27, మే 2011, శుక్రవారం

తెలుగు దేశం భవిష్యత్తు ఏమిటి ?....సమస్యలనుంచి సంక్షోభంలోకి.. పయనం


  నేటి నుంచి మూడు రోజులు మహానాడు

టిడిపి ఆవిర్భావం రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు దారితీసింది. తమిళనాడులో డిఎంకె, అన్నాడిఎంకె స్ఫూర్తితో ఆవిర్భవించిన టిడిపి రాష్ట్ర రాజకీయాల్లో గణనీయమైన ప్రభావాన్ని చూపించింది. ఎన్టీఆర్ హయాంలో దేశ వ్యాప్తంగా కాంగ్రెసేతర పక్షాలన్నింటిని ఏకం చేయగలిగింది. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి రాష్ట్రంలో కాంగ్రెస్‌ను కూకటి వేళ్లతో పెకిలించారని టిడిపి నాయకులు ఘనంగా చెప్పుకుంటారు.
 కానీ అది నిజం కాదు. టిడిపి ఆవిర్భావం తరువాత కాంగ్రెస్ ఓటు బ్యాంకు పెద్దగా చెదిరిపోలేదు. రాష్ట్రంలో కాంగ్రేసేతర పక్షాలన్నింటిని ఎన్టీఆర్ కూకటివేళ్లతో పెకిలించారు. ప్రతిపక్షాలు చీలికలు పేలికలు కావడం వల్ల 30- 40 శాతం ఓట్లతో ఎదురులేని విధంగా రాష్ట్రంలో పాలన సాగిస్తూ వచ్చిన కాంగ్రెస్ విజయాలకు టిడిపి బ్రేకు వేసింది.
 కాంగ్రేసేతర పక్షాల ఓట్లన్నీ గుండుగుత్తగా టిడిపి ఏకం చేయడంతో ఎదురులేదనుకున్న కాంగ్రెస్ డీలాపడిపోయింది. ఈ విజయంతో ఎన్టీఆర్ రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశ వ్యాప్తంగా కాంగ్రేసేతర పక్షాలను ఏకం చేయడానికి తీవ్రంగానే ప్రయత్నించారు.
ఇదంతా టిడిపికి సంబంధించి గత వైభవం. చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో ఎన్టీఆర్ ప్రభావాన్ని పార్టీపైన, ప్రజల పైన లేకుండా చేయడానికి తన శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. సాధ్యం కాలేదు. చివరకు ఓటమి తరువాత ఇప్పుడు తన పాలన గురించి చెప్పడం కన్నా ఎన్టీఆర్ హయాంలో సాధించిన విజయాలు, రాజకీయ రంగంలో ఎన్టీఆర్ చూపిన ప్రభావం గురించి చెప్పడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు గండిపేటలో మహానాడు నిర్వహిస్తున్నారు. తెలంగాణ సమస్య మొత్తం దేశానికి సమస్యగా మారిందనేది టిడిపి సీమాంధ్ర నాయకుల వాదన. ఒక రాష్ట్రాన్ని విభజిస్తే మొత్తం దేశం నుంచి లాంటి వందలాది డిమాండ్లు పుట్టుకొస్తాయని చెప్పుకొచ్చారు. తెలంగాణ దేశానికే సమస్య అని భావిస్తున్న వారు హైదరాబాద్‌లో జరుగుతున్న మహానాడులో మాత్రం తెలంగాణపై చర్చించవద్దని భావించడం విచిత్రం. అసలు సమస్యనే చర్చించనప్పుడు మూడు రోజుల మహానాడును మొక్కుబడి తంతుగా కాక పార్టీ శ్రేణులకు దశ దిశ చూపేదిగా ఎట్లా నిర్వహిస్తారు?
 ఒక పార్టీని వ్యతిరేకించడమే మా సిద్ధాంతం అని చెప్పుకునే ప్రత్యేకత టిడిపికి మాత్రమే పరిమితం! మరిప్పుడు తెలంగాణ, సమైక్యాంధ్ర, ఎన్‌డిఏ కూటమి, యుపిఎ కూటమి, తృతీయ ఫ్రంట్.. వీటిల్లో దేన్ని వ్యతిరేకించాలో.. ఎవరికి మద్దతు ఇవ్వాలో.. ఎటూ అంతు చిక్కని గందరగోళ పరిస్థితిలో టిడిపి కొట్టుమిట్టాడుతోంది.
ఎన్టీఆర్ మరణించిన ఒకటిన్నర దశాబ్దాల తరువాత కూడా ఇంకా ఎన్టీఆర్ పేరు చెప్పుకొని బతికే ప్రయత్నమే తప్ప పార్టీశ్రేణుల్లో ఉత్సాహం నింపలేకపోతున్నారు. దానికి ఏం చేయాలంటే ఎవరి వద్ద సమాధానం లేదు. నాయకునిపై పెద్దగా ఎవరికీ నమ్మకం లేదు. 2004 ఎన్నికల ముందు ప్రజల్లో టిడిపి పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉందనే విషయం పార్టీలో అందరికీ తెలుసు! అయినా చంద్రబాబు పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకు వస్తాడు అనే నమ్మకం చాలా మంది నాయకుల్లో బలంగా ఉండేది. ఇప్పుడలాంటి నమ్మకం ఏమాత్రం లేదు. 95లో ఎన్టీఆర్‌ను పక్కకు తప్పించి పగ్గాలు చేపట్టిన చంద్రబాబు నాయుడు పదహారేళ్ల శ్రమతో పార్టీ శ్రేణులను నమ్మకం నుంచి అపనమ్మకంలోకి తీసుకువెళ్లారు.

