15, సెప్టెంబర్ 2017, శుక్రవారం

మన కెందుకీ ఆదర్శమూర్తులు

‘‘మీఏరియాలో ప్రజలకు ఉచితంగా వైద్యం చేసే డాక్టర్లు ఉన్నారా?’’
‘‘అవసరం లేకున్నా గర్భాశయం తొలగించే వైద్యులున్నారు. అమృతాంజనం రాస్తే పోయే తలనొప్పికి కూడా లక్ష రూపాయల చికిత్స చేసే ఖరీదైన డాక్టర్లూ ఉన్నారు. కానీ పుట్టి బుద్ధెరిగిన తరువాత పేదలకు ఉచితంగా వైద్యం చేసే డాక్టర్‌ను చూడలేదు.’’
‘‘నువ్వు చూడకపోతే ఉండరా? ’’
‘‘గుడిసెలో ముసలమ్మ దగ్గినా బ్యాగ్ పట్టుకొచ్చి ఉచితంగా వైద్యం చేసే డాక్టర్లు 1960 నుంచి దాదాపు 75 వరకు సినిమాల్లో కనిపించే వారు. వేటగాడు కాలం నుంచి అలాంటి మంచి డాక్టర్లు కనిపించడం లేదు. చిరంజీవి సినిమాలో చనిపోయిన శవానికి కూడా చికిత్స చేసిన డాక్టర్ కనిపించాడు. కానీ నువ్వన్న మంచి డాక్టర్లు కనిపించలేదు.? ’’
‘‘ధర్మ రాజు  ఊర్లోకి వెళ్లి చూస్తే, అంతా మంచివాళ్లే కనిపించారట! అదే దుర్యోధనుడికి అంతా చెడ్డవాళ్లే కనిపించారు. మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది’’
‘‘నీ దృష్టికి ఎవరైనా ఉచిత డాక్టర్లు కనిపించారా? ’’
‘‘కనిపించలేదు కానీ ఉన్నారు. లేకపోతే అదో పెద్ద మిస్టరీ అవుతుంది’’
‘‘కోటిన్నరతో సీటు కొనుక్కున్నవాళ్లు. లక్షలు ఫీజులు కట్టి రాత్రింబవళ్లు చదువుకున్న వాళ్లు ఉచితంగా వైద్యం చేయాలని కోరుకోవడం అత్యాశ కాదా? ’’
‘‘మంచి వైద్యుల లెక్కలు తేలుస్తున్నాను అంతే. ఈ లెక్క చూడు’’
‘‘ అరే ఈ అంకెలన్నీ దాచేపల్లి బుక్ డిపో వాళ్లు ప్రచురించిన ఎక్కాల పుస్తకంలోనివి కదా? నా చిన్నప్పుడు మహంకాళి గుడి దగ్గరున్న ఆ షాపులో ఎక్కాల బుక్ కొన్నాను బాగా గుర్తుంది’’
‘‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఉచితంగా పేదలకు వైద్యం చేసే డాక్టర్ల సంఖ్య ఇది. వాళ్లు ఎక్కడున్నారో కనుక్కోవాలి. ఎవరూ కనిపించడం లేదు అంటే ఏదో మిస్టరీ ఉంది. సమాజంలో ప్రతోడు గుమ్మడిలానే పెద్ద మనిషిలా కనిపిస్తాడు కానీ ఎన్టీఆర్‌లాంటి సిఐడి ఉంటే కానీ ఆ గుమ్మడే విలన్ అని తెలియదు.’’
‘‘అర్థం కావడం లేదు’’
‘‘ఎంసెట్ ఫలితాలు వచ్చినప్పుడు పేపర్ చూడు. టాప్ ర్యాంకర్లు పది మంది ఇంటర్వ్యూలో డాక్టర్‌నై పేద ప్రజలకు సేవ చేస్తాను అంటారు. ఈ లెక్కన మెడికల్ విద్య పుట్టినప్పటి నుంచి, ఎంసెట్ పుట్టినప్పటి నుంచి ఏడాదికి పది మంది అంటే ఎంత మంది డాక్టర్లు అవుతారు. ఒక్కో నియోజక వర్గంలో ఎంత మంది ఉంటారు. అని లెక్క తీస్తున్నా, కనిపించడం లేదు అంటే ఏదో మతలబు ఉంది. అదేదో అక్కినేని సినిమాలో చిన్నపిల్లలందరినీ ఎత్తుకెళ్లి మరో ప్రపంచం సృష్టించాలని ప్రయత్నించినట్టు, ఈ ఉచిత డాక్టర్లను విదేశీ శక్తులో, మరో గ్రహంలోని శక్తులో ఎత్తుకెళ్లి ఉంటారని నా అనుమానం’’
‘‘ఏడ్చినట్టే ఉంది ఐనా నీకీ ఐడియా ఎందుకొచ్చింది?’’
‘‘సమాజంలో ఏ వృత్తిలో ఎంత మంది మంచివాళ్లు ఉన్నారని లెక్క తేల్చాలనుకుంటున్నా? ముందు డాక్టర్లతో మొదలు పెడదాం అని’’
‘‘నీ ఇష్టం వచ్చినట్టు మంచివాళ్ల జాబితాలో చేరిస్తే ఊరుకోరు. ఆధునిక సమాజం మంచితనానికి కొన్ని నియమ నిబంధనలు రూపొందించింది. పాత నిబంధనలు వేరు, లెటెస్ట్ నిబంధనలువేరు. ఉదాహరణకు మీ నియోజక వర్గం నేతపై నీ అభిప్రాయం ?’’
‘‘చాలా మంచోడు. ఇక్కడ రోడ్లన్నీ ఆయనే వేయించాడు. మా ఏరియాకు ఆ ఫ్యాక్టరీలు వచ్చాయంటే ఆయన కృషి కారణం. మా పొలాలు పచ్చగా ఉన్నాయంటే ఆయన పుణ్యమే? ఒకప్పుడు కరువు కాటకాలతో ఉన్న మా ప్రాంతానికి సాగునీరు వచ్చింది. వయసు సహకరించక పోటీ చేయలేదు’’
‘‘ ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారు.?’’
‘‘ ఆయనకేం పిల్లలు స్థిరపడ్డారు. మనవళ్లతో కాలక్షేపం చేస్తున్నాడు. ఎవరైనా వెళ్లి సహాయం అడిగితే ఇప్పటికీ మాట సహాయం చేస్తారు. మంచి చెడూ చెబుతారు.’’
‘‘అంటే తినడానికి తిండి లేకపోవడం, గుడిసెలో బతకడం, ఆస్పత్రిలో చికిత్సకు డబ్బు లేకపోవడం వంటి అష్టదారిద్య్రాలు ఏమీ లేవా? ’’
‘‘ఛీ ఛీ ఆయన  శత్రువుకూడా అలాంటి కష్టాలు వద్దు’’
‘‘ఐతే మీ నేతకు మంచివాళ్ల జాబితాలో చోటు దక్కే ప్రసక్తే లేదు. ప్రజాప్రతినిధిగా నియోజక వర్గానికి ఆయన ఏం చేశాడు అనేది అనవసరం ఆయన చివరి దశలో అడుక్కు తింటూ బతకాలి. పట్టించుకునే వారు లేక అనాధలా గుడిసెలో కాలం వెళ్లదీయాలి అలా అయితేనే ఆదర్శప్రాయుడు’’
‘‘తన ఆస్తినంతా ప్రజలకు పంచి పెట్టి పేదరికంలో ఉంటే ఆదర్శం అన్నా... నియోజక వర్గానికి మంచి చేస్తే ఆదర్శం అంటే బాగుంటుంది కానీ .. ఏమీ చేయకపోయినా తినడానికి తిండిలేక కటిక పేదరికంలో బతికితేనే ఆదర్శం అంటే ఇదేం రూల్’’
‘‘హలో ఇది నవ సమాజం తయారు చేసి రూల్స్. అలా అయితేనే మేం ఆదర్శమూర్తిగా గుర్తించి ఆకాశానికెత్తుతాం. లక్షల మందికి ఉద్యోగం కల్పించి, లక్షల కోట్లు సంపాదించడం ఆదర్శం కాదు... ఉత్తమ విద్యార్థులను ఏ టీచరైనా తయారు చేస్తాడు కానీ, పిల్లలను అడవులకు పంపి తాను ఎన్‌కౌంటర్‌లో పోవడమే ఆదర్శం. ఒకప్పుడు పెద్ద పారిశ్రామిక వేత్తగా ఓ వెలుగు వెలిగి మోసపోయి రోడ్డున పడి బాబూ ధర్మం అని అడుక్కుతింటూ ఉంటే ఆదర్శ పారిశ్రామిక వేత్త అంటాం. తల్లిదండ్రులను ఎదిరించి స్కూల్ నుంచి పారిపోయి ఎవడో గన్నయ్యను పోలీస్ స్టేషన్‌లో పెళ్లి చేసుకుని తల్లిదండ్రులను అదే లాకప్‌లో వేయించే వారిది ఆదర్శ వివాహం అని డిసైడ్ చేసేశాం. తానున్న వృత్తిలో ఏం చేశాడు అనేది అనవసరం. ఉచ్చదశలో ఉన్నప్పుడు రోజూ తాగి తందనాలు ఆడి జీవితం పట్ల అవగాహన లేక సంపాదించింది తాగుడుకే ధారపోసినా పరవాలేదు. చివరి దశలో దీనంగా బతికితే చాలు
మా ఆదర్శ సమాజం ఆదర్శమూర్తి అనే ముద్ర వేస్తుంది.’’
‘‘పారిశ్రామిక వేత్త, ప్రజాప్రతినిధి, ఉద్యోగి, ఏ వృత్తిలో ఉన్నా, మనిషిగా ఎవరి బాధ్యత వాళ్లు సక్రమంగా నిర్వహించడం ఆదర్శం అవుతుంది.. కానీ అడుక్కుతింటూ బతికితేనే ఆదర్శం అనే నీ ఆదర్శ సూత్రాలు వింటేనే భయమేస్తుంది? ’’
‘‘నీకు మా ఆదర్శ సమాజంలో అడుగుపెట్టే అర్హత లేదు... పో వెళ్లిపో... భయటకు పో... దుర్మార్గుడా!’’
‘‘భగవంతుడా  నేటి కాలం ఆదర్శమూర్తి ముద్ర పడకుండా మమ్ములను నువ్వే కాపాడాలి’’
-బుద్దా మురళి( జనాంతికం 15. 09. 2017)

8, సెప్టెంబర్ 2017, శుక్రవారం

తెలుగు సినిమా -భాష -కాంగ్రెస్ -చిరంజీవి

‘‘ఇప్పుడెంతో హాయిగా ఉంది. ఏమవుతుందో అనే టెన్షన్‌తో ఇన్నాళ్లూ బుర్ర వేడెక్కింది. ఇ ప్పుడు ఆకాశంలో పక్షిలా విహరిస్తున్నంత హాయిగా ఉంది’’
‘‘దేనికి టెన్షన్? రైళ్లో వచ్చావా? పరీక్షలన్నాక తప్పే వాళ్లూ ఉంటారు. పట్టాలున్నదే తప్పడానికి, అసలు పట్టాలు తప్పినప్పుడే పట్టాలంటూ ఉంటాయని తెలిసేది. దానికి టెన్షన్ ఎందుకు?’’
‘‘రైలు పట్టాలు తప్పితే ఆశ్చర్యపోయేంత అమాయకుడిలా కనిపిస్తున్నానా?’’


‘‘ టెన్షన్ దేనికి? రింగురోడ్డు మీద కారును బస్సు ఢీకొట్టినట్టు వారం రోజుల్లో అదేదో గ్ర హం వచ్చి భూమిని ఢీ కొడుతుంది. అంతా చనిపోతారని వాడెవడో చెప్పిన జోస్యం గురించా?’’
‘‘వారంలో యుగాంతం అని ప్రతి వారం ఎవరో ఒకరు జోస్యం చెబుతూనే ఉంటారు. చిన్నప్పుడు తెగ భయపడేవాడ్ని, ‘నాసా’నో ఇంకేదో కానీ ఐదువేల ఏళ్లలో భూమి అంతరించి పోతుందని ఓ నాలుగు దశాబ్దాల క్రితం ప్రకటించింది. ప్రతి రోజూ నిద్ర పోయేప్పుడు ఐదువేల ఏళ్లలో ఇంకా ఎన్ని సంవత్సరాలు మిగిలి ఉన్నాయని లెక్కపెట్టే వాణ్ణి. ఓ నెల గడిచాక బోర్ కొట్టేసి నేను బతికున్నంత వరకు ఐదువేల ఏళ్లు పూర్తి కావని తెలిసింది. నేను పోయాక కొన్ని వేల ఏళ్ల తరువాత భూమి ఆంతరిస్తే ఇప్పటి నుంచే ఆందోళన అవసరమా? అని నన్ను నేను సముదాయించుకున్నాను. చిన్నప్పుడు ‘నాసా’ చెబితేనే తేలిగ్గా తీసుకున్నా. చిలకజోస్యం వాడు చెబితే పట్టించుకుంటామా? ’’


‘‘రోజూ అబద్ధాలతో నీ బుర్ర వేడెక్కింది. ఇప్పుడు బాబుగారు అన్నీ నిజాలే మాట్లాడాలంటూ కర్తవ్యబోధ చేశారు అందుకే కదా నీలో సంతోషం ’’
‘‘పిచ్చోడా!ప్రతివాడూ ఎదుటి వాడు నిజాలు మాట్లాడాలని కోరుకుంటాడు. ఆ ప్రతివాడిలో నువ్వూ ఉంటావు, నేనూ ఉంటాను బాబూ ఉంటారు. తాను తప్ప అంతా నిజాలే మాట్లాడాలని అనుకోవడంతో ఏతావతా తేలేది ఏమంటే నిజాలు ఎవరూ మాట్లాడరు. రాజుగారింట్లో పెళ్లికి తలో చెంబుడు పాలు తెమ్మంటే ప్రతివాడూ ఎవరు చూడొచ్చారని నీళ్లు పోస్తాడు.. ఆ కథ తెలుసు కదా? ఆ పాల చెంబులోని నీళ్ల లాంటివే నిజాలు. టెక్నాలజీ పెరిగితే- ఊపిరి పీల్చుకోకున్నా బతికే రోజులు వస్తాయేమో కానీ, ఎంత టెక్నాలజీ పెరిగినా రాజకీయాల్లో ఉంటూ నిజాలు మాట్లాడే రోజులు రావు. నీ ప్రశ్న సిల్లీగా ఉంది. అబద్ధాలు లేని ప్రపంచాన్ని ఊహించలేం’’
‘‘అంటే అందరివీ అబద్ధాలేనా?’’


