘ప్రజలే నా దేవుళ్లు, వారికే నా జీవితం అంకితం. చివరి రక్తం బొట్టువరకు రైతుల కోసమే ఉద్యమిస్తాను’ అబ్బబ్బ ఇంకెంత కాలం చెబుతారు ఈ డైలాగులు. 1960 ప్రాంతంలో నాగభూషణం మహమ్మద్‌బిన్ తుగ్లక్ సినిమాలో ప్రజలే నా దేవుళ్లు అని రాజకీయ నాయకుడు డైలాగు చెప్పడాన్ని తొలిసారిగా ఉపయోగించారు. 82లో కొత్త పార్టీ నేత ఈ డైలాగులను చాలా సీరియస్‌గా ఉపయోగించారు. జనం కూడా బాగానే నమ్మారు. సరే సినిమా డైలాగు అయినా రాజకీయాల్లో తొలిసారి ఉపయోగించారు కాబట్టి బాగానే హిట్టయింది. 50 ఏళ్ల క్రితం నాటి ఆ సినిమా డైలాగు, 30 ఏళ్ల క్రితం నాటి రాజకీయ డైలాగును ఇంకా వాడుకుంటే ఎలా? కొత్త డైలాగు చెప్పండి. నెహ్రూ చితాభస్మాన్ని ఆకాశం నుండి పొలాల్లో చల్లించారంటారు. బ్లడ్ బ్యాంకు ద్వారా ఈయన రక్తం బొట్లను అందరికీ పంచుతారో ఏమిటో?


మురికివాడల్లో ముక్కుచీమిడి కారే పిల్లలను ముద్దుపెట్టుకుంటూ కెమెరాలకు ఫోజులిచ్చే టెక్నిక్ ఇందిరాగాంధీ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తనాటిది. సరే నానమ్మ వారసత్వంతో ఆమె మనవడు రాజకీయ శిక్షణలో భాగంగా గుడిసెల్లో దూరి భోజనం చేయడం, కాలేజీలకు వెళ్లి రాజకీయాల గురించి మాట్లాడితే పిల్ల చేష్టలు అనుకోవచ్చు. 60 ఏళ్లు దాటి, రిటైర్ మెంట్‌కు చేరువైన వారూ అవే నాటకాలా? తల్లిదండ్రులనే మా ఆవిడ వద్దంటుందమ్మా !అంటూ వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్న కాలమిది దశాబ్దాల తరబడి ఓదార్పులు అంటూ జనం మీద పడితే నమ్ముతారా? ఆన్‌లైన్‌లో పంటలు పండించవచ్చునని నమ్మేవారు సైతం పంట పొలాల వెంట పడి రైతులకే నా జీవితం అంకితం అని ఎంత కాలం చెబుతారు. దళితుల అభ్యున్నతి కోసమే పుట్టామని ఎంత కాలం చెప్పుకుంటారు. 1885లో కాంగ్రెస్ పుట్టాక, వచ్చిన తొలి ఎన్నికల్లో చెప్పిన మాటల నుండి నిన్నమొన్న పుట్టిన పార్టీ వరకు అన్ని పార్టీల ఎన్నికల ప్రణాళికలో అవే డైలాగులు సమసమాజం, పేదరిక నిర్మూలన, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ... వైగైరా.. వైగైరా... అవే డైలాగులు, తళతళలాడే ఖద్దరు డ్రెస్సు, మెడలో కండువా. ప్రతిసారి బడ్జెట్‌పై చెబుతారు అదేంటీ ఆ కొత్త సీసాలో పాతసారా! అని అలానే మీరు పార్టీల పేర్లు మారుస్తున్నారు తప్ప అదే వ్యాపారం, అవే డైలాగులు, అదే స్క్రిప్ట్. స్క్రిప్ట్ మార్చండి. కొత్త డైలాగులు చేర్చండి...

4 కామెంట్‌లు:

మీ అభిప్రాయానికి స్వాగతం