 ఇలాంటి పరిస్థితుల్లోనూ...పార్టీ పరిస్థితి ఎలాగైనా ఉండనివ్వండి. ఈ పార్టీని ఇప్పుడున్న స్థితిలో ఆయన తప్ప మరెవరూ నడిపించలేరని బలంగా నమ్మే నాయకులే ఎక్కువ ఉండటం చంద్రబాబుకు బాగా కలిసి వచ్చే అంశం. మీడియా పుణ్యమా అని నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌ల పేరుతో కొంత హడావుడి జరిగినా అవి తాటాకు చప్పుళ్ళే అన్న విషయం బాబుకు తెలుసు. నందమూరి హీరోలు ఎన్నికల ప్రచారానికి తప్ప ఒక రాజకీయ పార్టీని నిర్వహించే సామర్ధ్యం వారికి లేదనే విషయం పార్టీ నేతలకూ తెలుసు, బాబుకు మరింత బాగా తెలుసు.
తెలుగుదేశం నాతోనే పుట్టింది.. నాతోనే పోతుంది అని ఎన్టీఆర్ చెప్పిన మాట నిజం కాలేదు.. కానీ ఆ మాట చెప్పకపోయినా చంద్రబాబుకు మాత్రం ఆ గౌరవం దక్కేట్టుగా ఉంది. ఇప్పుడా పార్టీ నిలవాలన్నా..మునగాలన్నా ఆయన వల్లే సాధ్యం. పార్టీ పరిస్థితి మెరుగుపడాలంటే ఏం చేస్తే బాగుంటుంది? అనే ప్రశ్న బాబుతో సహా టిడిపి నాయకులెవరికీ ఉదయించడం లేదా? అంటే ఎందుకు ఉదయించదు. కానీ సమాధానం వారి చేతుల్లో లేదు! తెలంగాణ, జగన్ ఈరెండూ లేకపోతే టిడిపి ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలోకి వచ్చి పాలించేస్తున్నంత హడావుడిగా ఉండేది. టిడిపి దూకుడుకు పగ్గాలు లేకుండేవి. ఈ రెండు సమస్యలు పరిష్కారం అయితే కానీ టిడిపి ముందుకెళ్లలేదు. మరి చంద్రబాబును తెలంగాణ వ్యవహారం ముందుకెళ్లకుండా చేస్తోంది. ఈ విషయం కాంగ్రెస్ అధిష్టానం సైతం బాగానే గ్రహించినట్టుగా ఉంది. అందుకే తెలంగాణ వ్యవహారాన్ని అటు ముందుకెళ్లనివ్వడం లేదు, ఇటు వెనక్కి పోనివ్వడం లేదు. ఎందుకంటే ఒకసారి తెలంగాణ సమస్య పరిష్కరించారంటే పరిస్థితులు తమ చేతిలో ఉండవు. బాబు,జగన్ చేతిలో ఉంటాయి. అందుకే బలమైన తెలంగాణ ఆయుధాన్ని వచ్చే ఎన్నికల వరకు కాంగ్రెస్ హై కమాండ్ తమ చేతిలోనే ఉంచుకోదలుచుకుంది. తెలంగాణ సమస్య రాజుకున్నంత కాలం టిడిపి ముందరి కాళ్లకు బంధం వేసినట్టే. తెలంగాణకు టిడిపి ఔననదు, కాదనదు. తాము ఔనంటే ఢిల్లీ కాదనవచ్చు, తాము కాదంటే ఢిల్లీ ఔననవచ్చు. కాబట్టి మేం చివరకు రెండు కళ్లను నమ్ముకోవడం మినహా మరో మార్గం లేదనేది టిడిపి నాయకుల వాదన. టిడిపి రెండు కళ్ల సిద్ధాంతం చెప్పినంత కాలం రెండు ప్రాంతాల్లోనూ టిడిపికి ఇబ్బందులే.