‘‘అష్టాదశ పురాణాల్లో అబద్ధం చెప్పని ఏకైక పాత్ర ధర్మరాజు. చివరకు అతనూ అబద్ధం ఆడాడు. దేవుళ్లే అబద్ధాలు అడందే బతకలేనప్పుడు? ఇక మనిషి ఎంత? రాత్రి ఆలస్యంగా ఇంటికెందుకు వచ్చావని భార్య అడిగిన ప్రశ్నకు నిజాలు మాట్లాడితే బతుకు జడ్కాబండికి చేరుతుంది. రోజా చెంప దెబ్బకొడుతుంది, జీవిత తిడుతుంది. సుమలత ఏడిపిస్తుంది. ఇంటర్వ్యూకని చెప్పి ఎక్కడికెళ్లావురా? అని తండ్రి అడిగినపుడు కొడుకు నిజం చెబితే రోడ్డున పడతాడు. బాస్ అడిగిన వాటికి నిజం చెబితే ఉద్యోగం ఊడుతుంది. అంతెందుకు? ఈ భూమి తన చుట్టూ తాను ఎలా తిరుగుతుందో తెలుసా? అబద్ధం అనే ఇరుసును ఆధారంగా చేసుకుని తిరుగుతుంది. అబద్ధం లేకపోతే జీవితమే కాదు, అసలే భూమి నిలువదు. అంత పవిత్రమైన అబద్ధాన్ని తక్కువ చేయడం అన్యాయం. మన జీవితానికి ఆసరా ఇచ్చే అబద్ధాన్ని ఎప్పుడూ చిన్న చూపు చూడకూడదు. ఓటుకు నోటు కేసులో బాబైనా, కెసిఆరైనా నిజం చెబితే ఇంకేమైనా ఉందా? కేసు భయం, పదవీ గండం ఆయనది, సెక్షన్ 8, ఉమ్మడి రాజధాని, గవర్నర్ చేతిలో శాంతిభద్రతల సమస్య ఈయనది. నిజం ఇద్దరికీ నష్టం.. అబద్ధం ఇద్దరికీ క్షేమం. విన్‌విన్ స్ట్రాటజీ అన్నట్టు. అబద్ధం ఇద్దరినీ గెలిపించి, ఆశలు పెట్టుకున్న జగన్‌ను ఓడిచింది. ఇద్దరం జైలు నేతలమే అని జగన్‌కు చెప్పుకునే చాన్స్ లేకుండా చేశారు’’
‘‘ఐతే హైదరాబాద్ పోలీసులు హత్యాయత్నం చేసిన కేసును పన్నెండు  గంటల్లోనే ఛేదించినందుకా సంతోషం?’’
‘‘నువ్వేక్కడున్నావ్? హైదరాబాద్‌లో జరిగిన సంఘటన హైదరాబాద్‌లో ఉండే పోలీసులు చేధించేందుకు పన్నెండు  గంటలు పట్టింది. కానీ దేశంలో అక్కడెక్కడో హత్య జరిగితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, డిజిపి కూడా ఎవరు చేశారో చెప్పలేదు కానీ వాట్సప్‌లో, ఫేస్‌బుక్‌లో ఐదు నిమిషాల్లో నిందితులు ఎవరో చెప్పడమే కాకుండా శిక్షను కూడా ఖరారు చేశారు. టెక్నాలజీ బాగా పెరిగింది.. నువ్వే చాలా వెనుకబడి ఉన్నావ్’’


‘‘నేనూహించలేను నువ్వే చెప్పేయ్. కొంపతీసి ముఖ్యమంత్రి పిల్లలు కనమని చెప్పారని ఆ పనిలో పడతావే ఏంటి? ’’
‘‘మనకంత అదృష్టమా? అది కాదు కానీ.. కనీసం మనం ఇంకా ఓ 20 ఏళ్లు బతుకుతాం కదా?’’
‘‘ఈ పొల్యూషన్ ఇంత కన్నా పెరగకుండా ఉంటే మందులతో బతకొచ్చు’’
‘‘ఈ 20ఏళ్ల జీవితం ఎలా గడపాలా? అని జీవితంలో చాలా టెన్షన్‌గా ఉండేది. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ, రవితేజ కుమారుడు, పూరీ జగన్నాథ్ కుమారుడు హీరోలుగా నటించేందుకు అంగీకరించారు. ఈ జీవితానికి ఇంకేం కావాలి? మన శేషజీవితం హాయిగా గడిచిపోవడానికి మనమీద కరుణించి వాళ్లు హీరోలుగా నటించేందుకు ఒప్పుకున్నారంటే ఇంత కన్నా అదృష్టం ఏముంటుంది? ఆ వార్త తెలిసినప్పటి నుంచి ఆకాశంలో తేలిపోయినట్టుంది. ఆ తరువాత నాగచైతన్య సమంత సంతానం ఎలాగూ మనల్ని ఆదుకుంటుంది. హీరోలుగా నటించేందుకు ఒప్పుకుంటూ..’


‘‘నీ సంతోషం నీ ఇష్టం. కాంగ్రెస్, తెలుగుసినిమా ఒకే విధంగా ఉందనిపిస్తోంది. ఒకటి వంద దాటింది. ఇంకోటి వందకు చేరువగా ఉంది. రెండూ క్రమంగా క్షీణిస్తున్నాయి. ఆరుపదులు దాటిన  యువ నేతలు, సినిమాల్లో ఆ వయసు వారే హీరోలు. రెండూ ఒకప్పుడు బాగా బతికాయి. కాలం తెచ్చిన మార్పులను అర్థం చేసుకోలేక రెండూ దెబ్బతింటున్నాయి. రెండింటికి వారసులే గుదిబండగా మారారు. అన్ని సినిమాలను హనుమంతన్న ఆదుకోలేడు కదా? ఆ బాబా ఎవరో కాళ్లతో తన్నడమే దీవించడం అట .. పోస్టర్ చింపడమే హనుమన్న దీవెనలు .. సినిమా పోస్టర్ లు చింపడం లో పడిపోయి పార్టీ పోస్టర్ చిరిగిపోతున్న విషయం మరిచి పోతున్నారు  ’’
‘‘కాంగ్రెస్‌కు, తెలుగు భాషకు, తెలుగు సినిమాకు మరణం లేదు.’’
‘‘మరణం లేకపోవడం వేరు, బతకడం వేరు. బతకడం వేరు, బాగా బతకడం వేరు. బతికి బట్టకట్టాలంటే రెండింటికీ కొత్తరక్తం కావాలి. కొత్త ఆలోచనలు కావాలి’’
*బుద్దా మురళి (జనాంతికం 8. 9. 2017) 

1, సెప్టెంబర్ 2017, శుక్రవారం

నువ్వే హీరో.. నువ్వే విలన్

‘‘ ఫ్యాన్స్ గురించి ఏమనుకుంటున్నావ్??’’
‘‘నేను పర్యావరణ ప్రేమికుడిని.. ఏసీలు అస్సలు నాకు నచ్చవు. ఐ లైక్ ఫ్యాన్స్. నువ్వు కూడా ఏసీ వదిలేసి ఫ్యాన్‌ను నమ్ముకో’’
‘‘ నేనడిగింది ఫ్యాన్స్.. అంటే సినీ అభిమానుల గురించి..’’
‘‘జగన్ పార్టీ గుర్తు ఫ్యాన్ గురించా? నంద్యాలలో ఓడిపోయినంత మాత్రాన దిగులెందుకు? మనిషి లాంటి దేవుడు అని పూజలందుకుంటున్న ఎన్టీఆర్‌నే బోల్తా కొట్టించిన ‘గండర గండడు’ అక్కడ జగన్‌కు ప్రత్యర్థి. కవచ కుండలాలు, అధికారం రెండూ కలిసి ఉన్నప్పుడు ఆయన్ని ఢీ కొనడం అంటే ఆషామాషీ కాదు. జగన్ ఇంకా చాలా రాటుదేలాలి. చిన్న వయసే కదా? ’’
‘‘నేనడిగింది హీరోల ఫ్యాన్స్ గురించి’’
‘ఫ్యా న్  హీరోయిన్‌లు, పోర్న్ స్టార్స్‌కూ ఉంటారు. కేరళలో సన్నీలియోన్ ఫ్యాన్స్ ఫొటో చూశావా? సింహగర్జనలు, మహానాడులను మించి జనం కనిపించారు. సన్నీ లియోన్‌ను చూడని కనులు కూడా ఒక కనులేనా? అని కన్నులు విప్పార్చుకుని చూశారు. చెరువుల్లో పడవలపై కనిపించే కేరళ మొత్తం రోడ్డు మీదకు వచ్చిందేమో అనిపించింది.’’
‘‘ఆ ఫ్యాన్స్ వేరు, మన ఫ్యాన్స్ వేరు’’
‘‘నాకైతే పెద్ద తేడా అనిపించలేదు’’
‘‘ఇంతకూ ఫ్యాన్స్‌పై నీ పాలసీ ఏంటో చెప్పనే లేదు’’
‘‘అదే మన్నా కారల్ మార్క్స్ దాస్ క్యాపిటలా? దానిపై మనకో అభిప్రాయం ఏడ్చేందుకు? ఆర్థిక విధానాలు, పాలనా విధానాలు, విప్లవ ఉద్యమాలపై వ్యతిరేకంగానో, అనుకూలంగానో ఓ అభిప్రాయం ఏడుస్తుంది కానీ ఫ్యాన్స్‌పై అభిప్రాయం ఏంటి?’’
‘‘నీ అభిప్రాయం చెప్పాల్సిందే? ’’
‘‘చూడోయ్.. అందమైన రాజకుమారి ముక్కు మీద, పెదవుల మీద కూడా కవిత్వం చేప్పే వాళ్లు పూర్వం కవులు. వాటిని అటూ ఇటూ కాస్త మార్చి కాలేజీ చదువుల కాలంలో క్లాస్‌మేట్ అందంపై కవిత్వం చెప్పే వాళ్లం. ఫ్యాన్స్‌పై చెప్పమంటే ఏం చెబుతాం’’
‘‘చెప్పి తీరాల్సిందే?’’
‘‘అందమైన అమ్మాయి ముఖంపై కవిత్వం చెప్పినట్టు, చిన్న కుర్రాడికి జలుబుతో ముక్కు కారుతుంటే వర్ణించమంటే ఏం వర్ణిస్తాం. వాడి ముక్కు తుడువు తల్లీ.. అని మహా అయితే వాళ్లమ్మకు చెబుతాం ’’
‘‘ఏమీ తెలియని పి ల్లాడినా ? సూటిగా చె ప్పు ?’’
‘‘తెలుగు విప్లవ సినిమాల మాటల రచయిత పరుచూరి బ్రదర్స్ అని ఫ్యాన్స్ గురించి చాలా బాగా చెప్పాడు’’
‘‘ఏం చెప్పాడు? ఫ్యాన్స్ మా దేవుళ్లు అన్నాడా?’’
‘‘ఆ మాట ప్రతి సినిమా పంక్షన్‌లో కామన్‌గా వినిపించే డైలాగు. అది కాదు. ’’
‘‘మరేం చెప్పారు?’’
‘‘నేనే రాజు నేనే మంత్రి అనే అద్భుతమైన సినిమా విడుదలయ్యాక మీలో చాలా మంది రానాకు బానిసలు అవుతారు. గతంలో ఎన్టీఆర్‌కు ఇలానే బానిసలు అయ్యారు. ఇప్పుడు రానాకు బానిసలవుతారు అని చెప్పాడు. సామాన్యులు తిరగబడే కథల సినిమాలంటే తప్పకుండా ఆయన డైలాగులు ఉండాల్సిందే అంతటి సినిమా అభ్యుదయ వాది చెప్పిన తరువాత ఇంకా నేనేం చెప్పాలి?’’
‘‘అంటే బానిసలు అంటున్నావా?’’
‘‘అది నా మాట కాదు. నేనే రాజు నేనే మంత్రి ఫంక్షన్‌లో పరుచూరి అన్న మాట చెప్పాను. యూ ట్యూబ్‌లో వెతుకు.. దొరుకుతుంది. ఎన్నో దశాబ్దాల సినిమా అనుభవం ఉన్న ఆయన ఆ మాట అన్నాడంటే అబద్ధం ఎందుకవుతుంది? ఎంతో మంది బానిసలను చూసిన తరువాతే ఆ మాట అన్నాడనుకుంటున్నాను’’
‘‘డొంక తిరుగుడుగా వద్దు సూటిగా చెప్పు.. భయపడుతున్నావా? బానిసలు అంటూనే భయమెందుకు?’’
‘‘మళ్లీ చెబుతున్నా.. నేను అనని మాటను నాకు అంటగట్టొద్దు. కళామతల్లి ముద్దు బిడ్డ చెప్పిన మాటలు గుర్తు చేశా అం తే. నీ ఉద్దేశంలో బానిసలు అంటే ఏమీ చాత కాక ఓ మూలన కూర్చునే వాళ్లు అనుకుంటున్నావా? రాజ్యాలను ఏలిన బానిస రాజ కుటుంబాలు కూడా ఉన్నాయి తెలుసా? రాజుల కాలం వరకు ఎందుకూ అనుకుంటే మనం చూశాం కదా? డేరా బాబా భక్తి బానిసల వీరత్వం. ఒక నేరస్తుడిని కోర్టుకు తీసుకు వేళ్లేందుకు కూడా ప్రభుత్వాలు గజగజ వణికిపోయేట్టు చేశారు బాబా బానిసలు. కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులను ద్వంసం చేశారు. పూరి సినిమాలో హీరోతో సమాన స్థాయిలో విలన్ ఉన్నట్టు హీరోను మించిన బలవంతులు బానిసలు. డేరాబాబా కోర్టులో కన్నీళ్లు పెట్టుకుని క్షమించి శిక్ష తగ్గించండి అని విలపిస్తే ఆయన బానిసలు మాత్రం ధైర్యంగా బీభత్సం సృష్టించారు. బాబా కన్నా బాబా బానిసలే శక్తిమంతులు. ప్రభుత్వం బాబా కన్నా బాబా బానిసలకే ఎక్కువ భయపడింది. బానిసకు ఆలోచన తక్కువ కావచ్చు కానీ ధైర్యం ఎక్కువ. స్వాతంత్య్రం కోసం సుభాష్ చంద్రబోస్, భగత్‌సింగ్ లాంటి వారు సాయుధ పోరాటం సాగించిన కాలంలోనే బ్రిటీష్ చల్లని పాలనలోనే ఉంటాం బానిసత్వం మా నర నరాన జీర్ణించుకున్నాం. మా నుంచి బానిసత్వాన్ని దూరం చేయకండి బ్రిటీష్ పాలనే ఉండాలని మహా గ్రంధాలు రాసిన వారూ ఉన్నారు. ప్రతి చోట, ప్రతి అంశంలో వీరోచిత పోరాటాలు చేసిన వారున్నట్టే, మేం బానిసత్వంలోనే ఉంటాం అని అంత కన్నా వీరోచితంగా పోరాడేవాళ్లు ఉంటారు.’’
‘ఫ్యాన్  గురించి అడిగింది తప్ప- నువ్వు అన్నీ చెప్పావు...?’’
‘భగవంతుడు అనుకో,  ప్రకృతి అనుకో ఎవరినీ బానిసగా పుట్టించదు. ఎవరైనా స్వతంత్రుడిగానే పుడతారు. క్రమంగా వయసు పెరిగే కొద్ది నీకు నీవే బంధాలు వేసుకుని ఏవో ఆలోచనలకో, బాబాలకో, నటులకో బానిసవు అవుతావు. నీలోనే హీరో, విలన్, బానిస అందరూ ఉంటారు. ఎవరిని ప్రోత్సహిస్తే వారిగా నువ్వు మారుతావు. అబద్ధం ఎందుకు కానీ.. బద్ధకంలో ఉన్నంత ఆనందం బానిసత్వంలోనూ ఉంటుంది. సొంతంగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. సొంత గుర్తింపు కోసం శ్రమించాల్సిన పని ఉండదు. సొంత ఆలోచనలు ఉండవు. ఎవరికి బానిసగా ఉంటే వారి ఆలోచనలే మన ఆలోచనలు, వారి గుర్తింపే మన గుర్తింపు.’’
‘‘ అది తప్పంటావా? ’’
‘‘నువ్వు బానిసగా పుట్టలేదు. బాబాలు, హీరోలు పుట్టినట్టే నువ్వూ పుట్టావు. నీ జీవితానికి నువ్వే హీరో, నువ్వే విలన్. నీ పుట్టుకకు ప్రత్యేకత ఉంది అనుకుంటే అదేంటో అనే్వషించు. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అలవాటు చేసుకో.. నీకు నువ్వే ఫ్యాన్ అవుతావు. నీ కన్నా మించిన హీరో ఎవరూ లేరు. నువ్వే నీ జీవితానికి ముఖ్యం. ఆ తరువాతే ఎవరైనా.. అది కష్టం అనుకుంటే బుర్రకు విశ్రాంతి ఇచ్చి ఏ బాబానో, హీరోనో నమ్ముకో. ’’
*బుద్ధా మురళి (జనాంతికం 1. 9. 2017)

26, ఆగస్టు 2017, శనివారం

అనైతిక బాధ్యత..

‘‘హాయ్ రాధా.. నీకు నిండా నూరేళ్లు.. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను.. ఇంతలోనే నువ్వు కాల్ చేశావు’’
‘‘గోపీ.. నీకో అర్జంట్ విషయం చెప్పాలి. తొందరగా వచ్చేయ్!’’
‘‘ బిజీగా ఉన్నాను రాధా.. ఫరవాలేదు. ఫోన్‌లోనే చెప్పేయ్ విషయం ఏంటో?’’
‘‘నేను నెల తప్పాను గోపీ’’
‘‘పోనీ రాధా వందేళ్లలో ఓ నెల తగ్గితే పెద్ద తేడా ఏముంటుంది? ఇంతోటి దానికి ఫోన్ చేసి చెప్పాలా?’’
‘‘అబ్బా అది కాదండి.. నేను తల్లిని కాబోతున్నాను’’
‘‘టీవి సీరియలా? నాటకంలోనా?’’
‘‘కాదు గోపీ.. నీ బిడ్డకు తల్లిని కాబోతున్నాను’’
‘‘ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అని నాకింకా పెళ్లే కాలేదు నా బిడ్డకు నువ్వు తల్లివి కావడం ఏంటి రాధా?’’
‘‘మట్టి బుర్ర ఇంకెలా చెప్పాలి? మనమిద్దరం ప్రేమించుకున్నాం కదా? నేను కాలు జారాను ’’
‘‘కాలు జారితే ఫాక్చర్ అవుతుంది కానీ తల్లివి కావడమేంటి?’’
‘‘అబ్బా.. మనం ప్రేమించుకుని చెట్టా పట్టాలేసుకుని తిరిగాం కదా? వర్షం కురిసిన ఆ రాత్రి హద్దులు దాటాం.. ఇప్పుడు నెల తప్పాను... అదీ విషయం’’
‘‘ఓహో ఇదా.. ఇంత సింపుల్ విషయాన్ని ఎంత కాంప్లికేట్ చేశావ్ రాధా? నువ్వేప్పుడూ ఇంతే?’’
‘‘అంటే నేనేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కదా? మీ అమ్మానాన్నలను ఒప్పిస్తావు కదా?’’
‘‘చూడు రాధా.. నేనసలే నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చే వాడిని.. ఇంట్లో వాళ్లను ఒప్పించాల్సిన అవసరం లేదు. నువ్వు తల్లివి కావడానికి నైతిక బాధ్యత వహిస్తున్నాను’’
‘‘మరి మన పెళ్లెప్పుడు?’’
‘‘ పెళ్లికి, దీనికి సంబంధం ఏంటి రాధా? నైతిక బాధ్యత వహిస్తూ ‘రాధా ప్రియుడు’ అనే నా హోదాకు రాజీనామా చేస్తున్నాను. ఇప్పటి నుంచి నీకూ నాకూ ఎలాంటి సంబంధం లేదు’’
‘‘గోపీ’’
‘‘ప్రియుడి హోదాకు రాజీనామా చేసిన తరువాత నువ్విలా పరాయి మగవాడితో మాట్లాడడం అనైతికం. నైతిక బాధ్యత వహిస్తూ కాల్ కట్ చేస్తున్నాను’’
***
‘‘ఏరా బుడంకాయ్.. హోంవర్క్ చేసుకు రాకపోతే క్లాస్‌లోకి రానివ్వను అని చెప్పాను కదా? ఐనా ఎందుకు చేయలేదు?’’
‘‘కార్టూన్ నెట్‌వర్క్ చూస్తూ రాత్రంతా మేలుకున్నా టీచర్. హోంవర్క్ చేయనందుకు నైతిక బాధ్యత వహిస్తూ క్లాస్ నుంచి వెళ్లి పోతా’’. ‘‘ఏరా తిక్క తిక్కగా ఉందా?’’
‘‘మీకు పిల్లలంటే చిన్న చూపు టీచర్. నాలాంటి పిల్లకాయలు నైతిక బాధ్యత వహిస్తే ఓర్వలేరు. మీకు కుళ్లు’’
***
‘‘ఏంటండీ.. అంతగా సంతోష పడుతున్నారు.. మాకు చెబితే మేమూ సంతోషిస్తాం కదా?’’
‘‘చూడోయ్.. ఈ కాలంలో వార్డు మెంబర్‌గా గెలిచినోడు కూడా పదవి పట్టుకుని వేలాడుతాడు. పదవి తోనే పైకి పోవాలనుకుంటాడు కానీ ప్రపంచంలో కెల్లా అత్యంత పెద్దదైన భారతీయ రైల్వేకు మంత్రిగా ఉండి నైతిక బాధ్యత వహించి పదవి వదులు కోవడం అంటే మాటలా? మా కాలంలో లాల్ బహుద్దూర్ శాస్ర్తీ ఇలా చేశాడని మా నాన్న ప్రతి సారీ చెప్పేవాడు. సురేష్ ప్రభు అని మన జనరేషన్ గర్వంగా కాలరెత్తుకునేట్టు చేశాడు. ఈ కాలంలోనూ అంత గొప్ప నాయకుడు ఉన్నందుకు ఆనందంతో నా కళ్లు చెమ్మగిల్లాయి. సంతోషంతో ఆకాశంలో తేలిపోతున్నాను.’’
‘‘తెలియక అడుగుతున్నాను. మొన్న మనం ఫ్లైట్ ఎక్కాం కదా? ఎయిర్ హోస్టేస్ తన బాధ్యత సరిగా నిర్వర్తించలేదునుకో, పైలట్ నైతిక బాధ్యత వహించి విమానాన్ని మధ్యలోనే వదిలేసి తాను మాత్రం ప్యారాచూట్‌తో కిందికి దిగిపోతే ఎలా ఉంటుంది? ’’
‘‘ఇదేం తలతిక్క ప్రశ్న? ప్రయాణీకులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడం పైలట్ బాధ్యత. మధ్యలో వదిలేసి దూకేయడం నైతిక బాధ్యత ఎలా అవుతుంది? ’’
‘‘మరి ఇది కూడా అంతే కదా? రైల్వే మంత్రిగా రైల్వేను సమర్ధవంతంగా నడపడం బాధ్యత అవుతుంది కానీ ప్రమాదాలు జరగ్గానే రాజీనామా చేయడం నైతిక బాధ్యత ఎలా అవుతుంది?’’
‘‘తెలియకుండా మాట్లాడకు.. లాల్ బహద్దూర్ శాస్ర్తీ కాలం నుంచి వచ్చిన సంప్రదాయం తెలియకుండా మాట్లాడకు’’
‘‘తెలియకపోవడం వల్లే కదా? మిమ్ములను అడుగుతున్నది. లాల్‌బహుద్దూర్ శాస్ర్తీ రైల్వే ప్రమాదాలకు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశాక రైలు ప్రమాదాలు నిలిచిపోయాయా? ’’
‘‘అలా ఎందుకు నిలిచిపోతాయి. ప్రయాణం అన్నాక ప్రమాదాలు సహజం’’
‘‘మరి రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు రోడ్ల శాఖ మంత్రి, బస్సు ప్రమాదాలు జరిగినప్పుడు రవాణా శాఖ మంత్రి ఇలా రోజూ మంత్రులంతా నైతిక బాధ్యత వహించి రాజీనామాలు చేస్తే భలే ఉంటుంది కదా? దేశం మొత్తం నైతిక పరిమళాలు గుబాళిస్తాయి ’’
‘‘తలతిక్కగా మాట్లాడకు.. రైలు ప్రమాదాలు చాలా తక్కువగా జరుగుతాయి కాబట్టి నైతిక బాధ్యతగా రైల్వే మంత్రిని రాజీనామా చేయమంటారు. అదే బస్సు ప్రమాదం జరిగితే రవాణా మంత్రి నైతిక బాధ్యత వహించాలి అంటే రోజుకు ఆరుసార్లు రాజీనామా చేయాలి.’’
‘‘నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. రైల్వే మంత్రి రాజీనామా చేస్తే రైల్వే ప్రమాదాలు ఆగిపోతాయా? నెహ్రూ కాలం నుంచి మోదీ కాలం వరకు రైల్వే మంత్రులంతా ఇలా నైతిక బాధ్యత వహించి రాజీనామాలు చేశారు కదా? ప్రమాదాలు ఎందుకు నిలిచిపోలేదు?’’
‘‘తెలియకుండా మాట్లాడకు.. నైతిక బాధ్యత అనేది చాలా బాధ్యతతో కూడిన వ్యవహారం.. అల్లాటప్పా వాళ్లకు అర్థం కాదు’’
‘‘రైల్వే మంత్రిగా రాజీనామా చేశాక లాల్ బహద్దూర్ శాస్ర్తీ ఏకంగా ప్రధాని అయ్యారు. రైల్వే ప్రమాదాలకు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసిన నితీష్ కుమార్, మమతా బెనర్జీ ఏకంగా ముఖ్యమంత్రులు అయ్యారు. అందుకేనేమో సురేష్ ప్రభు రాజీనామా చేస్తానంటే మోదీ వద్దే వద్దు అన్నారు.’’
‘‘నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసినా తప్పేనా?’’
‘‘బాధ్యతను సక్రమంగా నిర్వహించడం నైతిక బాధ్యత అవుతుంది కానీ తప్పించుకోవడం కాదు. ప్రేమించి తప్పించుకున్నవాడికి, బాధ్యతను మధ్యలో వదిలేసినోడికి తేడా లేదు. రైల్వేలో కింది నుంచి పైస్థాయి వరకు పేరుకు పోయిన నిర్లక్ష్యాన్ని చాలెంజ్‌గా తీసుకుని శుభ్రం చేయడం నైతిక బాధ్యత అవుతుంది కానీ పారిపోయి మరో పదవి తీసుకోవడం నైతిక బాధ్యత అనిపించుకోదు.’’ *
-బుద్దా మురళి(జనాంతికం 25. 8. 2017)

18, ఆగస్టు 2017, శుక్రవారం

ఇది శకుని వజ్రాయుధం..!

‘‘ప్రధాని మోదీ స్విస్ బ్యాంక్‌లో నల్లధనం దా చుకునే అవకాశం లేకుండా చేశాడని అంతా అంటున్నారు. నిజమేనా? ’’
‘‘బీడీ కొట్లో అప్పు తీర్చలేదని ఆ సాయిబు, టిఫిన్ తిని డబ్బులివ్వలేదని ఉడిపి హోటల్ వాడు తిడుతున్నారు. ముందు వాళ్ల సంగతి చూడు’’
‘‘అమెరికాలో కాసినోవా గురించి ఆలోచిస్తుంటే, నువ్వు పాన్ డబ్బా గురించి మాట్లాడుతున్నావ్. ఆఫ్టర్ వన్ అండ్ ఆఫ్ ఇయర్‌లో మేం ఎక్కడో ఉంటాం .  పాన్ షాపునే పీకించేసి ఆ ల్యాండ్ మొత్తం ఆక్రమించుకుని అక్కడ పెద్ద అపార్ట్‌మెంట్ కట్టి చూపిస్తా’’
‘‘ఏంట్రోయ్.. లాటరీ టికెట్ ఏమన్నా కొన్నావా? ఏంటి?’’
‘‘అధికారం తలుపుతట్టే మాస్టర్ ప్లాన్ వేశాం’’
‘‘ఎక్కడ తెలంగాణలోనా? ఆంధ్రాలోనా? ’’
‘‘ప్రస్తుతానికి తెలంగాణలోనే, తర్వాత  ఆంధ్రాలో.’’
‘‘కలలు కనండి అని అబ్దుల్ కలాం చెప్పిన మాట బాగానే ఆచరిస్తున్నారు.’’
‘‘ఎవరి పిచ్చి వారికి, ఎవరి ఆలోచన వారికి మాస్టర్ ప్లాన్‌లానే ఉంటుంది.’’
‘‘ఇది చూడు.. మా లీడర్ ఆమరణ నిరాహారదీక్ష పోస్టర్. మనమే ప్రింట్ చేయించాం.. దీని వెనుక పెద్ద ప్లాన్ ఉంది.’’
‘‘పోస్టర్ అతికించడానికి గోడ కావాలి కానీ.. ప్లాన్ ఏంటి?’’
‘‘జోకులొద్దు. ?’’
‘‘ఒక జిల్లాలో మెడికల్ కాలేజీ కోసం దీక్ష అంటే ఇక్కడొకరు,అక్కడొకరు ఎందుకు? అన్ని నియోజక వర్గాల వారు ఒకేసారి మెడికల్ కాలేజీల దీక్ష చేయవచ్చు కదా?’’
‘‘అసలు ముందు దీనికి ప్లాన్ వేసిందే మా  బాస్. పోస్టర్ బయటకు లీకై ఇతర నాయకులు ఫాలో అవుతున్నారు. మా ప్లాన్ ప్రకారం ముందు రాష్ట్రంలో అన్ని నియోజక వర్గాల్లో, తరువాత ఆంధ్రలో, తరువాత దేశమంతా నియోజక వర్గాల్లో మెడికల్ కాలేజీ దీక్షలు సాగించాలి. ఈ దెబ్బతో మేం అధికారంలోకి వస్తాం’’
‘‘ఈ లోపు లోకల్ బాడీస్ ఎన్నికలు వస్తాయి. సర్పంచులు మా గ్రామంలో మెడికల్ కాలేజీ అని దీక్షలు చేస్తారేమో’’
‘‘చూశావా? ప్లాన్ వర్కవుట్ అవుతుందని నీక్కూడా అర్థమైంది. ఈ పోస్టర్లు గోడలకు అం టించే కాంట్రాక్టు, అధికారంలోకి వచ్చాక లక్షల కోట్ల కాంట్రాక్టులు మనవే. అందుకే వన్నండాఫ్ ఇయర్ వెయిట్ చేయమంటున్నాను. ఎలా ఉంది ఐడియా?’’
‘‘ఇది మీ ఐడియా పార్టీలో కనీసం రెండు వందల మంది సిఎం అభ్యర్థులు ఉంటారు కాదా? ఒక్కొక్కరికి సిఎం కావడానికి ఓ ఐడియా ఉంటుంది ?’’
‘‘ఔను!ఐతే అలా నవ్వుతావేం. నూటా పాతికేళ్ల అనుభవం ఉన్న వాళ్లం ఏం చేయాలో బాగా తెలుసు. నవ్విన నాప చేనే పండుతుంది. బిజెపి చరిత్ర గురించి తెలుసా? 1984లో దేశం మొత్తంలో రెండే రెండు సీట్లు బిజెపి గెలిచింది. మరిప్పుడు మూడు దశాబ్దాల తరువాత సొంత బలంతో అధికారంలోకి వచ్చింది. ఇందిరాగాంధీ ఓడిపోతే అంతా అయిపోయింది అనుకున్నారు. రెండేళ్లు గడిచాక ఆదే ఇందిరాగాంధీ హవాలో జనతా కకావికలైంది. టిడిపి నాతోనే పుట్టింది నాతోనే పోతుంది అని చెప్పిన ఎన్టీఆర్ పోయిన తరువాత కూడా ఆంధ్రలో టిడిపి అధికారంలో ఉంది. ఆంధ్రలో అస్సలే లేమని, తెలంగాణలో అధికారంలోకి రామని కలలు కంటున్నావేమో? మెడికల్ కాలేజీల ప్లాన్ ఆరంభం మాత్రమే, తరువాత వజ్రాయుధం ప్రయోగిస్తాం. రెండు రాష్ట్రాల్లో అధికారం కోసం ప్లాన్ గీయిస్తున్నాం’’
‘‘మీ పార్టీలో  సీరియస్ గా ప్రయత్నించే సిఎం అభ్యర్థులు రెండు వందల మంది. ఉంటారు ఇస్తే చేస్తాం అనే వారు ఇంకో రెండు వందల మంది ఉంటారు .. అంతా  కలిసి ఒక ప్లాన్ గీస్తే ఓకే.. కానీ రెండు వందల మందికి నాలుగు వందల ప్లాన్లు ఉంటాయి. దూకుడు సినిమాలో ధర్మవరపు సుబ్రమణ్యం విలన్‌తో అంటాడు చూడు మీరు ఎవరికి వారు గేమ్ ఆడుతున్నామనుకుంటే ఆ బాబు మీ అందరితో గేమ్ అడుకుంటున్నాడు.. అని. ఇక్కడ అదే జరుగుతోంది. మీ గేమ్ మీరు ఆడుకుంటున్నారు కానీ- ఆ సిఎం మిమ్ములను నిండా ముంచే గేమ్ ఆడుతున్నాడు. తెలంగాణ సాధించిన ఆ గేమ్ ప్లాన్ ముందు గడ్డాలు పెంచి, దీక్షలు చేసే ప్లాన్‌లు నిలుస్తాయా?’’
‘‘వజ్రాయుధం ఇంకా మా అమ్ములపొదిలోనే ఉంది అది ప్రయోగించామంటే బ్రహ్మ రుద్రాదులు కూడా మేం అధికారంలోకి రావడాన్ని ఆపలేరు’’
‘‘ఏంటో ఆ తిరుగులేని వజ్రాయుధం?’’
‘‘ఆ ఆయుధానికి తిరుగు లేదు. రెడ్డి రాజుల స్వర్ణ యుగం మళ్లీ చూడబోతున్నాం. కోటి ఎకరాలకు సాగునీరు, ప్రతి గొంతుకూ తాగునీరు, వృద్ధాప్య పెన్షన్‌లు.. ఏవీ వజ్రాయుధం ముందు పని చేయవు’’
‘‘అదేంటో చెప్పవచ్చు కదా?’’
‘‘కులం’’
‘‘ఏనుగు ఏదో అనుకుంటే తుస్సుమనిపించింది అన్నట్టు. ఎన్నికలు పుట్టక ముందు నుంచే కులం పుట్టింది. ప్రజాస్వామ్య వ్యవస్థ కన్నా రాజకీయాల్లో కులం వయసు ఎక్కువ. పాత టెక్నికే కదా?’’
‘‘పూర్తిగా విను. అరశాతం ఉన్న వెలమలు ఎలా పాలిస్తారు? అని జనం లోకి బలంగా వెళితే?’’
‘‘అరశాతం వాళ్లు మూడేళ్లు పాలిస్తేనే తట్టుకోలేక మూడు దశాబ్దాల పాటు పాలించిన రెండుశాతం వాళ్లు రెడ్డిరాజ్యం తెస్తామని  ప్రజలకు చెబుతారా?’’
‘‘వంకర టింకరగా మాట్లాడకు.. ప్రపంచంలో ఏ పార్టీలో ఉన్నా ఏకమై  రెడ్డి రాజ్యం అనే వజ్రాయుధం ప్రయోగిస్తే దాని ముందు ఎవరూ నిలువలేరు. ’’
‘‘సరే నువ్వు చెప్పిన లెక్కలోకే వస్తాను. రాష్ట్రంలో 50 శాతం మంది బిసిలు, 16శాతం ఎస్సీలు, 14శాతం మైనారిటీలు, పది శాతం ఎస్‌టిలు. 90 శాతం పోతే మిగిలిన పది శాతంలో రెడ్డి,కమ్మ,వైశ్య, వెలమ, బ్రాహ్మణ ఇతర కులాలు ఉన్నాయి. ఏదో వాదన కోసమే ఐదు కులాలే అనుకున్నా సగటున రెండు శాతమే కదా? రెండు శాతం ఏకమై ఒకవైపు చేరితే మిగిలిన 98 శాతం మంది ఏకం కావచ్చు కదా?’’
‘‘ఇది మా ఇంటర్నల్ ప్లాన్.. బయటకు తెలియదు’’
‘‘ ఉప్పు నిప్పు లాంటి వేరువేరు పార్టీల్లో ఉంటూ ఇంత కాలం బాహాబాహీగా తిట్టుకున్న నాయకులు , పార్టీ కండువాలు పక్కన పెట్టి  పార్టీలతో అతీతంగా మనం రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలి అని తీర్మానించుకున్న సంగతి రహస్యమేమీ కాదే’’
‘‘ప్రజలు ఏ రోజు వార్త ఆ రోజే మరిచిపోతారు’’
‘‘మహాభారతం కథ విన్నావా?’’
‘‘విన్నాను. మా ప్లాన్‌కు, మహాభారతానికి సంబంధం ఏంటి?’’
‘‘మహాభారతంలో అంతా శ్రీకృష్ణున్ని ఇష్టపడతారు కానీ స్వయంగా శ్రీకృష్ణుడికి కూడా నచ్చిన పాత్ర శకుని. ఒక్క శకుని పగ మొత్తం కురువంశాన్ని నాశనం చేసింది.’’
‘‘ఔను.. అయితే..?’’
‘‘మీ ప్లాన్ వింటే నాకెందుకో శకుని గుర్తుకు వచ్చాడు. రాజ్యం చేతిలోకి వచ్చే వ్యూహం అని చెప్పి శకుని మొత్తం కురువంశాన్ని నాశనం చేసి ప్రతీకారం తీర్చుకుంటాడు.’’
‘‘???? అంటే ?’’
‘‘నేను సిఎం అయ్యే అవకాశం లేనప్పుడు పార్టీ ఉంటే ఎంత లేకుంటే ఎంత అని రెండు వందల మంది అభ్యర్థులు శకునిని ఆవహింపజేసుకున్నారేమో?’’
‘‘రెండు శాతం కోసం పరితపించి 98 శాతం జనాలకు దూరమయ్యే అలోచన మీరు మాత్రమే చేయగలరు.’’
‘‘ఇంతకూ మా శకుని ఎవరు?’’
‘‘
రెండు సీట్ల నుంచి బీజేపీ అధికారం లోకి వచ్చిన విషయం స్ఫూర్తి తో తొలుత రెండు రాష్ట్రాల్లో రెండేసి సీట్లు గెలిచే వ్యూహాలు పన్నుతున్నారేమో అనిపిస్తుందిమహాభారతం ఒక్క శకునినే భరించలేకపోయింది. ఒకరా? ఇద్దరా? వందల మంది శకునిలు. అది వజ్రాయుధమే. కానీ ఇంద్రుని చేతిలో కాదు శకుని చేతిలోని వజ్రాయుధం. కాలం మారింది మీరూ మారాలి..  ..  ’’
*
-బుద్దా మురళి(జనాంతికం 18. 8. 2017)

11, ఆగస్టు 2017, శుక్రవారం

నా కళ్లు తెరిపించావు బాబూ..!‘‘వారానికో సినిమా.. రెండున్నర గంటల సినిమాను ఆ డైలాగు కోసమే వెళ్లి సినిమా అయిపోగానే- వచ్చే వారం కోసం రోజులు లెక్కించడం... జీవితంలో మరిచిపోలేని అనుభూతి’’
‘‘ఏ డైలాగు? ఏ సినిమా?’’
‘‘అన్ని సినిమాల్లో కామన్‌గా ఉండేది. ఆ డైలాగు కోసమే చిన్నప్పుడు సినిమాలకు వెళ్లే వాడిని.. ఇప్పుడు పాత సినిమాలు ఆ డైలాగు కోసమే చూస్తున్నాను. ఇప్పుడా డైలాగు సినిమాల్లో మాయమై జీవితంలో వినిపిస్తోంది.’’
‘‘ఎప్పుడొచ్చామన్నది కాదు.. బుల్లెట్ దిగిందా? లేదా? అనే పవర్‌ఫుల్ డైలాగుల కాలంలో కూడా నువ్వు ఆ పాత డైలాగు గురించి ఇంతగా చెబుతున్నావంటే అది ఎస్‌వి రంగారావు డైలాగే కదా? ’’
‘‘కాదురా..గూట్లే ...  ఈ డైలాగు మాత్రం ఎస్వీఆర్‌దే’’
‘‘ఎస్వీఆర్‌ది కాకపోతే ఇంకెవరిది? ’’
‘‘అసలు విలనే లేని గుండమ్మకథ సినిమాలో సూర్యకాంతం మొదలుకొని ఆనాటి విలన్లు అందరికీ ఇది కామన్ డైలాగు’’
‘‘అదే.. ఏంటా డైలాగు?’’
‘‘చివర్లో సూర్యకాంతం నా కళ్లు తెరిపించావు బాబూ అని సావిత్రిని కన్నబిడ్డలా చూసుకోవడం గుర్తుందా? ’’
‘‘ఒక్క సూర్యకాంతం అనే కాదు ఎస్‌విఆర్ నుంచి రాజనాల, ఆర్.నాగేశ్వర్‌రావు, ముక్కామల, ప్రభాకర్‌రెడ్డి,నాగభూషణం, గుమ్మడి, రావుగోపాలరావు వరకు విలన్లు అందరూ సినిమా చివరి ఫైట్ తరువాత పోలీసులు వచ్చి ‘యువర్ అండర్ అరెస్టు’ అన్నాక పశ్చాత్తపంతో- ‘నువ్వు నా కళ్లు తెరిపించావు బా బూ’ అంటూ హీరో ముందు ఈ డైలాగు చెప్పిన వారే.’’
‘‘ఔను.. చివర్లో ఈ డైలాగు చెప్పించేందుకే రెండున్నర గంటల సినిమా తీసేవారేమో అనిపించేది. ఆ కాలం విలనే్ల వేరు.. చివర్లోనే వాళ్లు కళ్లు తెరిచే వారు. కానీ ఇప్పుడు హీరోలు వారికా చాన్స్ ఇవ్వడం లేదు. విలన్లు కూడా కళ్లు తెరిపించుకోవడానికి సిద్ధంగా లేరు. హీరో చేతిలో చావు తప్ప వారికి మరో మార్గం లేకుండా పోయింది. ’’
‘‘చివరకు ధర్మమే గెలుస్తుంది అనే నమ్మకం బహుశా సినిమా చివర్లో వినిపించే ‘నా కళ్లు తెరిపించావు బాబూ’ అనే డైలాగు వల్ల మన నర నరాల్లో జీర్ణించుకు పోయిందనుకుంటాను’’
‘‘ఎన్ని సినిమాల్లో రాజనాల నా కళ్లు తెరిపించావు అని కాంతారావు ముందు చెప్పలేదు. కానీ, పాపం.. చివరి రోజుల్లో దయనీయమైన స్థితిలో చేరుకున్న తరువాత కానీ ఆ ఇ ద్దరూ కళ్లు తెరవలేదు. అప్పటికే అంతా అయిపోయింది.’’
‘‘కోట్లాది మంది సా మాన్యులకూ కళ్లు మూసేప్పుడే కళ్లు తెరుచుకుంటాయి. వృద్ధాశ్రమంలో ఉన్న తల్లితండ్రులు నా కళ్లు తెరిపించావు బాబూ.. అనే డైలాగు కుమారుడి ముందు చెప్పాలని ఉన్నా, వాళ్లకా అదృష్టం లేకుండానే కళ్లు మూసేస్తున్నారు ’’
‘‘హీరో ముందు విలన్ ఆ డైలాగు చెప్పడం కన్నా ప్రతి రోజూ మనకు మనం ఆ డైలాగు చెప్పుకుంటే చివరి రోజుల్లో చెప్పాల్సిన అవసరం ఉండదేమో’’
‘‘మన సంగతి వదిలేయ్.. క్రియాశీలక రాజకీయాల నుంచి విరమించే సమయంలో వెంకయ్యనాయుడుకు కళ్లు తెరుచుకున్నాయట! ’’
‘‘ఏం మాట్లాడుతున్నావ్? చిన్నప్పటి నుంచి రాజకీయాలను నమిలి మింగేసిన ఆయన ఇప్పుడు కళ్లు తెరుచుకోవడం ఏంటి? ’’
‘‘రాజకీయ వీడ్కోలు సత్కార సభల్లో ఆయనే స్వయంగా చెబుతున్నారు కావాలంటే ఇదిగో చదువు. నీతి నిజాయితీలే ఊపిరిగా బతికానని, రాజకీయాల్లో ఒక్క రూపాయి కూడా సంపాదించలేదంటున్నారు. ’’
‘‘ఈ రోజుల్లో హోటల్‌లో రూపాయి టిప్ ఇచ్చినా దానికి ఓ పది రూపాయలు జత చేసి మనకే ఇచ్చేట్టున్నారు. రైతు బజార్లో కరివేపా కు అమ్మే వాళ్లు కూడా రూపాయి తీసుకోవడం లేదు. ’’
‘‘నిజంగా నీతిని తిం టూ నిజాయితీని పీలుస్తూ బతికిన తనపై కూడా ఆరోపణలు వచ్చినప్పుడు రాజకీయాలు ఇంతగా దిగజారాయా? అని ఆశ్చర్యపోయినట్టు క్రియాశీలక రిటైర్‌మెంట్ సభల్లో వెంకయ్య చెబుతున్నారు. ఆ రోపణలు రాజకీయాల అసలు రూపం చూపించాయన్నమాట. అంటే ఆయనకు కళ్లు తెరిపించినట్టే కదా? ’’
‘‘ఆయనే కాదు.. మహామహా నాయకులు ఎంతో మంది చివరి రోజుల్లోనే కళ్లు తెరుచుకున్నారు. దాదాపు అన్ని సినిమాల్లో ఎన్టీఆర్ హీరోగా విలన్లతో ‘నా కళ్లు తెరిపించారు బాబూ’ అనిపించుకున్నారు. కానీ, పాపం.. రాజకీయ నిజ జీవితంలో మాత్రం ఎన్టీఆర్ చివరి డైలాగు నా కళ్లు తెరిపించావు ‘బాబూ’- అని అల్లుడిని తలుచుకుని మనసులోనే అనుకున్నారు. అప్పటికీ అంతా అయిపోవడం, కాళ్లు మొక్కిన వాళ్లు కాళ్లు లాగేయడంతో మంచాన పడి విలవిలలాడిపోయారు.’’
‘‘ఏదేమైనా అతి తక్కువ కాలంలో కోట్లాది మంది భారతీయు కళ్లు తెరిపించింది మాత్రం ముమ్మాటికీ బిజెపినే?’’
‘‘అంత హఠాత్తుగా మోదీపై ప్రేమ పుట్టుకొచ్చిందేమిటి? కళ్లు తెరిపించడం ఏమిటి? ’’
‘‘బిజెపి డిఫరెంట్ పార్టీ, సిద్ధాంతాలు అంటూ బిజెపి వ్యతిరేకులు సైతం నమ్మే వాళ్లు. ఈ దేశంలో కమ్యూనిస్టులకు, బిజెపికి మాత్రమే సిద్ధాంతాలు ఉన్నాయని బిజెపిని తీవ్రంగా వ్యతిరేకించే వారు సైతం చెప్పేవారు’’
‘‘ఔను అయితే ?’’
‘‘అతిగా ఊహించుకుని కలలు కంటున్న మనకు వాస్తవ ప్రపంచాన్ని చూపించారు. మూడేళ్ల అధికారిక జీవితంతో మన కళ్లు తెరిపించారు. మార్కెట్‌లో ఉన్న అన్ని షాపుల్లాంటిదే ఈ షాపు... అన్ని సూపర్ మార్కెట్లలో ఉన్నట్టుగానే అమ్మకాలు,కొనుగోళ్లు ఉంటాయని, వస్తువుల్లో నాణ్యత ఉంటుందని ఇదేదో ఇంద్ర లోకం నుంచి ఊడిపడ్డ షాపు కాదని తేల్చి చెప్పారు. ఇక్కడున్న వాళ్లు కినె్నరలు, కింపురుషులు కాదు అందరి లాంటి నాయకులే అని కళ్లకు కట్టినట్టు చూపించారు. అసెంబ్లీల ఎన్నికల నుంచి, రాజ్యసభ ఎన్నికల వరకు తీవ్రంగా కృషి చేసి మన కళ్లు తెరిపించినందుకు కృతజ్ఞతలు చెప్పాలి’’
‘‘రాజ్యసభ ఎన్నికల్లో అహ్మద్ పటేల్ ఎన్నికతో గుజరాత్‌లో అమిత్ షాకు బ్రేకు పడింది కదా?’’
‘‘డి-మార్ట్ పక్కనున్న చిన్న పచారీ కొట్టు కూడా బతుకుతుంది. అంత మాత్రాన పచారీ కొట్టు బతకడం డి-మార్ట్ పరాజయం అంటావా? వ్యాపారంలో నష్టం, పరాజయం అనరు, అనుభవం అంటారు. నాదెండ్ల విఫలమైన వ్యాపార అనుభవంతో బాబు విజయం సాధించలేదా? ’’
‘‘రాజకీయం, వ్యాపారం ఒకటే అని నా కళ్లు తెరిపించావు’’ *
-బుద్దా మురళి(జనాంతికం 11. 8. 2017)

4, ఆగస్టు 2017, శుక్రవారం

మనం చాలా బిజీ గురూ..

‘‘ప్రపంచంలో అత్యంత బిజీగా ఉండేవాళ్లు ఎవరంటావ్?’’
‘‘యక్షుడు అడిగిన ప్రశ్నల్లో స్పీడ్ గురించి ఉంది. కానీ బిజీ గురించి లేదు. చైనావాడి బుల్లెట్ ట్రైన్ స్పీడట! ఆ మధ్య బాబుగారు చూసొచ్చారు. ఆయన చెప్పినట్టు బుల్లెట్ ట్రైన్‌ను తీసుకువస్తే దేశంలో అమరావతిలోనే స్పీడ్ ప్రయాణం అవుతుంది’’
‘‘నీలోనూ రాజకీయ నాయకుడి లక్షణాలు బాగానే ఉన్నాయి. నేనడిగిన దానికి చెప్పకుండా నీకు తెలిసింది చెబుతున్నావ్’’
‘‘బాబు బాగా బిజీ.. అని అదేదో ఎఫ్‌ఎం రేడియో ఛానల్‌లో ఆవిడెవరో కవ్విస్తున్నట్టు ద్వంద్వార్థంతో ఏదో చెబుతుంది.. కానీ బిజీ అంటే అది కాదు. క్షణం తీరిక లేకుండా ప్రాణాలకు సైతం తెగించేంత బిజీ జీవితం గడిపేది ఎవరని నా ప్రశ్న ’’
‘‘ఐనా ఈ రోజుల్లో గూగుల్ లాంటి గురువు చేతిలో ఉండగా ఏ విషయమైనా తెలుసుకోవడం ఎంత సేపు?’’
‘‘ఒకప్పటి కాలంలో పిల్లలకు తల్లిదండ్రులు, గురువులే అన్నీ చెప్పేవాళ్లు. ఇప్పుడు వాళ్ల పాత్రను కూడా గూగుల్ పోషిస్తోంది. ఏమడిగినా క్షణంలో చేప్పేస్తుంది. రోడ్డుపై మనం అడ్రస్ అడిగితే ఒక్కొక్కరు ఒక్కో దారి చూపిస్తారు. మన రోడ్లకు గూగుల్ కూడా కన్‌ఫ్యూజ్ అయి దారి సరిగా చూపడం లేదు. కానీ అమెరికాలో మాత్రం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా గూగులే చూపిస్తుంది, చెబుతుంది. నీ ప్రశ్నకు గూగుల్ వెదికినా సమాధానం దొరకడం లేదు’’
‘‘నిజమా? ఎందుకలా? సమాధానం నీ వద్ద సిద్ధంగా ఉన్నాకే ప్రశ్న అడుగుతావు. ఆ సంగతి నాకు తెలుసు కానీ సమాధానం కూడా నువ్వే చెప్పేయ్. నేనైతే అమెరికానే అనుకుంటున్నా? వాళ్లు ఎప్పుడు చూసినా బిజీ బిజీగా ఉంటారని విన్నాను. సంపన్న దేశం కదా? సంపన్నులు మహేశ్ బాబంత బిజీగా ఉంటారు. ’’
‘‘ బిజీకీ, మహేశ్ బాబుకీ సంబంధం ఏంటి?’’
‘‘నువ్వు సినిమాలు చూడవా? ’’
‘‘మల్లీశ్వరి నాలుగుసార్లు చూశా? రాముడు- భీముడు రెండు సార్లు చూశా. ’’
‘‘అందుకే అలా అడిగావు. ఆ కాలం సినిమాల్లో హీరో మరీ బద్ధకస్తుడు. ఇద్దరు ముగ్గురు విలన్లను కొట్టడానికే నానా హైరానా పడేవాడు. డిష్యుం డిష్యుం అంటూ పిడి గుద్దులు గుద్దేవాడు. మరిప్పుడు మహేశ్ బాబు చాలా బిజీ కాబట్టి ఒక గన్నుతో అయితే ఆలస్యం అవుతుందని రెండు చేతులతో రెండు గన్స్ పట్టుకుని వందల మంది విలన్ల ముఠాను మూడున్నర నిమిషాల్లో పేల్చేస్తాడు.. ఆయన కన్నా బిజీ ఎవరుంటారు’’
‘‘నేనడిగింది సినిమాల గురించి కాదు, బిజీగా ఉండేవాళ్ల గురించి?’’
‘‘నువ్వే చెప్పు వింటాను’’
‘‘మనవాళ్ల ప్రతిభను తొక్కేస్తున్నారు. గూగుల్‌ను నమ్మకంతో అడిగితే ప్రపంచంలో టాప్ టెన్ దేశాలు అంటూ ఆదాయం, ఎక్కువ సమయం పని చేయడం, కష్టపడి పని చేయడం వంటి దేశాల జాబితా చూపుతున్నారు కానీ నిజంగా బిజీగా ఉండే మన వాళ్ల ప్రసక్తే ఎక్కడా కనిపించడం లేదు’’
‘‘అంటే నీ ఉద్దేశం ప్రపంచంలో ఎక్కువగా బిజీ ఉండేది మన వాళ్లేనా? నమ్మలేక పోతున్నాను. గంటల తరబడి ఇరానీ హోటల్స్‌లో టీలు తాగుతూ బస్టాపుల్లో కాలక్షేపం, రోజుకో సినిమా చూస్తూ, రోజంతా క్రికెట్ చూస్తూ గడిపే మనం అందరి కన్నా బిజీనా? నమ్మలేకపోతున్నాను? అందుకే మహాకవి గురజాడ మన వాళ్లు ఉత్త వెధవాయలోయ్ అన్నట్టున్నారు’’
‘‘అంబులెన్స్ వెళుతున్నా దాన్ని ఓవర్ టేక్ చేస్తూ వెళుతుంటారు? ఎందుకంటావు? అంబులెన్స్ అత్యవసరం.. అలాంటి అంబులెన్స్ కోసం కూడా ఓ నిమిషం పక్కకు తప్పుకోలేనంత బిజీగా ఉంటేనే కదా? దాన్ని ఓవర్ టేక్ చేసి వెళ్లడం. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఎర్ర బల్బు వెలిగినా వాహనం నిలపకుండా వెళ్లి పోతాం అంటే రెండు నిమిషాలు కూడా వృథా చేయనంత బిజీగా ఉండడం వల్లే కదా? అలా వెళుతున్నాం. రోడ్డు మీద మనుషులు కనిపిస్తే వాళ్ల పై నుంచే ఇసుక లారీలు వెళ్తాయి.. ఎందుకనుకుంటున్నావ్?’’
‘‘అర్థమైంది ఇసుక లారీలు అందరి కన్నా బిజీ’’
‘‘వెరీ గుడ్.. రైల్వే క్రాసింగ్‌ల వద్ద బద్ధకస్తులను చూస్తే ఎంత బాధేస్తుందో? రైలు వస్తుందని గేటు వేస్తే అరగంట పాటు అలానే నిలబడతారు. మనలాంటి ఏ కొద్ది మందో బిజీ జీవితం గడిపేవారు గేటు పైకి ఎక్కి వెళతారు, గేటు కింది నుంచి దూరి వెళతారు. ఎంత బిజీగా లేకపోతే అలా చేస్తాం. ప్రపంచంలో బహుశా మరెక్కడా లేనంత బిజీ జీవితాన్ని మనం గడుపుతున్నా- బిజీ జీవుల జాబితాలో మన దేశం కనిపించక పోవడం మన ప్రతిభను తొక్కి పెట్టడమే. చెప్పుకుంటే సిగ్గు చేటు.. అమెరికా అంటే బాగా అభివృద్ధి చెందిన దేశం అని అనుకుంటాం కదా? అక్కడ మనలా ఎవరైనా బిజీగా ఉండేందుకు ప్రయత్నిస్తే, ప్రోత్సహించడానికి బదులు జరిమానాలు విధిస్తారు’’
‘‘ఔనా? ఎందుకలా?’’
‘‘కొత్తగా సిమెంట్ రోడ్డు వేస్తే గట్టిపడేంత వరకు నీటితో తడుపుతూ అటు వైపు ఎవరూ వెళ్లకుండా అడ్డం పెడతారు. మనలాంటి బిజీ జీవులకు దీని వల్ల ఎంత సమయం వృథా అవుతుంది? సరే... మనం పట్టించుకోకుండా ఇంకా గట్టిపడని ఆ రోడ్డుపై నుంచే వెళతాం.. మన పాద పద్మాలు, టైర్ల గుర్తులు ఆ సిమెంట్ రోడ్డుపై శాశ్వతంగా ఉండిపోతాయి. ఇటీవల అమెరికాలో మన సోదరుడు ఒకరు అలానే బిజీగా ఇంకా గట్టిపడని రోడ్డుపై వెళితే పదివేల డాలర్ల జరిమానా విధించారు. ఇలా అయితే ఆ దేశం ఎలా బాగుపడుతుందో? ’’
‘‘బిజీలోనే కాదు.. ఎన్నో విషయాల్లో మన రికార్డులు ప్రపంచానికి తెలియడం లేదు. మొన్నో మాజీ మంత్రి కొడుకు తనపై తానే మూడు రౌండ్లు కాల్పులు జరిపించుకున్నాడు. ఎదుటి వారిని చంపేవారు ఎక్కడైనా కనిపిస్తారు. తనపై తూటాలు పేల్చడానికి తానే లక్షలు ఇచ్చి ఏర్పాట్లు చేయించుకునే సాహసవంతులు ఎక్కడైనా ఉంటారా? అభినందించాల్సింది పోయి అరెస్టు చేస్తారా? ఇందుకేనా తెలంగాణ తెచ్చుకున్నది. సాహసవంతులు జైలులో ఉంటే ఈ ప్రపంచానికి జ్ఞాన బోధ చేసేది ఎవరు? ’’
‘‘అన్నీ నిజమే.. కానీ మన దేశ గ్రోత్ రేట్ అధో  ముఖం పట్టిందట కదా..?’’
‘‘ఇలా మాట్లాడితేనే నాకు చిర్రెత్తుకొస్తుంది. బిజీగా బతకడంలో, బద్ధకంలో, చట్టాలను ఉల్లంఘించడంలో ఎన్నో రంగాల్లో గ్రోత్ రేట్ ఊర్ధ్వముఖంలో ఉంటే ఒక్క గ్రోత్‌రేట్ తగ్గిందని .. నిరుద్యోగం పెరిగిందని , జనం బతక లేక పోతున్నారని పనికి రాని మాటలు  ఎందుకు మాట్లాడుతావ్? అందుకే గురజాడ మనల్ని తిడుతూ ‘వెధవాయలోయ్’ అన్నాడు.
*
-బుద్దా మురళి(జనాంతికం 4. 8. 2017)

2, ఆగస్టు 2017, బుధవారం

తెలుగు చిత్ర పరిశ్రమ తరలిపోగలదా..!అసలెందుకు తరలిపోవాలి?
తెలుగు పరిశ్రమ తరలిపోతుందా? వెళ్లిపోదామని ఒకరిద్దరనుకుంటే -40వేలమంది సమూహంతో సాగుతోన్న ఇండస్ట్రీ తెల్లారేసరికి తరలిపోవడం సాధ్యమా? ఒక్కో సందర్భంలో ఏ ఒకరిద్దరికో నొప్పికలిగిన ప్రతిసారీ -ఇలాంటి తర్కం తలెత్తడం పరిశ్రమకు మంచిదేనా?
**
తెలంగాణ ఉద్యమకాలం తరువాత మరోసారి తెలుగు సినిమా రంగాన్ని డ్రగ్స్ వ్యవహారం ఆలోచనల్లో పడేసింది. తెలంగాణ ఆవిర్భవిస్తే సినిమా పరిశ్రమ ఆంధ్రకు తరలిపోతుందనే ప్రచారం -ఉద్యమ సమయంలో బలంగా సాగింది. డ్రగ్స్ వ్యవహారంతో మళ్లీ అదే తరహా వాదన చర్చకొస్తోంది. డ్రగ్స్ వ్యవహారంలో ప్రభుత్వ వైఖరి సినిమావాళ్లకు కోపం తెప్పించిందన్న కథనాలున్నాయి. దీంతో బహిరంగ ప్రకటన చేయకున్నా పరిశ్రమ విశాఖకు తరలి పోతుందేమో అని కొందరంటుంటే, పోతే బాగుండని ఇంకొందరూ ఆశ పడుతున్నారు.
**
తెలుగు సినిమా ఇతర ప్రాంతాలకు విస్తరించడం వేరు. హైదరాబాద్ నుంచి తరలి పోవడం వేరు. ఆంధ్రలోని విశాఖకే కాదు తెలంగాణలోని కరీంనగర్ లాంటి ప్రాంతాలకూ సినిమా విస్తరిస్తోంది. అంతమాత్రాన దీన్ని తరలిపోవడం అనలేం. టెక్నాలజీ పెరిగింది. చిన్న సినిమా హాళ్లపై దృష్టి మళ్లుతోంది. గుత్త్ధాపత్యానికి గండిపడే రోజు కనిపిస్తోంది. కనుక -సినిమా విస్తరించడం ఆశ్చర్యకరమైన విషయమేం కాదు. అమెరికావంటి దేశాల్లో డాలర్లు సంపాదించిన ఐటీ ఉద్యోగులు ఆసక్తిగా తెలుగు సినిమాపై దృష్టిపెట్టడం ఇటీవలి కాలంలో ఎక్కువగా కనిపిస్తోన్న పరిణామం. ఇది బలపడినపుడు జిల్లాలస్థాయికీ తెలుగు సినిమా విస్తరిస్తుందేమో కానీ, మూలాలు వదులుకునే పరిస్థితి ఉండదు, ఉండబోదు కూడా. అందుకు -అనేక కారణాలు.
**
డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం లేదు కానీ -ఆంధ్ర ఐటి మంత్రి లోకేశ్ తెలుగు సినిమా పరిశ్రమ విశాఖకు వచ్చేలా చేస్తామని చాలాకాలంగానే చెబుతున్నారు. చెబుతూనే ఉన్నారు. అలాంటి ప్రకటనలు వెలువడినపుడూ -నిజంగా తెలుగు సినిమా ఆంధ్రకు తరలిపోతుందా? సాధ్యమా? అన్న ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. సినిమా పరిశ్రమలో అధికశాతం ఆంధ్ర రాష్ట్రానికి చెందినవారి చేతిలోనే ఉందన్న భావన ఉన్నపుడు -ఆ రాష్ట్రానికి తరలిపోదని ఎలా ఎప్పగలం? బహుశ ఇంతటి సంక్లిష్టత ఒక్క తెలుగు సినిమాకే పరిమితమేమో. ఇక ఇలాంటి అంశాలు చర్చకు వచ్చినపుడే -రాత్రికి రాత్రి పరిశ్రమ తరలిపోవడం సాధ్యమా? అన్న ప్రశ్నలూ ఉద్భవిస్తున్నాయి. సాధ్యం కాదనీ గతా అనుభవాలు రుజువు చేశాయి.
**
ఒకప్పుడు-
తెలుగువారికి రాష్ట్రం కావాలి. తమిళనాడులో రెండో తరగతి పౌరులుగా ఉండలేమన్న ఉద్యమం తీవ్రమైనపుడు -53లో రాష్ట్రం ఆవిర్భావమైంది. 56లో ఉమ్మడి ఆంధ్ర ఏర్పడింది. అయితే, పోరాడి తెచ్చుకున్న తెలుగునాడుకు సినిమా పరిశ్రమను తెచ్చుకోవడానికి దాదాపు అర్థ శతాబ్దం పట్టింది. 2000 సంవత్సరానికి సంపూర్ణంగా వచ్చిందన్న భావన కలిగింది. ఆంధ్ర సిఎంగా ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేసేనాటికి ఆయన చిరునామా మద్రాస్ నగరమే. సినిమా గ్లామర్‌తో మహానటుడు సిఎం అయినా, తెలుగు సినిమా పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు తరలిరాలేదు. కాసు బ్రహ్మానందరెడ్డి కాలంలో తరలింపు మొదలైతే, చంద్రబాబు సిఎంగా ఉన్నప్పటికి పూరె్తైంది. దశాబ్దానికో స్టూడియో నిర్మాణం చొప్పున మెల్లగా అడుగులేస్తూ 2000 నాటికి సినిమా పత్రికల కార్యాలయాలు సహా మద్రాస్ నుంచి ఆంధ్రకు తరలివచ్చింది. తమిళనాడులో తెలుగు సినిమాకు ఎలాంటి మార్కెట్ లేదు. సొంత రాష్ట్రం కాదు. సొంత భాష కాదు. మరి నాలుగు దశాబ్దాల పాటు మద్రాస్ కేంద్రం నుంచి తెలుగు సినిమా ఎందుకు కదల్లేదు. అందుకూ అనేక కారణాలు. అందులో ప్రధానంగా -ఎస్టాబ్లిష్‌మెంట్. అది పూర్తికాకుండా పరిశ్రమ మరోచోటికి కదలడం అంత ఈజీ కాదు.
**
ఇక తెలంగాణ నుంచి తరలి వెళ్లడాన్ని ఆలోచిద్దాం. తెలుగు సినిమాకు తెలంగాణ పెద్ద మార్కెట్టే. హైదరాబాద్ వద్దనుకుని విశాఖకు తరలిపోవడం అంటే, మార్కెట్‌ను దూరం చేసుకుంటున్నట్టే. మార్కెట్‌ను విస్తరించుకోవాలన్న ఆశతో ఇతర రాష్ట్రాలకు, ఓవర్సీస్‌కు పరుగులు తీస్తున్న తెలుగు పరిశ్రమ -ప్రస్తుత తరుణంలో తరలిపోవాలన్న నిర్ణయాలు తీసుకుంటుందా? మళ్లీ జీరో నుంచి కొత్త మార్కెట్ సృష్టిద్దామన్న ఆలోచనలకు పోతుందా? ఆలోచించాల్సిన ప్రశ్న.
**
వెళ్లిపోతాం.. పరిశ్రమ వెళ్లిపోతుందని ప్రచారం చేసేవారి లక్ష్యమేమిటోకానీ, ఇలాంటి ప్రచారాల వల్ల పరిశ్రమకు కలిగే ప్రయోజనం కనిపించడం లేదు. తెలంగాణ ఆవిర్భావం తరువాత పరిశ్రమకు ప్రభుత్వం వల్ల ఏదైనా భారీనష్టం కలిగివుంటే, అప్పుడు పరిశ్రమ తరలిపోవచ్చన్న చర్చకు అర్థముంటుంది. కానీ తెలంగాణ ఆవిర్భావం తరువాత ఏర్పాటైన ప్రభుత్వం పరిశ్రమపట్ల సానుకూలంగానే ఉందని సినిమావాళ్లే అంటున్నారు. అందుకు ఎన్నో అంశాలనూ ఉదహరిస్తున్నారు. పరిశ్రమ ఎదుగుదలకు ఎలాంటి సాయంకావాలో సూచించమంటూ ప్రభుత్వమూ అడుగుతోంది. మరెందుకు పరిశ్రమ తరలిపోవాలి అన్నదే చర్చ?
డ్రగ్స్ కేసులో సినిమావాళ్లను విచారించడం కొందరికి నచ్చడం లేదు. అందుక్కారణం సెలబ్రిటీలు అన్నింటికీ అతీతులన్న భావనే వాళ్లలో కనిపిస్తోంది. అందుకు కారణాలు ఏమైనా కావొచ్చు. కానీ -డ్రగ్స్ కేసుతో సంబంధముందన్న విషయం బయటపడితే హీరోలు, హీరోయిన్లను విచారించడం తప్పా? కానీ, అదే తప్పైనట్టు, అందుకే పరిశ్రమ ఇక్కడి నుంచి తరలిపోవాలని ఆశిస్తున్నట్టు పరిశ్రమలో కొందరి నుంచి సన్నాయినొక్కులు వినిపిస్తున్నాయి.
సెలబ్రిటీలైన తమను విచారించడం ఏంటనే అహం తప్ప -తెలుగు సినిమా తరలిపోవచ్చన్న ప్రచారానికి మరో కారణం కనిపించడం లేదు. విశాఖపట్నానికి తరలిపోవాలన్నది కొందరి ఆశ. బాగానే ఉంది. అక్కడ -చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలుండవన్న హామీ ప్రభుత్వాలేమైనా ఇస్తాయా?
***
ఒక్కసారి చరిత్రను పరికిస్తే-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందే నిజాం రాజ్యం 1920ల్లోనే హైదరాబాద్‌లో స్టూడియోలు ఉన్నాయి. హైదరాబాద్ నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్, దీరేంద్ర నాథ్ గంగూలీని హైదరాబాద్ పిలిపించి, 1921లో ఫలక్‌నుమా ప్యాలెస్ దగ్గర స్టూడియో కట్టించారు. లోటస్ ఫిల్మ్ కంపెనీగా నామకరణం చేశారు. నిజాం రాజ్యంలో సినిమా పరిశ్రమ పునాధులను బలోపేతం చేయడానికి ఆ కాలంలోనే ప్రయత్నాలు జరిగాయి. దీరేంద్ర నాథ్ గంగూలీ సలహాపై రెండు సినిమా హాళ్లను కట్టించారు. లోటస్ స్టూడియోలో అప్పుడు  ఐధు సినిమాలు నిర్మించి మన దేశంలోనే కాదు, పొరుగు దేశాల్లోనూ విడుదల చేశారు. దీరేంద్రనాథ్ గంగూలి నిర్మించిన సినిమాల్లో ఒకటి -ముస్లిం యువరాజు, హిందూ యువతి ప్రేమ కథ. ఈ సినిమా వివాదాస్పదం కావడంతో ఆగ్రహించిన నిజాం, 24 గంటల్లో సినిమా యూనిట్ సభ్యులు హైదరాబాద్ విడిచి వెళ్లాలని ఆదేశించారు. దాంతో ఆయన వెళ్లిపోయారు. 1928లో హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో అజంతా సినీ స్టూడియోస్ నిర్మించారు. 1970 వరకు పనిచేసిన ఆ స్టూడియోలో దాదాపు 200 సినిమాలు నిర్మించారు. 1931లో సికిందరాబాద్‌లో మహావీర్ సినీ కార్పొరేషన్ పేరిట స్టూడియో నిర్మించి 16 హిందీ సినిమాలు, ఎనిమిది ఇంగ్లీష్ సినిమాలు నిర్మించారు.
కొన్ని సినిమా కుటుంబాలు హైదరాబాద్‌కు వచ్చి ఉండకపోతే హైదరాబాద్‌కు అసలు సినిమా గురించే తెలిసి ఉండకపోయేది అన్న తలంపునూ కొందరు వ్యక్తం చేస్తుండటం దురదృష్టకరం. హైదరాబాద్ నగరంకన్నా చిన్న సైజులో ఉన్న దేశాలే సొంత భాషలో సినిమాలు తీస్తున్నాయి. అంతర్జాతీయ అవార్డుకలు అర్హమైన సినిమాలను ఆ దేశాలు అందిస్తున్నాయి. ఆంధ్ర ఏర్పడకుండా హైదరాబాద్ అలాగే ఉండివుంటే, అప్పుడూ సినిమాలు ఉండేవి. అందులో సందేహం లేదు. కారణం -సినిమా వ్యాపార కోణానికి ఎప్పుడో మారింది.
తెలంగాణ యాసతో శేఖర్ కమ్ముల ఫిదా తీసినా, మరో నిర్మాత కోస్తా యాసతో సినిమా తీసినా -అదంతా వ్యాపారమే. వ్యాపారికి లాభం ముఖ్యం. సెంటిమెంట్ వ్యక్తిగతం, వ్యాపారం వాస్తవం.
ప్రస్తుత తెలుగు సినిమా రంగంలో అగ్ర నిర్మాతగా ఉన్న దిల్‌రాజు తెలంగాణకు చెందిన వారే. అయినా, తెలంగాణ కోణంలో సినిమా తీయలేనని, సినిమా అనేది వ్యాపారం అంటూ బహిరంగంగానే చెప్పుకున్నాడు. ఇప్పుడు దిల్‌రాజే కాదు ఇతర ప్రాంతాలకు చెందిన వారూ తెలంగాణ యాసతో సిసినా విజయం సాధిస్తుందని అనుకుంటే, పోటీ పడి మరీ సినిమా తీస్తారు. ఇటీవల సక్సెస్ అయిన పలు సినిమా కథల్లో తెలంగాణ హీరోలు, హీరోయిన్లు కనిపిస్తారు. పెళ్లిచూపులు, అమీతుమీ, ఫిదావంటి సినిమాల్లో ప్రధాన పాత్రలది తెలంగాణ నేపథ్యంగానే చూపించారు. హీరో హీరోయిన్లలో ఒకరిది ఆంధ్ర, మరొకరిది తెలంగాణ నేపథ్యాలుగా చూపించారు. మారిన పరిస్థితుల్లో అనివార్యంగా మారిన ట్రెండ్ ఇది. రెండు ప్రాంతాల్లో మార్కెట్ ఉంది. ఒక ప్రాంతం కోసం ఇంకో ప్రాంతం మార్కెట్ వదలుకోలేరు.
సినిమా రంగాన్ని హైదరాబాద్‌లో ఉంచేది మార్కెట్ తప్ప సెంటిమెంట్ కాదు. సినిమా పరిశ్రమ ఇతర ప్రాంతాలకు విస్తరించొచ్చు. విస్తరించాలి కూడా. అంతేగాని, తరలిపోవాలన్న ఆలోచనలు రేకెత్తించడం మొత్తం తెలుగు సినిమా పరిశ్రమకే నష్టం.
-బుద్దా మురళి( వెన్నెల ఆంధ్రభూమి 1.8. 2017)

ఇంతకీ ‘ట్రంప్ ఫోబియా’ ఎవరికి?

‘ భూతల స్వర్గం’ అని అందరూ కీర్తిస్తున్న అమెరికాలో నిజంగా మన వాళ్లకు భద్రత లేదా? మన ఐటి ఉద్యోగులు, విద్యార్థుల భవిష్యత్తు అయోమయంగా, అలవికాని విధంగా ఉందా? మన నేలపై ఉంటూ మన టీవీ చానళ్లలో చూస్తే ఇలానే అనిపిస్తుంది. కానీ, అమెరికాకు వెళ్లి చూస్తే మాత్రం దీనికి పూర్తిగా భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. ‘అమెరికా దృశ్యాల’ను హైదరాబాద్ నగరం నుంచే ఇష్టం వచ్చినట్టుగా ఊహించుకుని తెలుగు చానళ్లు కథలు అల్లాయి. మన జాతీయ టీవీ చానళ్లు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలవడమే తప్పు అన్నట్టు చూపిస్తే, తెలుగు చానళ్లు మరో అడుగు ముందుకేసి ట్రంప్ గెలుపు తమకు నచ్చలేదని తేల్చిచెప్పడంతో పాటు మన వాళ్ల జీవితాలు నడిరోడ్డున పడ్డాయన్నట్టుగా తెగ ఆందోళన వ్యక్తం చేశాయి. నెల రోజుల పాటు అమెరికాలోని అనేక ప్రాంతాల్లో తిరగడంతో పాటు ఐటి ఉద్యోగులతో మాట్లాడితే- మన చానళ్లలో ఎంతో సీరియస్‌గా చెప్పిన విషయాలపై వాళ్లు జోకులేస్తున్నారు. వాస్తవానికి, ప్రచారానికి అంత తేడా ఉంది!
అధికారిక గణాంకాల ప్రకారం 23 లక్షల మందికి పైగా భారతీయులు అమెరికాలో నివసిస్తున్నారు. వీరు కాకుండా విద్యార్థులు, వివిధ రకాల అనుమతులతో అక్కడ ఉద్యోగం చేస్తున్న వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అమెరికాలో మన ఐటి ఉద్యోగులు, విద్యార్థులను ‘ట్రంప్ ఫోబియా’ వెంటాడుతోందా? వీళ్లందరినీ ట్రంప్ వెళ్లగొట్టడం ఖాయమా? తెలుగు చానళ్లు చూశాక తలెత్తిన ప్రశ్నలు ఇవి. ఈ వ్యాస రచయిత కొద్దిరోజుల క్రితం అమెరికా పర్యటించినపుడు అసలీ ప్రశ్నలే ఎక్కడా వినిపించలేదు.
భారతీయులను గానీ, మన తెలుగువాళ్లను గానీ ట్రంప్ ఏ విధంగానూ భయపెట్టడం లేదు. ట్రంప్ నివసించే వైట్ హౌస్ ముందే ఎవరో అనామకుడు రెండు నెలల నుంచి గుడారం వేసుకుని ట్రంప్ దిగిపోవాలని ప్లకార్డులు ప్రదర్శిస్తున్నా అక్కడి భద్రతా సిబ్బంది ఎవరూ అడ్డుకోవడం లేదు. అమెరికా అడ్మినిస్ట్రేషన్ భవనం వరకూ ఎలాంటి అనుమతి లేకుండా వెళ్లి వచ్చినా అడ్డుకునే వారు లేరు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చి అమెరికాలో ఉంటున్న తెలుగు వారు నిశ్చింతగా తమ ఉద్యోగాలు తాము చేసుకుంటున్నారు. యువతీ యువకులు ఉన్నత విద్యాసంస్థలలో హాయిగా చదువులు కొనసాగిస్తున్నారు. అయితే, ఎక్కువగా ఐటి విద్యార్థులు ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లి అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. గతంలో ఇలానే వెళ్లిన వారు అక్కడే స్థిరపడిపోయారు. ఒకసారి అమెరికా వాతావరణం, అక్కడి పరిస్థితులు అలవాటు అయిన తరువాత ఇండియాకు తిరిగి వచ్చేవాళ్లు తక్కువ అనే అభిప్రాయం అక్కడ బలంగా వినిపించింది. కెరీర్ పరంగా ఎదిగేందుకు ఉన్న విస్తృత అవకాశాలతో పాటు ప్రజల్లో చట్టం పట్ల భయం, గౌరవం ఆ దేశాన్ని ఉన్నత స్థితికి తీసుకుపోయిందని అనిపిస్తోంది.
ఎంఎస్ చేసేందుకు రెండేళ్లు అమెరికాలో ఉన్నప్పుడు అక్కడి జీవన విధానం, క్రమశిక్షణ, చట్టాన్ని ఉల్లంఘించని బాధ్యతాయుతమైన జీవితం ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. దీనికి తోడు ఎదిగేందుకు ఉన్న పుష్కలమైన అవకాశాలు, డాలర్ల సంపాదన యువతను కట్టిపడేస్తుంది. ట్రంప్ భయం లేదు కానీ, మనవాళ్లు పెద్ద సంఖ్యలో వస్తుండడం వల్ల ఉద్యోగ అవకాశాలు ఇటీవలి కాలంలో కాస్త మందగించాయనే అభిప్రాయం అక్కడి వారిలో వినిపించింది. ఎక్కువ మంది కన్సల్టెన్సీల ద్వారా ఉద్యోగాల్లో చేరుతారు. హెచ్1బి వీసా రాక ముందే చదువు ముగిసిన తరువాత విద్యార్థులు ఓపిటిపై ఉద్యోగంలో చేరుతారు. మూడేళ్ల పాటు ఓపిటిపై ఉద్యోగం చేసుకునేందుకు అవకాశం ఉంది. కనీసం విద్య కోసం తాము ఖర్చు చేసిన డబ్బును తిరిగి అక్కడే సంపాదించుకోవాలనే దృఢమైన అభిప్రాయం అక్కడి విద్యార్థుల్లో కనిపించింది.
గతంలో కన్సల్టెన్సీల్లో చేరితే ఒకటి, రెండు నెలల్లోనే ఏదో ఒక సంస్థలో ఉద్యోగం లభించేది. కానీ ఇప్పుడు చాలా చోట్ల ఆ పరిస్థితి కనిపించడం లేదు. కొందరు విద్యార్థులు ఆరునెలల నుంచి కన్సల్టెన్సీల్లో ఉంటూ అవకాశం కోసం ఎదురుతెన్నులు చూస్తున్నారు. ఏడాది నుంచి ఎదురు చూస్తున్న వారు సైతం ఉన్నారు. చదువు ముగించి ఏడాది పాటు ఉద్యోగం లేకుండా అమెరికా లాంటి దేశంలో ఉండడం అంటే ఆ విద్యార్థిపై మానసికంగా తీవ్ర ప్రభావం పడుతుంది. మంచి ఉద్యోగం కోసం ఎక్కువ కాలం ఎదురు చూడడం కన్నా ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోవడం మేలు అనే భావన కనిపిస్తోంది. ట్రంప్ ప్రభావం లేకపోయినప్పటికీ గత కొంత కాలంగా పెద్ద సంఖ్యలో మన వాళ్లు వస్తున్నారు. దీని వల్ల వెంటనే ఉద్యోగాలు దొరికే పరిస్థితి లేదని చెబుతున్నారు. కన్సల్టెన్సీలది ఇక్కడ లాభసాటి వ్యాపారంగా మారింది. వీటిని ఎక్కువగా తెలుగువారే నిర్వహిస్తున్నారు. ఎన్ని నెలలు అయినా ఈ కన్సల్టెన్సీలే అభ్యర్థికి వసతి కల్పించి ఉద్యోగాల కోసం మార్కెటింగ్ చేస్తాయి. ఉద్యోగం వచ్చిన తరువాత, ఉద్యోగం చేస్తున్నంత కాలం కన్సల్టెన్సీల వారికి వీరి సంపాదనలో కొంత వాటా ఉంటుంది. ఏడాదికి దాదాపు లక్ష డాలర్లు విద్యార్థికి పని చేసే సంస్థ చెల్లిస్తే ఈ కన్సల్టెన్సీలు ఉద్యోగికి 60వేల డాలర్ల వరకు ఇచ్చి నలభై వేల రూపాయల వరకు తాము తీసుకుంటాయి. రెండు మూడు నెలలు వసతి కల్పించి మార్కెట్ చేసినందుకు విద్యార్థి కన్నా కన్సల్టెన్సీలకే ఆదాయం ఎక్కువ. అయినప్పటికీ విద్యార్థులు కన్సల్టెన్సీలనే నమ్ముకోక తప్పడం లేదు. సొంతంగా ప్రయత్నిస్తే లభించే అవకాశాల కన్నా కన్సల్టెన్సీల ద్వారానే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు న్యూయార్క్ లాంటి నగరంలోని విశ్వవిద్యాలయాల్లో రెండేళ్ల ఎంఎస్‌కు దాదాపు 60లక్షల రూపాయల వ్యయం అవుతుంది. ఇంత వ్యయంతో చదువుకోవడం అంత ప్రయోజనకరం కాదని విద్యార్థులు అంటున్నారు. కనీసం ఒక ఏడాది ఉద్యోగం కోసం నిరీక్షించడానికి అవకాశం ఉన్నవారు మాత్రమే ఇప్పుడు అమెరికా వైపు దృష్టిసారించడం మంచిదనే సలహా వినిపిస్తోంది అక్కడ విద్యార్థుల నుంచి. మన దేశం నుంచి వస్తున్న విద్యార్థుల సంఖ్య తగ్గినట్టయితే అక్కడున్న వారికి కొంత వరకు అవకాశాలు మెరుగు పడతాయి.
‘అమెరికా సంయుక్త రాష్ట్రాలు’ అనడం కన్నా ‘ప్రపంచ దేశాల సంయుక్త దేశం’ అన్నట్టుగా అమెరికా వాతావరణం కనిపించింది. యూనివర్సిటీల్లోనూ, న్యూయార్క్, వాషింగ్టన్ లాంటి నగరాల్లో ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల వారు కనిపిస్తూ మినీ ప్రపంచాన్ని చూస్తున్నట్టుగా అనిపించింది. చిన్న చిన్న ఆసియా దేశాలు మొదలుకొని యూరప్ దేశాల, ముస్లిం దేశాల వారు కనిపిస్తారు. విమానాశ్రయాల్లో మాట్లాడుకునే వారిని గమనిస్తే ప్రపంచ భాషలు వినిపిస్తాయి. ప్రపంచ యువతను అమెరికా ఆకర్షిస్తోంది. చదువుకునే రోజుల్లో ‘అమెరికా సామ్రాజ్య వాదం’ అంటూ కొన్ని పడికట్టు పదాలు మనసుపై అలానే ముద్రించుకుని ఉండిపోయినా ఆ దేశంలో మాత్రం చట్టం అంటే ప్రజలకు ఉన్న గౌరవం ఆశ్చర్యం కలిగిస్తుంది. ‘కాళ్లు కడిగినప్పుడే కాపురం చేసే తీరు తెలుస్తుంది’ అన్నట్టుగా రోడ్డుపై వాహనాల నడక చూస్తేనే చాలు చట్టం ఎంత బలంగా పనిచేస్తుందో తెలుస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మన దేశంలో 50 ఏళ్ల పాటు వాహనం నడిపినా ఏమీ కాదు. పట్టుకుంటే ట్రాఫిక్ సిబ్బంది చేతిలో వందనోటు పెడితే చాలు. కానీ అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కారు స్టీరింగ్ పట్టుకునే ధైర్యం మన వాళ్లు కూడా చేయరు.
‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అందరినీ వెనక్కి పంపించేస్తున్నాడు, వీసాలు ఇవ్వడం లేదు’ అంటూ మన మీడియా రకరకాల ప్రచారం చేసింది. ‘ఒబామా హెల్త్‌కేర్’ సహా ఇప్పటి వరకూ ఏ ఒక్కటీ ట్రంప్ విధానం అమలు కాలేదు. మనకు ‘తత్కాల్ పాస్‌పోర్ట్’ తరహాలో ప్రత్యేక ఫీజుతో పరిశీలించే హెచ్1బి వీసాల పెండింగ్ పెరిగిపోవడంతో కొత్త దరఖాస్తులు నిలిపివేశారు. పాత వాటిని క్లియర్ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకుంటే మన మీడియా మాత్రం హెచ్1బి విసాల నిలుపుదల అంటూ హడావుడి చేసింది. ‘అదిగో పులి అంటే.. ఇదిగో తోక’ అన్నట్టు తెలుగు మీడియాకు ట్రంప్ ఫోభియా పట్టుకుంది కానీ అమెరికాలోని తెలుగు వారికి మాత్రం ఎలాంటి భయమూ లేదు. స్వయంగా అక్కడి యువతతో మాట్లాడిన తరువాత కలిగిన అభిప్రాయం ఇది.
మన దేశంలో ఉద్యోగ అవకాశాలు అంతంత మాత్రం. నాలుగేళ్ల బిటెక్ చదివాక పది శాతం మందికి క్యాంపస్ సెలక్షన్‌లో ఉద్యోగాలు, సగటు జీతం 25వేల రూపాయలు. మిగిలిన 90 శాతం మందికి అదీ లేదు. ఇలాంటి పరిస్థితిలో ఒక అభ్యర్థి అమెరికా వెళితే పోటీలో ఒకరు తగ్గినట్టే కాదు. ఉద్యోగిగా వారు పంపే డాలర్లతో ఒకరిద్దరికి ఉపాధి కల్పించినట్టు అవుతుంది. విదేశాలకు వెళ్లే ప్రతి ఒక్కరి వల్ల ముగ్గురికి ఉపాధి లభించినట్టు అవుతుంది.
వారంలో ఐదు రోజులు పని చేసి మిగిలిన రెండు రోజులు జీవితాన్ని అనుభవించాలి. ఉద్యోగం చేసినంత కాలం చేసి, ఆ తర్వాత శేష జీవితం హాయిగా గడపాలనేది అమెరికా వారి జీవన విధానం. మన వాళ్ల జీవితం మాత్రం దీనికి భిన్నంగా ఉంది. మన యువత మనం ఊహించిన దాని కన్నా ఎక్కువ బాధ్యతా యుతంగా ఉన్నారు. జీవితం గురించి, ఆర్థిక అంశాల గురించి స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. తాము అమెరికాకు ఎందుకు వచ్చాం? ఎలా ఉండాలి? అనే దానిపై వారిలో స్పష్టమైన అవగాహన కనిపించింది. పాతికేళ్ల వయసు వారితో మాట్లాడితే- ‘సొంతగడ్డపై ఉన్నవారిలో కన్నా’ దేశభక్తి ఎక్కువగానే కనిపించింది. భారత్‌లో ఉంటున్న యువతే కాదు, విదేశాల్లో ఉన్న మన యువత సైతం మన జాతి సంపదే.
-బుద్దా మురళి(2.8.2017) 

29, జులై 2017, శనివారం

‘కలికాలం దేవుళ్ల’కు కష్టాలు!

‘‘ ఛీ ఛీ.. కలికాలం.. ఇలాంటి గడ్డుకాలం వస్తుందని క లలోనూ ఊహించలేదు. భక్తులకు కష్టాలు వస్తే దేవుళ్లకు మొక్కుకుంటారు. ఆ దేవుళ్లకే కష్టాలు వస్తే..?’’
‘‘సెలబ్రిటీలంతా ఒకే చోట ఉన్నారు. ఇంద్రసభలో దేవుళ్లంతా కొలువైనట్టు ఉంది. మీ అందరినీ ఒకే చోట చూసేందుకు రెండు కళ్లు చాలడం లేదు. డైరెక్టర్, హీరోలు, హీరోయిన్‌లు, క్యారక్టర్ ఆర్టిస్టులు, కెమెరామెన్.. వావ్..! సూపర్‌హిట్ సినిమా కాంబినేషన్ మొత్తం ఇక్కడే ఉంది.’’
‘‘రావయ్యా.. రా! ఇక్కడ నీ పొగడ్తలకేం తక్కువ లేదు. కానీ మీ చానల్‌లో మాత్రం మేం డ్రగ్స్ తీసుకునే వార్తలు పదే పదే చూపిస్తారు. నువ్వు లేవగానే టీ తీసుకుంటావ్, ఇంకొకరు కాఫీ తాగందే బెడ్‌మీద నుంచి లేవరు. ఎవరి అలవాటు వారిది. అడగడానికి వీళ్లెవ్వరు?’’
‘‘మా హీరోయిన్ ఆరోగ్యం మీద ఆమె అమ్మ కన్నా పోలీసులకు ఎక్కువ శ్రద్ధ ఉంటుందా? వాళ్ల అమ్మే అడగలేదు. పోలీసులెవరు అడగడానికి? అయినా మేం మీడియాను పిలవలేదు కదా! ఎందుకొచ్చావ్?’’
‘‘మీడియాగా రాలేదు. ఏదో ఫ్రెండ్‌షిప్ కొద్దీ వచ్చా..’’
‘‘ఫ్రెండ్ అనుకుంటే టీవీలో డ్రగ్స్ గురించి అంతసేపు చూపించవు. సర్లే.. డ్రగ్స్ తీసుకుంటావా?’’
‘‘అమ్మో.. ఇప్పుడొద్దు. కాస్త చల్లబడిన తరువాత! మీ విచారణ పూర్తయ్యాకనే! డ్రగ్స్ ప్రస్తావన లేకుండా, మీరు డ్రగ్స్ తీసుకుంటారా? అని ప్రశ్నించకుండా, మీ అమ్మాయి మనోభావాల, మీ అమ్మ ఆవేదన, మీ ఆవిడ భావోద్వేగంపై గంట సేపు ఇంటర్వ్యూ చేశాం కదా! అయినా ఇలా నిష్ఠురం తగునా?’’
‘‘అంతకన్నా ముందు పరువు తీసేట్టుగా చూపించారు కదా? రోజంతా చూపించాల్సిన అవసరం ఉందా? కాంబోడియాలో ట్రాఫిక్ జామ్,ట్రంప్‌కు జలుబు, ఆఫ్రికా అడవుల్లో దొరికిన మూడు తలల నాగుపాము, చైనాలో కొత్త రకం వంకాయ పంట.. ఇలా ఎన్నిలేవు చూపించడానికి? మా సినిమా వాళ్ల గురించే అంతసేపు చూపించాలా?
‘‘నాకు పెళ్లయింది. మా పక్కింటి వాడికి పెళ్లయింది. రాష్ట్రంలో, దేశంలో కోట్లాది మందికి పెళ్లయింది. వాళ్ల పెళ్లి ముచ్చట్లు ఏమీ చూపలేదు. కానీ మీ సినిమావాళ్ల పెళ్ల మొత్తం రోజంతా టీవీలో చూపిస్తారు. అలా ఎందుకు? అని అప్పుడు అడిగి వుంటే బాగుండేదన్నా?’’
‘‘మీ రేటింగ్‌ల కోసం చూపిస్తారు. మా కోసమా?
‘‘ఇది కూడ అంతే. మరిచిపోయా ..  పెళ్లిళ్లు, పుట్టిన రోజులే కాదు.. పోయిన రోజు కూడా రోజంతా చూపిస్తారు. గాంధీ జయంతి రోజున గాంధీని గుర్తు చేసుకోకపోయినా, సినీనటుల పుట్టినరోజున మాత్రం గుర్తుంచుకని రోజంతా చూపిస్తాం. ఎందుకంటే మీరు దేవుళ్లు. మీ ఆవిడను మీరు మొదటిసారి ఎక్కడ కలిసారు? మీ అమ్మాయి ముద్దుపేరు ఏంటో ప్రేక్షకులకు చెబుతాం. పరమశివుని కుమారుడు గణపతి అని తెలిసినప్పుడు మీ పిల్లల పేర్లు కూడా జనాలకు తెలియడం ధర్మం.’’
‘‘అసలు మన సిస్టమ్‌లోనే తప్పుంది. మీరు సినిమా హాల్‌కు వెళ్లినప్పుడు ఫస్ట్‌క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అని వుంటుంది. భారీ బడ్జెట్ సినిమా, లోబడ్జెట్ సినిమా అని వుంటుంది. ఎవరి స్థాయికి తగ్గట్టు వారు వెడతారు. అదేవిధంగా మామూలు జనాలను విచారించే చట్టాలలోనే సినిమావాళ్లను విచారించడం ఏమిటి? సినిమా వాళ్లకు ప్రత్యేక రాజ్యాంగం, చట్టం ఉండాలి’’
‘‘ఔను! రాజ్యాంగం రాసిన వారికి ఈ ముందు చూపు లేకపోవడం వల్ల తలెత్తిన సమస్య ఇది..’’
‘‘ఇప్పటికైనా రాజ్యాంగాన్ని మార్చాలి. మోదీకి చెప్పాలి’’
‘‘ఆయన ఛస్తే వినడేమో! ఒకే దేశం, ఒకే చట్టం అంటూ ఇప్పటికే ఉన్న సౌకర్యాలను పీకి పారేయాలని చూస్తున్నాడు..’’
‘‘వినకపోతే సినిమా వారికి ప్రత్యేక దేశం కావాలంటాం. సినిమావాళ్లు లేకపోతే ఈ వెర్రి జనం ఒక్కరోజు కూడా బతకలేరు. మమ్మల్ని తక్కువగా అంచనా వేయవద్దు. ఒక్క నటుడు తలుచుకుంటేనే గతంలో ఓ ప్రాంతీయ పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చాడు. మొత్తం సినిమా వాళ్లంతా తలుచుకంటే..?’’


‘‘అలాంటి నట నాయకుణ్ణి మట్టి కరిపించింది రాజకీయ నాయకుడే అయినా చిన్న సమస్యకు అంత తీవ్రమైన నిర్ణయం ఎందుకులెండి. శ్రీరాముడికే కష్టాలు తప్పలేదు. సీతమ్మపైనే నిందలు వేసారు. మీమీదా అంతే?’’
‘‘వాళ్లతో మాకు పోలికేంటి? వాళ్లు పాతకాలం నాటి దేవుళ్లు.. మేం కలియుగ దైవాలం. మేం కనిపించే దైవాలం. ఏరా..! నేనిక్కడ సీరియస్‌గా మాట్లాడుతునే ఉన్నాను. ఆ హీరోయిన్‌ను గోకుతున్నావ్! ఏ టైంలో ఏం చేయాలో తెలియదా? వాళ్లు ఒక మతం వారికి దేవుళ్లు మేం అందరికీ దేవుళ్లం’’
‘‘గోకడం లేదు సార్! హీరోయిన్ బుగ్గలపై ఎలాంటి మేకప్ వేస్తే బాగుంటుందో రిహార్సల్స్ చేస్తున్నా కెమెరా  మెన్ గా ఇవన్నీ చూసుకోవడం నా ధర్మం ...’’
‘‘ఇది షూటింగ్ ఏమో? మేకప్‌మెన్, కెమెరామెన్ గోకినా ఏమనవద్దని ఊరుకున్నాను. మరిచేపోయా! షూటింగ్ కాదు కదా!
‘‘నువ్వే చూశావుకదా! మా హీరోయిన్ ప్రతిక్షణం నటనలో లీనమై ఉంటుంది. అలాంటి హీరోయిన్‌ను కూడా అనుమానించడం అంత పాపం ఇంకోటి ఉంటుందా?’’
‘‘అవును.. మీరు నిరంతరం నటిస్తూనే ఉంటారు.’’
‘‘ప్రజలకు దగ్గర కావడం వల్ల సమస్య కానీ, అదే మద్రాస్‌లో ఉన్నప్పుడు దేవుళ్ల కన్నా మాకే ఎక్కువ క్రేజ్ ఉండేది. తిరుపతి వెంకన్నను గంటలో దర్శనం చేసుకున్నా, మద్రాస్ వచ్చి నటులను దర్శించుకోవడానికి గంటలకు గంటలు పడిగాపులు కాసేవాళ్లు. ఇప్పుడు మేం దగ్గరగా ఉండడం వల్ల కేసుల్లో బుక్కవుతున్నాం.’’
‘‘కలియుగ దైవాలు కళ్లముందు ప్రత్యక్షం అయ్యారని మురిసిపోయి సెల్ఫీ దిగి పోవాలి కానీ.. పోలీసుల ఓవర్ చేస్తున్నారు’’
‘‘కొందరు పోలీసులు  నిజంగా బుద్ధిమంతులు. ‘సిట్’ కార్యాలయంలోకి మేం రాగానే ఫోటో దిగి మా ముందే వాళ్ల పెళ్లాలకు ‘షేర్’ చేసి మురిసిపోయారు. ఆ ‘బట్టతల పోలీసు అధికారి’కే మేమంటే ఏంటో తెలియడం లేదు. దేవుళ్లను చూసిన ఫీలింగ్‌తో కాకుండా మామూలు మనుషులను చూసినట్టు చూశాడు. ఎంత అవమానం? ఆ పోలీసు బాసు మీద ఓ సినిమా తీసి.. నేనేంటో చూపిస్తా.’’


‘‘ఓసారి మోహన్‌బాబు చిత్తూరు జిల్లా ఎన్నికల ప్రచారంలో ఎన్నికల అధికారిపై కోపం వచ్చి- సినిమాలో నీ సంగతి చూపిస్తా అని వార్నింగ్ ఇచ్చి మరిచిపోయారు. మీరు మాత్రం ఆ ‘బట్టతల అధికారి’ని విలన్‌గా చూపించి ఓ సినిమా తీయాలి. డ్రగ్స్ కేసులో చివరకు ఆ పోలీసు అధికారి విలన్ అని తేలుతుంది. ఎలా ఉంది ఐడియా?’’
‘‘గుమ్మడి, నాగభూషణం, ప్రభాకర్‌రెడ్డిలతో కూడా ఇలాంటి సినిమాలు వచ్చాయి. వెరైటీగా సిఎం విలన్ అని చూపిస్తే..?’’
‘‘గుడ్ ఐడియా.. ఓ అడుగు ముందుకేసి ప్రధాని విలన్ అని చూపితే ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంటుంది.’’
‘‘విలన్ చేసే డ్రగ్స్ వ్యాపారాన్ని బయటపెట్టే పవర్‌ఫుల్ హీరోయిన్ పాత్ర నాకే. డ్రగ్స్‌లో నాకు బోలెడు అనుభవం ఉంది.’’
‘‘అసలే నిండా మునిగి పోయి ఉన్నాం. రోజులు మారాయి. హీరో ఇంట్లో అర్ధరాత్రి తుపాకీ పేల్చినా ఏమీ కాదు. ఓ టీవీ సీరియల్‌లో అత్త,కోడలి మధ్య కనిపించే అన్యోన్యతలా అధికార, విపక్షాల మధ్య ఆ కాలంలో అనుబంధం ఉండేది. ‘ఆయనే ఉంటే..’ అని ఏదో సామెత చెప్పినట్టు ఆ రోజులు మళ్లీ రావు.’’
‘‘మీరు ఇలా మా బండారం బయటపెట్టి కేసులు పెడితే- మేం అమరావతి వెళ్లిపోతాం అని వార్నింగ్ ఇస్తే ఎలా ఉంటుంది? చచ్చినట్టు ఈ చట్టాల నుంచి మనకు మినహాయిపు ఇస్తారేమో!’’
‘‘మనం వెళ్లిపోతాం అంటే- మీ సినిమాలు మాకు వద్దు అని మెలిక పెడతారు. అసలే పది శాతం సినిమాలకు కూడా లాభాలు రావడం లేదు. మార్కెట్ సగం తగ్గితే వసూళ్లు కూడా సగం తగ్గుతాయి కదా!’’
‘‘ఏంటోయ్ కామన్ మ్యాన్ సినిమా దేవుళ్లను అందరినీ ఒకే చోట చూసి నోటమాట రావడం లేదా? అవాక్కయ్యావు’’
‘‘ స్వర్గంలో ఉండాల్సిన అప్సరస మీ అందరి మధ్యలో ఉందేమిటని ఆశ్చర్యపోతున్నారేమో!’’
‘‘చెప్పవయ్యా.. అలా చూస్తూ ఉండిపోయావేం?’’


‘‘మీలా నటించలేను, మనసులో మాట చెప్పి బాధ పెట్టలేను.. ఏదో కామన్ మెన్‌ను వదిలేయండి.’’
‘‘కాళిదాసును చూస్తే కవిత్వం వచ్చినట్టు సినిమా వాళ్లను చూసి నీకూ డైలాగులు వస్తున్నాయి. చెప్పు ఫరవాలేదు. మేమే కాదు, మమ్మల్ని పూజించే నువ్వు కూడా దేవుడివే.’’
‘‘ఆ గౌరవం అంతా ఆడియా ఫంక్షన్‌లోనే. మీ ఇంటికొస్తే సెక్యురిటీ వాడికి చెప్పి కొట్టిస్తారు.’’
‘‘ఆ సంగతి వదిలేయ్! జరుగుతున్న పరిణామాలపై నువ్వేమంటావు? నిర్మొహమాటంగా చెప్పు.. ఫరవాలేదు.’’
‘‘సినిమాలో నటించండి ఫరవాలేదు. జీవితంలో నటన ఓ భాగం. మీరేమీ సమాజానికి అతీతులు కారు. సమాజంలో మీరూ భాగమే. సినిమా కనిపెట్టకముందు కూడా సమాజం ఉంది. సినిమా లేకపోయినా సమాజం ఉంటుంది. కానీ సమాజం లేకపోతే సినిమా ఉండదు. మేము సమాజానికి అతీతులమని భావించినప్పుడే సమస్య. మేం చట్టానికి అతీతులం అనుకున్నప్పుడే చట్ట వ్యతిరేక పనులను అవలీలగా చేస్తారు లేదా మత్తులో మునిగిపోతారు. చట్టం మాకూ వర్తిస్తుందని అనుకుంటే తప్పు చేయరు’’
‘‘ ఇది చిత్తూరు నాగయ్య కాలం కాదు. పోకిరీల కాలం.. నీతులు చెబితే ఎవ్వడూ వినడు.’’
‘‘అబ్బో.. మీ సక్సెస్ ఫార్ములాతో రోజుకు పది సినిమాల షూటింగ్‌లు ప్రారంభం అయితే నెలకు ఒక్క సినిమా కూడా లాభాలు గడించడం లేదు.’’
‘‘ఇంతకూ ఏమంటావ్ ?’’
‘‘దేవుళ్లం అనే భ్రమ నుంచి బయటపడి మేమూ మనుషులమే అనే వాస్తవంలోకి రమ్మంటాను. చట్టం తన పని తాను చేసుకుపోతుంది.’’ 

*
-బుద్దా మురళి (జనాంతికం 28. 7. 2017)