నిజానికి కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకు నిర్వీర్యంగా మారుతోంది. రెండుసార్లు గెలిచిన కాంగ్రెస్‌కు ఎంత గొప్పనాయకుడు నాయకత్వం వహించినా మూడోసారి గెలవడం అంత సులభం కాదు. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడు లేని పార్టీగా మారింది. ఇలాంటి పరిస్థితి వాస్తవానికి ఇప్పుడు అంతా టిడిపి వైపు చూసే పరిస్థితి ఉండాలి. కానీ టిడిపి సైతం శూన్యంలోకి చూస్తోంది. జగన్ పార్టీ ఏర్పాటు చేసిన తరువాత కాంగ్రెస్ ఓట్లు రెండుగా చీలి మేం అధికారంలోకి వస్తాం అంటూ చంద్రబాబు కొత్త వాదాన్ని వినిపించి పార్టీ శ్రేణుల్లో ఆశలు రేకెత్తించారు. ఆ వాదం బయటకు వచ్చిన తరువాత జరిగిన తొలి ఎన్నికలు కడప, పులివెందుల. కాంగ్రెస్ ఓట్లు చీలడం మాట అటుంచి చివరకు టిడిపి ఓట్లు సైతం చీలిపోయి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు పడ్డాయి. గత ఎన్నికల్లో కడపలో టిడిపికి మూడున్నర లక్షల ఓట్లు వస్తే ఇప్పుడు లక్షా 20వేల ఓట్లు మాత్రమే వచ్చి, డిపాజిట్ కూడా దక్కలేదు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ఈ స్థాయిలో ఉండక పోవచ్చు. కానీ జగన్ పార్టీకి కాంగ్రెస్ ఓట్లు మాత్రమే చీలుతాయని చెప్పలేం, టిడిపి ఓట్లు సైతం చీలడం ఖాయం. ఇదే టిడిపిని కలవరపెడుతున్న సమస్య. అధికారంలో ఉన్నంత కాలం పాజిటివ్ ప్రచారంతో ఆశలు రేకెత్తించారు. గతంలో మాదిరిగా మీడియా మొత్తం టిడిపికి ఏకపక్షంగా లేదు, టిడిపి ప్రత్యర్థులకు సైతం బలమైన మీడియా అండ ఉంది. ఇది టిడిపికి మింగుడు పడని కొత్త సమస్య. ఏకపక్ష మీడియాతో ప్రయోజనం పొందిన టిడిపికి ప్రత్యర్థులకు సైతం మీడియా అండ లభించడంతో ఈ కొత్త పోరును ఎలా ఎదుర్కోవాలో తెలియడం లేదు. ఇప్పుడు మీడియా ఒకే సామాజిక వర్గం, ఒకే ప్రాంతం చెప్పు చేతుల్లో లేదు. విస్తృత మైంది.

 ఇక ఇప్పటి వరకు గట్టి మద్దతుదారులుగా నిలిచిన వామపక్షాలు జగన్ వైపు దృష్టిసారించాయి. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ సమీకరణలు వేగంగా మార్పు చోటు చేసుకుంటాయి. రోజులు గడుస్తున్నా కొద్ది టిడిపిని తెలంగాణ సమస్య మరింతగా చుట్టుముడుతుంది. ఇప్పుడు నాగం జనార్దన్‌రెడ్డిని బయటకు పంపినా, తెలంగాణపై గొంతెత్తే నేతల సంఖ్య ఇంతటితో ఆగిపోదు. ఉద్యమం బలపడిన కొద్దీ సమస్యలు చుట్టుముడతాయి. పూర్తిగా చల్లబడితే ముందు ప్రయోజనం పొందేది టిడిపినే. మరి చల్లబడేదెప్పుడు? మొత్తం మీద టిడిపి పరిస్థితి సమస్యల నుంచి సంక్షోభం వైపు పయనిస్తున్నట్టుగా ఉంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం